అమిత్‌షాతో పళనిస్వామి (ఫైల్)
సాక్షి, చైన్నె : అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి హోదాలో తొలిసారిగా ఎడపాడి కే పళనిస్వామి బుధవారం ఢిల్లీకి వెళ్లారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఆయన భేటీ అయ్యారు. ఈసందర్భంగా పళనికి తన అభయాన్ని అమిత్ షా ఇస్తూ కొన్ని సూచనలు చేసినట్టు సమాచారం. అన్నాడీఎంకేలో పళని స్వామి, పన్నీరుసెల్వం మధ్య జరుగుతున్న వార్ క్‌లైమాక్స్‌కు చేరిన విషయం తెలిసిందే. కోర్టు, ఎన్నికల కమిషన్ ఉత్తర్వులతో అన్నాడీఎంకేను పూర్తిగా పళని స్వామి తన గుప్పెట్లోకి తెచ్చుకున్నారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రాజకీయ వ్యూహాలకు పదును పెట్టే పనిలో పడ్డారు.
ఇందులో భాగంగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో బుధవారం ఢిల్లీకి పళని వెళ్లారు. ముందుగా సేలంలోని తన స్వగ్రామం శిలువం పట్టిలోని మారియమ్మన్ ఆలయంలో పూజలు నిర్వహించారు. అక్కడ జరిగిన కుంభాభిషేక ఉత్సవానికి కుటుంబ సమేతంగా హాజరు అయ్యారు. అనంతరం కోయంబత్తూరు చేరుకున్న పళనిస్వామి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఆయనకు కోయంబత్తూరు విమానాశ్రయంలో అన్నాడీఎంకే వర్గాలు ఘనంగా వీడ్కోలు పలికాయి. పార్టీ నేతలు తంగమణి, ఎస్పీ వేలుమణిలతో కలిసి రాత్రి ఏడు గంటలకు ఢిల్లీకి పళనిస్వామి చేరుకున్నారు.
అక్కడి విమానాశ్రయంలో పార్టీ నేతలు, ఎంపీలు సీవీ షణ్ముగం, తంబిదురై, చంద్రశేఖర్ పళనికి ఆహ్వానం పలికారు. రాత్రి తొమ్మిది గంటల సమయంలో అమిత్ షాతో పళనిస్వామి భేటీ అయ్యారు. ఈ ఇద్దరి మధ్య అర గంటకు పైగా తమిళ రాజకీయ అంశాలపై చర్చ జరిగినట్టు సమాచారం. అలాగే, రాష్ట్రంలో అన్నాడీఎంకే కూటమిలో గందరగోళం సృష్టించే విధంగా బీజేపీ అధ్యక్షుడు అన్నామలై తరచూ చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలపై అమిత్ షాకు పళణి ఫిర్యాదు చేసినట్టు సమాచారం.
అలాగే, లోక్‌సభ ఎన్నికల కూటమి గురించి చర్చించినట్టు తెలిసింది. ఈసందర్భంగా పళని స్వామికి అమిత్ షా అభయాన్ని ఇచ్చినట్టు తెలిసింది. అన్ని వ్యవహారాలను తాను చూసుకుంటానని, తమిళనాడులో కూటమి అధిక స్థానాల్ని కై వసం చేసుకోవడం లక్ష్యంగా కార్యక్రమాలు విస్తృతం చేయాలని అమిత్ షా పళనికి సూచించినట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment