పరిశ్రమలకు కోత
చెన్నై, సాక్షి ప్రతినిధి:వాణిజ్య, పారిశ్రామిక వాడలకు సరఫరా అవుతున్న విద్యుత్‌లో 20 శాతం కోత విధిస్తున్నారు. కొత్తగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని మంగళవారం నుంచే అమలు చేయడం ప్రారంభించారు. రాష్ట్రంలో కొన్నేళ్లుగా విద్యుత్ కోత అమల్లోకి ఉంది. విద్యుత్ కోతలను ఎత్తివేస్తామని ముఖ్యమంత్రి జయలలిత ఈ ఏడాది మేలో ప్రకటించారు. పూర్తిగా కోతలను ఎత్తివేయడం కుదరలేదు. భారీ విద్యుత్‌లోటు ఉన్నా రాష్ట్రంలోని పవన విద్యుత్ ఇన్నాళ్లు ఆదుకుంటూ వస్తోంది. అయితే రాష్ట్రంలో గాలుల కాలం ముగిసిపోగా పవన విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి భారీగా పడిపోయింది. దీంతో పారిశ్రామిక వాడలకు విద్యుత్‌కోతను అమలు చేయడం ప్రారంభించారు. ఇప్పటికే పారిశ్రామిక వాడల్లో 40 శాతం విద్యుత్‌ను మాత్రమే వాడుకుంటున్నారు. తాజా కోతల కారణంగా రాత్రి 10 గంటల నుంచి మరుసటి రోజు సాయంత్రం 6 గంటల వరకు అత్యవసర సేవలకు మాత్రమే విద్యుత్‌ను వినియోగించుకోవాలి. అంటే విద్యుత్ దీపాలు, భద్రతావసరాలకు మాత్రమే వాడుకోవాలి.
ఏప్రిల్ నుంచి చార్జీల పెంపు: వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి పెరిగిన విద్యుత్ చార్జీలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. సీఎం జయలిత మంగళవారం నిర్వహించిన కేబినెట్ సమావేశంలోనే ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అధికారులు పెంచిన విద్యుత్ చార్జీల జాబితాను సిద్ధం చేసి చర్చించారు. వచ్చేనెల 23వ తేదీ వరకు విద్యుత్ చార్జీల పెంపుపై బహిరంగ సమావేశాలు నిర్వహించి ప్రజాభిప్రాయం సేకరిస్తారు. ప్రస్తుతం రూ.6,854 కోట్ల ఆర్థిక లోటు ఎదుర్కొంటుండగా చార్జీల పెంపుతో రూ.6,805 కోట్లు పూడ్చుకునే అవకాశం ఉందని లెక్కకట్టారు. 500 యూనిట్లలోపు విద్యుత్‌వాడకంలో ఉండే పేద, మధ్య తరగతి వారి రాయితీల భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని సీఎం జయ ప్రకటించారు. పెంచిన విద్యుత్ చార్జీలను ఉపసంహరించాలని ఎండీఎంకే, పీఎంకే అధినేతలు వైగో, రాందాస్‌లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.