జయ కారులోనే శశికళ..!
చెన్నై: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా జయలలిత నెచ్చెలి శశికళా నటరాజన్ శనివారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. తమిళులందరికీ అమ్మ జయలలిత ఆరాధ్యదైవం అని పేర్కొన్నారు. అయితే, అన్నాడీఎంకే పగ్గాలు చేపట్టేందుకు ఆమె పోయెస్ గార్డెన్ నుంచి పార్టీ కార్యాలయానికి జయలలిత వాడిన కారులోనే రావడం విశేషం.
శశికళ పార్టీ పగ్గాలు చేపడుతున్న సందర్భంగా అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం వద్ద సందడి నెలకొంది. పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి 'చిన్నమ్మ', 'చిన్నమ్మ' అంటూ నినాదాలతో హోరెత్తించారు. పలువురు అభిమానులు శశికళ ఫొటోలు, నినాదాలు ఉన్న టీషర్టులు ధరించి.. ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.