సాక్షి, న్యూఢిల్లీ: 2024 సార్వత్రిక ఎన్నికలకు దృష్టిలో ఉంచుకునే రాజకీయ పరిణామాలు శరవేగంగా.. రోజుకో మలుపు తిరుగుతున్నాయి. బీజేపీకి అధికారం దూరం చేసే క్రమంలో.. సాధ్యమైనంత వరకు ఐక్యంగా ఉండాలని విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. అవసరమైతే ఉమ్మడి ప్రధాని అభ్యర్థిని నిలపాలనే యోచనలోనూ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈలోపే బీజేపీ మరో ప్లాన్‌తో ముందుకు వచ్చింది.
విపక్ష కూటమి సమావేశం కంటే ముందే ఎన్డీయే కూటమి బలప్రదర్శన చేయాలని నిర్ణయించుకంది. ఈ మేరకు జులై 18వ తేదీన ఎన్డీయే విస్తృతస్థాయి సమావేశానికి సిద్ధమవుతున్న బీజేపీ.. మిత్రపక్షాలకు సమాచారం అందించింది. ఎన్డీయే పక్షాలనే కాదు.. ఏ కూటమికి చెందని కొన్ని పార్టీలకు సైతం ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది. ఈ లిస్ట్‌లో అకాలీదళ్, చిరాగ్ పాశ్వాన్ కూడా ఉన్నారు. మరోవైపు కర్ణాటకలో జేడీఎస్‌తోనూ పొత్తు కోసం యత్నిస్తున్న బీజేపీ.. ఆ పార్టీకి ఆహ్వానం పంపింది.
ఇక తమిళనాడులో గత కొంతకాలంగా విబేధాలతో దూరంగా ఉంటూ వస్తున్న మిత్రపక్షం అన్నాడీఎంకేకు సైతం ఆహ్వానం పంపింది. పార్లమెంట్ సమావేశాలకు ముందరే జరగనున్న ఈ కీలక సమావేశం ద్వారా విపక్షాల ఐక్యతకు కౌంటర్ ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది.
మంత్రివర్గ విస్తరణపై సమావేశం
ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో ఇవాళ(గురువారం) మంత్రివర్గ పునర్వవ్యస్థీకరణ భేటీ జరిగింది. ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. నాలుగు గంటలకు పైగా సాగిన సమావేశంలో.. కేబినెట్ మార్పులు చేర్పులపైనే ప్రధానాంశంగా చర్చ జరిగింది. ఈ శని లేదంటే ఆదివారం మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఎన్నికల దృష్ట్యానే ఈ కేబినెట్ కూర్పు ఉండనున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment