ఈ కాలమ్ మీదే: చర్చా వేదిక | this is your column: stage for debate | Sakshi
Sakshi News home page

ఈ కాలమ్ మీదే: చర్చా వేదిక

Published Mon, Mar 2 2015 12:19 AM | Last Updated on Mon, Oct 1 2018 5:19 PM

ఈ కాలమ్ మీదే: చర్చా వేదిక - Sakshi

ఈ కాలమ్ మీదే: చర్చా వేదిక

అయ్యో పాపం... తులసి మొక్క!
మా ఊళ్లో ఒక పురాతనమైన శివాలయం ఉంది. ఆవరణలోనే ఒక వారగా తులసి మొక్క ఒకటి ఉంది. ఆరోజు కార్తీకమాసం కావడంతో అందరిలాగే స్వామి దర్శనం కోసం నేను కూడా శివాలయానికి వెళ్లాను. అక్కడి దృశ్యం నన్ను విస్మయానికి గురి చేసింది. తులసి మొక్క చుట్టూ సుమారు ఇరవై, ముప్పై దీపాలు దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్నాయి. అక్కడ ఉన్న భక్తులు, తులసి మొక్కపై పసుపు, కుంకాలు, పుష్పాలు పోటాపోటీగా చల్లి పూజలు చేస్తున్నారు.
 
పసుపు కుంకాలతో ముంచెత్తబడిన ఆ తులసి మొక్క రంగు మారి దీనంగా కనిపించింది. చిత్రమేమిటంటే ఎవరూ కూడా ఆ మొక్కకు చెంబెడు నీళ్లు పోయాలని అనుకోవడం లేదు. నీరు లేకపోతే మొక్క బతకదు అనే విషయం పామరుడికి కూడా తెలుసు.
 
అక్కడికి వచ్చిన వాళ్లలో చదువుకున్నవాళ్లు, లోకజ్ఞానం ఉన్నవాళ్లు ఉన్నారు. ఎవరూ కూడా ఆ విషయం గురించి ఆలోచించే స్థితిలో లేరు భక్తి పారవశ్యంలో మునిగి. చేరువలోనే ఉన్న రాతి శివలింగానికి మాత్రం చేతిపంపు దగ్గర నీటిని శుభ్రమైన పాత్రలలో పట్టి తెచ్చి అభిషేకం చేస్తున్నారు. నీటి అవసరం ఉన్న మొక్కకి నీరు పోయకుండా, నీరు లేకపోయినా అస్తిత్వం కోల్పోని శివలింగానికి మాత్రం కడవలతో నీరు గుమ్మరిస్తున్నారు!
 
నా వంతు బాధ్యతగా చేతిపంపు దగ్గర నీటిని ఒక లోటాతో పట్టి తులసి మొక్కకు కరువు తీరా పోశాను. దాహంతో ఉన్న మనిషికి గుక్కెడు నీళ్లు పోస్తే ఎలా  ఆనందిస్తాడో, అదే భావం ఆ మొక్కలో కనిపించింది నాకు. హాయిగా ఆ మొక్క కదులుతూ ఉంటే... శివుడు, తులసిమాత ఇద్దరూ నన్ను ఆశీర్వదిస్తున్నట్లే అనిపించింది నాకు. తులసి మొక్కని పసుపు కుంకాలతో పూజించి, దీపాలు పెట్టగానే పని అయిపోయినట్లు  కాదు. అన్ని మొక్కల్లాగే తులసి కూడా ఒక మొక్కే! కాస్త ఔషధ గుణాలు ఎక్కువ. దానికీ నీరు కావాలి. పసుపుకుంకాలతో అర్చించే బదులు దానికి చెంబెడు నీళ్లు పోస్తే వచ్చే పుణ్యం ఎక్కువ.
 - దుర్గాసూరి, పాతపేట, నూజివీడు, కృష్ణా జిల్లా.


 
కార్యాచరణ మొదలు కావాలి...
బాధ పడుతూ కూర్చోవడం కంటే కార్యాచరణ అనేది ముఖ్యమైనది. అప్పుడే తెలుగు భాషను రక్షించుకోగలుగుతాము. ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన ఉత్తరప్రత్యుత్తరాలు, న్యాయస్థానాలలో తీర్పులు, బోర్డులు, సూచికలు... మొదలైనవి తెలుగు భాషలో ఉండాలి.
 
పాఠశాలల్లో నీతిశతకాలను చదవడం తప్పనిసరి చేయాలి. పెద్దబాల శిక్షను ప్రవేశ పెట్టాలి. తెలుగును చిన్నచూపు చూసే, అవమానించే విద్యాలయాలపై కఠిన చర్యలు తీసుకోవాలి. మరోవైపు... తల్లిదండ్రులు తమ పిల్లలను తెలుగు భాషపై అభిమానం కలిగించే రీతిలో ప్రోత్సహించాలి. ఉద్యోగావకాశాల్లోనూ తెలుగులో చదువుకున్న వారికి ప్రాముఖ్యత ఇవ్వాలి.
 - టి.అప్పలస్వామి, విశ్రాంత తెలుగు ఉపాధ్యాయులు, గజపతినగరం, విజయనగరం జిల్లా.

ఇలా అయితే... ఎలా?!
గత వారం  ప్రచురించిన అశోక్, విజయవాడ రాసిన ఉత్తరాన్ని చదివి ఇది రాస్తున్నాను. ‘మన సినిమాల్లో మంచి సినిమాలు ఎన్ని?’ అని ప్రశ్నించుకుంటే వేళ్ల మీద లెక్కపెట్టుకోవడం కూడా కష్టమే. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో గొప్ప సినిమాలు వస్తున్నాయి. వాటితో పోల్చితే మన సినిమా ఎక్కడో ఉంటుంది. ఇది నిజంగా దురదృష్టకరమైన విషయం.
 
ఎప్పుడోగానీ మంచి సినిమాలు రావడం లేదు. అలా వచ్చిన సినిమాలను ఆదరించాలి తప్ప ప్రతీది భూతద్దంలో చూసి విమర్శించడం తగదు. ‘పీకె’ అనేది చాలా మంచి సినిమా. మన వ్యవస్థలోని తప్పుడు విధానాలను బయట పెట్టిన సినిమా.
 
‘బాబాల బండారం’ గురించి తొలిసారిగా చెప్పింది ‘పీకె’ సినిమా మాత్రమే కాదు... అంతకుముందు కూడా ఎన్నో సినిమాలు వచ్చాయి. ఫక్తు కమర్షియల్ సినిమా అయిన ‘ఆఖరి పోరాటం’ సినిమాలో కూడా బాబాల గురించి ఉంది. అమ్రిష్‌పురి పాత్రను ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే సరి.
 
వివాదం వల్లే  సినిమా హిట్ అయిందని అశోక్ అంటున్న మాటలు చాలా అమాయకంగా ఉన్నాయి. ఈ లెక్కన వివాదాస్పదమైన ప్రతీ సినిమా హిట్ కావాలి. ఇక దర్శకులు, రచయితలు ‘కథ’ గురించి ఆలోచించనక్కర్లేదు. ‘వివాదం’ గురించి ఆలోచిస్తే సరిపోతుంది!
 
ముగింపుగా... నేను చెప్పే ముఖ్యమైన విషయం ఏమిటంటే, అరుదుగా వచ్చే సినిమాలను గురించి గొప్పగా మాట్లాడకున్నా ఫరవాలేదు. కానీ... నిరాశపరిచేలా మాత్రం మాట్లాడకండి!
 - సి.రజిత, గోదావరిఖని, కరీంగనర్.


 జాలి, భయం కలుగుతున్నాయి!
నేటి యువతను చూస్తే, జాలితో పాటు భయం వేస్తోంది. చిన్న చిన్న కారణాలకే ఇంటి నుంచి పారిపోతున్నారు. ఆత్యహత్యప్రయత్నాలు చేస్తున్నారు. మా ఇంటి పక్కన ఉండే వాళ్లు పేదవాళ్లు. వాళ్ల అబ్బాయి ఇంజనీరింగ్ చదువుతున్నాడు. తను ఇంజనీరింగ్‌లో రెండు సబ్జెక్ట్‌లు ఫెయిలయ్యాడు. ఫ్రెండ్స్ అవమానం చేస్తారని, తల్లిదండ్రులు తిడతారని భయపడి యాసిడ్ తాగాడు. చనిపోలేదుగానీ నోటి లోపల చాలా దెబ్బతింది.
 
‘‘ఎంతో కష్టపడి చదివిస్తే... ఇలా చేశాడు’’ అని తల్లిదండ్రులు ఏడుస్తున్నారు.
 కేవలం అతడు మాత్రమే కాదు... ఈ తరంలో చాలా మంది యువకులు నెగటివ్‌గా ఆలోచిస్తున్నారు. నెగిటివ్‌గా కాకుండా పాజిటివ్‌గా ఆలోచించే శక్తి రావాలంటే, మంచి మంచి కథలు, నవలలు, జీవిత చరిత్రలు చదవాలి. దీనివల్ల ‘సానుకూల ఆలోచనశక్తి’ పెరుగుతుంది. ఫేస్‌బుక్‌లోనో, ట్విటర్‌లోనో సమయాన్ని వృథా చేయకుండా, ఆ సమయాన్ని పుస్తకాలు చదవడానికో, సేవ చేయడానికో, ధ్యానం చేయడానికో ఉపయోగిస్తే యువత అభివృద్ధి చెంది దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుంది.
 - ఆవులపాటి ఉమామహేష్, హుజూర్‌నగర్, నల్గొండ జిల్లా.
 
పాఠకులకు ఆహ్వానం
‘ఈ కాలమ్ మీదే’ అనే ఈ  చర్చావేదికలో పాల్గొనండి. చర్చనీయాంశం మీ ఇష్టం. ఏ సామాజిక అంశాన్నయినా, ఆలోచననైనా మీరు చర్చకు పెట్టొచ్చు.  
 మీ వాదనను వినిపించవచ్చు. దానిపై మిగతా పాఠకులనూ చర్చకు ఆహ్వానిస్తుంది సాక్షి ఫ్యామిలీ. వీటిని ప్రతి సోమవారం ప్రచురిస్తుంది. వెంటనే రాసి పంపండి. మీ చర్చనీయాంశం పంపవలసిన చిరునామా: ‘ఈ కాలమ్ మీదే’ సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34  ఇ-మెయిల్: www.sakshireaders@gmail.com

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement