ముచ్చుమర్రి బాలిక హత్యాచారం కేసులో కీలక పరిణామం
అనుమానితులు ఇచి్చన సమాచారంతో పోలీసుల అదుపులో ఆరుగురు
విచారణలో నలుగురి ప్రమేయంలేదని తేలడంతో విడుదల
మిగిలిన వారిని చిత్రహింసలకు గురిచేసిన పోలీసులు.. దెబ్బలు తాళలేక దళిత వ్యక్తి మృత్యువాత
ఉబ్బిపోయిన మృతుడి రెండు చేతులు, కాళ్లు.. డొక్క, వీపు భాగంలో గట్టిగా కొట్టిన ఆనవాళ్లు
మిడుతూరు పీఎస్ నుంచి నంద్యాల ప్రభుత్వాస్పత్రికి మృతదేహం తరలింపు
లాకప్‌డెత్ వెలుగుచూడకుండా పోలీసుల పాట్లు
మృతుని బంధువులతో రాజీ?.. గుట్టుగా అంత్యక్రియలు
థర్డ్ డిగ్రీతోపాటు విచక్షణారహితంగా కొట్టడంవల్లే చనిపోయినట్లు కుటుంబ సభ్యుల ఆరోపణ
అనుమానితుల విచారణలో పాల్గొన్న సస్పెండ్ అయిన పోలీసులు?
సాక్షి, నంద్యాల : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ముచ్చుమర్రి మైనర్ బాలిక హత్యాచారం కేసు విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పోలీసుల అదుపులో ఉన్న అనుమానితుల్లో ఒక దళిత వ్యక్తి శనివారం లాకప్‌డెత్‌కు గురైనట్లు తెలుస్తోంది. విచక్షణారహితంగా కొట్టడంతో పాటు థర్డ్ డిగ్రీ ఉపయోగించడంవల్లే అతని ప్రాణాలు పోయినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు.
అంతకుముందు.. మైనర్ బాలిక హత్యాచారం ఘటనతో సంబంధం ఉన్న అనుమానంతో పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకుని విచారించారు. వారిచ్చిన సమాచారంతో గురువారం సాయంత్రం మరో ఆరుగురిని నందికొట్కూరు, ముచ్చుమర్రి ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. వీరిని మొదట జూపాడు బంగ్లా పోలీస్‌స్టేషన్‌కు తరలించి అక్కడ రెండు గంటల పాటు విచారించినట్లు స్థానికులు చెబుతున్నారు. పోలీసుల దెబ్బలు తాళలేక నిందితులు అరిచిన అరుపులు తమకు వినిపించాయని వారంటున్నారు.
అయితే, ఈ విచారణలో నలుగురు వ్యక్తులకు ఈ ఘటనతో సంబంధంలేదని తేలడంతో వారిని వదిలేసి అంబటి హుస్సేన్ అలియాస్ యోహాన్ (36), అంబటి ప్రభుదాస్‌ను తమదైన శైలిలో గట్టిగా విచారించారు. వీరిద్దరినీ మిడుతూరు పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి శుక్రవారం అంతా విపరీతంగా కొట్టినట్లు సమాచారం. ఆ తర్వాత నంద్యాల పట్టణంలోని సీసీఎస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అయితే, హుస్సేన్ మిడుతూరులో మృతిచెందితే నంద్యాల సీసీఎస్‌కు తరలించి ఆ తర్వాత ఆసుపత్రికి తరలించారా? లేక సీసీఎస్ పోలీస్‌స్టేషన్‌లో మృతిచెందిన తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లారా అన్న దానిపై స్పష్టతలేదు.
బంధువులతో రాజీ..
ఇక హుస్సేన్ చనిపోయాడన్న సమాచారం తెలుసుకున్న బంధువులు శనివారం ఉదయాన్నే ముచ్చుమర్రి, నందికొట్కూరు నుంచి నంద్యాలకు బయల్దేరారు. మార్గమధ్యంలోనే పోలీసులు వీరిని అడ్డుకుని రహస్య ప్రాంతానికి తరలించారు. అక్కడ లాకప్‌డెత్ విషయంలో రాజీకి ప్రయత్నించినట్లు సమాచారం. వీరితో సంతకం చేయించుకున్న తర్వాత మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. అప్పటివరకు క్యాజువ్యాలిటీలోనే ఉ.6 నుంచి సా.4 వరకు మృతదేహాన్ని ఉంచారు.
ఆయాసంతో చనిపోయాడంట..
ఇక బాధితులతో రాజీ ప్రయత్నం సఫలం కావడంతో జిల్లా ఎస్పీ కార్యాలయం శనివారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. హుస్సేన్‌ను అదుపులోకి తీసుకుని నందికొట్కూర్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్తుండగా నిందితుడు పోలీస్ వాహనం నుంచి దూకి పారిపోయే ప్రయత్నం చేశాడని తెలిపారు. అప్రమత్తమైన పోలీసులు హుస్సేన్‌ను పట్టుకోవడంతో తనకు ఆయాసంగా ఉందని, గుండెనొప్పిగా ఉన్నట్లు పోలీసులకు తెలిపాడని.. దీంతో పోలీసులు అతన్ని నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారని పేర్కొన్నారు. (నిజానికి.. దగ్గర్లోని నందికొట్కూరు ఆస్పత్రికి తరలించకుండా 60 కి.మీ దూరంలోని నంద్యాలకు తరలించారు.) డాక్టర్లు పరిశీలించి చనిపోయినట్లు నిర్ధారించారని ఆ ప్రకటనలో తెలిపారు. అలాగే, మిడుతూరు పోలీస్‌స్టేషన్‌లో ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ కార్యాలయం ఆ ప్రకటనలో తెలిపింది.
నోట్లో గుడ్డలు కుక్కి మరీ..
నిజానికి.. హుస్సేన్, ప్రభుదాస్ ఇద్దరూ అన్నదమ్ములు. మైనర్ బాలిక హత్యాచారం కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న నిందితులలో ఒక బాలుడికి వీరు మేనమామ అవుతారని గ్రామస్తులు చెబుతున్నారు. ఘటన జరిగిన తర్వాత నిందితుల్లో ఒకరైన పదో తరగతి బాలుడు ఇచ్చిన సమాచారం మేరకు మృతదేహాన్ని మాయం చేయడంలో హుస్సేన్ ప్రధాన పాత్ర పోషించాడని పోలీసుల విచారణలో తేలినట్లు విశ్వసనీయ సమాచారం.
దీంతో మృతదేహం ఎక్కడ వేశారు.. ఆ సమయంలో ఎవరెవరున్నారు అన్న కోణంలో విచారణ సాగింది. ఈ సందర్భంగా మృతుడిని విచక్షణారహితంగా కొట్టినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. హుస్సేన్ రెండు చేతులు, వేళ్లు, కాళ్లు ఉబ్బిపోయి కనిపిస్తున్నాయి. డొక్క, వీపు భాగంలో గట్టిగా కొట్టిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొట్టే సమయంలో బాధితుడు అరవకుండా నోట్లో గుడ్డ పేలికలు పెట్టినట్లు తెలుస్తోంది. చనిపోయిన తర్వాత మృతుడి నోరు తెరుచుకుని ఉండడం ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది.
రాజీ కుదిర్చిన టీడీపీ నేత?.. గుట్టుగా అంత్యక్రియలు
మరోవైపు.. లాకప్‌డెత్ కేసులో నియోజకవర్గానికి చెందిన టీడీపీ ప్రజా ప్రతినిధి తండ్రి రాజీ కుదిర్చినట్లు సమాచారం. చనిపోయిన వ్యక్తి కుటుంబానికి ఆర్థిక సాయం చేయడంతో పాటు కుటుంబంలో ఇద్దరికి ఉద్యోగాలిస్తామని చెప్పి రాజీచేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఆ నేత ఇచ్చిన హామీ మేరకు హుస్సేన్ మృతిపై బంధువులు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని సమాచారం. ఇదిలా ఉంటే.. హుస్సేన్ మృతదేహాన్ని పోలీస్ ఎస్కార్ట్ సాయంతో అంబులెన్స్ ద్వారా రాత్రి ఎనిమిది గంటల సమయంలో నంద్యాల నుంచి పాత ముచ్చుమర్రికి తరలించి అక్కడి శ్మశాన వాటికలో ఉంచారు. కుటుంబ సభ్యులను మాత్రమే అక్కడికి అనుమతిచ్చి అంత్యక్రియలు గుట్టుగా పూర్తిచేయించారు. మృతుడికి తల్లి, ముగ్గురు సోదరులు, ఇద్దరు అక్కలు ఉన్నారు.
తాళం వేసి పోస్టుమార్టం?
మరోవైపు.. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో హుస్సేన్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టానికి తరలించారు. సాయంత్రం ఐదు గంటల సమయంలో ప్రొ. డాక్టర్ రాజశేఖర్ దీనిని పూర్తిచేశారు. ఈ గదికి లోపల వైపు తాళం వేసి మరీ ఈ ప్రక్రియను చేపట్టారు. ఇతర సిబ్బంది, మీడియా ప్రతినిధులు ఎవరూ అటువైపు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. పోస్టుమార్టం ప్రక్రియను వీడియో రికార్డ్ చేశారు. లాకప్‌డెత్ కానప్పుడు తాళంవేసి రహస్యంగా పోస్ట్‌మార్టం చేయించాల్సిన అవసరమేంటని బంధువులు ప్రశ్నిస్తున్నారు. అధికారం అండతో కేసును లాకప్‌డెత్ కాకుండా ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మిడుతూరు నుంచి నంద్యాల సీసీఎస్‌కు అక్కడి నుంచి ఆస్పత్రికి..
ఇక పోలీసులు కొట్టిన దెబ్బలు తట్టుకోలేక శనివారం తెల్లవారుజామున హుస్సేన్ మృతిచెందినట్లు తెలిసింది. కానీ, ప్రభుదాస్ ఎలా ఉన్నాడు? ఎక్కడ ఉన్నాడనే సమాచారం తెలీకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందారు. అంతకుముందు.. హుస్సేన్‌ను హుటాహుటిన నంద్యాల సర్వజన ఆస్పత్రిలోని క్యాజువల్ వార్డుకు తరలించారు. పోలీసులు రోగుల సహాయకులను అక్కడ నుంచి పంపించేసి వార్డులోకి ఎవరూ వెళ్లకుండా కాపలా ఉన్నారు.
హుస్సేన్‌ను మిడుతూరు నుంచి నంద్యాల సీసీఎస్ స్టేషన్‌కు అక్కడి నుంచి ప్రభుత్వాస్పత్రికి ఉదయం 5–6 గంటల సమయంలో తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి నంద్యాల డీఎస్పీ రవీంద్రనాథ్‌రెడ్డితో పాటు ఆరుగురు సీఐలు, నలుగురు ఎస్‌ఐలు దాదాపు 30 మంది కానిస్టేబుళ్లు ఆస్పత్రిని తమ ఆధీనంలో ఉంచుకున్నారు. మీడియా సిబ్బంది ఎవరూ ఆసుపత్రిలోకి రాకుండా అడ్డుకున్నారు. అయినా, మృతుడి ఫొటోలు మీడియాకు లభ్యం కావడంతో వాటిని పోలీసులే దగ్గరుండి మరీ తొలగించారు.
విచారణలో సస్పెండ్ అయిన పోలీసులు?
మైనర్ బాలిక హత్యాచారం ఘటనలో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు రావడంతో ఒక సర్కిల్ ఇన్‌స్పెక్టర్, మరో సబ్ ఇన్‌స్పెక్టర్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. కేసులో మొదటి నుంచి వీరు ఉండడంతో సస్పెండ్ అయిన తర్వాత కూడా వీరు పోలీసు విచారణలో పాల్గొన్నట్లు అత్యంత శ్వసనీయంగా తెలిసింది. అనుమానితులను అదుపులోకి తీసుకున్న తర్వాత విచారణ చేసే సమయంలో వీరిద్దరూ సంఘటన స్థలంలోనే ఉన్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment