పల్లె ముంగిట్లో సాంకేతిక సౌరభాలు
దోమ: ఒకప్పుడు పట్టణాలకు, ఉన్నత కుటుంబాలకే పరిమితమైన టెక్నాలజీ వినియోగం నేడు పల్లెలకు కూడా పాకింది. విద్య, వైద్యం, ఆరోగ్యం, రవాణా, కమ్యూనికేషన్, వినోదం, ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోనూ టెక్నాలజీ నిత్య నూతనమైంది. ఆయా రంగాల్లో సాంకేతికాభివృద్ధి ఫలితంగా అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక సౌకర్యాలన్నీ మానవ జీవితాన్ని అత్యంత సుఖవంతం చేశాయి.
అదే సమయంలో వాటిని దుర్వినియోగం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతున్నాయి. ఈ కారణంగా శాస్త్ర, సాంకేతికాభివృద్ధి ఫలితంగా అందుబాటులోకి వచ్చిన సౌకర్యాలను ఎలా సద్వినియోగం చేసుకోవాలి, వాటిని దుర్వినియోగం చేస్తే ఎదురయ్యే పరిస్థితులపై ప్రజలకు అవగాహన కల్పించేందుకై ప్రతి ఏటా నవంబర్ మాసంలో 2వ గురువారాన్ని ప్రపంచ యూజబిలిటీ డేగా పాటిస్తున్నారు.
ప్రపంచ యూజబిలిటీ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏటా ఈ రోజు పలు ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతూ ప్రజలను చైతన్యవంతం చేయడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి.
పల్లె జీవన శైలి మార్చిన టెక్నాలజీ
గత కొన్నేళ్ల క్రితం వరకు పట్టణాలు,నగరాలకే పరిమితమైన టెక్నాలజీ వినియోగం నేడు పల్లెలకు కూడా పాకింది. కొన్నేళ్ల క్రితం వరకు సెల్‌ఫోన్ ఎవరిచేతిలోనైనా కనబడితే అందరూ ఆశ్చర్యంగా చూసేవారు. నేడు పల్లెల్లో సెల్‌ఫోన్ లేనిదే క్షణం గడవని పరిస్థితి. అంతేకాకుండా ప్రస్తుతం పల్లెల్లో ఇంటర్నెట్ వినియోగం కూడా గణనీయంగా పెరిగింది. పరిగి ప్రాంతాన్ని తీసుకుంటే మూడేళ్ల క్రితం కేవలం 2 ఇంటర్నెట్ కేంద్రాలు మాత్రమే అందుబాటులో ఉండేవి.
కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది. పరిగిలోనే కాకుండా దోమ, కుల్కచర్ల, గండేడ్ మండలాల్లో పెద్ద ఎత్తున ఇంటర్నెట్ కేంద్రాలు వెలిశాయి. అన్ని చోట్లా కలిపి ప్రస్తుతం 20 ఇంటర్నెట్ కేంద్రాలు కొనసాగుతున్నాయి. ఇక ఇళ్లల్లో దాదాపు 200 మంది వరకు బ్రాడ్ బ్యాండ్ సేవలను వినియోగిస్తున్నారు. నిర్మాణ రంగంలోనూ అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. శారీరక శ్రమ తగ్గిపోయి బేస్‌మెంట్ దగ్గర నుంచి చెత్తు వేసే వరకు కూడా అత్యాధునిక యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి.
విద్యా సంస్థల విషయానికొస్తే బ్లాక్‌బోర్డులకు బదులుగా ప్రస్తుతం కొన్ని చోట్ల ప్రొజెక్టర్ సౌకర్యాన్ని వినియోగిస్తున్నారు. అలాగే ఒకప్పుడు ధనవంతులకే పరిమితమైన కార్లు ప్రస్తుతం మధ్యతరగతి వారికి కూడా అందుబాటులోకి వచ్చాయి. అంతేకాకుండా పల్లెల్లో ద్విచక్రవాహనం లేని ఇళ్లు లేదని చెప్పడానికి ఎలాంటి అతిశయోక్తి అవసరం లేదు. ఇక వ్యవసాయంలోనూ కూలీల అవసరం తగ్గి మి షన్లతోనే పనులు జరుగుతున్నాయి. గతంలో వారాలు పట్టే పనిని యంత్రాలతో గంటల్లోనే ముగిస్తున్నారు.
వినియోగంలో లోపిస్తున్న విచక్షణ....
విజ్ఞాన శాస్త్రం అనేక సమస్యలు పరిష్కరించి మానవ జీవితాన్ని సుఖమయం చేసింది. కానీ మనిషి విచక్షణా లోపం వల్ల ఆ విజ్ఞానమే పర్యావరణ అసమతుల్యత, పరిసరాల కాలుష్యానికి దారి తీస్తోంది. ఉదాహరణకు సోషల్‌నెట్‌వర్కింగ్‌తో పరిచయాలు పాత స్నేహితులను కలుసుకోవచ్చు. అదే సోషల్‌నెట్‌వర్క్‌ను కొందరు దుర్వినియోగం చేస్తుండటంతో వస్తున్న పెద్ద పెద్ద సమస్యల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.
అదే విధంగా సెల్‌ఫక్షన్ సిగ్నల్స్‌తో కొన్ని రకాల పక్షులు ఇప్పుడు పల్లెల్లో కూడా కనుమరుగవుతున్నాయి. ఇక ఆండ్రాయిడ్ ఫోన్‌లు వచ్చినప్పటి నుంచి సహచరులతో మాట్లాడటం తగ్గించి ఫోన్‌లతోనే కాలక్షేపం చేస్తుండటంతో సంబంధబాంధవ్యాలు దెబ్బతింటున్నాయి. మానవుడు తన పరిజ్ఞానాన్ని సరైన మార్గంలో వినియోగించి సృష్టి ఔన్నత్యానికి పాటు పడాలే గానీ సృష్టి వినాశనానికి కాదని గుర్తుపెట్టుకోవాల్సిన విషయం.