అనుకున్నదే అయ్యింది.. విమర్శలు ప్రతివిమర్శలు, అపనమ్మకాలు..ఆరోపణలు, ఎత్తులు.. పైఎత్తులతో ఇన్నాళ్లూ పడుతూ లేస్తూ సాగిన అన్నాడీఎంకే– బీజేపీ బంధానికి సోమవారం తెరపడింది. ఎన్డీయే కూటమని నుంచి ప్రధాన భాగస్వామి అయిన అన్నాడీఎంకే బయటకు వచ్చినట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పళణిస్వామి ప్రకటించారు. ఈ మేరకు పార్టీ జిల్లా కార్యదర్శుల సమావేశంలో స్పష్టం చేశారు. రాష్ట్రంలోని బీజేపీ నేతల తీరే ఈ నిర్ణయానికి కారణమని వెల్లడించారు.
సాక్షి, చైన్నె: బీజేపీ – అన్నాడీఎంకే బంధానికి బ్రేక్ పడింది. ఎన్డీఏ కూటమికి బై..బై చెబుతూ సోమవారం అన్నాడీఎంకే కీలక ప్రకటన చేసింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి నేతృత్వంలోనే కూటమి ఏర్పాటు అవుతుందని స్పష్టం చేశారు. ఈ మేరకు చైన్నెలో జరిగిన పార్టీ జిల్లా కార్యదర్శులు, రాష్ట్ర కమిటీ నేతలు, ఎంపీ, ఎమ్మెల్యేల సమావేశంలో నిర్ణయించారు. ఈ ప్రకటనతో అన్నాడీఎంకే వర్గాలు సంబరాల్లో మునిగిపోయాయి. వివరాలు.. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం తదుపరి చోటు చేసుకున్న పరిణామాలతో ఈ పార్టీ ప్రభుత్వంలో బీజేపీ జోక్యం పెరిగిన విషయం తెలిసిందే. సీఎంగా పగ్గాలు చేపట్టినానంతరం పళణి స్వామి 2017 నుంచి బీజేపీతో స్నేహ పూర్వకంగా మెలుగుతూ వచ్చారు.
2019 లోక్‌సభ ఎన్నికలతో పాటు 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలలోనూ బంధం పదిలం అన్నట్లుగానే ముందుకు సాగారు. అయితే, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా అన్నామలై పగ్గాలు చేపట్టినానంతరం రెండు పార్టీల మధ్య క్రమంగా దూరం పెరుగుతూ వచ్చింది. బీజేపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా మిత్రపక్షం అన్నాడీఎంకేను సైతం అన్నామలై టార్గెట్ చేయడం వివాదానికి ఆజ్యం పోసింది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామితో పాటు దివంగత నేతలు అన్నాదురై, జయలలితకు వ్యతిరేకంగా అన్నామలై తీవ్ర వ్యాఖ్యలు చేయడం వివాదంగా మారింది.
ఢిల్లీ పర్యటన తర్వాత మారిన సీను..
వారం క్రితం అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి ఢిల్లీ పర్యటన అనంతరం పరిణామాలు వేగంగా మారాయి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో చర్చల సమయంలో చోటు చేసుకున్న పరిణామాలను పళణి తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది. తమ శత్రువులు పన్నీరు, దినకరన్‌ను బీజేపీ అక్కున చేర్చుకునే ప్రయత్నాలు చేస్తుండ డం, పుదుచ్చేరితోపాటు తమిళనాడులో 20 సీట్లను ఆశించడం వంటి సమాచారంతో బీజేపీతో ఇక కటీఫ్ అన్న నినాదాన్ని అన్నాడీఎంకే నేతలు అందుకున్నారు.
సుదీర్ఘచర్చ తర్వాత కఠిన నిర్ణయం..
అన్నాడీఎంకే జిల్లాల కార్యదర్శుల సమావేశం సోమవారం సాయంత్రం రాయపేటలోని ఎంజీఆర్ మాళిగైలో జరిగింది. గంటన్నర పాటు జరిగిన ఈ సమావేశంలో జిల్లాల కార్యదర్శులు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర కమిటీ నేతలు ముక్తకంఠంతో బీజేపీతో తెగతెంపులు చేసుకోవాలని నినాదించారు. ఢిల్లీలో అమిత్‌షా చర్చల సమయంలో చోటు చేసుకున్న పరిణామాలు, అన్నామలైపై ఫిర్యాదు చేయడానికి వెళ్లిన పార్టీ నేతలకు ఎదురైన నిరాశపూరిత పరిణామాల గురించి సైతం ఈ సమావేశంలో చర్చించడం గమనార్హం. కూటమి నుంచి బయటకు వచ్చిన పక్షంలో ఎదురయ్యే పరిణామాలు, ఈడీ, ఐటీ, సీబీఐ దాడులు, వాటిని తిప్పికొట్టే విధంగా నేతలు సిద్ధమయ్యే విధంగా చర్చించారు. సుదీర్ఘర సమాలోచన అనంతరం పార్టీ నేతలు మునుస్వామి, జయకుమార్, ఎస్పీ వేలుమణి, నత్తం విశ్వనాథన్, దిండుగల్ శ్రీనివాసన్ మీడియా ముందుకు వచ్చారు.
పళణి నేతృత్వంలోనే కూటమి
మీడియాతో నేతలు మాట్లాడుతూ, తమ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో జరిగిన సమావేశంలో నేతలందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేశామని వివరించారు. గత ఏడాది కాలంగా పథకం ప్రకారం రాష్ట్ర బీజేపీ నేతలు అన్నాడీఎంకే దివంగత నేతలను, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని గురిపెట్టి తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారని గుర్తు చేశారు. పురట్చి తమిళర్ పళణి స్వామి నేతృత్వంలో మదురై వేదికగా జరిగిన భారీ మహానాడును సైతం విమర్శించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు కోట్ల మంది అన్నాడీఎంకే కేడర్ మనోభావాలకు వ్యతిరేకంగా బీజేపీ చర్యలు ఉంటున్నాయని ధ్వజమెత్తారు. అందుకే ఆ పార్టీకి దూరంగా ఉండాలని నిర్ణయించామన్నారు. ఎన్‌డీఏ కూటమి నుంచి తాము బయటకు వచ్చేశామని ప్రకటించారు. కేవలం రాష్ట్రంలోని బీజేపీ నేతల తీరు కారణంగానే కూటమి నుంచి బయటకు వచ్చేశామని, ఇక, బీజేపీతో పొత్తు ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. 2024 లోక్‌సభ ఎన్నికలలో అన్నాడీఎంకే నేతృత్వంలో కూటమి అని, దీనికి తమ ప్రధాన కార్యదర్శి పళణి స్వామి నేతృత్వం వహిస్తారని ప్రకటించారు.
స్వీట్లు పంచి..
ఎన్‌డీఏకు బై..బై....చెప్పేశామని మునుస్వామి ప్రకటన చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా అన్నాడీఎంకే వర్గాలు సంబరాల్లో మునిగిపోయాయి. ఇక బీజేపీతో ఆరేళ్ల బంధం వీడడంతో అన్నాడీఎంకే వర్గాలు బాణా సంచా పేల్చుతూ సందడి చేశారు.ి అన్నాడీఎంకే కార్యాలయం ఎంజీఆర్‌మాళిగై పరిసరాలు సంబరాల కోలాహలంలో మునిగింది. ఆనంద తాండవం చేస్తూ నేతలు పళణికి మద్దతుగా నినాదాలు చేశారు. ఇదిలా ఉండగా, జాతీయస్థాయిలో ఎన్‌డీఏ కూటమిలో అన్నాడీఎంకే కీలంగా ఉన్న నేపథ్యంలో తాజా నిర్ణయం మున్ముందు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో అనే ఉత్కంఠం ప్రస్తుతం నెలకొంది.
రాష్ట్రనేతలెవరూ మాట్లాడొద్దు– బీజేపీ అధిష్టానం
అన్నాడీఎంకే నిర్ణయంపై తమ పార్టీ అధిష్టానం సరైన సమయంలో స్పందిస్తుందని బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై వ్యాఖ్యానించారు. కోయబత్తూరులో నా మట్టి... నా ప్రజలు యాత్రలో పాల్గొంటున్న ఆయన్ని మీడియా ప్రతినిధులు సాయంత్రం అన్నాడీఎంకే నిర్ణయంపై ఆయన్ని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ అధిష్టానం అన్ని అంశాలను గమనిస్తోందని, తగిన సమయంలో స్పందిస్తుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం తన యాత్ర విజయవంతంగా కొనసాగుతోందని, తమ పార్టీకి ఏ నిర్ణయమైనా అధిష్టానం తీసుకోవాల్సి ఉంటుందని వెల్లడించారు. తాను కూడా త్వరలో మీడియా ముందుకు వచ్చి అన్ని వివరాలను తెలియజేస్తానని ముగించారు. బీజేపీ ఎమ్మెల్యే, జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలు వానతీ శ్రీనివాసన్ కూడా అన్నామలై తరహాలోనే స్పందించారు. ఇక అన్నాడీఎంకే ప్రకటనపై బీజేపీ అధిష్టానం సోమవారం రాత్రి స్పందించింది. పొత్తు అంశంపై రాష్ట్రనేతలెవరూ మాట్లాడకూడదని స్పష్టం చేసింది. ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది.
ముందే చెప్పిన ‘సాక్షి’
అన్నాడీఎంకే, బీజేపీ మధ్య అంతరాలు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు బెడిసికొట్టే అవకాశం ఉందనే విషయంపై గతంలోనే ‘సాక్షి’ పలుమార్లు విశ్వసనీయ కథనాలు ప్రచురించింది. అన్నాడీఎంకే కార్యదర్శుల సమావేశంలో పళణి స్వామి ఈమేరకు ఎన్డీఏ నుంచి బయటకు వస్తున్నట్లు ప్రకటించే అవకాశం ఉందని స్పష్టం చేసింది. సోమవారం అదే నిజమైంది.
Comments
Please login to add a commentAdd a comment