ప్రాణాల మీదికి తెచ్చిన ‘ప్రయోగం’ | Gelatin sticks explosion in student hands | Sakshi
Sakshi News home page

ప్రాణాల మీదికి తెచ్చిన ‘ప్రయోగం’

Published Sun, Sep 21 2014 11:34 PM | Last Updated on Wed, Apr 3 2019 3:55 PM

Gelatin sticks  explosion in student hands

 దోమ: విద్యార్థులు సరదాగా చేసిన ప్రయోగం వారి ప్రాణాల మీదికొచ్చింది. చేతిలో జిలిటెన్ స్టిక్  పేలడంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. కలకలం సృష్టించిన ఈ సంఘటన జిల్లా దోమ మండల పరిధిలోని దిర్సంపల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. క్షతగాత్రులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దిర్సంపల్లి గ్రామ సమీపంలో ఉన్న రాళ్లగుట్టల్లో క్రషర్‌ల నిర్వాహకులు తరచూ కంప్రెషర్ ద్వారా చిన్న సైజుల్లో ఉండే జిలిటెన్ స్టిక్స్ ఉపయోగించి బ్లాస్టింగ్ చేస్తూ రాళ్లు పగులగొడుతుంటారు.

జిలిటెన్ స్టిక్స్‌కు రెండు వైపులా బ్లాస్టింగ్ తీగల కనెక్షన్ ఇచ్చి వాటిని దూరంగా కలుపుతారు. అప్పుడు పేలుడు జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఈ జిలిటెన్ స్టిక్స్ పేలకుండా అలాగే ఉండిపోతాయి. ఇలా మిగిలిన కొన్ని జిలిటెన్ స్టిక్స్‌ను కొద్ది రోజుల క్రితం దిర్సంపల్లికి చెందిన 3వ తరగతి విద్యార్థి సందారం నవీన్, 7వ తరగతి విద్యార్థి చాకలి అనిల్‌లు సేకరించారు. వారికి  బ్లాస్టింగ్ తీగలు కూడా దొరకడంతో జిలెటెన్ స్టిక్‌కు వాటిని జతచేసి ఓ చిన్న రాయి కింద పెట్టి దూరంగా నిలబడి పరీక్షించారు.

 రాయి పగలడంతో విద్యార్థులు ఈ ప్రయోగం బాగుందని భావించి ఓ జిలిటెన్ స్టిక్‌ను ఇంటికి తీసుకొచ్చారు. ఆదివారం సెలవు దినం కావడంతో  నవీన్ ఇంట్లో ప్రయోగం చేసేందుకు పూనుకున్నారు. జిలిటెన్ స్టిక్‌ను నవీన్ చేతిలో పట్టుకోగా పక్కనే ఉన్న అనిల్ బ్లాస్టింగ్ తీగల ధన, రుణ ఆవేశాలను కలిపాడు. దీంతో ఒక్కసారిగా నవీన్ చేతిలో పెద్దశబ్దంతో పేలుడు జరిగింది. దీంతో విద్యార్థుల చేతులతో పాటు ముఖం, కడుపు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. పెద్దశబ్దం రావడంతో గ్రామస్తులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సరదాగా విద్యార్థులు చేసిన ప్రయోగంతో గాయపడడంతో వారి తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement