‘కోతల’ పాపం కేంద్రానిదే
Published Fri, Nov 29 2013 2:56 AM | Last Updated on Tue, Sep 18 2018 8:28 PM
కటిక చీకట్ల నుంచి నిరంతర వెలుగుల దిశగా పయనిస్తున్న ఈ రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం తెచ్చిన పాపం కేంద్ర ప్రభుత్వానిదే. కోతల్లేని రాష్ట్రంగా తీర్చిదిద్దామని అసెంబ్లీలో ప్రకటించగానే కేంద్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థలు పడకేశాయి. ఆ సంస్థల్లో విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. దీంతో రాష్ట్రంలో మళ్లీ విద్యుత్ కోతలు మొదలయ్యూయి. - జయలలిత
చెన్నై, సాక్షి ప్రతినిధి:రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఎదుర్కొనే పరిస్థితులు సృష్టించిన పాపం కేంద్రానిదేనని ముఖ్యమంత్రి జయలలిత ఆరోపించారు. అన్నాడీఎంకే ప్రభుత్వం కేంద్రం అడుగులకు మడుగులొత్తడం లేదన్న అక్కసుతో విద్యుత్ సంక్షోభాన్ని సృష్టించారని ఆమె మండిపడ్డారు. ఏర్కాడు ఉప ఎన్నికల ప్రచారం నిమిత్తం గురువారం ఆమె నియోజకవర్గంలో పర్యటించారు. పలు చోట్ల నిర్వహించిన ప్రచా ర సభల్లో ఆమె మాట్లాడుతూ, తాను అధికారంలోకి రాకముందు రాష్ట్రం కటికచీకట్లో మగ్గిపోయేదని, గత రెండున్నరేళ్ల కాలంలో తాము చేపట్టిన ప్రయత్నాలతో రాష్ట్రంలో వెలుగులు చిమ్మాయని చెప్పారు. విద్యుత్ కోతలులేని రాష్ట్రంగా తీర్చిదిద్దానని గత అసెంబ్లీ సమావేశాల్లో సైతం తాను సగర్వంగా ప్రకటించానని తెలిపారు. తన మాటలు వెలువడిన రెండో రోజు నుంచి ఆశ్చర్యకరంగా రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం పునరావృతమైందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని విద్యుత్ కేంద్రాలన్నీ సక్రమంగా పనిచేస్తూ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుండగా, కేంద్ర ప్రభుత్వానికి చెందిన నైవేలీ, కల్‌పాక్కం తదితర విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి పడిపోయిందని పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో 2500 మెగావాట్ల ఉత్పత్తిలోటు ఏర్పడగా కోతలు అనివార్యమయ్యూయని ఆమె అన్నారు. ఎవరో ఆదేశించినట్లుగా అకస్మాత్తుగా ఉత్పత్తిలో విఘాతం ఏర్పటాన్ని అనుమానిస్తున్నట్లు చెప్పారు.
డీఎంకే సైతం ఏర్కాడు ఎన్నికల్లో విద్యుత్ కోతలనే ఎత్తిచూపడంతో తన అనుమానం నిజమవుతోందని పేర్కొన్నారు. కేంద్రం సృష్టించే అడ్డంకులను అధిగమిస్తూ రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన ఇవ్వడం సహించలేని డీఎంకే కేంద్రంలోని కాంగ్రెస్‌తో చేతులు కలిపి విద్యుత్ సంక్షోభానికి కారణమైందని ఆరోపించారు. డీఎంకే హయాంలో భూకబ్జాలకు పాల్పడిన నేతలను దండించి వారి నుంచి స్వాధీనం చేసుకున్న భూములను తాను పేదలకు పంచిపెట్టినట్లు వివరించారు. దీన్ని డీఎంకే జీర్ణించుకోలేకపోతోందని అన్నారు. తమిళ ప్రజలను ఆ రెండు పార్టీలు రాజకీయ కారణాలతో వంచనకు గురిచేస్తున్నాయని ఆమె దుయ్యబట్టారు. ఇటువంటి కుట్రలకు తాను వెరవడం లేదని, వీటన్నిటినీ అధిగమించి విద్యుత్ కోతలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని ఆమె హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో అన్నాడీఎంకే ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను ఏకరువుపెట్టారు. ఎంజీ రామచంద్రన్ కాలం నాటి నుంచి నేటి వరకు అంటే 1977 నుంచి 2011 వరకు వరుస విజయాలతో ఏర్కాడు నియోజకవర్గం అన్నాడీఎంకేకు పెట్టనికోటగా మారిందని ఆమె పేర్కొన్నారు. గురువారం ఉదయం 11 గంటలకు ఏర్కాడుకు చేరుకున్న జయలలిత సుమారు 9 ప్రచార సభల్లో ప్రసంగించారు. అభ్యర్థి సరోజ ముకుళిత హస్తాలతో ఆమె వెంట ప్రయాణించారు. భారీ సంఖ్యలో ప్రజలు జయ సభలకు హాజరయ్యూరు.
తెలుగుయువశక్తి ప్రచారం
ఏర్కాడులో అన్నాడీఎంకే అభ్యర్థి సరోజ గెలుపుకోసం తమిళనాడు తెలుగు యువశక్తి గురువారం రెండోరోజు ప్రచారం నిర్వహించింది. యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తదితరులు తెలుగువారున్న ప్రాంతాల్లో తెలుగులోనే భారీ పోస్టర్లు అంటించి, కరపత్రాలతో ప్రచారం చేశారు. కాశీనగరం, పుదుమర్రిమాన్ కోవిల్, గుండుకల్లూరు, కారిపట్టి తదితర ప్రాంతాల్లో అమ్మ పథకాలతో ముద్రించిన కరపత్రాలను వాడవాడలా పంచారు. యువశక్తి బృందం వెంట అధికారపార్టీకి చెందిన స్థానిక నేతలు పాల్గొన్నారు.
నేటి నుంచి స్టాలిన్ ప్రచారం
డీఎంకే అభ్యర్థి నాగమారన్ గెలుపు కోసం ఆపార్టీ కోశాధికారి స్టాలిన్ శుక్రవారం నుంచి వచ్చేనెల 2వ తేదీ వరకు ఏర్కాడులో ప్రచారం నిర్వహించనున్నారు.
Advertisement
Advertisement