pity
-
సోనియా, రాహుల్‌లపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్లు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీలు విద్వేషపూరిత ఉపన్యాసాలు చేశారని, వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ ఢిల్లీ హైకోర్టులో గురువారం పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఢిల్లీ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ముంబై మాజీ ఏఐఎంఐఎం ఎమ్మెల్యే వరీస్ పఠాన్లు విద్వేషపూరిత ఉపన్యాసాలు చేశారని, వారిపైనా ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలంటూ ‘లాయర్స్ వాయిస్’ తరఫున గురువారం పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లను హైకోర్టు శుక్రవారం విచారించనుంది. ఆల్ ఇండియా మజ్లిస్ ఈ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) నేతలు అసదుద్దీన్ ఒవైసీ, అక్బరుద్దీన్ విద్వేషపూరిత ఉపన్యాసాలు చేశారని, వారిపైనా కేసులు నమోదు చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో హిందూసేన పిటిషన్ వేసింది. -
ఆ సంగతి తెలియగానే గుండు చేయించుకున్నా..
అహ్మదాబాద్ : ‘క్యాన్సర్’ పేరు వింటేనే సగం చచ్చిపోతాము. ఆ మహమ్మారితో పోరాడాలంటే ఎంతో ధైర్యం కావాలి. ఎందుకంటే క్యాన్సర్ చికిత్సలో భాగంగా చేసే కీమోథెరపి చాలా కష్టమైన ప్రక్రియ. మనిషి చాలా బలహీనమవుతాడు. జుట్టు కూడా రాలిపోతుంది. చాలామంది వీటన్నింటిని తట్టుకుని నిలబడలేరు. కానీ అహ్మదాబాద్‌కు చెందిన ఉర్వి సబ్నిస్ను మాత్రం ఈ భయాలు ఏమి చేయలేకపోయాయి. ఆమె కాన్యర్పై తన పోరాటాన్ని కొనసాగించి, గెలిచింది. ఆమె తనకు క్యాన్సర్ అని తెలియగానే ముందుగా చేసిన పని గుండు చేయించుకుంది. గుండు చేయించుకున్న తర్వాత ఆమె తన తలను స్కార్ఫ్ లేదా విగ్గుతో దాయలనుకోలేదు. ఆమె గుండు చేయించుకున్నానని సిగ్గు పడలేదు. అంతేకాకుండా ఆమె కీమోథెరపి చేయించుకోవడానికి వెళ్లిన ప్రతిసారి చాలా చక్కగా అలంకరించుకుని వెళ్లేది. ఆమె ఇంత ధైర్యంగా క్యాన్సర్‌తో పోరాడింది కాబట్టే ‘సెల్ఫ్ వీ సర్వైవర్’ పోటీలో రెండో స్థానంలో నిలిచింది. ఈ ‘సెల్ఫ్ వీ’ పోటీలో క్యాన్సర్‌పై పోరాడి గెలిచిన వారిని.. వారు క్యాన్సర్‌ను ఎలా ఎదుర్కొన్నారో 90 సెకన్లకు మించకుండా వారి మాటలల్లోనే ఒక వీడియో తీసి పంపిచమన్నారు. సబ్నిస్ తీసిన ఆ వీడియోలో ‘2015లో నాకు రొమ్ము క్యాన్సర్ అని తెలిసింది. అది విన్న వెంటనే ఒక్కసారిగా నా గుండె పగిలిపోయినట్లయ్యింది, కానీ నేను వెంటనే తేరుకొన్నాను. నాకే ఎందుకు ఇలా జరిగింది, నాకేమన్నా జరిగితే నా కుటుంబం పరిస్థితి ఏంటి అని బాధపడుతూ నా సమయాన్ని, శక్తిని వృథా చేయదల్చుకోలేదు. కేవలం నేను చేయించుకోబోయే వైద్యం గురించి, తర్వాత కోలుకోవడం గురించే ఆలోచించాను. క్యాన్సర్ బారిన పడిన వారు ముఖ్యంగా భయపడేది చావుతో జుట్టు ఊడిపోవడం గురించి. కీమోథెరపీ చేయించుకుంటే జుట్టు రాలిపోవడం అనివార్యమని నాకు తెలుసు. అందుకే నాకు క్యాన్సర్ అని తెలియగానే ముందు గుండు చేయించుకున్నాను. నేను కీమోథెరపీ కోసం వెళ్లిన ప్రతిసారి మంచి బట్టలు ధరించి, చక్కగా అలంకరించుకుని వెళ్లేదాన్ని. నేను దురదృష్టాన్ని కూడా నవ్వుతూ ఆహ్వానించాలనుకున్నాను. అలాగే చేశాను. మా అమ్మ నన్ను చూడడానికి వచ్చినప్పుడు నా కోసం విగ్గు తీసుకువచ్చింది. కానీ నేను దాన్ని పెట్టుకోవాలని అనుకోలేదు’ అని తెలిపింది. ప్రస్తుతం సబ్నీస్ హెచ్‌సీజీ ఆస్పత్రికి వచ్చే క్యాన్సర్ రోగులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తూ, వారిలో ధైర్యాన్ని నింపుతున్నారు. నా మీద జాలీ చూపించేవారంటే నాకు ఇష్టం ఉండదు. అలాంటివారికి దూరంగా ఉండాలనుకుంటాను. నేను చికిత్స పొందే సమయంలో నా మంచం దగ్గర ఒక నోట్‌ను పెట్టుకున్నాను. దానిలో నేను ‘జాలిని ఆశించను, జాలిని చూపించను’ అని ఉంటుంది. ఒకరు నా మీద జాలీ పడటం నాకు ఇష్టం ఉండదు. జాలీ పడటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు అని పేర్కొంది. -
బతకాలని ఉంది.. ఆదుకోరూ..
కారంపూడి: మృత్యువు ముంచుకొస్తోంది... మరి కొంత కాలం బతకాలని వుంది... దాతలు చేయూతనిచ్చి ఆదుకోవాలని మండలంలోని ఒప్పిచర్ల గ్రామానికి చెందిన మాగులూరి వీరాచారి అభ్యర్థిస్తున్నాడు. వివరాలు ఇలా వున్నాయి. వీరాచారి గ్రామంలో వడ్రంగం పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతనికి మెదడు క్యాన్సర్ వచ్చింది. హైదరాబాదు నిమ్స్‌లో ఆపరేషన్ చేసి తలలోని క్యాన్సర్ గడ్డ తొలగించారు. మరో 35 రోజులు రేడియేషన్ చికిత్స అవసరమని వైద్యులు తెలిపారు. ఐతే డబ్బులు లేక ఇంటికి వచ్చాడు. ఇప్పుడు అతని ఒక కంటి చూపు కూడా క్యాన్సర్ ప్రభావం వల్ల పోయింది. భార్య కూడా అనారోగ్యం పాలయింది. వండ్రంగం పనికి శరీరం సహకరించకపోవడంతో ఇద్దరూ తేలిక పాటి కూలి పనులకు వెళ్లి జీవిస్తున్నారు. ఇంకా తనకు కొంత కాలం బతకాలని ఆశగా వుందని, నిత్యం ముంచుకొస్తున్న మృత్యువును తలుచుకుని అంతులేని వేదన అనుభవిస్తున్నాని వీరాచారి కన్నీటి పర్యంతం అయ్యాడు. సాయం చేయాలనుకున్న దాతలు సెల్ నంబరు 8008330520 సంప్రదించాలని వీరాచారి అభ్యర్థిస్తున్నాడు. బతకాలని ఉంది.. ఆదుకోరూ.. -
'టీడీపీ వాళ్లే వేధించి చంపారు'
పచ్చని కుటుంబానికి రాజకీయ ఉచ్చు ఆధిపత్య రాజకీయాలకు మున్సిపల్ చైర్పర్సన్ భర్త బలి గుండె పగిలేలా రోదిస్తున్న భార్య ఆటుపోట్లన్నవి ఎరుగని పచ్చని కుటుంబానికి రాజకీయ పెను సునామీ కకలావికలం చేసింది. పోటీ చేయడానికే అభ్యర్థుల కరువైన వేళ ఏడు సముద్రాల అవతల ఉన్న వ్యక్తికి పదవీ ఎర వేసింది. ప్రజా మద్దతుతో ఆయన భార్యను మున్సిపల్ చైర్మన్ పదవి వరించింది. దీంతో పదేళ్లపాటు అధికారం లేక కోమాలో ఉన్న గ్రూపులు ఒక్కసారిగా నిద్రలేచాయి. అడుగడుగునా చైర్పర్సన్ ముందరకాళ్లకు బంధమేశాయి. పదవంటే ముళ్ల కిరీటంలా మార్చేశాయి.. చివరకు నీచ రాజకీయాలకు నిండు ప్రాణం బలి తీసుకుని..ఆమె గుండెను ముక్కలు చేశాయి. తన హదయ వేదన కన్నీళ్ల చారికలై పలకరించిన ప్రతి గుండెనూ వేడుకుంటున్నాయి తన భర్త ప్రాణాలను ఒక్కసారి తీసుకురావాలని.. మాచర్ల: అతనుండేది అమెరికాలో.. వారిది రాజకీయ కుటుంబం కాదు. మున్సిపల్ ఎన్నికల ఆరు నెలల ముందు అమెరికా నుంచి మాచర్లకు వచ్చి కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జీవిస్తున్నాడు. ఈ సమయంలో అధికార పార్టీకి అభ్యర్థులు కరువవడంతో వీరిని రాజకీయ ఉచ్చులోకి లాగారు. వారి నీచ రాజకీయాలకు ఆయన ప్రాణాలు గాలిలో కలిసిపోయేలా చేశారు. ప్రస్తుతం పట్టణంలో ఎక్కడ చూసినా మున్సిపల్ చైర్పర్సన్ గోపవరపు శ్రీదేవి భర్త మల్లికార్జునరావు మృతిపైనే చర్చ జరుగుతుంది. తల్లిదండ్రులను కోల్పోయిన ఆమెను ఇప్పుడు భర్త కూడా ఒంటరి చేసి వెళ్లడంతో గుండెలవిసేలా రోదిస్తోంది. ఈ పరిస్థితి అంతటికీ తెలుగుదేశం పార్టీలోని ఆధిపత్య పోరేనని తెలుస్తుంది. పోటీ చేసేందుకు దిక్కులేని సమయంలో.. పురపాలక సంఘ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రాని సమయంలో అందరూ ఆర్యవైశ్య సంఘ నాయకుడు గోపవరపు బ్రహ్మయ్య కుమారుడు మల్లికార్జునరావు ఇంటి చుట్టూ తిరిగి నీవు తప్పితే ఎవరూ గెలవరని వివిధ ప్రలోభాలు చూపారు. ఆయన భార్య శ్రీదేవిని ఎన్నికల్లో పోటీ చేయాలని కోరారు. తీరా ఆ కుటుంబాన్ని ఎన్నికల గోదారిలోకి దించారు. ఫలితాలు వచ్చాక సగంపైగా పదవిని కేటాయించిన టీడీపీ నాయకులు చైర్మన్ పదవిని చేపట్టిన రోజు నుంచి మల్లికార్జునరావు మృతి చెందే వరకు ఆధిపత్య రాజకీయాలు నడిపారు.. ప్రతిదానికి అడ్డంపడటం, అవినీతి జరుగుతుందని ప్రచారం చేయటం, తమ పని తాము చేయకుండా నిరసనల పేరుతో టీడీపీ సామాజిక వర్గానికి చెందిన నాయకులు అడుగడుగునా రాజకీయం నడిపారు. అధికారులను సైతం ఏ ఒక్క పని చైర్మన్‌కు చేయవద్దని చెప్పి అడ్డగించారు. ఎన్నికలలో ఖర్చు పెట్టించి అప్పులపాలైన తనకు అన్ని విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్న స్వపక్ష కౌన్సిలర్ల తీరుపై అనేకసార్లు చైర్మన్ వర్గీయులు బాధపడ్డారు. దీనిపై తమకు వస్తున్న ఇబ్బందులను జిల్లా నాయకులకు తెలియపరిచారు. నియోజకవర్గ, జిల్లా నాయకులు ఎవరూ చైర్మన్ పడుతున్న బాధలను పట్టించుకొని స్పందించలేదు. ఆవేదనతోనే ఘర్షణల మధ్య వారు పదవిలో ఉన్నారు. ఇదే సమయంలో ముందుగానే వైస్ చైర్మన్ వర్గీయులు చైర్మన్‌పై నానా రకాలుగా నాయకుల వద్ద దుష్పచారాలు చేశారని మల్లికార్జునరావు ఆవేదన చెందుతుండే వారు. ఈ నేపథ్యంలో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. రెండు వర్గాలుగా విడిపోయి.. సమయంలో టీడీపీ సామాజిక వర్గానికి చెందిన నాయకులంతా రెండు వర్గాలుగా చీలి ఒకరు మద్దతు పలికినట్లు మరొకరు రాజీనామా చేయాలని కోరినట్లు నటించారు. తీరా తమకు అనుకూలంగా వ్యవహరించిన వారు సైతం పదవిని వదులుకోవాలని లేకుంటే ఇబ్బందులు పెడతామని బెదిరించినట్లు తెలిసింది. అన్ని వర్గాలు తనపై మూకుమ్మడిగా దాడి చేస్తూ పదవిని వదులుకోకపోతే ప్రాణహాని కలిగిస్తామని ఇచ్చిన సంకేతాలతో ఆందోళన చెందిన మల్లికార్జునరావు తనకు, భార్యకు గన్‌మెన్ కావాలని అన్ని వర్గాలను కోరారు. అయినా టీడీపీ సామాజిక వర్గానికి చెందిన నాయకులంతా చైర్మన్ భర్తను టార్గెట్ చేస్తూ ఇబ్బందులకు గురి చేయటంతో రోజురోజుకీ ఆందోళన చెందిన ఆయన చివరకు గుండెపోటుకు బలయ్యారు. దీంతో మున్సిపల్ చైర్మన్ శ్రీదేవి రెండు రోజులుగా తీవ్ర ఆవేదనతో భర్త మల్లికార్జునరావు మృతదేహం వద్ద గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఆమెకు వేదనను చూసిన ప్రతి మహిళా నీచ రాజకీయాల కోసం ఓ కుటుంబ ఉసురుపోసుకున్న టీడీపీ నాయకుల తీరును అసహ్యించుకుంటున్నారు. తమ సామాజిక వర్గానికి చెందిన మల్లికార్జునరావును అధికార పార్టీ నాయకులు స్వార్థ రాజకీయాల కోసం బలి చేయటంపై ఆర్యవైశ్యులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాల కోసం మా కుటుంబాన్ని బలి చేశారు.. రాజకీయాలంటే మాకు తెలియవు. నేను, నా భర్త అందరం బాగుండాలని కోరుకునే వాళ్లం. మేము కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాం. తీరా అధికారంలో ఉన్న మమ్మల్ని ప్రతిరోజూ వేధించారు. సొంత పార్టీ వారే ప్రతి రోజూ అధికారం పేరుతో మా కుటుంబాన్ని వేధించి నా భర్త చనిపోయే వరకు బాధించారు. పదవి కోసం ఇంత నీచంగా వ్యవహరిస్తారని నేనెప్పుడూ అనుకోలేదు. నన్ను ఒంటరిని చేసి నా భర్తను బలి చేసిన వారిపై నేను రాజీపడను అంటూ ఆమె కన్నీటితో తన ఆవేదనను వ్యక్తం చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ శ్రీదేవి -
ఈ కాలమ్ మీదే: చర్చా వేదిక
అయ్యో పాపం... తులసి మొక్క! మా ఊళ్లో ఒక పురాతనమైన శివాలయం ఉంది. ఆవరణలోనే ఒక వారగా తులసి మొక్క ఒకటి ఉంది. ఆరోజు కార్తీకమాసం కావడంతో అందరిలాగే స్వామి దర్శనం కోసం నేను కూడా శివాలయానికి వెళ్లాను. అక్కడి దృశ్యం నన్ను విస్మయానికి గురి చేసింది. తులసి మొక్క చుట్టూ సుమారు ఇరవై, ముప్పై దీపాలు దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్నాయి. అక్కడ ఉన్న భక్తులు, తులసి మొక్కపై పసుపు, కుంకాలు, పుష్పాలు పోటాపోటీగా చల్లి పూజలు చేస్తున్నారు. పసుపు కుంకాలతో