అనుమానాలు తొలగిపోయాయి.. ఉత్కంఠకు తెరపడింది. సుదీర్ఘ పోరాటం తర్వాత ఎట్టకేలకూ అన్నాడీఎంకే పూర్తిగా పళణి స్వామి గుప్పెట్లోకి చేరింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆయనకి కేంద్ర ఎన్నికల కమిషన్ గుర్తింపు కల్పించింది. ఆయన నేతృత్వంలో 79 మంది రాష్ట్ర కమిటీ, 69 జిల్లాల కార్యదర్శులు, ఇతర రాష్ట్రాలలోని కార్యదర్శులకు ఆమోద ముద్ర వేస్తూ.. ఆ వివరాలను మంగళవారం కేంద్ర ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ఇది అన్నాడీఎంకే శ్రేణుల్లో అమితానందాన్ని నింపింది.
సాక్షి, చైన్నె: అమ్మ జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకేలో చోటు చేసుకున్న అనూహ్య పరిణామాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాల క్రమంలో ఆ పార్టీలోని ముఖ్య నేతలు నాలుగు శిబిరాలుగా విడిపోయి ముందుకెళ్తున్నారు. ఓ ఓ వైపు తానే ఆ పార్టీ ప్రధాన కార్యదర్శినంటూ జయలలిత నెచ్చెలి శశికళ, మరోవైపు పార్టీలో చీలిక కారణంగా ఏర్పడిన అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం గొడుగు నీడన దినకరన్, ఇంకో వైపు సమన్వయ కమిటీ కన్వీనర్ హోదాతో అంటూ పన్నీరు సెల్వం శిబిరం అన్నాడీఎంకేను కై వశం చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాయి.
అయితే, కేడర్ బలం, ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీల మద్దతుతో అన్నాడీఎంకే తనదే అని చాటే విధంగా పళణి స్వామి నిత్యం వ్యూహాలకు పదును పెట్టి చివరికి సఫలీకృతులయ్యారు. అన్నాడీఎంకే వ్యవహారాలు అనేకం కోర్టుల్లో ఉన్నా, పార్టీకి కీలకం ఎవరు? అనే విషయాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ తాజాగా మరోమారు తేల్చింది. సర్వ సభ్య సమావేశం, పార్టీ నిబంధనలకు అనుగుణంగా సంస్థాగత ఎన్నికలు, ఏకగ్రీవంగా పదవులకు ఆమోదం లభించడంతో పళనిస్వామి పై చేయి సాధించారు.
నూతనోత్సాహంతో..
సుప్రీంకోర్టు ఇటీవల వచ్చిన తీర్పు, అందుకు అనుగుణంగా కేంద్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఉత్తర్వులతో వ్యూహాలకు పదును పెట్టి అన్నాడీఎంకేలో ఏక నాయకత్వం దిశగా పళణి స్వామి అడుగులు వేసి విజయం సాధించారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పగ్గాలు చేపట్టి బలోపేతం దిశగా పరుగులు తీస్తున్నారు. ఆగస్టులో మదురై వేదికగా భారీ మహానాడు నిర్వహణకు సిద్ధమవున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రధాన కార్యదర్శిగా తన ఎంపికతో పాటుగా, రాష్ట్ర కమిటీ, జిల్లాల కమిటీ, ఇతర రాష్ట్రాల కమిటీల ఎంపిక వివరాలను కేంద్ర ఎన్నికల కమిషన్‌కు అన్నాడీఎంకే వర్గాలు పంపించాయి.
ఇందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఆమోద ముద్ర వేసింది. ఇక, అన్నాడీఎంకేను సొంతం చేసునే అవకాశం ఇతర గ్రూపులకు లేని విధంగా కేంద్ర ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌లో పెట్టిన ఉత్తర్వులు మంగళవారం పళణి స్వామికి అందాయి. ఇందులో అన్నాడీఎంకేలో ఇక ఏక నాయకత్వం అని చాటే విధంగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పళణి స్వామికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే, 69 జిల్లాలకు కార్యదర్శులు, రాష్ట్ర కమిటీలో జంబో జట్టుగా 79 మంది నియామకానికి, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, ఢిల్లీ, తెలంగాణ, అండమాన్ తదితర ప్రాంతాలకు పార్టీ కార్యదర్శుల గుర్తింపునకు ఆమోదం లభించింది. దీంతో ఆపార్టీలో నూతనోత్సాహం కనిపిస్తోంది.
రాష్ట్ర కమిటీలో 79 మందికి చోటు
పార్టీ ప్రిసీడియం చైర్మన్‌గా తమిళ్ మగన్ హుస్సేన్, డిప్యూటీ ప్రధాన కార్యదర్శులుగా కేపీ మునుస్వామి, నత్తం ఆర్. విశ్వనాథన్, కోశాధికారిగా దిండుగల్ శ్రీనివాసన్, ఆల్ ఇండియా ఎంజీఆర్ మండ్రం కార్యదర్శిగా సి. పొన్నయ్యన్‌ను నియమించారు. పార్టీ సిద్ధాంతాల ప్రచార కార్యదర్శిగా సి. తంబి దురై, నిర్వాహక కార్యదర్శులుగా సెంగోట్టయన్, తంగమణి, జయకుమార్, సీవీ షణ్ముగం, సెమ్మలై, దళవాయి సుందరం, పార్టీ ప్రధాన కార్యాలయ కార్యదర్శిగా ఎస్పీ వేలుమణి, పార్టీ ఎన్నికల విభాగం కార్యదర్శిగా పొల్లాచ్చి వి. జయరామన్, మహిళా విభాగం కార్యదర్శిగా వలర్మతికు పదవులు కల్పించారు.
కేంద్ర ఎన్నికల కమిషన్ తమకే అన్నాడీఎంకే అని స్పష్టం చేయడంతో పళణి స్వామి మద్దతు దారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక, అన్నాడీఎంకే జెండాను గానీ,పార్టీ చిహ్నాన్ని గానీ మరెవరైనా ఉపయోగిస్తే చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని జయకుమార్ హెచ్చరించారు. పళణిస్వామికి అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి గుర్తింపు వచ్చిందో లేదో వెంటనే ఏన్డీఏ కూటమి ఆహ్వానం కూడా దక్కింది. ఈనెల 18వ తేదీ ఢిల్లీలో జరగనున్న ఎన్డీఏ పార్టీల సమావేశానికి అన్నాడీఎంకే తరపున హాజరు కావాలంటూ పళణికి పిలుపు రావడం విశేషం. ఈ పరిణామాలతో అన్నాడీఎంకే వర్గాలు ఆనంద తాండవం చేస్తున్నాయి.
అంగీకరించే ప్రసక్తే లేదు..
కేంద్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులను తాము అంగీకరించే ప్రసక్తే లేదని పన్నీరు సెల్వం స్పష్టం చేశారు. మంగళవారం ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ వ్యవహారం కోర్టులో ఉందని, తమకు అనుకూలంగా తీర్పు వస్తుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. పళణి సీఎంగా ఉన్నప్పుడు చోటు చేసుకున్న (దివంగత సీఎం జయలలితకు చెందిన ఎస్టేట్) కొడనాడు ఘటనను ఈసందర్భంగా పన్నీరు సెల్వం ప్రస్తావిస్తూ, ఈ కేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేయాని కోరారు.
ఈ విషయంపై ఆగస్టు 1వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నామని ప్రకటించారు. కాగా, ఎన్డీఏ కూటమి సమావేశానికి పళణి స్వామికి, పీఎంకే తరపున అన్భుమణి రాందాసుకు, తమిళ మానిల కాంగ్రెస్ తరపున జీకే వాసన్‌కు ఆహ్వానాలు వచ్చినా తనకు మాత్రం ఎలాంటి ఆహ్వానం అందలేని పన్నీరు పేర్కొనడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment