tonsure head
-
Vijayawada: మరెవరికీ ఇలాంటి అన్యాయం జరగొద్దు
సాక్షి, విజయవాడ: టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కక్ష సాధింపులకు నిరసనగా వైఎస్సార్సీపీ దళిత నేత శిరోముండనం చేయించుకున్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ దళిత నాయకుడిపై స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గుండా గిరి చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున ప్రచారం చేశాడనే కోపంతో అధికారులను ఉపయోగించి మరీ నందెపు జగదీష్‌కు చెందిన భవనాన్ని జేసీబీతో కూల్చివేయించారు. ఈ ఘటనపై తీవ్ర మనస్థాపానికి గురైన జగదీష్.. కూల్చేసిన భవనం ముందే శిరోముండనం చేయించుకుని అర్ధనగ్నంగా బోండా ఉమాకు నిరసన తెలియజేశారు. అనంతరం జగదీష్ మీడియాతో మాట్లాడారు. ‘‘నేను అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున ప్రచారం చేశానని అసూయతో, అధికార బలంతో భవనాలను కుప్పకూల్చారు. దీనిపై సీఎం చంద్రబాబుకు స్పందనలో ఫిర్యాదు చేస్తా. దళిత వైఎస్సార్సీపీ నాయకుడిగా ఉండటం నేను చేసిన తప్పా?. బోండా ఉమాకు అధికారం తోడవడంతో ఇటువంటి అన్యాయాలు ముందు రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం ఉంది. .. నేను మాజీ కార్పొరేటర్, కో ఆప్షన్ మెంబర్‌ను. నాకు న్యాయం జరగకపోతే, నా కుటుంబ సభ్యులకి శిరోముండనం చేసుకొని నిరసన తీవ్రతరం చేస్తా. నాకు జరిగిన అన్యాయం ఇంకెవరికీ జరగకూడదు’’ అని జగదీష్ ఆవేదన వ్యక్తం చేశారు. -
వెంకటాయపాలెం : 1996 శిరోముండనం కేసులో కీలక తీర్పు
సాక్షి, విశాఖపట్నం: 1996 నాటి శిరోముండనం కేసులో విశాఖ ఎస్సీ, ఎస్టీ కోర్టు మంగళవారం కీలక తీర్పు వెల్లడించింది. శిరోముండనం చేసినట్లు ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది. దాడి కేసులో మాత్రం మొత్తం 10 మందిని దోషులుగా కోర్టు గుర్తించింది. ఈ పది మందిలో ఒకరు మృతి చెందారు. నిందితులకు అట్రాసిటీ కేసులో 18 నెలల జైలు శిక్ష విధించింది. ఒక్కొక్కరికి 42,000 రూపాయల చొప్పున 3,78,000 జరిమానా విధించింది. ఈ కేసులో 28 ఏళ్లపాటు వివిధ కోర్టుల్లో కేసు విచారణ కొనసాగింది. విశాఖ కోర్టులోనూ సుదీర్ఘకాలం విచారణ జరగ్గా.. ఎట్టకేలకు తీర్పు వెల్లడించింది. కోర్టు దోషులుగా గుర్తించిన పది మందిలో రాజకీయ నాయకుడు తోట త్రిమూర్తులు ఒకరు. నేరం జరిగినప్పుడు త్రిమూర్తులు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. 1996లో చంద్రబాబు సీఎంగా ఉండగా డిసెంబర్ 29న ఈ ఘటన జరిగింది. వెంకటాయపాలెంలో అయిదుగురు దళితులను చిత్రహింసలు పెట్టారని, వారికి శిరోముండనం చేశారని కేసు నమోదయింది. భారతీయ శిక్షాస్మృతి 342, 324, 506 లతోపాటు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం సెక్షన్ 3 లతో రామచంద్రాపురం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు 28 ఏళ్ల పాటు విచారణ జరిగి ఈ రోజు తుది తీర్పు వెలువడింది. తోట త్రిమూర్తులు భవితవ్యమేంటీ? 1994లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రామచంద్రపురం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా తోట త్రిమూర్తులు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అనంతరం1995లో తెలుగుదేశం పార్టీలో చేరి పార్టీ అభ్యర్థిగా రామచంద్రపురం నుంచి1999లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అదే సమయంలో ఈ ఘటన జరిగింది. 2024లో జరుగుతున్న ఎన్నికల్లోనూ ఆయన పోటీ చేయనున్నారు. తొలుత శిక్ష విషయంపై ఆందోళన చెందినా.. కోర్టు 18 నెలల జైలు శిక్ష మాత్రమే విధించడంతో పోటీ చేయడానికి ఎలాంటి ఇబ్బందులు లేవని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఈ కేసులో బెయిల్ కోసం త్రిమూర్తులుతో సహా నిందితులందరూ దరఖాస్తు చేసుకున్నారు. నిందితులు హైకోర్టులో అప్పీలు చేసుకోవడానికి గడువు కావాలని కోరడంతో న్యాయమూర్తి వారికి తాత్కాలిక బెయిల్ మంజూరు చేశారు. చట్టాన్ని గౌరవిస్తాను చట్టాన్ని గౌరవించడం నా బాధ్యత, ఈ కేసుపై హైకోర్టులో అప్పీల్ చేసుకోవాలని భావిస్తున్నాను, అందుకే గడువు కోసం బెయిల్ విజ్ఞప్తి చేయగా... కోర్టు అంగీకరించింది : తోట త్రిమూర్తులు -
దారుణం: లిఫ్టు అడిగినందుకు వితంతువుకు గుండు చేయించారు
అహ్మదాబాద్: ఓ వితంతువు.. వివాహితుడైన వ్యక్తిని లిఫ్టు అడిగి బైక్ మీద అతనితో ప్రయాణించినందుకు ఆరుగురు వ్యక్తులు ఆమెపై దాడికి పాల్పడ్డారు. అనంతరం గ్రామంలోకి తీసుకువెళ్లి శిరోముండనం చేశారు. ఈ దారుణమైన ఘటన గత శుక్రవారం గుజరాత్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సబర్కాంత జిల్లాలోని సంచేరి గ్రామానికి చెందిన ఓ వితంతు మహిళ.. తన ఇద్దరు కుమారులకు సంబంధించిన ఆధార్ కార్డులను బ్యాంక్ ఇవ్వడానికి హిమ్మత్ నగర్ పట్టణానికి వెళ్లారు. పని ముగించుకున్న ఆమె తిరిగి సంచేరి గ్రామానికి బయలుదేరారు. అయితే మార్గ మధ్యలో అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని ఆమె లిఫ్టు అడిగింది. తెలిసిన మహిళ కావటంతో అతను ఆమెకు లిఫ్టు ఇచ్చాడు. గ్రామానికి వస్తున్న క్రమంలో రాయ్‌గడ్ గ్రామం వద్ద ఆరుగురు వ్యక్తులు ఒక్కసారిగా బైక్‌ను అడ్డగించి మహిళపై దాడిచేశారు. ఆమె దుస్తులు చించేశారు. తర్వాత వారిని గ్రామంలోకి తీసుకోవచ్చి.. ఆ వితంతు మహిళకు శిరోముండనం చేశారు. ఆమె సదరు వ్యక్తితో రహస్య సంబంధం పెట్టుకుందని ఆగ్రహంతో దాడిచేసినట్లు పోలీసులు తెలిపారు. మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. అందులో నలుగురు పురుషులు, ఇద్దరు మహిళల ఉన్నారు. ఆ మహిళకు లిఫ్టు ఇచ్చిన వ్యక్తి.. నిందితుల్లోని ఓ మహిళ సోదరికి భర్త అని పోలీసులు గుర్తించారు. -
టికెట్ నిరాకరణ.. మహిళ శిరోముండనంతో నిరసన
తిరువనంతపురం: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేరళలో రాజకీయం వేడెక్కుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ ఆదివారం విడుదల చేసింది. విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో తనకు సీటు కేటాయించకపోవడతో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు లతికా సుభాష్ తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఎత్తిమన్నూర్ సీటును కేటాయిస్తారని ఆమె భావించారు. కానీ, అదిష్టానం నుంచి నిరాశ ఎదురవడంతో తనకు అన్యాయం జరిగిందంటూ లతికా ఆవేదన వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా పార్టీ కేంద్ర కార్యాలయం ఇందిరా భవన్లో శిరోముండనం చేసుకొని నిరసన తెలిపారు. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ముల్లపల్లి రామచంద్రన్ నేడు ఢిల్లీలో అభ్యర్థు జాబితాను విడుదల చేశారు. కేరళ రాజకీయ చరిత్ర టికెట్ నిరాకరించడంతో ఇలా నిరసన వ్యక్తం చేయటం మొదటిసారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చదవండి: కేరళ బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల -
శిరోముండనం కేసును సీబీఐకి అప్పగించండి
సాక్షి, అమరావతి: తూర్పు గోదావరి జిల్లా, సీతానగరం పోలీసులు తనకు శిరోముండనం చేసిన కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ బాధితుడు ఐ.ప్రసాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్‌రాయ్ విచారణ జరిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది జడా శ్రవణ్‌కుమార్ వాదనలు వినిపిస్తూ, రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసినా కూడా పోలీసులు ఈ కేసును నీరుగార్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారని తెలిపారు. అందువల్ల ఈ కేసులో దర్యాప్తును సీబీఐ వంటి స్వతంత్ర సంస్థకు అప్పగించాల్సిన అవసరం ఉందన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని, సీబీఐని ఆదేశించారు. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేశారు. -
పోలీసులకు సహకరించని నూతన్‌నాయుడు
సాక్షి, విశాఖపట్నం: మాజీ ఐఏఎస్ పీవీ రమేష్ పేరిట పలువురు అధికారులకు ఫోన్లు చేసి మోసం చేసిన కేసులో సినీ నిర్మాత, బిగ్ బాస్ ఫేం నూతన్‌నాయుడునుసోమవారం సాయంత్రం పోలీసులు సెంట్రల్ జైలుకు తరలించారు. విశాఖ పోలీసులు ఇటీవల ఆయనను అరెస్ట్ చేసి 14 రోజుల పాటు రిమాండ్‌కు ఆరిలోవ సెంట్రల్ జైల్‌కు పంపిన విషయం తెలిసిందే. అయితే శని, ఆది, సోమవారాల్లో విచారణ నిమిత్తం పోలీస్ కస్టడీకి కోర్టు అనమతిచ్చింది. విచారణ అనంతరం తిరిగి జైలుకు పంపారు. మూడు రోజుల విచారణలో శిరోముండనం కేసులో పోలీసులకు నూతన్‌నాయుడు సహకరించలేదని తెలిసింది. శిరోముండనం చేసిన సమయంలో తాను రాజమండ్రిలో ఉన్నట్టు నూతన్‌నాయుడు చెప్పినట్టు సమాచారం. దళిత యువకుడు శ్రీకాంత్‌పై దాడి, శిరోముండనానికి ముందు తన భార్యతో మాట్లాడినట్టు తేలడంతో పోలీసులు ఆ కోణంలో ప్రశ్నించారు. వీటికి సమాధానం చెప్పకుండా కడుపులో నొప్పిగా ఉందంటూ తప్పించుకునే యత్నం చేసినట్టు పోలీసులు చెప్పారు. మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ పేరిట ప్రభుత్వ వైద్యులకు ఫోన్ చేసిన కేసుల్లో, ఉద్యోగం ఇప్పిస్తానని నూకరాజు నుంచి రూ.12 కోట్లు వసూలు చేసినట్టు మహారాణిపేట పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసుపైనా విచారించారు. మళ్లీ పోలీస్ కస్టడీ కోరతాం.. బ్యాంక్ ఉద్యోగం ఇస్తామని రూ.12 కోట్లు తీసుకుని మోసం చేసినట్టు నమోదైన కేసులో అవసరమైతే నూతన్‌నాయుడిని మళ్లీ పోలీస్‌కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరతామని డీసీపీ–1 ఐశ్వర్య రస్తోగి మీడియాతో చెప్పారు. -
పోలీసుల కస్టడీకి మధుప్రియ
సాక్షి, విశాఖపట్నం: నూతన్ నాయుడు భార్య మధుప్రియను విశాఖ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. మధుప్రియతో పాటు బాధితుడు శ్రీకాంత్‌ను తీవ్రంగా హింసించిన ఇందిరాను కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం నూతన్ నాయుడు ఇంటి సూపర్వైజర్ను పోలీసులు విచారిస్తున్నారు. కాగా.. ఇప్పటికే నూతన్ నాయుడు ప్రమేయాన్ని పోలీసులు గుర్తించారు. అయితే తాజాగా.. శాస్త్రీయమైన సాక్ష్యాలు సేకరించే క్రమంలో ముగ్గురు నిందితులను రెండు రోజుల పాటు విశాఖ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. (విశాఖ సెంట్రల్ జైల్‌కు నూతన్ నాయుడు) -
విశాఖ సెంట్రల్ జైల్‌కు నూతన్ నాయుడు
సాక్షి, విశాఖపట్నం: మాజీ ఐఏఎస్ అధికారి పి.వి.రమేశ్ పేరిట పలువురికి ఫోన్ చేసి మోసం చేసిన కేసులో సినీ నిర్మాత నూతన్ నాయుడికి కోర్టు రిమాండ్ విధించడంతో పోలీసులు ఆయనను విశాఖ సెంట్రల్ జైల్‌కు తరలించారు. దళిత యువకుడు శ్రీకాంత్‌కు శిరోముండనం చేసిన కేసులో ఇప్పటికే నూతన్ నాయుడు భార్య ప్రియామాధురి సహా ఏడుగురు అరెస్టయిన విషయం తెలిసిందే. ► శ్రీకాంత్‌పై దాడి చేసేటప్పుడు, శిరోముండనానికి ముందు నూతన్ తన భార్యతో వీడియో కాల్ మాట్లాడినట్లు నిర్ధారణ కావడంతో ఘటనలో ఆయన పాత్ర ఉన్నట్లు పోలీసులు ధ్రువీకరించుకున్నారు. ► తన పేరిట పైరవీలకు పాల్పడుతున్నారని మాజీ ఐఏఎస్ అధికారి పి.వి రమేశ్ విశాఖ నగర పోలీస్ కమిషనర్‌కి ఫిర్యాదు చేశారు. దీంతో ముంబై పారిపోతున్న నూతన్ నాయుడిని కర్ణాటకలోని ఉడిపిలో పట్టుకుని అక్కడ కోర్టులో హాజరుపరిచిన సంగతి తెలిసిందే. ► అక్కడ నుంచి ట్రాన్సిట్ వారెంట్‌పై శనివారం అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో విశాఖకు తీసుకొచ్చారు. ► అనంతరం కరోనా టెస్ట్‌తో పాటు వైద్యపరీక్షలు నిర్వహించారు. ► కరోనా టెస్ట్ నెగిటివ్ రావడంతో ఆదివారం ఆయనని కోర్టులో హాజరుపర్చగా కోర్టు 14 రోజులపాటు రిమాండ్ విధించింది. ► పి.వి.రమేశ్ పేరుతో పైరవీలు చేయడంపై కంచరపాలెం, గోపాలపట్నం, గాజువాక పోలీస్ స్టేషన్లలోనూ నూతన్‌పై కేసులు నమోదయ్యాయి. -
ఆ సంగతి తెలియగానే గుండు చేయించుకున్నా..
అహ్మదాబాద్ : ‘క్యాన్సర్’ పేరు వింటేనే సగం చచ్చిపోతాము. ఆ మహమ్మారితో పోరాడాలంటే ఎంతో ధైర్యం కావాలి. ఎందుకంటే క్యాన్సర్ చికిత్సలో భాగంగా చేసే కీమోథెరపి చాలా కష్టమైన ప్రక్రియ. మనిషి చాలా బలహీనమవుతాడు. జుట్టు కూడా రాలిపోతుంది. చాలామంది వీటన్నింటిని తట్టుకుని నిలబడలేరు. కానీ అహ్మదాబాద్‌కు చెందిన ఉర్వి సబ్నిస్ను మాత్రం ఈ భయాలు ఏమి చేయలేకపోయాయి. ఆమె కాన్యర్పై తన పోరాటాన్ని కొనసాగించి, గెలిచింది. ఆమె తనకు క్యాన్సర్ అని తెలియగానే ముందుగా చేసిన పని గుండు చేయించుకుంది. గుండు చేయించుకున్న తర్వాత ఆమె తన తలను స్కార్ఫ్ లేదా విగ్గుతో దాయలనుకోలేదు. ఆమె గుండు చేయించుకున్నానని సిగ్గు పడలేదు. అంతేకాకుండా ఆమె కీమోథెరపి చేయించుకోవడానికి వెళ్లిన ప్రతిసారి చాలా చక్కగా అలంకరించుకుని వెళ్లేది. ఆమె ఇంత ధైర్యంగా క్యాన్సర్‌తో పోరాడింది కాబట్టే ‘సెల్ఫ్ వీ సర్వైవర్’ పోటీలో రెండో స్థానంలో నిలిచింది. ఈ ‘సెల్ఫ్ వీ’ పోటీలో క్యాన్సర్‌పై పోరాడి గెలిచిన వారిని.. వారు క్యాన్సర్‌ను ఎలా ఎదుర్కొన్నారో 90 సెకన్లకు మించకుండా వారి మాటలల్లోనే ఒక వీడియో తీసి పంపిచమన్నారు. సబ్నిస్ తీసిన ఆ వీడియోలో ‘2015లో నాకు రొమ్ము క్యాన్సర్ అని తెలిసింది. అది విన్న వెంటనే ఒక్కసారిగా నా గుండె పగిలిపోయినట్లయ్యింది, కానీ నేను వెంటనే తేరుకొన్నాను. నాకే ఎందుకు ఇలా జరిగింది, నాకేమన్నా జరిగితే నా కుటుంబం పరిస్థితి ఏంటి అని బాధపడుతూ నా సమయాన్ని, శక్తిని వృథా చేయదల్చుకోలేదు. కేవలం నేను చేయించుకోబోయే వైద్యం గురించి, తర్వాత కోలుకోవడం గురించే ఆలోచించాను. క్యాన్సర్ బారిన పడిన వారు ముఖ్యంగా భయపడేది చావుతో జుట్టు ఊడిపోవడం గురించి. కీమోథెరపీ చేయించుకుంటే జుట్టు రాలిపోవడం అనివార్యమని నాకు తెలుసు. అందుకే నాకు క్యాన్సర్ అని తెలియగానే ముందు గుండు చేయించుకున్నాను. నేను కీమోథెరపీ కోసం వెళ్లిన ప్రతిసారి మంచి బట్టలు ధరించి, చక్కగా అలంకరించుకుని వెళ్లేదాన్ని. నేను దురదృష్టాన్ని కూడా నవ్వుతూ ఆహ్వానించాలనుకున్నాను. అలాగే చేశాను. మా అమ్మ నన్ను చూడడానికి వచ్చినప్పుడు నా కోసం విగ్గు తీసుకువచ్చింది. కానీ నేను దాన్ని పెట్టుకోవాలని అనుకోలేదు’ అని తెలిపింది. ప్రస్తుతం సబ్నీస్ హెచ్‌సీజీ ఆస్పత్రికి వచ్చే క్యాన్సర్ రోగులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తూ, వారిలో ధైర్యాన్ని నింపుతున్నారు. నా మీద జాలీ చూపించేవారంటే నాకు ఇష్టం ఉండదు. అలాంటివారికి దూరంగా ఉండాలనుకుంటాను. నేను చికిత్స పొందే సమయంలో నా మంచం దగ్గర ఒక నోట్‌ను పెట్టుకున్నాను. దానిలో నేను ‘జాలిని ఆశించను, జాలిని చూపించను’ అని ఉంటుంది. ఒకరు నా మీద జాలీ పడటం నాకు ఇష్టం ఉండదు. జాలీ పడటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు అని పేర్కొంది. -
తప్పుదోవపడుతున్న శిరోముండనం కేసు
ద్రాక్షారామ (రామచంద్రపురం రూరల్): రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెంకటాయపాలెం దళితుల శిరోముండనం కేసులో ప్రధాన ముద్దాయి, అధికార పార్టీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు కేసు నుంచి బయట పడడానికి కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని జిల్లాలోని 18 దళిత, ప్రజా సంఘాలకు చెందిన నాయకులు స్పష్టం చేశారు. బాధితులు ఎస్సీ కులానికి చెందినవారు కాదని, క్రైస్తవులుగా చిత్రించి, వారికి బీసీ సీ గా గుర్తించేలా చేయాలని చూస్తున్నారని ఆ సంఘాల నాయకులు ఆరోపించారు. నిజ నిర్ధారణ కమిటీగా ఏర్పడిన వారు విచారణ చేసి తమ నివేదికను ద్రాక్షారామలో గుర్రాల పరంజ్యోతి స్మారక గ్రంథాలయం వద్ద శుక్రవారం పత్రికలకు విడుదల చేశారు. బాధితులైన కోటి చినరాజు, దడాల వెంకటరత్నం కుల ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలని కోర్టు ఆదేశించిందన్నా రు. దీంతో మనుగడలో లేని ఒక పాస్టర్ ద్వారా బాధితులు బాప్తిజం తీసుకుని క్రైస్తవ మతం స్వీకరించారని, గ్రామంలోని కొందరితో క్రైస్తవులని చెప్పించారని, ఆ గ్రామంలో ఎటువంటి విచారణ చేయకుండానే స్థానిక తహసీల్దార్, ఆర్డీఓల చేత జాయింట్ కలెక్టర్‌కు గతంలో బాధితులు మోసం చేసి ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలు తీసుకున్నట్లుగా నివేదిక ఇప్పించారని విచారణలో తేలిందన్నారు. అధికారులను పావులుగా వాడుకుని కేసు నుంచి బయట పడాలని చూస్తున్న ఎమ్మెల్యే తోట త్రిమూర్తులును ప్రభుత్వం పదవి నుంచి బర్తరఫ్ చేయాలని, ఎమ్మెల్యేకు తొత్తులుగా వ్యవహరించిన తహసీల్దార్, ఆర్డీఓలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేకు సహకరించిన నకిలీ పాస్టరు ఎన్.సామ్యూల్, కాలకుర్చ జీవరత్నం, పువ్వుల వెంకటరమణ, కనికెల్ల గణపతి, గొల్ల సాల్మన్ రాజుపై చీటింగ్ కేసు నమోదు చేసి, వారిని అరెస్ట్ చేయాలన్నారు. మొత్తం వ్యవహారంపై జ్యుడీషియల్ ఎంక్వయిరీ వేయాలని నిజ నిర్ధారణ కమిటీ డిమాండ్ చేసింది. పౌరహక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు జిల్లెల్ల మనోహర్, ఆంధ్ర మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు సిద్దాంతుల కొండబాబు, భారత కార్మిక సంఘాల సమైఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు చీకట్ల వెంకటేశ్వరరావు, రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మచ్చా నాగయ్య, పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్.తిరుపతిరావు, దళిత సంఘం జిల్లా నాయకుడు దళిత బహుజన మహిళా శక్తి జాతీయ కన్వీనర్ కొంకి రాజామణి, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు జనిపల్లి సత్తిబాబు, మానవ హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు ముత్యాల శ్రీనివాసరావు, మాదిగ దండోరా జిల్లా ఉపాధ్యక్షుడు మందపల్లి చిట్టిబాబు, చైతన్య మహిళా సంఘం జిల్లా కార్యదర్శి జి.రమ, పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఆర్.రాఘవులు, కుల నిర్మూలన పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు కోనాల లాజర్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర నాయకుడు దమ్ము కృష్ణరాజు, దళిత ఐక్య పోరాట వేదిక కన్వీనర్ వెంటపల్లి భీమశంకరం, జై భీం దళిత సేవా సంఘం అధ్యక్షుడు గుబ్బల శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
