మళ్లీ వారసుడిగా తెరపైకి హీరో అజిత్?
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం తీవ్రంగా విషమించడంతో ఆమె వారసుడు ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. గతంలో జయలలిత పలు కేసుల్లో జైలుపాలైనప్పుడు ఆమె వారసుడిగా వీరవిధేయుడైన పన్నీర్ సెల్వం పగ్గాలు చేపట్టారు. జయలలిత జైలు నుంచి విడుదలైన తర్వాత తిరిగి ఆమెకు పగ్గాలు అప్పగించారు. అయితే, జయలలిత తదనంతరం ఆమె వారసుడిగా అన్నాడీఎంకేను ముందుకునడిపే సత్తా, డీఎంకేను దీటుగా ఢీకొనే సామర్థ్యం పన్నీర్ సెల్వంకు ఉందా? అన్నది ఆ పార్టీలోనే కొందరు సీనియర్ నేతలు అనుమానిస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో అమ్మ వారసుడిగా హీరో అజిత్ పేరు మరోసారి వినిపిస్తున్నది. కోలీవుడ్‌లో మాస్ హీరోగా అజిత్‌కు మంచి అభిమానగణం ఉంది. జయలలిత వారసుడిగా ఆయన రాజకీయాల్లోకి వస్తే.. ప్రత్యర్థి డీఎంకేను ఎదుర్కోవడం సులువు అనేది అన్నాడీఎంకేలోని కొందరు సీనియర్ నేతల ఆలోచనగా చెప్తున్నారు. జయలలితకు కుమారుడులాంటివాడిగా పేరు తెచ్చుకున్న అజిత్‌ను తెరపైకి తీసుకువచ్చేందుకు అన్నాడీఎంకేలోని పన్నీర్ సెల్వం కన్నా సీనియర్ వర్గం ఒకటి ప్రయత్నిస్తున్నట్టు తమిళ రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. గతంలోనూ జయలలిత వారసుడిగా అజిత్ రంగప్రవేశం చేస్తారని కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే.
మరోవైపు సోమవారం జయలలిత చికిత్స పొందుతున్న అపోలో ఆస్పత్రిలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేల కీలక సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ‘అమ్మ’ ఆరోగ్యం అత్యంత ఆందోళనకరంగా ఉన్న నేపథ్యంలో తదుపరి నాయకత్వంపై ఈ భేటీలో చర్చించినట్టు సమాచారం. జయ వారసుడిగా పన్నీరు సెల్వం పేరును ప్రతిపాదించినట్టు తెలిసింది. పన్నీరు సెల్వంకు మద్దతుగా ఎమ్మెల్యేలు సంతకాలు చేసినట్టు కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో జయ వారసుడిగా అజిత్ తెరపైకి వచ్చిది ఎంతవరకు సాధ్యమో చూడాలని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.