'టీడీపీ వాళ్లే వేధించి చంపారు'
'టీడీపీ వాళ్లే వేధించి చంపారు'
Published Thu, Jul 21 2016 8:36 AM | Last Updated on Mon, Sep 17 2018 5:18 PM
పచ్చని కుటుంబానికి రాజకీయ ఉచ్చు
ఆధిపత్య రాజకీయాలకు మున్సిపల్ చైర్‌పర్సన్ భర్త బలి
గుండె పగిలేలా రోదిస్తున్న భార్య
ఆటుపోట్లన్నవి ఎరుగని పచ్చని కుటుంబానికి రాజకీయ పెను సునామీ కకలావికలం చేసింది. పోటీ చేయడానికే అభ్యర్థుల కరువైన వేళ ఏడు సముద్రాల అవతల ఉన్న వ్యక్తికి పదవీ ఎర వేసింది. ప్రజా మద్దతుతో ఆయన భార్యను మున్సిపల్ చైర్మన్ పదవి వరించింది. దీంతో పదేళ్లపాటు అధికారం లేక కోమాలో ఉన్న గ్రూపులు ఒక్కసారిగా నిద్రలేచాయి. అడుగడుగునా చైర్‌పర్సన్ ముందరకాళ్లకు బంధమేశాయి. పదవంటే ముళ్ల కిరీటంలా మార్చేశాయి.. చివరకు నీచ రాజకీయాలకు నిండు ప్రాణం బలి తీసుకుని..ఆమె గుండెను ముక్కలు చేశాయి. తన హదయ వేదన కన్నీళ్ల చారికలై పలకరించిన ప్రతి గుండెనూ వేడుకుంటున్నాయి తన భర్త ప్రాణాలను ఒక్కసారి తీసుకురావాలని..
మాచర్ల: అతనుండేది అమెరికాలో.. వారిది రాజకీయ కుటుంబం కాదు. మున్సిపల్ ఎన్నికల ఆరు నెలల ముందు అమెరికా నుంచి మాచర్లకు వచ్చి కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జీవిస్తున్నాడు. ఈ సమయంలో అధికార పార్టీకి అభ్యర్థులు కరువవడంతో వీరిని రాజకీయ ఉచ్చులోకి లాగారు. వారి నీచ రాజకీయాలకు ఆయన ప్రాణాలు గాలిలో కలిసిపోయేలా చేశారు. ప్రస్తుతం పట్టణంలో ఎక్కడ చూసినా మున్సిపల్ చైర్‌పర్సన్ గోపవరపు శ్రీదేవి భర్త మల్లికార్జునరావు మృతిపైనే చర్చ జరుగుతుంది. తల్లిదండ్రులను కోల్పోయిన ఆమెను ఇప్పుడు భర్త కూడా ఒంటరి చేసి వెళ్లడంతో గుండెలవిసేలా రోదిస్తోంది. ఈ పరిస్థితి అంతటికీ తెలుగుదేశం పార్టీలోని ఆధిపత్య పోరేనని తెలుస్తుంది.
పోటీ చేసేందుకు దిక్కులేని సమయంలో..
పురపాలక సంఘ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రాని సమయంలో అందరూ ఆర్యవైశ్య సంఘ నాయకుడు గోపవరపు బ్రహ్మయ్య కుమారుడు మల్లికార్జునరావు ఇంటి చుట్టూ తిరిగి నీవు తప్పితే ఎవరూ గెలవరని వివిధ ప్రలోభాలు చూపారు. ఆయన భార్య శ్రీదేవిని ఎన్నికల్లో పోటీ చేయాలని కోరారు. తీరా ఆ కుటుంబాన్ని ఎన్నికల గోదారిలోకి దించారు. ఫలితాలు వచ్చాక సగంపైగా పదవిని కేటాయించిన టీడీపీ నాయకులు చైర్మన్ పదవిని చేపట్టిన రోజు నుంచి మల్లికార్జునరావు మృతి చెందే వరకు ఆధిపత్య రాజకీయాలు నడిపారు.. ప్రతిదానికి అడ్డంపడటం, అవినీతి జరుగుతుందని ప్రచారం చేయటం, తమ పని తాము చేయకుండా నిరసనల పేరుతో టీడీపీ సామాజిక వర్గానికి చెందిన నాయకులు అడుగడుగునా రాజకీయం నడిపారు. అధికారులను సైతం ఏ ఒక్క పని చైర్మన్‌కు చేయవద్దని చెప్పి అడ్డగించారు. ఎన్నికలలో ఖర్చు పెట్టించి అప్పులపాలైన తనకు అన్ని విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్న స్వపక్ష కౌన్సిలర్ల తీరుపై అనేకసార్లు చైర్మన్ వర్గీయులు బాధపడ్డారు. దీనిపై తమకు వస్తున్న ఇబ్బందులను జిల్లా నాయకులకు తెలియపరిచారు. నియోజకవర్గ, జిల్లా నాయకులు ఎవరూ చైర్మన్ పడుతున్న బాధలను పట్టించుకొని స్పందించలేదు. ఆవేదనతోనే ఘర్షణల మధ్య వారు పదవిలో ఉన్నారు. ఇదే సమయంలో ముందుగానే వైస్ చైర్మన్ వర్గీయులు చైర్మన్‌పై నానా రకాలుగా నాయకుల వద్ద దుష్పచారాలు చేశారని మల్లికార్జునరావు ఆవేదన చెందుతుండే వారు. ఈ నేపథ్యంలో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.
రెండు వర్గాలుగా విడిపోయి..
సమయంలో టీడీపీ సామాజిక వర్గానికి చెందిన నాయకులంతా రెండు వర్గాలుగా చీలి ఒకరు మద్దతు పలికినట్లు మరొకరు రాజీనామా చేయాలని కోరినట్లు నటించారు. తీరా తమకు అనుకూలంగా వ్యవహరించిన వారు సైతం పదవిని వదులుకోవాలని లేకుంటే ఇబ్బందులు పెడతామని బెదిరించినట్లు తెలిసింది. అన్ని వర్గాలు తనపై మూకుమ్మడిగా దాడి చేస్తూ పదవిని వదులుకోకపోతే ప్రాణహాని కలిగిస్తామని ఇచ్చిన సంకేతాలతో ఆందోళన చెందిన మల్లికార్జునరావు తనకు, భార్యకు గన్‌మెన్ కావాలని అన్ని వర్గాలను కోరారు. అయినా టీడీపీ సామాజిక వర్గానికి చెందిన నాయకులంతా చైర్మన్ భర్తను టార్గెట్ చేస్తూ ఇబ్బందులకు గురి చేయటంతో రోజురోజుకీ ఆందోళన చెందిన ఆయన చివరకు గుండెపోటుకు బలయ్యారు. దీంతో మున్సిపల్ చైర్మన్ శ్రీదేవి రెండు రోజులుగా తీవ్ర ఆవేదనతో భర్త మల్లికార్జునరావు మృతదేహం వద్ద గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఆమెకు వేదనను చూసిన ప్రతి మహిళా నీచ రాజకీయాల కోసం ఓ కుటుంబ ఉసురుపోసుకున్న టీడీపీ నాయకుల తీరును అసహ్యించుకుంటున్నారు. తమ సామాజిక వర్గానికి చెందిన మల్లికార్జునరావును అధికార పార్టీ నాయకులు స్వార్థ రాజకీయాల కోసం బలి చేయటంపై ఆర్యవైశ్యులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.
రాజకీయాల కోసం మా కుటుంబాన్ని బలి చేశారు..
రాజకీయాలంటే మాకు తెలియవు. నేను, నా భర్త అందరం బాగుండాలని కోరుకునే వాళ్లం. మేము కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాం. తీరా అధికారంలో ఉన్న మమ్మల్ని ప్రతిరోజూ వేధించారు. సొంత పార్టీ వారే ప్రతి రోజూ అధికారం పేరుతో మా కుటుంబాన్ని వేధించి నా భర్త చనిపోయే వరకు బాధించారు. పదవి కోసం ఇంత నీచంగా వ్యవహరిస్తారని నేనెప్పుడూ అనుకోలేదు. నన్ను ఒంటరిని చేసి నా భర్తను బలి చేసిన వారిపై నేను రాజీపడను అంటూ ఆమె కన్నీటితో తన ఆవేదనను వ్యక్తం చేశారు.
మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీదేవి
Advertisement