doma
-
ఎంతపని చేశావ్ దేవుడా..! తీవ్ర విషాదం..!!
వికారాబాద్: ఏడుగురు కూతుళ్ల తర్వాత పుట్టిన ఒక్కగానొక్క కుమారుడిని విద్యుత్ ప్రమాదం పొట్టన పెట్టుకున్న విషాదకర సంఘటన వికారాబాద్ జిల్లా దోమ పీఎస్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దతండాకు చెందిన నేనావత్ చందర్, జెమినీబాయి దంపతులకు ఏడుగురు కూతుళ్లు, ఒక కుమారుడు సంతానం. కూతుళ్ల వివాహాలను ఘనంగా చేసిన ఆయన.. అందరిలో చిన్నవాడైన కొడుకు రాము(22) పెళ్లి జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. ఇందులో భాగంగా బ్రాహ్మణపల్లిలో కుమారుడి కోసం నూతన గృహాన్ని నిర్మిస్తున్నాడు. ఈ క్రమంలో రాము ఇంటిపై ఉన్న స్టీల్‌రాడ్‌ను కిందికి తీసుకువస్తుండగా పైనున్న హైటెన్షన్ తీగలకు తగిలి విద్యుదాఘాతానికి గురయ్యాడు. క్షణాల్లో ప్రాణాలు విడిచి విగతజీవిగా పడిపోయాడు. చిన్ననాటి నుంచి అల్లారుముద్దుగా చూసుకుంటున్న తమ కుమారుడి మరణాన్ని తట్టుకోలేని చందర్ దంపతులు ఎంత పని చేశావ్ దేవుడా.. అంటూ కన్నీరుమున్నీరయ్యారు. పోస్టుమార్టం నిమిత్తం రాము మృతదేహాన్ని పరిగి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రవిగౌడ్ తెలిపారు. -
ఫేస్బుక్ ప్రేమ.. పెళ్లి పేరుతో నమ్మించి, యువతిని మోసం చేసిన ఆర్మీ ఉద్యోగి
సాక్షి, వికారాబాద్: సమాజంలో అందరికీ స్ఫూర్తిగా నిలవాల్సిన ఆర్మీ ఉద్యోగి ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన ఘటన దోమ మండల పరిధిలో చోటుచేసుకుంది. బాధితురాలు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఐనాపూర్‌కు చెందిన యువతి (20)తో దాదాపూర్‌కు చెందిన ఆర్మీ ఉద్యోగి రామకృష్ణ (24)కు సంవత్సరం క్రితం ఫేస్ బుక్‌లో పరిచయం ఏర్పడింది. వారి పరిచయం ప్రేమగా మారింది. వారం క్రితం స్వగ్రామానికి వచ్చిన రామకృష్ణ పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. దీంతో వీరి ప్రేమ శారీరక సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో సోమవారం రాత్రి రామకృష్ణ యువతికి ఫోన్ చేసి గ్రామ శివారులోకి తీసుకెళ్లగా అది గమనించిన కుటుంబ సభ్యులు యువకుడిని పట్టుకున్నారు. దీంతో గ్రామస్తుల సమక్షంలో పెళ్లి విషయం మాట్లాడే ప్రయత్నం చేశారు. రామకృష్ణ వ్యవహారశైలి అనుమానాస్పదంగా కనిపించడంతో మంగళవారం కుటుంబ సభ్యులతో కలిసి బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదు కాపీను ఎస్ఐ చింపివేశారని బాధితురాలు ఆరోపించారు. కేసును నీరుగార్చే యత్నం రామకృష్ణ తనను మోసం చేశారని ఫిర్యాదు చేయడానికి వస్తే అతని బంధువు కానిస్టేబుల్ మాటలను నమ్మి ఫిర్యాదు కాపీని చించివేసి కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని బాధితురాలు ఆరోపించారు. ఉన్నతాధికారులు రామకృష్ణపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ విషయమై ఎస్ఐ విశ్వజన్‌ను వివరణ కోరగా.. బాధితురాలు ఫిర్యాదు మేరకు రామకృష్ణపై 376, 420 కింద కేసు నమోదు చేశామని తెలిపారు. చదవండి: ఢిల్లీ లిక్కర్ స్కాం: కదులుతున్న డొంక -
పల్లె ముంగిట్లో సాంకేతిక సౌరభాలు
దోమ: ఒకప్పుడు పట్టణాలకు, ఉన్నత కుటుంబాలకే పరిమితమైన టెక్నాలజీ వినియోగం నేడు పల్లెలకు కూడా పాకింది. విద్య, వైద్యం, ఆరోగ్యం, రవాణా, కమ్యూనికేషన్, వినోదం, ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోనూ టెక్నాలజీ నిత్య నూతనమైంది. ఆయా రంగాల్లో సాంకేతికాభివృద్ధి ఫలితంగా అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక సౌకర్యాలన్నీ మానవ జీవితాన్ని అత్యంత సుఖవంతం చేశాయి. అదే సమయంలో వాటిని దుర్వినియోగం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతున్నాయి. ఈ కారణంగా శాస్త్ర, సాంకేతికాభివృద్ధి ఫలితంగా అందుబాటులోకి వచ్చిన సౌకర్యాలను ఎలా సద్వినియోగం చేసుకోవాలి, వాటిని దుర్వినియోగం చేస్తే ఎదురయ్యే పరిస్థితులపై ప్రజలకు అవగాహన కల్పించేందుకై ప్రతి ఏటా నవంబర్ మాసంలో 2వ గురువారాన్ని ప్రపంచ యూజబిలిటీ డేగా పాటిస్తున్నారు. ప్రపంచ యూజబిలిటీ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏటా ఈ రోజు పలు ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతూ ప్రజలను చైతన్యవంతం చేయడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి. పల్లె జీవన శైలి మార్చిన టెక్నాలజీ గత కొన్నేళ్ల క్రితం వరకు పట్టణాలు,నగరాలకే పరిమితమైన టెక్నాలజీ వినియోగం నేడు పల్లెలకు కూడా పాకింది. కొన్నేళ్ల క్రితం వరకు సెల్‌ఫోన్ ఎవరిచేతిలోనైనా కనబడితే అందరూ ఆశ్చర్యంగా చూసేవారు. నేడు పల్లెల్లో సెల్‌ఫోన్ లేనిదే క్షణం గడవని పరిస్థితి. అంతేకాకుండా ప్రస్తుతం పల్లెల్లో ఇంటర్నెట్ వినియోగం కూడా గణనీయంగా పెరిగింది. పరిగి ప్రాంతాన్ని తీసుకుంటే మూడేళ్ల క్రితం కేవలం 2 ఇంటర్నెట్ కేంద్రాలు మాత్రమే అందుబాటులో ఉండేవి. కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది. పరిగిలోనే కాకుండా దోమ, కుల్కచర్ల, గండేడ్ మండలాల్లో పెద్ద ఎత్తున ఇంటర్నెట్ కేంద్రాలు వెలిశాయి. అన్ని చోట్లా కలిపి ప్రస్తుతం 20 ఇంటర్నెట్ కేంద్రాలు కొనసాగుతున్నాయి. ఇక ఇళ్లల్లో దాదాపు 200 మంది వరకు బ్రాడ్ బ్యాండ్ సేవలను వినియోగిస్తున్నారు. నిర్మాణ రంగంలోనూ అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. శారీరక శ్రమ తగ్గిపోయి బేస్మెంట్ దగ్గర నుంచి చెత్తు వేసే వరకు కూడా అత్యాధునిక యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. విద్యా సంస్థల విషయానికొస్తే బ్లాక్‌బోర్డులకు బదులుగా ప్రస్తుతం కొన్ని చోట్ల ప్రొజెక్టర్ సౌకర్యాన్ని వినియోగిస్తున్నారు. అలాగే ఒకప్పుడు ధనవంతులకే పరిమితమైన కార్లు ప్రస్తుతం మధ్యతరగతి వారికి కూడా అందుబాటులోకి వచ్చాయి. అంతేకాకుండా పల్లెల్లో ద్విచక్రవాహనం లేని ఇళ్లు లేదని చెప్పడానికి ఎలాంటి అతిశయోక్తి అవసరం లేదు. ఇక వ్యవసాయంలోనూ కూలీల అవసరం తగ్గి మి షన్లతోనే పనులు జరుగుతున్నాయి. గతంలో వారాలు పట్టే పనిని యంత్రాలతో గంటల్లోనే ముగిస్తున్నారు. వినియోగంలో లోపిస్తున్న విచక్షణ.... విజ్ఞాన శాస్త్రం అనేక సమస్యలు పరిష్కరించి మానవ జీవితాన్ని సుఖమయం చేసింది. కానీ మనిషి విచక్షణా లోపం వల్ల ఆ విజ్ఞానమే పర్యావరణ అసమతుల్యత, పరిసరాల కాలుష్యానికి దారి తీస్తోంది. ఉదాహరణకు సోషల్నెట్వర్కింగ్తో పరిచయాలు పాత స్నేహితులను కలుసుకోవచ్చు. అదే సోషల్నెట్వర్క్ను కొందరు దుర్వినియోగం చేస్తుండటంతో వస్తున్న పెద్ద పెద్ద సమస్యల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అదే విధంగా సెల్ఫక్షన్ సిగ్నల్స్‌తో కొన్ని రకాల పక్షులు ఇప్పుడు పల్లెల్లో కూడా కనుమరుగవుతున్నాయి. ఇక ఆండ్రాయిడ్ ఫోన్లు వచ్చినప్పటి నుంచి సహచరులతో మాట్లాడటం తగ్గించి ఫోన్లతోనే కాలక్షేపం చేస్తుండటంతో సంబంధబాంధవ్యాలు దెబ్బతింటున్నాయి. మానవుడు తన పరిజ్ఞానాన్ని సరైన మార్గంలో వినియోగించి సృష్టి ఔన్నత్యానికి పాటు పడాలే గానీ సృష్టి వినాశనానికి కాదని గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. -
తులసి.. ఔషధ గుణాల నిధి
దోమ: నిత్య జీవితంలో తులసి మొక్కకు గల ప్రాధాన్యం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తులసి మొక్కను పూజిస్తే సకల పాపాలు, దోషాలు తొలగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆడపడుచులు తులసి మొక్కకు పూజలు చేయడం చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా కార్తీక మాసంలో ఈ మొక్కకు పూజలు చేయడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. తులసి మొక్కల చుట్టూ కార్తీక దీపాలు వెలిగించి పూజలు చేస్తారు. ఈ మొక్క ఆరోగ్య ప్రదాయిని అని శాస్త్రీయంగా నిరూపితమైంది. రోజూ తులసి ఆకులు తినడం ఎంతో ఆరోగ్యకరమని పెద్దలు చెబుతుం టారు. కార్తీక మాసంలో ఎక్కడ చూసినా తులసి పూజలు పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. తులసితో ఎన్నో ప్రయోజనాలు ఉన్నందున దీనిని భూలోక కల్పవృక్షం అని పిలుస్తారు. రకాలు తులసి మొక్కల్లో చాలా రకాలు ఉంటాయి. వాటిలో లక్ష్మీ తులసి తెలుపురంగులో ఉంటుంది. దీనిని పూజలకు వాడతారు. కృష్ణ తులసి నలుపురంగులో ఉంటుంది. దీనిని దేవతామూర్తుల అర్చన కార్యక్రమాల్లో వాడతారు. రామ తులసిగా పిలవబడే తెలుపు రంగులో ఉండే మరో మొక్కను వైద్య రంగంలో విరివిగా వాడతారు. లక్ష్మీ తులసికి కార్తీక మాసంలో ద్వాదశి రోజున మహా విష్ణువుగా భావించే ఉసిరికకు వివాహం జరిపి ప్రత్యేక పూజలు జరపడం సాంప్రదాయంగా కొనసాగుతోంది. వాడకంలో నియమాలు సనాతన సంప్రదాయాల ప్రకారం ఆది, మంగళ, గురు, శుక్రవారాల్లో తులసి ఆకులను తుంచరాదు. తులసి ఆకులను తూర్పు, ఉత్తర ముఖంగా నిల్చుని మాత్రమే కోయాలి. ద్వాదశి అమావాస్య, పున్నమి తిథులలో తులసి ఆకులను తుంచరాదు. రాత్రి వేళల్లోనూ, స్నానం చేయకుండా గానీ, పాదరక్షలతో గానీ తులసి మొక్కను ముట్టుకోరాదు. తులసి ఆకులను ఒంటిగా తుంచరాదు. మూడు ఆకుల దళంతో కలిపే తుంచాలి. వైద్య రంగంలో.. తులసి మొక్క ఆకులు, కొమ్మలు, గింజలు, వేర్లు అన్నింటినీ వైద్య రంగంలో ఉపయోగిస్తారు. తులసి ఆకుల రసాన్ని జ్వరం, వాంతులు, విరేచనాలు, అతిసార, రక్తస్రావం తదితర వ్యాధులను తగ్గించడంలో వాడతారు. తులసి ఆకురసం జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. తులసి ఆకులను నిమ్మ రసంతో కలిపి చర్మ సంబంధిత వ్యాధుల నిర్మూలనలో ఉపయోగిస్తారు. గొంతు గరగరను తగ్గించడంలోనూ, కఫాన్ని తొలగించి గొంతును శుభ్రం చేయడంలోనూ తులసి రసాన్ని ఎక్కువగా వాడతారు. పాము కరిచిన వ్యక్తి చేత తులసి ఆకులను తినిపించి, తులసి ఆకులు, వేర్లు, మిరియాలు కలిపి నూరి తినిపిస్తే విషం త్వరగా ఎక్కదని ఆయుర్వేద వైద్యులు చెబుతారు. తేలు కుడివైపు కుడితే ఎడమవైపు, ఎడమ వైపు కుడితే కుడి వైపు చెవిలో తులసి రసం వేస్తే విషం ఎక్కదంటారు. ప్రాధాన్యం తులసి మొక్క ఉన్న ఇంటిని తీర్థస్థలమని, తులసి కోట ఉన్న ప్రదేశం గంగాతీరంతో సమానమైన పవిత్రతను కలిగి ఉంటుందని పెద్దలు చెబుతుంటారు. రోజూ నిద్ర లేవగానే తులసి మొక్కను దర్శించడం, ప్రదక్షిణలు చేయడం వల్ల సప్త ద్వీపాలతో కూడిన సమస్త భూ మండలాన్ని, అందులోని తీర్థాలను, క్షేత్రాలను దర్శించినంత పుణ్యం లభిస్తుందని ఓ నమ్మకం. తులసి మొక్కను నాటినా, నీరు పోసినా, తాకినా, పోషించినా మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. తులసి మొక్కతో హరిహరులను పూజిస్తే పునర్జన్మ ఉండదని చెబుతారు. -
పంట ఎండిందని ప్రాణం తీసుకున్నాడు..
దోమ: ఆరుగాలం కష్డపడి సాగు చేసిన వరిపంట కళ్ల ముందే ఎండిపోవడంతో అప్పులు తీరేమార్గం లేదని మనోవేదనకు గురైన ఓ అన్నదాత బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా దోమ మండల పరిధిలోని బొంపల్లి చిన్నతండాలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. తండాకు చెందిన ఆంగోతు రాములు నాయక్(35) బొంపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వద్ద 6 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని గత మూడేళ్లుగా వ్యవసాయం చేస్తున్నాడు. ఈ ఏడాది ఖరీఫ్‌లో వరిపంట వేశాడు. పెట్టుబడికి, కుటుంబ అవసరాల కోసం దోమ ఎస్బీహెచ్లో రూ.30 వేలు, ప్రైవేట్‌గా మరో రూ.1.70 లక్షల వరకు అప్పు చేశాడు. ఇటీవల విద్యుత్ కోతల కారణంగా పంటకు నీరందక పూర్తిగా ఎండిపోయింది. దీంతో పెట్టిన పెట్టుబడి కూడా వస్తుందో రాదోనని రాములునాయక్ మానసిక వేదనకు గురయ్యాడు. అప్పులు తీరేమార్గం లేదని మనస్తాపం చెందిన ఆయన మంగళవారం మధ్యాహ్నం పొలంలో తాడుతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొద్దిసేపటి తర్వాత పొలానికి వెళ్లిన చిన్న కుమారుడు సేవ్యా తండ్రి మృతదేహాన్ని గమనించి గ్రామస్తులకు సమాచారం ఇచ్చాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య లక్ష్మీబాయితో పాటు కుమారులు శంకర్, సేవ్యా, కుమార్తె సావిత్రి ఉన్నారు. రైతు మృతితో కుటుంబీకులు, బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు. మృతుడి తండ్రి రూప్సింగ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అమరుల త్యాగ స్మరణయే మొహర్రం
దోమ: ఇస్లాం పరిరక్షణకు ప్రాణత్యాగం చేసిన వారిని స్మరించుకునే మాసమే మొహర్రం. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం మొహర్రం మొదటి మాసంగా పేర్కొంటారు. ఇరాక్‌లోని కర్బలాలో జరిగిన యుద్ధంలో శత్రువులతో పోరాడి వీరమరణం పొందిన ఇమామ్ హుస్సేన్, హస్సన్, వారి కుటుంబ సభ్యుల త్యాగాన్ని స్మరించుకునేందుకు ఏటా ఈ మాసంలో సంతాప కార్యక్రమాలు నిర్వహిస్తారు. మంగళవారం మొహర్రం నేపథ్యంలో పది రోజుల క్రితమే గ్రామాల్లో చావిడీలను ప్రత్యేకంగా అలంకరించి వాటిలో పీర్లను ప్రతిష్టించారు. అప్పటి నుండి సోమవారం వరకు సంతాప దినాలుగా పాటించి శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. మొహర్రం అనే పేరు హరం అనే ఉర్దూ పదం నుండి వచ్చిందని చెబుతుంటారు. హరం అంటే త్యాగం, క్షమాపణ అని అర్థం. మొహర్రం సందర్భంగా పలు చోట్ల ముస్లింలు ఛాతీ బాదుకుంటూ, రక్తం చిందిస్తూ మాతం యాత్ర నిర్వహించి యుద్ధంలో అమరులైన వారికి సంతాపం తెలుపుతారు.మొహర్రం గ్రామాల్లో మతసామరస్యానికి వేదికగా నిలుస్తోంది. చాలా గ్రామాల్లో పీర్లను ముస్లింలతో సమానంగా హిందువులు దర్శించుకొని పూజలు చేస్తారు. హిందువులు మాతం యాత్రలోనూ పాల్గొని ముస్లింలకు సంఘీభావం తెలపడం ఓ సాంప్రదాయంగా కొనసాగుతోంది. ముస్లింల సంఖ్య తక్కువగా ఉండే గ్రామాల్లో హిందువులే ముందుండి మొహర్రం కార్యక్రమాలను నిర్వహిస్తుండడం ఓ విశేషంగా చెప్పుకోవచ్చు.దోమ మండల పరిధిలోని పాలేపల్లి, దోమ, మోత్కూర్, దిర్సంపల్లి, కిష్టాపూర్ తదితర గ్రామాల్లో మొహర్రం నాడు ఏటా ఘనంగా పీర్ల ఊరేగింపు నిర్వహిస్తారు. పది రోజుల పాటు చావిడీల్లో దర్శనార్థం ఉంచిన పీర్లను మంగళవారం నెలవంక దర్శనం కాగానే మాతం యాత్ర చేపట్టనున్నారు. -
ప్రాణాల మీదికి తెచ్చిన ‘ప్రయోగం’
దోమ: విద్యార్థులు సరదాగా చేసిన ప్రయోగం వారి ప్రాణాల మీదికొచ్చింది. చేతిలో జిలిటెన్ స్టిక్ పేలడంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. కలకలం సృష్టించిన ఈ సంఘటన జిల్లా దోమ మండల పరిధిలోని దిర్సంపల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. క్షతగాత్రులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దిర్సంపల్లి గ్రామ సమీపంలో ఉన్న రాళ్లగుట్టల్లో క్రషర్ల నిర్వాహకులు తరచూ కంప్రెషర్ ద్వారా చిన్న సైజుల్లో ఉండే జిలిటెన్ స్టిక్స్ ఉపయోగించి బ్లాస్టింగ్ చేస్తూ రాళ్లు పగులగొడుతుంటారు. జిలిటెన్ స్టిక్స్‌కు రెండు వైపులా బ్లాస్టింగ్ తీగల కనెక్షన్ ఇచ్చి వాటిని దూరంగా కలుపుతారు. అప్పుడు పేలుడు జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఈ జిలిటెన్ స్టిక్స్ పేలకుండా అలాగే ఉండిపోతాయి. ఇలా మిగిలిన కొన్ని జిలిటెన్ స్టిక్స్‌ను కొద్ది రోజుల క్రితం దిర్సంపల్లికి చెందిన 3వ తరగతి విద్యార్థి సందారం నవీన్, 7వ తరగతి విద్యార్థి చాకలి అనిల్‌లు సేకరించారు. వారికి బ్లాస్టింగ్ తీగలు కూడా దొరకడంతో జిలెటెన్ స్టిక్కు వాటిని జతచేసి ఓ చిన్న రాయి కింద పెట్టి దూరంగా నిలబడి పరీక్షించారు. రాయి పగలడంతో విద్యార్థులు ఈ ప్రయోగం బాగుందని భావించి ఓ జిలిటెన్ స్టిక్‌ను ఇంటికి తీసుకొచ్చారు. ఆదివారం సెలవు దినం కావడంతో నవీన్ ఇంట్లో ప్రయోగం చేసేందుకు పూనుకున్నారు. జిలిటెన్ స్టిక్‌ను నవీన్ చేతిలో పట్టుకోగా పక్కనే ఉన్న అనిల్ బ్లాస్టింగ్ తీగల ధన, రుణ ఆవేశాలను కలిపాడు. దీంతో ఒక్కసారిగా నవీన్ చేతిలో పెద్దశబ్దంతో పేలుడు జరిగింది. దీంతో విద్యార్థుల చేతులతో పాటు ముఖం, కడుపు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. పెద్దశబ్దం రావడంతో గ్రామస్తులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సరదాగా విద్యార్థులు చేసిన ప్రయోగంతో గాయపడడంతో వారి తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. -
పంట నష్ట పరిహారం చెల్లింపులో అవకతవకలు
దోమ: పంట నష్ట పరిహారం మంజూరులో అధికారులు అవినీతికి పాల్పడ్డారని, అర్హులకు అన్యాయం జరిగింద ని ఆగ్రహిస్తూ మండల పరిధిలోని మైలారం గ్రామానికి చెందిన రైతులు శనివారం పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. 2013 నవంబరులో భారీ వర్షాల కారణంగా మండలంలో వేలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. అప్పట్లో వీఆర్ఓలు, వ్యవసాయాధికారులు గ్రామాల్లో పర్యటించి పంట నష్టపోయిన రైతుల వివరాలను ప్రభుత్వానికి పంపించారు. అధికారులు అందించిన వివరాల మేరకు ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం సంబంధిత రైతులకు పంట నష్టపరిహారం డబ్బులు విడుదల చేసింది. మైలారం గ్రామంలో 57మందిని అర్హులుగా ఎంపిక చేసి నష్టపరిహారం మంజూరు చేశారు. అయితే నిజంగా పంట నష్టపోయిన రైతులకు కాకుండా అనర్హులకు పరిహారం మంజూరు చేశారంటూ గ్రామానికి చెందిన వందలాది మంది రైతులు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పక్కనే ఉన్న వ్యవసాయ కార్యాలయాన్ని మూసి వేయించారు. వ్యవసాయ విస్తరణ అధికారి వెంకటయ్యను చుట్టు ముట్టి అతనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం భూమి కూడా లేనివారికి, వ్యవసాయం అంటే ఏమిటో కూడా తెలియని వారికి పరిహారం మంజూరైందని ఆరోపించారు. పైరవీలు చేసి ఎంతో కొంత ముట్టజెప్పిన వారికే అధికారులు పరిహారం మంజూరు చేయిం చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకే సర్వే నెంబరుపై నలుగురైదుగురికి పరిహారం ఎలా వస్తుందంటూ ప్రశ్నించారు. అవినీతికి పాల్పడ్డ అధికారులపై చర్యలు తీసుకోవడంతో పాటు అర్హులైన రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీనికి తహసీల్దార్ జనార్దన్ స్పందిస్తూ రైతుల ఆందోళన విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతానని వారికి నచ్చజెప్పారు. అయితే రెండు, మూడు రోజుల్లో తమకు న్యాయం చేయకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఆందోళనలో ఎంపీటీసీ సుశీలతో పాటు పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు. -
నేడే ఎంసెట్ ఆల్ ద బెస్ట్
దోమ, న్యూస్‌లైన్: ఇంజినీరింగ్, మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఎంసెట్ పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గురువారం ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఇంజినీరింగ్, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు మెడిసిన్ పరీక్ష నిర్వహించనున్నారు. వికారాబాద్‌లోని ఎస్ఏపీ కళాశాల, ధన్నారం సమీపంలోని అన్వర్‌ఉలూమ్ కళాశాల సెంటర్లలో పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇవీ సూచనలు.. నిమిషం ఆలస్యమైనా పరీక్షాకేంద్రంలోకి అనుమతించరు. ఆన్లైన్ దరఖాస్తు పత్రం తప్పనిసరి. హాల్‌టికెట్, గెజిటెడ్ అధికారి సంతకం చేసిన ఆన్లైన్ దరఖాస్తు పత్రం తప్పకుండా తీసుకెళ్లాలి. ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్ఫోన్లు వెంట తీసుకెళ్లవద్దు. పరీక్ష రాసేందుకు వాడే అట్టలకు కూడా అనుమతి లేదు. దరఖాస్తు ఫారంలో ఎలాంటి పొరపాట్లు ఉన్నా పరీక్షా కేంద్రంలో ఉండే నామినల్ రోల్స్‌లో సరి చేసుకునే వీలుంది. విద్యార్థులు గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. ఇంజినీరింగ్ పరీక్ష రాసే విద్యార్థులను ఉదయం 9గంటల నుంచి, మెడిసిన్ పరీక్ష రాసే విద్యార్థులను మధ్యాహ్నం 1.30 నుంచి అనుమతిస్తారు. పరీక్షకు 30 నిమిషాల ముందు ఓఎంఆర్ షీట్‌ను అంది స్తారు. విద్యార్థులు తప్పులు లేకుండా వాటిని నింపాలి. సమాధానాలు గుర్తించేందుకు పెన్సిల్‌కు బదులు బ్లూలేదా బ్లాక్ బాల్‌పాయింట్ పెన్ను ఉపయోగించాలి. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉండాలి. మంచి ర్యాంకు సాధించగలమన్న నమ్మకంతో పరీక్షకు వెళ్లాలి. పరీక్షకు ముందు సబ్జెక్టు గురించి ఇతరులతో చర్చించి ఆందోళనకు గురికావొద్దు. -
వ్యవసాయ సమాచారంతో వెబ్సైట్
దోమ, న్యూస్‌లైన్: ఆయా సీజన్లలో పండించే పంటలు, వాటి సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన మెలకువలపై పూర్తి సమాచారాన్ని అం దించేందుకు వీలుగా వ్యవసాయ శాఖ ఓ సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. రైతులకు కావాల్సిన సమాచారాన్ని పూర్తిగా తెలుగులో అందించేందుకు వీలుగా ఇటీవల ‘అగ్రిస్నెట్’ పేరుతో కొత్త వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఖరీఫ్, రబీ సీజన్లలో పండించే పంటల వివరాలు, సలహాలు, సూచనలతో పాటు వ్యవసాయ అనుబంధ శాఖల సమాచారాన్ని కూడా ఇందులో పొందుపరిచారు. కొద్దిపాటి కంప్యూటర్ పరిజ్ఞానమున్న రైతులు సైతం ఈ వెబ్‌సైట్‌ను ఉపయోగించుకునేలా సౌలభ్యం కల్పించారు. అందుబాటులో సమస్త సమాచారం అగ్రిస్నెట్ వెబ్సైట్ ఓపెన్ చేయగానే స్క్రీన్‌పై ఎడమవైపున వ్యవసాయానికి సంబంధించి పలు రకాల అంశాలకు సంబంధించిన సమాచార వివరాలు కనిపిస్తాయి. పంటల యాజమాన్యం, అంతర పంటల వివరాలు, సమగ్ర సస్యరక్షణ, శ్రీ వరి సాగు, మార్కెట్లో కూరగాయలు, పంటల ధరలు, వ్యవసాయ అనుబంధ శాఖల వివరాలు, సేంద్రియ వ్యవసాయ పద్ధతులు తది తర అంశాలకు సంబంధించిన వివరాలు ఇందులో ఉంటాయి. వీటితో పాటు రైతుల విజయగాథలు, ప్రశ్నలు - సమాధానాలు, వ్యవసాయ అధికారుల ఫోన్ నంబర్లు, ఆయా పథకాల వినియోగానికి సంబంధించిన దరఖాస్తు ఫారాలు, ప్రకృతి వైపరీత్యాలు- వాటి నివారణా మార్గాలు, వ్యవసాయ డీలర్ల వివరాలు, ప్రభుత్వం కల్పిస్తున్న సబ్సిడీ ఇలా అన్ని రకాల వివరాలు ఉంటాయి. వాటిపై క్లిక్ చేస్తే చాలు ఆయా అంశాలకు సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులోకి వస్తుంది. ప్రభుత్వ పథకాలు, సబ్సిడీ.. వ్యవసాయ అభివృద్ధితో పాటు రైతుల ఉపయోగార్థమై ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కల్పిస్తున్న సబ్సిడీ సదుపాయం తదితర అంశాలకు సం బంధించిన సమాచారాన్ని సైతం వెబ్సైట్లో పొందుపరిచారు. భూసార పరీ క్షలు చేసే విధానం, కలిగే ప్రయోజ నాలు, మార్కెట్లో పంటల మద్దతు ధరలను సైతం అందుబాటులో ఉం చారు. మొత్తంగా చూస్తే రైతులకు సం బంధించిన అన్ని రకాల సమాచారాన్ని ఈ వెబ్సైట్ ద్వారా పొందవచ్చు. -
అంగన్వాడీలు..ఇక ఫుల్‌టైమ్
దోమ, న్యూస్‌లైన్: అంగన్వాడీ కేంద్రాల పనివేళల్లో మార్పు చేస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇకపై ప్రభుత్వ పాఠశాలల మాదిరిగా అంగన్వాడీ కేంద్రాలు పూర్తి సమయం పనిచేయాల్సి ఉంటుంది. ఈ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలను సైతం పెంచారు. కేంద్రం నుంచి వచ్చే 75శాతం నిధులు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 25శాతం నిధులతో నడుస్తున్న ఈ కేంద్రాలు ప్రస్తుతం ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు కొనసాగాయి. తాజా ఉత్తర్వుల ప్రకారం సాయంత్రం 4 గంటల వరకు పనిచేయాల్సి ఉంది. పని వేళల్లో మార్పు చేసిన కారణంగా అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాల వేతనాలను కూడా స్వల్పంగా పెంచారు. ఇప్పటివరకు కార్యకర్తలకు ఇస్తున్న రూ.3,700 వేతనాన్ని రూ4,200కు, ఆయాల ఇస్తున్న రూ.1,950 వేతనాన్ని రూ.2,200కు పెంచారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 12 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలో 2,500 వరకు అంగన్వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి. పరిగి ప్రాజెక్టు పరిధిలో ఉన్న దోమ, కుల్కచర్ల, పరిగి, గండేడ్, పూడూరు మండలాల్లో మొత్తం 230 అంగన్వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ ఉత్తర్వులను అమలు చేసేందుకు ఐసీడీఎస్ అధికారులు చర్యలను ప్రారంభించారు. అదనపు పనులు అంగన్వాడీ కేంద్రాల పని వేళల్లో మార్పులు చేసిన ప్రభుత్వం ఆయా కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు చేపడుతున్న పనులు, అందిస్తున్న సేవలలోనూ మార్పులు చేసింది. ఇప్పటివరకు అంగన్వాడీ కార్యకర్తలు చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యనందించడం, పౌష్టికాహారం సరఫరా చేయడం, బాలింతలు, గర్భిణులకు తగు సలహాలు, సూచనలు ఇవ్వడం, జనన, మరణాల సంఖ్యను నమోదు చేయడం, వ్యాధి నిరోధక టీకాలు వేయడం, ఏఎన్ఎంలతో కలిసి ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం, కుటుంబ వివరాల సేకరణ వంటి పనులు చేసేవారు. ఇకపై వారు సామాజిక కార్యకలాపాలపై కూడా దృష్టి పెట్టాలని ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది. ఆయా గ్రామాల్లో మహిళలు సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో రాణించేందుకు వీలుగా అవసరమైన శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటుచేసే బాధ్యతను కూడా అంగన్వాడీ సిబ్బందికి అప్పగించింది. అంగ న్వాడీల ద్వారా ఇస్తున్న పౌష్టికాహార పంపిణీలోనూ కొంత మార్పు చేశారు. ఈ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు ఇప్పటివరకు వారానికి రెండు గుడ్లు ఇచ్చే వారు. ఇకపై వారానికి నాలుగు గుడ్లు ఇస్తారు. అంగన్వాడీల ఆగ్రహం పని వేళలను పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం నామమాత్రంగా వేతనాలు పెంచిన ప్రభుత్వం తమతో వెట్టి చేయించుకోవాలని చూస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం 4 గంటల వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ పని చేయమని తేల్చిచెబుతున్నారు. ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలనే డిమాండ్‌తో అంగన్వాడీలు ఆందోళనకు కూడా సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఆదేశాలు జారీ చేశాం అంగన్వాడీ కేంద్రాలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటలవరకు కొనసాగించాలని ప్రభుత్వం ఇటీవలే జీఓ నెం.24 జారీ చేసింది. మారిన పనివేళలకు అనుగుణంగా కొనసాగించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశాం. అయితే పలు కారణాలతో సిబ్బంది 4గంటల వరకు పనిచేయడానికి అంగీకరించడం లేదు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. - రాణి, అంగన్వాడీ సూపర్వైజర్, కుల్కచర్ల మండలం