అమ్మ గెలిచిందని ఒక్కో సీటుకు ఒక్కరు గుండు!
చెన్నై: తమిళనాట ప్రతినోటా వినిపించే పదం అమ్మ. వరుసగా రెండో సారి ఎన్నికల్లో గెలిచి మూడు దశాబ్దాల రికార్డును తిరగరాసి తమిళ రాజకీయాలకు కొత్త జోస్యం చెప్పింది అమ్మ. జయలలిత ఆరోసారి ముఖ్యమంత్రిగా సోమవారం ప్రమాణం చేశారు. ఏఐడీఎంకే పార్టీ నేతలు, కార్యకర్తలలో నూతన ఉత్సాహం ఉప్పొంగింది. ఆ జోరు ఎంత అంటే చెప్పలేం. తాజా ఫలితాలలో అమ్మకు చెందిన పార్టీ 134 సీట్లను కైవసం చేసుకుని సాధారణ మెజార్టీ సాధించింది. కానీ, అమ్మ మద్దతుదారులకు ఇది పండగ లాంటి విషయం. జయలలితపై అభిమానాన్ని వినూత్నంగా చాటి చెప్పాలనుకున్నారు. ఒక్కో సీటుకు గుర్తుగా ఒక్కరు గుండు చేయించుకున్నారు. మొత్తం 134 సీట్లకు గానూ 134 మంది గుండు చేయించుకుని అమ్మపై అభిమానాన్ని ఇలా ప్రదర్శించారు. అనంతరం అమ్మ నివాసానికి వెళ్లగా వీరిని కలిసేందుకు సీఎం ఇష్టపడలేదు.
కోయంబత్తూరుకు చెందిన జయ అభిమాని అయిన ఓ ఆటోడ్రైవర్ తన ఆటోలో ఎక్కే ప్రయాణికులు ఎక్కడకు వెళ్లినా వాళ్ల దగ్గర నుంచి కేవలం ఒక్క రూపాయి మాత్రమే చార్జీ తీసుకున్నాడు. ఒక రోజులో మొత్తం 102 మందిని తాను గమ్యాలకు చేర్చి 102 రూపాయలు సంపాదించానని, ఇందుకోసం తాను ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం మానేశానని ఆటోడ్రైవర్ ఆర్ఎం మత్తివనన్ తన అభిమానాన్ని చాటుకున్నాడు.. జయలలిత 68వ పెట్టినరోజును పురస్కరించుకుని 668 మంది అభిమానులు చేతిపై అమ్మ టాటూను వేయించుకున్న విషయం తెలిసిందే.