తప్పుదోవపడుతున్న శిరోముండనం కేసు | dalit Tonsure head case going wrong way | Sakshi
Sakshi News home page

తప్పుదోవపడుతున్న శిరోముండనం కేసు

Published Sat, Feb 24 2018 1:33 PM | Last Updated on Sat, Feb 24 2018 1:33 PM

dalit Tonsure head case going wrong way - Sakshi

సమావేశంలో మాట్లాడుతున్న నాయకులు

ద్రాక్షారామ (రామచంద్రపురం రూరల్‌): రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెంకటాయపాలెం దళితుల శిరోముండనం కేసులో ప్రధాన ముద్దాయి, అధికార పార్టీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు కేసు నుంచి బయట పడడానికి కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని జిల్లాలోని 18 దళిత, ప్రజా సంఘాలకు చెందిన నాయకులు స్పష్టం చేశారు. బాధితులు ఎస్సీ కులానికి చెందినవారు కాదని, క్రైస్తవులుగా చిత్రించి, వారికి బీసీ సీ గా గుర్తించేలా చేయాలని చూస్తున్నారని ఆ సంఘాల నాయకులు ఆరోపించారు. నిజ నిర్ధారణ కమిటీగా ఏర్పడిన వారు విచారణ చేసి తమ నివేదికను ద్రాక్షారామలో గుర్రాల పరంజ్యోతి స్మారక గ్రంథాలయం వద్ద శుక్రవారం పత్రికలకు విడుదల చేశారు. బాధితులైన కోటి చినరాజు, దడాల వెంకటరత్నం కుల ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలని కోర్టు ఆదేశించిందన్నా రు. దీంతో మనుగడలో లేని ఒక పాస్టర్‌ ద్వారా బాధితులు బాప్తిజం తీసుకుని క్రైస్తవ మతం స్వీకరించారని, గ్రామంలోని కొందరితో క్రైస్తవులని చెప్పించారని, ఆ గ్రామంలో ఎటువంటి విచారణ చేయకుండానే స్థానిక తహసీల్దార్, ఆర్డీఓల చేత జాయింట్‌ కలెక్టర్‌కు గతంలో బాధితులు మోసం చేసి ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలు తీసుకున్నట్లుగా నివేదిక ఇప్పించారని విచారణలో తేలిందన్నారు.

అధికారులను పావులుగా వాడుకుని కేసు నుంచి బయట పడాలని చూస్తున్న ఎమ్మెల్యే తోట త్రిమూర్తులును ప్రభుత్వం పదవి నుంచి బర్తరఫ్‌ చేయాలని, ఎమ్మెల్యేకు తొత్తులుగా వ్యవహరించిన తహసీల్దార్, ఆర్డీఓలను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యేకు సహకరించిన నకిలీ పాస్టరు ఎన్‌.సామ్యూల్, కాలకుర్చ జీవరత్నం, పువ్వుల వెంకటరమణ, కనికెల్ల గణపతి, గొల్ల సాల్మన్‌ రాజుపై చీటింగ్‌ కేసు నమోదు చేసి, వారిని అరెస్ట్‌ చేయాలన్నారు. మొత్తం వ్యవహారంపై జ్యుడీషియల్‌ ఎంక్వయిరీ వేయాలని నిజ నిర్ధారణ కమిటీ డిమాండ్‌ చేసింది.

పౌరహక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు జిల్లెల్ల మనోహర్, ఆంధ్ర మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు సిద్దాంతుల కొండబాబు, భారత కార్మిక సంఘాల సమైఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు చీకట్ల వెంకటేశ్వరరావు, రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మచ్చా నాగయ్య, పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్‌.తిరుపతిరావు, దళిత సంఘం జిల్లా నాయకుడు దళిత బహుజన మహిళా శక్తి జాతీయ కన్వీనర్‌ కొంకి రాజామణి, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు జనిపల్లి సత్తిబాబు, మానవ హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు ముత్యాల శ్రీనివాసరావు, మాదిగ దండోరా జిల్లా ఉపాధ్యక్షుడు మందపల్లి చిట్టిబాబు, చైతన్య మహిళా సంఘం జిల్లా కార్యదర్శి జి.రమ, పంచాయతీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు ఆర్‌.రాఘవులు, కుల నిర్మూలన పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు కోనాల లాజర్, రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా రాష్ట్ర నాయకుడు దమ్ము కృష్ణరాజు, దళిత ఐక్య పోరాట వేదిక కన్వీనర్‌ వెంటపల్లి భీమశంకరం, జై భీం దళిత సేవా సంఘం అధ్యక్షుడు గుబ్బల శ్రీను తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement