దోమ: నిత్య జీవితంలో తులసి మొక్కకు గల ప్రాధాన్యం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తులసి మొక్కను పూజిస్తే సకల పాపాలు, దోషాలు తొలగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆడపడుచులు తులసి మొక్కకు పూజలు చేయడం చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా కార్తీక మాసంలో ఈ మొక్కకు పూజలు చేయడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు.
తులసి మొక్కల చుట్టూ కార్తీక దీపాలు వెలిగించి పూజలు చేస్తారు. ఈ మొక్క ఆరోగ్య ప్రదాయిని అని శాస్త్రీయంగా నిరూపితమైంది. రోజూ తులసి ఆకులు తినడం ఎంతో ఆరోగ్యకరమని పెద్దలు చెబుతుం టారు. కార్తీక మాసంలో ఎక్కడ చూసినా తులసి పూజలు పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. తులసితో ఎన్నో ప్రయోజనాలు ఉన్నందున దీనిని భూలోక కల్పవృక్షం అని పిలుస్తారు.
రకాలు
తులసి మొక్కల్లో చాలా రకాలు ఉంటాయి. వాటిలో లక్ష్మీ తులసి తెలుపురంగులో ఉంటుంది. దీనిని పూజలకు వాడతారు.
కృష్ణ తులసి నలుపురంగులో ఉంటుంది. దీనిని దేవతామూర్తుల అర్చన కార్యక్రమాల్లో వాడతారు.
రామ తులసిగా పిలవబడే తెలుపు రంగులో ఉండే మరో మొక్కను వైద్య రంగంలో విరివిగా వాడతారు.
లక్ష్మీ తులసికి కార్తీక మాసంలో ద్వాదశి రోజున మహా విష్ణువుగా భావించే ఉసిరికకు వివాహం జరిపి ప్రత్యేక పూజలు జరపడం సాంప్రదాయంగా కొనసాగుతోంది.
వాడకంలో నియమాలు
సనాతన సంప్రదాయాల ప్రకారం ఆది, మంగళ, గురు, శుక్రవారాల్లో తులసి ఆకులను తుంచరాదు.
తులసి ఆకులను తూర్పు, ఉత్తర ముఖంగా నిల్చుని మాత్రమే కోయాలి.
ద్వాదశి అమావాస్య, పున్నమి తిథులలో తులసి ఆకులను తుంచరాదు.
రాత్రి వేళల్లోనూ, స్నానం చేయకుండా గానీ, పాదరక్షలతో గానీ తులసి మొక్కను ముట్టుకోరాదు.
తులసి ఆకులను ఒంటిగా తుంచరాదు. మూడు ఆకుల దళంతో కలిపే తుంచాలి.
వైద్య రంగంలో..
తులసి మొక్క ఆకులు, కొమ్మలు, గింజలు, వేర్లు అన్నింటినీ వైద్య రంగంలో ఉపయోగిస్తారు.
తులసి ఆకుల రసాన్ని జ్వరం, వాంతులు, విరేచనాలు, అతిసార, రక్తస్రావం తదితర వ్యాధులను తగ్గించడంలో వాడతారు.
తులసి ఆకురసం జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.
తులసి ఆకులను నిమ్మ రసంతో కలిపి చర్మ సంబంధిత వ్యాధుల నిర్మూలనలో ఉపయోగిస్తారు.
గొంతు గరగరను తగ్గించడంలోనూ, కఫాన్ని తొలగించి గొంతును శుభ్రం చేయడంలోనూ తులసి రసాన్ని ఎక్కువగా వాడతారు.
పాము కరిచిన వ్యక్తి చేత తులసి ఆకులను తినిపించి, తులసి ఆకులు, వేర్లు, మిరియాలు కలిపి నూరి తినిపిస్తే విషం త్వరగా ఎక్కదని ఆయుర్వేద వైద్యులు చెబుతారు.
తేలు కుడివైపు కుడితే ఎడమవైపు, ఎడమ వైపు కుడితే కుడి వైపు చెవిలో తులసి రసం వేస్తే విషం ఎక్కదంటారు.
ప్రాధాన్యం
తులసి మొక్క ఉన్న ఇంటిని తీర్థస్థలమని, తులసి కోట ఉన్న ప్రదేశం గంగాతీరంతో సమానమైన పవిత్రతను కలిగి ఉంటుందని పెద్దలు చెబుతుంటారు.
రోజూ నిద్ర లేవగానే తులసి మొక్కను దర్శించడం, ప్రదక్షిణలు చేయడం వల్ల సప్త ద్వీపాలతో కూడిన సమస్త భూ మండలాన్ని, అందులోని తీర్థాలను, క్షేత్రాలను దర్శించినంత పుణ్యం లభిస్తుందని ఓ నమ్మకం.
తులసి మొక్కను నాటినా, నీరు పోసినా, తాకినా, పోషించినా మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం.
తులసి మొక్కతో హరిహరులను పూజిస్తే పునర్జన్మ ఉండదని చెబుతారు.
తులసి.. ఔషధ గుణాల నిధి
Published Sat, Nov 8 2014 12:39 AM | Last Updated on Tue, Oct 16 2018 3:25 PM
Advertisement