ఎంపీలు, ఎమ్మెల్యేల గౌరవ చర్య
చెన్నై: అమ్మకోసం కన్నీటి సంద్రమైన తమిళనాడులో మరో అరుదైన ఘట్టం నమోదైంది. జయలలితకు అంత్యక్రియలు నిర్వహించిన మెరీనా బీచ్ వేలాదిమందితో మరోసారి పోటెత్తింది. దీంతో ఎంజీఆర్, జయలలితను సమాధుల ప్రదేశం పుణ్యక్షేత్రాన్ని తలపిస్తోంది. వేలాదిగా తరలి వచ్చిన మహిళలు, పురుషులతో పాటు ఏఐడీఎంకే ఎంపీలు, ఎమ్మెల్యేలూ అమ్మకు నివాళిగా తలనీలాలు సమర్పిస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. అమ్మపై అభిమానంతో తలనీలాలు సమర్పించిన ఎంపీ సెంథిల్ నాథన్ మాట్లాడుతూ.. అమ్మ కేవలం ఓ నాయకురాలు మాత్రమే కాదని తమ కుటుంబసభ్యుల్లో ఆమె ఒకరని అన్నారు. కుటుంబసభ్యుల్లో ఒకరిని పోగొట్టుకున్నందుకు అందరం గుండు గీయించుకుంటున్నట్లు తెలిపారు. జయలలిత ఆఖరి విశ్రాంత స్థలంవద్ద అన్నాడీఎంకే ఎంపీలు, ఎమ్మెల్యేలు కార్యకర్తలు, అభిమానులు గౌరవం సూచకంగా తలనీలాలు సమర్పిస్తూ నివాళులర్పిస్తున్నారు. అసంఖ్యాకంగా హాజరైన జయలలిత అభిమానులు సమాధిని దర్శించుకొని కన్నీరు మున్నీరవుతున్నారు. -
అమ్మ గెలిచిందని ఒక్కో సీటుకు ఒక్కరు గుండు!
చెన్నై: తమిళనాట ప్రతినోటా వినిపించే పదం అమ్మ. వరుసగా రెండో సారి ఎన్నికల్లో గెలిచి మూడు దశాబ్దాల రికార్డును తిరగరాసి తమిళ రాజకీయాలకు కొత్త జోస్యం చెప్పింది అమ్మ. జయలలిత ఆరోసారి ముఖ్యమంత్రిగా సోమవారం ప్రమాణం చేశారు. ఏఐడీఎంకే పార్టీ నేతలు, కార్యకర్తలలో నూతన ఉత్సాహం ఉప్పొంగింది. ఆ జోరు ఎంత అంటే చెప్పలేం. తాజా ఫలితాలలో అమ్మకు చెందిన పార్టీ 134 సీట్లను కైవసం చేసుకుని సాధారణ మెజార్టీ సాధించింది. కానీ, అమ్మ మద్దతుదారులకు ఇది పండగ లాంటి విషయం. జయలలితపై అభిమానాన్ని వినూత్నంగా చాటి చెప్పాలనుకున్నారు. ఒక్కో సీటుకు గుర్తుగా ఒక్కరు గుండు చేయించుకున్నారు. మొత్తం 134 సీట్లకు గానూ 134 మంది గుండు చేయించుకుని అమ్మపై అభిమానాన్ని ఇలా ప్రదర్శించారు. అనంతరం అమ్మ నివాసానికి వెళ్లగా వీరిని కలిసేందుకు సీఎం ఇష్టపడలేదు. కోయంబత్తూరుకు చెందిన జయ అభిమాని అయిన ఓ ఆటోడ్రైవర్ తన ఆటోలో ఎక్కే ప్రయాణికులు ఎక్కడకు వెళ్లినా వాళ్ల దగ్గర నుంచి కేవలం ఒక్క రూపాయి మాత్రమే చార్జీ తీసుకున్నాడు. ఒక రోజులో మొత్తం 102 మందిని తాను గమ్యాలకు చేర్చి 102 రూపాయలు సంపాదించానని, ఇందుకోసం తాను ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం మానేశానని ఆటోడ్రైవర్ ఆర్ఎం మత్తివనన్ తన అభిమానాన్ని చాటుకున్నాడు.. జయలలిత 68వ పెట్టినరోజును పురస్కరించుకుని 668 మంది అభిమానులు చేతిపై అమ్మ టాటూను వేయించుకున్న విషయం తెలిసిందే.