ఫైల్ ఫోటో
అహ్మదాబాద్ : ‘క్యాన్సర్’ పేరు వింటేనే సగం చచ్చిపోతాము. ఆ మహమ్మారితో పోరాడాలంటే ఎంతో ధైర్యం కావాలి. ఎందుకంటే క్యాన్సర్ చికిత్సలో భాగంగా చేసే కీమోథెరపి చాలా కష్టమైన ప్రక్రియ. మనిషి చాలా బలహీనమవుతాడు. జుట్టు కూడా రాలిపోతుంది. చాలామంది వీటన్నింటిని తట్టుకుని నిలబడలేరు. కానీ అహ్మదాబాద్‌కు చెందిన ఉర్వి సబ్నిస్‌ను మాత్రం ఈ భయాలు ఏమి చేయలేకపోయాయి. ఆమె కాన్యర్‌పై తన పోరాటాన్ని కొనసాగించి, గెలిచింది. ఆమె తనకు క్యాన్సర్ అని తెలియగానే ముందుగా చేసిన పని గుండు చేయించుకుంది. గుండు చేయించుకున్న తర్వాత ఆమె తన తలను స్కార్ఫ్ లేదా విగ్గుతో దాయలనుకోలేదు. ఆమె గుండు చేయించుకున్నానని సిగ్గు పడలేదు. అంతేకాకుండా ఆమె కీమోథెరపి చేయించుకోవడానికి వెళ్లిన ప్రతిసారి చాలా చక్కగా అలంకరించుకుని వెళ్లేది.
ఆమె ఇంత ధైర్యంగా క్యాన్సర్‌తో పోరాడింది కాబట్టే ‘సెల్ఫ్ వీ సర్వైవర్’ పోటీలో రెండో స్థానంలో నిలిచింది. ఈ ‘సెల్ఫ్ వీ’ పోటీలో క్యాన్సర్‌పై పోరాడి గెలిచిన వారిని.. వారు క్యాన్సర్‌ను ఎలా ఎదుర్కొన్నారో 90 సెకన్లకు మించకుండా వారి మాటలల్లోనే ఒక వీడియో తీసి పంపిచమన్నారు. సబ్నిస్ తీసిన ఆ వీడియోలో ‘2015లో నాకు రొమ్ము క్యాన్సర్ అని తెలిసింది. అది విన్న వెంటనే ఒక్కసారిగా నా గుండె పగిలిపోయినట్లయ్యింది, కానీ నేను వెంటనే తేరుకొన్నాను. నాకే ఎందుకు ఇలా జరిగింది, నాకేమన్నా జరిగితే నా కుటుంబం పరిస్థితి ఏంటి అని బాధపడుతూ నా సమయాన్ని, శక్తిని వృథా చేయదల్చుకోలేదు. కేవలం నేను చేయించుకోబోయే వైద్యం గురించి, తర్వాత కోలుకోవడం గురించే ఆలోచించాను.
క్యాన్సర్ బారిన పడిన వారు ముఖ్యంగా భయపడేది చావుతో జుట్టు ఊడిపోవడం గురించి. కీమోథెరపీ చేయించుకుంటే జుట్టు రాలిపోవడం అనివార్యమని నాకు తెలుసు. అందుకే నాకు క్యాన్సర్ అని తెలియగానే ముందు గుండు చేయించుకున్నాను. నేను కీమోథెరపీ కోసం వెళ్లిన ప్రతిసారి మంచి బట్టలు ధరించి, చక్కగా అలంకరించుకుని వెళ్లేదాన్ని. నేను దురదృష్టాన్ని కూడా నవ్వుతూ ఆహ్వానించాలనుకున్నాను. అలాగే చేశాను.
మా అమ్మ నన్ను చూడడానికి వచ్చినప్పుడు నా కోసం విగ్గు తీసుకువచ్చింది. కానీ నేను దాన్ని పెట్టుకోవాలని అనుకోలేదు’ అని తెలిపింది. ప్రస్తుతం సబ్నీస్ హెచ్‌సీజీ ఆస్పత్రికి వచ్చే క్యాన్సర్ రోగులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తూ, వారిలో ధైర్యాన్ని నింపుతున్నారు. నా మీద జాలీ చూపించేవారంటే నాకు ఇష్టం ఉండదు. అలాంటివారికి దూరంగా ఉండాలనుకుంటాను. నేను చికిత్స పొందే సమయంలో నా మంచం దగ్గర ఒక నోట్‌ను పెట్టుకున్నాను. దానిలో నేను ‘జాలిని ఆశించను, జాలిని చూపించను’ అని ఉంటుంది. ఒకరు నా మీద జాలీ పడటం నాకు ఇష్టం ఉండదు. జాలీ పడటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు అని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment