Basil plant
-
ఆరోగ్య వర్ధిని
ఈ మధ్య జపాన్‌లోని ప్రతి ఇంటిలోనూ తులసిమొక్కలు పెంచుతున్నారట. ఎందుకంటే జపనీయులు తులసి ప్రాధాన్యత గుర్తించారు కాబట్టే జపాన్‌లో కూడా ప్రతి ఇంటిలో తులసి చెట్టు తప్పక పెంచుతున్నారు. ఇంతకీ ఏమిటా ప్రాధాన్యత అంటారా? అదేంటో చూద్దాం... తులసి లక్ష్మీ స్వరూపం. తులసి చెట్టు దగ్గర చేసే ప్రాణాయామం, ధ్యానం, యోగా మరిన్ని మంచి ఫలితాలని ఇస్తాయని శాస్త్రం చెబుతోంది. మన పూర్వీకులు దేనినైనా పూజించండి అంటే, అందులో ఆధ్యాత్మిక, ఆరోగ్య, వైజ్ఞానిక కారణాలు తప్పకుండా ఉంటాయి. మనకు అవి తెలియవి, అంతే. తులసి గురించి ఒక నాలుగు మాటలు చెప్పుకుందాం. సాధారణంగా అన్ని మొక్కలు, చెట్లు ఉదయం మొత్తం కార్బన్–డై–ఆక్సయిడ్ పీల్చుకుని, ఆక్సిజ న్ వదులుతాయి, రాత్రి సమయంలో ఉదయం తాము పీల్చుకున్న కార్బన్–డై–ఆక్సైడ్ మొత్తాన్నీ పర్యావరణంలోనికి విడిచిపెడతాయి. కానీ తులసి మాత్రం రోజులో 22 గంటలపాటు ఆక్సిజ న్ (ప్రాణవాయువు) ను విడిచిపెడుతుందని పరిశోధనలో తేలింది. వృక్షజాతిలో మరే మొక్కకు ఈ ప్రత్యేకత లేదు. తులసి ఔషధగని. తులసిలో ప్రతి భాగం ఆయుర్వేద చికిత్సలో వాడుతారు. తులసికున్న ఘాటైన వాసన కారణంగా తులసి వాసన వ్యాపించినంత మేర ఈగలు, దోమలు, పాములు రావు. అందుకే మనం సంప్రదాయంలో ఇంటి ముందు, వెనుకా కూడా తులసిమొక్కను పెట్టి పూజించమన్నారు, ఫలితంగా ఇంట్లోకి పాములు రాకుండా ఉంటాయి. తులసిలో ఉన్న ఔషధగుణాల వల్ల గొంతులోని కఫం కరిగిపోతుంది. తులసి ఎంత గొప్పదంటే తులసి వనంలో పెట్టిన శవం తొందరగా చెడిపోదని మన ఆయుర్వేద గ్రంథాలు చెప్పాయి. దీన్ని ఆధునిక శాస్త్రవేత్తలు కూడా అంగీకరించారు. ప్రపంచాన్ని హడలుగొట్టిన స్వైన్‌ప్లూ భారత్‌లో స్వైరవిహారం చేయకుండా అడ్డుకున్నది తులసి మొక్కేనని తేలింది. ఎందుకంటే, తులసి గాలి కారణంగా జనంలో స్వైన్‌ప్లూను తట్టుకునే రోగనిరోధక శక్తి పెరిగిందట. ఏ ఇంట్లో అధికంగా తులసిమొక్కలు ఉంటాయో, ఆ ఇంట్లో జనం ఆరోగ్యంగా ఉంటారు. తులసిచెట్టు కాలుష్య ప్రభావాన్ని తగ్గిస్తుంది. తాజ్‌మహల్ కాలుష్యం బారినపడి మసకబారకుండా ఉండడం కోసం, తాజ్‌మహల్ పక్కనే, లక్ష తులసి మొక్కల వనాన్ని ప్రత్యేకంగా పెంచారు. అంతకంతకూ పెరిగిపోతున్న ఈ కాలుష్య జీవనంలో కనీసం మనిషి ఒక తులసి మొక్కైనా పెంచాలి. నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ వ్యాప్తిని తగ్గించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. తులసి ఆకులు నీటిలోని ఫ్లోరోసిస్ వ్యాప్తిని తగ్గిస్తాయని ఈ మధ్యే ధృవీకరించారు. మనం పెరటి తులసిని సక్రమంగా వాడుకుంటే, రూపాయి ఖర్చు లేకుండా అనేక మంది జీవితాల్లో వెలుగు నింపవచ్చు. ఇది తులసి మహాత్మ్యం. -
ఈ కాలమ్ మీదే: చర్చా వేదిక
అయ్యో పాపం... తులసి మొక్క! మా ఊళ్లో ఒక పురాతనమైన శివాలయం ఉంది. ఆవరణలోనే ఒక వారగా తులసి మొక్క ఒకటి ఉంది. ఆరోజు కార్తీకమాసం కావడంతో అందరిలాగే స్వామి దర్శనం కోసం నేను కూడా శివాలయానికి వెళ్లాను. అక్కడి దృశ్యం నన్ను విస్మయానికి గురి చేసింది. తులసి మొక్క చుట్టూ సుమారు ఇరవై, ముప్పై దీపాలు దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్నాయి. అక్కడ ఉన్న భక్తులు, తులసి మొక్కపై పసుపు, కుంకాలు, పుష్పాలు పోటాపోటీగా చల్లి పూజలు చేస్తున్నారు. పసుపు కుంకాలతో ముంచెత్తబడిన ఆ తులసి మొక్క రంగు మారి దీనంగా కనిపించింది. చిత్రమేమిటంటే ఎవరూ కూడా ఆ మొక్కకు చెంబెడు నీళ్లు పోయాలని అనుకోవడం లేదు. నీరు లేకపోతే మొక్క బతకదు అనే విషయం పామరుడికి కూడా తెలుసు. అక్కడికి వచ్చిన వాళ్లలో చదువుకున్నవాళ్లు, లోకజ్ఞానం ఉన్నవాళ్లు ఉన్నారు. ఎవరూ కూడా ఆ విషయం గురించి ఆలోచించే స్థితిలో లేరు భక్తి పారవశ్యంలో మునిగి. చేరువలోనే ఉన్న రాతి శివలింగానికి మాత్రం చేతిపంపు దగ్గర నీటిని శుభ్రమైన పాత్రలలో పట్టి తెచ్చి అభిషేకం చేస్తున్నారు. నీటి అవసరం ఉన్న మొక్కకి నీరు పోయకుండా, నీరు లేకపోయినా అస్తిత్వం కోల్పోని శివలింగానికి మాత్రం కడవలతో నీరు గుమ్మరిస్తున్నారు! నా వంతు బాధ్యతగా చేతిపంపు దగ్గర నీటిని ఒక లోటాతో పట్టి తులసి మొక్కకు కరువు తీరా పోశాను. దాహంతో ఉన్న మనిషికి గుక్కెడు నీళ్లు పోస్తే ఎలా ఆనందిస్తాడో, అదే భావం ఆ మొక్కలో కనిపించింది నాకు. హాయిగా ఆ మొక్క కదులుతూ ఉంటే... శివుడు, తులసిమాత ఇద్దరూ నన్ను ఆశీర్వదిస్తున్నట్లే అనిపించింది నాకు. తులసి మొక్కని పసుపు కుంకాలతో పూజించి, దీపాలు పెట్టగానే పని అయిపోయినట్లు కాదు. అన్ని మొక్కల్లాగే తులసి కూడా ఒక మొక్కే! కాస్త ఔషధ గుణాలు ఎక్కువ. దానికీ నీరు కావాలి. పసుపుకుంకాలతో అర్చించే బదులు దానికి చెంబెడు నీళ్లు పోస్తే వచ్చే పుణ్యం ఎక్కువ. - దుర్గాసూరి, పాతపేట, నూజివీడు, కృష్ణా జిల్లా. కార్యాచరణ మొదలు కావాలి... బాధ పడుతూ కూర్చోవడం కంటే కార్యాచరణ అనేది ముఖ్యమైనది. అప్పుడే తెలుగు భాషను రక్షించుకోగలుగుతాము. ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన ఉత్తరప్రత్యుత్తరాలు, న్యాయస్థానాలలో తీర్పులు, బోర్డులు, సూచికలు... మొదలైనవి తెలుగు భాషలో ఉండాలి. పాఠశాలల్లో నీతిశతకాలను చదవడం తప్పనిసరి చేయాలి. పెద్దబాల శిక్షను ప్రవేశ పెట్టాలి. తెలుగును చిన్నచూపు చూసే, అవమానించే విద్యాలయాలపై కఠిన చర్యలు తీసుకోవాలి. మరోవైపు... తల్లిదండ్రులు తమ పిల్లలను తెలుగు భాషపై అభిమానం కలిగించే రీతిలో ప్రోత్సహించాలి. ఉద్యోగావకాశాల్లోనూ తెలుగులో చదువుకున్న వారికి ప్రాముఖ్యత ఇవ్వాలి. - టి.అప్పలస్వామి, విశ్రాంత తెలుగు ఉపాధ్యాయులు, గజపతినగరం, విజయనగరం జిల్లా. ఇలా అయితే... ఎలా?! గత వారం ప్రచురించిన అశోక్, విజయవాడ రాసిన ఉత్తరాన్ని చదివి ఇది రాస్తున్నాను. ‘మన సినిమాల్లో మంచి సినిమాలు ఎన్ని?’ అని ప్రశ్నించుకుంటే వేళ్ల మీద లెక్కపెట్టుకోవడం కూడా కష్టమే. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో గొప్ప సినిమాలు వస్తున్నాయి. వాటితో పోల్చితే మన సినిమా ఎక్కడో ఉంటుంది. ఇది నిజంగా దురదృష్టకరమైన విషయం. ఎప్పుడోగానీ మంచి సినిమాలు రావడం లేదు. అలా వచ్చిన సినిమాలను ఆదరించాలి తప్ప ప్రతీది భూతద్దంలో చూసి విమర్శించడం తగదు. ‘పీకె’ అనేది చాలా మంచి సినిమా. మన వ్యవస్థలోని తప్పుడు విధానాలను బయట పెట్టిన సినిమా. ‘బాబాల బండారం’ గురించి తొలిసారిగా చెప్పింది ‘పీకె’ సినిమా మాత్రమే కాదు... అంతకుముందు కూడా ఎన్నో సినిమాలు వచ్చాయి. ఫక్తు కమర్షియల్ సినిమా అయిన ‘ఆఖరి పోరాటం’ సినిమాలో కూడా బాబాల గురించి ఉంది. అమ్రిష్‌పురి పాత్రను ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే సరి. వివాదం వల్లే సినిమా హిట్ అయిందని అశోక్ అంటున్న మాటలు చాలా అమాయకంగా ఉన్నాయి. ఈ లెక్కన వివాదాస్పదమైన ప్రతీ సినిమా హిట్ కావాలి. ఇక దర్శకులు, రచయితలు ‘కథ’ గురించి ఆలోచించనక్కర్లేదు. ‘వివాదం’ గురించి ఆలోచిస్తే సరిపోతుంది! ముగింపుగా... నేను చెప్పే ముఖ్యమైన విషయం ఏమిటంటే, అరుదుగా వచ్చే సినిమాలను గురించి గొప్పగా మాట్లాడకున్నా ఫరవాలేదు. కానీ... నిరాశపరిచేలా మాత్రం మాట్లాడకండి! - సి.రజిత, గోదావరిఖని, కరీంగనర్. జాలి, భయం కలుగుతున్నాయి! నేటి యువతను చూస్తే, జాలితో పాటు భయం వేస్తోంది. చిన్న చిన్న కారణాలకే ఇంటి నుంచి పారిపోతున్నారు. ఆత్యహత్యప్రయత్నాలు చేస్తున్నారు. మా ఇంటి పక్కన ఉండే వాళ్లు పేదవాళ్లు. వాళ్ల అబ్బాయి ఇంజనీరింగ్ చదువుతున్నాడు. తను ఇంజనీరింగ్‌లో రెండు సబ్జెక్ట్‌లు ఫెయిలయ్యాడు. ఫ్రెండ్స్ అవమానం చేస్తారని, తల్లిదండ్రులు తిడతారని భయపడి యాసిడ్ తాగాడు. చనిపోలేదుగానీ నోటి లోపల చాలా దెబ్బతింది. ‘‘ఎంతో కష్టపడి చదివిస్తే... ఇలా చేశాడు’’ అని తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. కేవలం అతడు మాత్రమే కాదు... ఈ తరంలో చాలా మంది యువకులు నెగటివ్‌గా ఆలోచిస్తున్నారు. నెగిటివ్‌గా కాకుండా పాజిటివ్‌గా ఆలోచించే శక్తి రావాలంటే, మంచి మంచి కథలు, నవలలు, జీవిత చరిత్రలు చదవాలి. దీనివల్ల ‘సానుకూల ఆలోచనశక్తి’ పెరుగుతుంది. ఫేస్‌బుక్‌లోనో, ట్విటర్‌లోనో సమయాన్ని వృథా చేయకుండా, ఆ సమయాన్ని పుస్తకాలు చదవడానికో, సేవ చేయడానికో, ధ్యానం చేయడానికో ఉపయోగిస్తే యువత అభివృద్ధి చెంది దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుంది. - ఆవులపాటి ఉమామహేష్, హుజూర్నగర్, నల్గొండ జిల్లా. పాఠకులకు ఆహ్వానం ‘ఈ కాలమ్ మీదే’ అనే ఈ చర్చావేదికలో పాల్గొనండి. చర్చనీయాంశం మీ ఇష్టం. ఏ సామాజిక అంశాన్నయినా, ఆలోచననైనా మీరు చర్చకు పెట్టొచ్చు. మీ వాదనను వినిపించవచ్చు. దానిపై మిగతా పాఠకులనూ చర్చకు ఆహ్వానిస్తుంది సాక్షి ఫ్యామిలీ. వీటిని ప్రతి సోమవారం ప్రచురిస్తుంది. వెంటనే రాసి పంపండి. మీ చర్చనీయాంశం పంపవలసిన చిరునామా: ‘ఈ కాలమ్ మీదే’ సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 ఇ-మెయిల్: www.sakshireaders@gmail.com -
తులసి.. ఔషధ గుణాల నిధి
దోమ: నిత్య జీవితంలో తులసి మొక్కకు గల ప్రాధాన్యం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తులసి మొక్కను పూజిస్తే సకల పాపాలు, దోషాలు తొలగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆడపడుచులు తులసి మొక్కకు పూజలు చేయడం చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా కార్తీక మాసంలో ఈ మొక్కకు పూజలు చేయడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. తులసి మొక్కల చుట్టూ కార్తీక దీపాలు వెలిగించి పూజలు చేస్తారు. ఈ మొక్క ఆరోగ్య ప్రదాయిని అని శాస్త్రీయంగా నిరూపితమైంది. రోజూ తులసి ఆకులు తినడం ఎంతో ఆరోగ్యకరమని పెద్దలు చెబుతుం టారు. కార్తీక మాసంలో ఎక్కడ చూసినా తులసి పూజలు పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. తులసితో ఎన్నో ప్రయోజనాలు ఉన్నందున దీనిని భూలోక కల్పవృక్షం అని పిలుస్తారు. రకాలు తులసి మొక్కల్లో చాలా రకాలు ఉంటాయి. వాటిలో లక్ష్మీ తులసి తెలుపురంగులో ఉంటుంది. దీనిని పూజలకు వాడతారు. కృష్ణ తులసి నలుపురంగులో ఉంటుంది. దీనిని దేవతామూర్తుల అర్చన కార్యక్రమాల్లో వాడతారు. రామ తులసిగా పిలవబడే తెలుపు రంగులో ఉండే మరో మొక్కను వైద్య రంగంలో విరివిగా వాడతారు. లక్ష్మీ తులసికి కార్తీక మాసంలో ద్వాదశి రోజున మహా విష్ణువుగా భావించే ఉసిరికకు వివాహం జరిపి ప్రత్యేక పూజలు జరపడం సాంప్రదాయంగా కొనసాగుతోంది. వాడకంలో నియమాలు సనాతన సంప్రదాయాల ప్రకారం ఆది, మంగళ, గురు, శుక్రవారాల్లో తులసి ఆకులను తుంచరాదు. తులసి ఆకులను తూర్పు, ఉత్తర ముఖంగా నిల్చుని మాత్రమే కోయాలి. ద్వాదశి అమావాస్య, పున్నమి తిథులలో తులసి ఆకులను తుంచరాదు. రాత్రి వేళల్లోనూ, స్నానం చేయకుండా గానీ, పాదరక్షలతో గానీ తులసి మొక్కను ముట్టుకోరాదు. తులసి ఆకులను ఒంటిగా తుంచరాదు. మూడు ఆకుల దళంతో కలిపే తుంచాలి. వైద్య రంగంలో.. తులసి మొక్క ఆకులు, కొమ్మలు, గింజలు, వేర్లు అన్నింటినీ వైద్య రంగంలో ఉపయోగిస్తారు. తులసి ఆకుల రసాన్ని జ్వరం, వాంతులు, విరేచనాలు, అతిసార, రక్తస్రావం తదితర వ్యాధులను తగ్గించడంలో వాడతారు. తులసి ఆకురసం జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. తులసి ఆకులను నిమ్మ రసంతో కలిపి చర్మ సంబంధిత వ్యాధుల నిర్మూలనలో ఉపయోగిస్తారు. గొంతు గరగరను తగ్గించడంలోనూ, కఫాన్ని తొలగించి గొంతును శుభ్రం చేయడంలోనూ తులసి రసాన్ని ఎక్కువగా వాడతారు. పాము కరిచిన వ్యక్తి చేత తులసి ఆకులను తినిపించి, తులసి ఆకులు, వేర్లు, మిరియాలు కలిపి నూరి తినిపిస్తే విషం త్వరగా ఎక్కదని ఆయుర్వేద వైద్యులు చెబుతారు. తేలు కుడివైపు కుడితే ఎడమవైపు, ఎడమ వైపు కుడితే కుడి వైపు చెవిలో తులసి రసం వేస్తే విషం ఎక్కదంటారు. ప్రాధాన్యం తులసి మొక్క ఉన్న ఇంటిని తీర్థస్థలమని, తులసి కోట ఉన్న ప్రదేశం గంగాతీరంతో సమానమైన పవిత్రతను కలిగి ఉంటుందని పెద్దలు చెబుతుంటారు. రోజూ నిద్ర లేవగానే తులసి మొక్కను దర్శించడం, ప్రదక్షిణలు చేయడం వల్ల సప్త ద్వీపాలతో కూడిన సమస్త భూ మండలాన్ని, అందులోని తీర్థాలను, క్షేత్రాలను దర్శించినంత పుణ్యం లభిస్తుందని ఓ నమ్మకం. తులసి మొక్కను నాటినా, నీరు పోసినా, తాకినా, పోషించినా మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. తులసి మొక్కతో హరిహరులను పూజిస్తే పునర్జన్మ ఉండదని చెబుతారు. -
కేన్సర్‌పై ‘తులసి’ పోరు
వాషింగ్టన్: కేన్సర్‌పై పోరాడేందుకు తులసి మొక్కలోని ఔషధ గుణాలను మరింత పెంపొందించే దిశగా భారత సంతతి శాస్త్రవేత్త చంద్రకాంత్ ఏమాని ఆధ్వర్యంలో అమెరికా శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తున్నారు. తులసిలోని ‘యూజెనాల్’ అనే ఔషధం మరింత ఎక్కువగా ఉత్పత్తయ్యేలా జన్యుపరంగా మార్పులు (జెనిటికల్ ఇంజనీరింగ్) చేస్తున్నారు. తులసిలో లభించే ‘యూజెనాల్’కు వైద్య పరంగా ఎంతో ప్రాముఖ్యం ఉంది. బ్రెస్ట్ కేన్సర్‌తో పాటు మరెన్నో వ్యాధుల నివారణకు ఈ రసాయనం తోడ్పడుతుంది. అందువల్ల ‘యూజెనాల్’ను మరింత ఎక్కువగా జన్యుపరంగా మార్పులు చేస్తున్నట్లు చంద్రకాంత్ పేర్కొన్నారు.