ముంచెత్తబడిన ఆ తులసి మొక్క రంగు మారి దీనంగా కనిపించింది. చిత్రమేమిటంటే ఎవరూ కూడా ఆ మొక్కకు చెంబెడు నీళ్లు పోయాలని అనుకోవడం లేదు. నీరు లేకపోతే మొక్క బతకదు అనే విషయం పామరుడికి కూడా తెలుసు. అక్కడికి వచ్చిన వాళ్లలో చదువుకున్నవాళ్లు, లోకజ్ఞానం ఉన్నవాళ్లు ఉన్నారు. ఎవరూ కూడా ఆ విషయం గురించి ఆలోచించే స్థితిలో లేరు భక్తి పారవశ్యంలో మునిగి. చేరువలోనే ఉన్న రాతి శివలింగానికి మాత్రం చేతిపంపు దగ్గర నీటిని శుభ్రమైన పాత్రలలో పట్టి తెచ్చి అభిషేకం చేస్తున్నారు. నీటి అవసరం ఉన్న మొక్కకి నీరు పోయకుండా, నీరు లేకపోయినా అస్తిత్వం కోల్పోని శివలింగానికి మాత్రం కడవలతో నీరు గుమ్మరిస్తున్నారు! నా వంతు బాధ్యతగా చేతిపంపు దగ్గర నీటిని ఒక లోటాతో పట్టి తులసి మొక్కకు కరువు తీరా పోశాను. దాహంతో ఉన్న మనిషికి గుక్కెడు నీళ్లు పోస్తే ఎలా ఆనందిస్తాడో, అదే భావం ఆ మొక్కలో కనిపించింది నాకు. హాయిగా ఆ మొక్క కదులుతూ ఉంటే... శివుడు, తులసిమాత ఇద్దరూ నన్ను ఆశీర్వదిస్తున్నట్లే అనిపించింది నాకు. తులసి మొక్కని పసుపు కుంకాలతో పూజించి, దీపాలు పెట్టగానే పని అయిపోయినట్లు కాదు. అన్ని మొక్కల్లాగే తులసి కూడా ఒక మొక్కే! కాస్త ఔషధ గుణాలు ఎక్కువ. దానికీ నీరు కావాలి. పసుపుకుంకాలతో అర్చించే బదులు దానికి చెంబెడు నీళ్లు పోస్తే వచ్చే పుణ్యం ఎక్కువ. - దుర్గాసూరి, పాతపేట, నూజివీడు, కృష్ణా జిల్లా. కార్యాచరణ మొదలు కావాలి... బాధ పడుతూ కూర్చోవడం కంటే కార్యాచరణ అనేది ముఖ్యమైనది. అప్పుడే తెలుగు భాషను రక్షించుకోగలుగుతాము. ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన ఉత్తరప్రత్యుత్తరాలు, న్యాయస్థానాలలో తీర్పులు, బోర్డులు, సూచికలు... మొదలైనవి తెలుగు భాషలో ఉండాలి. పాఠశాలల్లో నీతిశతకాలను చదవడం తప్పనిసరి చేయాలి. పెద్దబాల శిక్షను ప్రవేశ పెట్టాలి. తెలుగును చిన్నచూపు చూసే, అవమానించే విద్యాలయాలపై కఠిన చర్యలు తీసుకోవాలి. మరోవైపు... తల్లిదండ్రులు తమ పిల్లలను తెలుగు భాషపై అభిమానం కలిగించే రీతిలో ప్రోత్సహించాలి. ఉద్యోగావకాశాల్లోనూ తెలుగులో చదువుకున్న వారికి ప్రాముఖ్యత ఇవ్వాలి. - టి.అప్పలస్వామి, విశ్రాంత తెలుగు ఉపాధ్యాయులు, గజపతినగరం, విజయనగరం జిల్లా. ఇలా అయితే... ఎలా?! గత వారం ప్రచురించిన అశోక్, విజయవాడ రాసిన ఉత్తరాన్ని చదివి ఇది రాస్తున్నాను. ‘మన సినిమాల్లో మంచి సినిమాలు ఎన్ని?’ అని ప్రశ్నించుకుంటే వేళ్ల మీద లెక్కపెట్టుకోవడం కూడా కష్టమే. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో గొప్ప సినిమాలు వస్తున్నాయి. వాటితో పోల్చితే మన సినిమా ఎక్కడో ఉంటుంది. ఇది నిజంగా దురదృష్టకరమైన విషయం. ఎప్పుడోగానీ మంచి సినిమాలు రావడం లేదు. అలా వచ్చిన సినిమాలను ఆదరించాలి తప్ప ప్రతీది భూతద్దంలో చూసి విమర్శించడం తగదు. ‘పీకె’ అనేది చాలా మంచి సినిమా. మన వ్యవస్థలోని తప్పుడు విధానాలను బయట పెట్టిన సినిమా. ‘బాబాల బండారం’ గురించి తొలిసారిగా చెప్పింది ‘పీకె’ సినిమా మాత్రమే కాదు... అంతకుముందు కూడా ఎన్నో సినిమాలు వచ్చాయి. ఫక్తు కమర్షియల్ సినిమా అయిన ‘ఆఖరి పోరాటం’ సినిమాలో కూడా బాబాల గురించి ఉంది. అమ్రిష్‌పురి పాత్రను ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే సరి. వివాదం వల్లే సినిమా హిట్ అయిందని అశోక్ అంటున్న మాటలు చాలా అమాయకంగా ఉన్నాయి. ఈ లెక్కన వివాదాస్పదమైన ప్రతీ సినిమా హిట్ కావాలి. ఇక దర్శకులు, రచయితలు ‘కథ’ గురించి ఆలోచించనక్కర్లేదు. ‘వివాదం’ గురించి ఆలోచిస్తే సరిపోతుంది! ముగింపుగా... నేను చెప్పే ముఖ్యమైన విషయం ఏమిటంటే, అరుదుగా వచ్చే సినిమాలను గురించి గొప్పగా మాట్లాడకున్నా ఫరవాలేదు. కానీ... నిరాశపరిచేలా మాత్రం మాట్లాడకండి! - సి.రజిత, గోదావరిఖని, కరీంగనర్. జాలి, భయం కలుగుతున్నాయి! నేటి యువతను చూస్తే, జాలితో పాటు భయం వేస్తోంది. చిన్న చిన్న కారణాలకే ఇంటి నుంచి పారిపోతున్నారు. ఆత్యహత్యప్రయత్నాలు చేస్తున్నారు. మా ఇంటి పక్కన ఉండే వాళ్లు పేదవాళ్లు. వాళ్ల అబ్బాయి ఇంజనీరింగ్ చదువుతున్నాడు. తను ఇంజనీరింగ్‌లో రెండు సబ్జెక్ట్‌లు ఫెయిలయ్యాడు. ఫ్రెండ్స్ అవమానం చేస్తారని, తల్లిదండ్రులు తిడతారని భయపడి యాసిడ్ తాగాడు. చనిపోలేదుగానీ నోటి లోపల చాలా దెబ్బతింది. ‘‘ఎంతో కష్టపడి చదివిస్తే... ఇలా చేశాడు’’ అని తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. కేవలం అతడు మాత్రమే కాదు... ఈ తరంలో చాలా మంది యువకులు నెగటివ్‌గా ఆలోచిస్తున్నారు. నెగిటివ్‌గా కాకుండా పాజిటివ్‌గా ఆలోచించే శక్తి రావాలంటే, మంచి మంచి కథలు, నవలలు, జీవిత చరిత్రలు చదవాలి. దీనివల్ల ‘సానుకూల ఆలోచనశక్తి’ పెరుగుతుంది. ఫేస్‌బుక్‌లోనో, ట్విటర్‌లోనో సమయాన్ని వృథా చేయకుండా, ఆ సమయాన్ని పుస్తకాలు చదవడానికో, సేవ చేయడానికో, ధ్యానం చేయడానికో ఉపయోగిస్తే యువత అభివృద్ధి చెంది దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుంది. - ఆవులపాటి ఉమామహేష్, హుజూర్నగర్, నల్గొండ జిల్లా. పాఠకులకు ఆహ్వానం ‘ఈ కాలమ్ మీదే’ అనే ఈ చర్చావేదికలో పాల్గొనండి. చర్చనీయాంశం మీ ఇష్టం. ఏ సామాజిక అంశాన్నయినా, ఆలోచననైనా మీరు చర్చకు పెట్టొచ్చు. మీ వాదనను వినిపించవచ్చు. దానిపై మిగతా పాఠకులనూ చర్చకు ఆహ్వానిస్తుంది సాక్షి ఫ్యామిలీ. వీటిని ప్రతి సోమవారం ప్రచురిస్తుంది. వెంటనే రాసి పంపండి. మీ చర్చనీయాంశం పంపవలసిన చిరునామా: ‘ఈ కాలమ్ మీదే’ సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 ఇ-మెయిల్: www.sakshireaders@gmail.com