అమ్మ అడుగుజాడల్లో.. శశి శకం!
అంతా ఊహించినట్టుగానే దివంగత ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ నటరాజన్ అధికార అన్నాడీఎంకే పగ్గాలను చేపట్టారు. చెన్నైలో గురువారం జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
అయితే, జయలలిత వారసురాలిగా తనను తాను శశికళ నిరూపించుకోవడం అంత సులువు కాదు. ముఖ్యంగా ఎన్నికల రాజకీయాల్లో ఆమె ఆరితేరాల్సి ఉంటుంది. పార్టీ పగ్గాలు చేపట్టడం కన్నా అసలు సిసలు సవాళ్లను ఇకముందు ఆమె ఎదుర్కోవాల్సి ఉంటుంది. అది జయలలిత ఎదుర్కొన్న రాజకీయ ప్రస్థానం కన్నా కష్టతరమైనది కావొచ్చు.
మొదటగా చెప్పాలంటే జయలలిత తరహాలో శశికి సినీ ఛరిష్మా లేదు. జయకు ఉన్నంత రాజకీయ అనుభవం కూడా లేదు. ఎంజీఆర్ నాయకత్వంలో ఎన్నోఏళ్లు పనిచేసి.. అపారమైన రాజకీయ అనుభవాన్ని జయ పోగేసుకున్నారు. శశికళ విషయానికొస్తే ఎప్పుడూ విషాదగ్రస్తగా కనిపించే ఆమె ఆ స్థాయిలో ప్రజల్ని ఆకట్టుకోగలరా? అన్నది సందేహాస్పదమే. దీనికితోడు కుటుంబసభ్యులనే భారం కూడా ఆమెను వెంటాడుతోంది. అంతేకాకుండా, ఆమె, ఆమె కుటుంబసభ్యులు పలు అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. అంతేకాదు తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన పేరును దుర్వినియోగం చేశారని, ఆర్థిక లబ్ధులు పొందారనే ఆరోపణలతో స్వయంగా జయలలితే శశికళను, ఆమె కుటుంబసభ్యులను పోయెస్‌గార్డెన్ నుంచి తరిమేసిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది.
ఒకప్పుడు జయలలిత అనుసరించిన రాజకీయ విధానాన్నే ఇప్పుడు శశికళ అనుసరిస్తున్నట్టు కనిపించవచ్చు. 1989లో ఎంజీఆర్ చనిపోయినప్పుడు వారసురాలిగా ఆయన భార్య జానకి ముందుకొచ్చారు. కానీ జయలలిత పార్టీలో చీలిక తీసుకురావడం.. ఎన్నికల్లో జానకి నిలదొక్కుకోలేకపోవడంతో అన్నాడీఎంకే జయలలిత చేతికొచ్చింది. ఇప్పుడు జయలలిత మృతి నేపథ్యంలో అన్నాడీఎంకేను శశికళ తన చేతుల్లోకి తీసుకున్నారు. పార్టీ ప్రభుత్వాన్ని రానున్న నాలుగేళ్లు నడుపడం, పార్టీ చీలిపోకుండా ఐక్యంగా కొనసాగించడం ప్రస్తుతం ఆమె ముందున్న అతిపెద్ద సవాళ్లని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.