సాక్షి, చైన్నె: మాజీ సీఎం పన్నీరు సెల్వం కొత్త పార్టీ కసరత్తుల్లో ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి.ఈ పార్టీకి అమ్మ డీఎంకే అనే పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. వివరాలు.. అన్నాడీఎంకేను కై వశం చేసుకునేందుకు మాజీ సీఎం పన్నీరు సెల్వం చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టులో, కేంద్ర ఎన్నికల కమిషన్ వద్ద చుక్కెదురైంది. పళణి స్వామి అనుకూలంగా తీర్పులు వెలువడ్డాయి. చివరకు సర్వ సభ్య సమావేశ తీర్మానాల విషయంలో తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని ఎదురుచూసి భంగ పడ్డారు.
ఈ వ్యవహారంలోనూ పళణి స్వామినే విజయం వరించింది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఆ పార్టీ పగ్గాలను పూర్తిగా పళణి స్వామి తన గుప్పెట్లోకి తెచ్చుకున్నారు. దీంతో పన్నీరుకు భంగపాటు తప్పలేదు. ఇక, అన్నాడీఎంకే కై వశం ప్రయత్నాలను పక్కన పెట్టి తనను నమ్మి వచ్చిన వారి కోసం, తనకు అండగా ఉన్న కేడర్ చేజారకుండా జాగ్రత్తలకు పన్నీరు సెల్వం సిద్ధమయ్యారు. ఇందుకోసం కొత్త పార్టీకి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే తమ కంటూ ఓ పత్రికను ఏర్పాటు చేశారు. ఈ పత్రిక ద్వారా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కొత్త వ్యూహాలకు సిద్ధమయ్యారు.
ఇందులో భాగంగా ఆయన అన్నాడీఎంకేను ఇరకాటంలో పెట్టే రీతిలో కొత్త పార్టీ వైపుగా అడుగులు వేస్తున్నట్టు మద్దతుదారులు పేర్కొంటున్నారు. ఈ పార్టీకి అమ్మడీఎంకే అన్న పేరును పరిశీలిస్తున్నట్లు సంకేతాలు వెలువడ్డాయి. ఇప్పటికే అన్నాడీఎంకే నుంచి చీలికతో దినకరన్ నేతృత్వంలో అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం ఆవిర్భవించి ఉంది. ఇది విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లి ఉంది.
ఈ దృష్ట్యా, అన్నా డీఎంకేకు ప్రత్యామ్నాయంగా అమ్మడీఎంకే అన్న పేరును పరిశీలిస్తున్నామని ఓ నేత పేర్కొన్నారు. మరికొద్ది రోజుల్లో పార్టీ ప్రకటన, మహానాడుకు సిద్ధమవుతున్నామని ఆ నేత తెలిపారు. లోక్‌సభ ఎన్నికలలో పన్నీరు పార్టీ పోటీకి దిగడం ఖాయం అని ధీమా వ్యక్తంచేశారు. కేంద్రంలోని బీజేపీ తమను మోసం చేసిందని అందుకే ఆ కూటమికి ప్రత్యామ్నాయంగా అమ్మ డీఎంకే అడుగుల వేగం పెంచడం ఖాయం అని మరో నేతపేర్కొనడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment