the Internet
-
ధ్రువపత్రం.. బహు భద్రం
జిల్లాలో డిజిటల్ లాకర్ అమలుకు కలెక్టర్ కసరత్తు ప్రతి యూజర్‌కు 10 ఎంబీ స్పేస్ కేటాయింపు జనన ధ్రువీకరణ ప్రతం నుంచి పాస్‌పోర్ట్ వరకు అన్నీ లాకర్లో నిక్షిప్తం విజయవాడ : ఇప్పుడంతా డిజిటల్ యుగం. అన్ని పనులూ కంప్యూటర్, ఇంటర్నెట్లోనే అయిపోతున్నాయి. దీన్ని ప్రజలు ఆచరిస్తున్నా, లేకపోయినా సర్కారు మాత్రం పాటిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న డిజిటల్ లాకర్ విధానాన్ని జిల్లాలోనూ అమలు చేయాలని కలెక్టర్ బాబు ఎ. నిర్ణయించారు. బహుళ ప్రయోజనకారిగా ఉపయోగపడే డిజిటల్ లాకర్‌పై విస్తృత ప్రచారం చేయడంతోపాటు ప్రజలకు అవగాహన పెంచి అందరూ డిజిటల్ ఖాతాలు ప్రారంభించే దిశగా అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే కలెక్టర్ దీనిపై అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. డిజిటల్ లాకర్ అంటే.. డిజిటల్ లాకర్లో ఒక వ్యక్తికి సంబంధించిన జనన ధ్రువీకరణ పత్రం నుంచి పాస్‌పోర్ట్ వరకు అన్ని విలువైన పత్రాలను స్టోర్ చేసుకోవచ్చు. అంటే పదో తరగతి మార్కుల జాబితా, ఇంటర్, డిగ్రీ సర్టిఫికెట్లు, ఆధార్, పాన్ కార్డు.. ఇలా అన్ని రకాల సర్టిఫికెట్లను స్కాన్ చేసి డిజిటల్ లాకర్లో స్టోర్ చేసుకోవచ్చు. ప్రతి లాకర్‌కు 10 ఎంబీ స్పేస్‌ను కేటాయిస్తారు. ఇది బహుళ ప్రయోజనకారిగా ఉపయోగపడుతుంది. జ్ట్టిఞ//ఛీజీజజీౌ్ట్చఛిజ్ఛుట.జౌఠి.వెబ్‌సైట్‌ను కేంద్ర ప్రభుత్వ ఐటీ మంత్రిత్వ శాఖ దీన్ని నిర్వహిస్తోంది. ఎలా పొందాలి.. డిజిటల్ లాకర్ పొందాలనుకునే ప్రతి ఖాతాదారు ఈ వైబ్సైట్లోకి వెళ్లి ఒక యూజర్ నేమ్, పాస్ట్‌వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆధార్ నంబర్‌ను యాడ్ చేయాలి. అప్పుడు ఖాతాదారుడికి 10 ఎంబీస్పేస్ను ఈ వెబ్సైట్ కేటాయిస్తుంది. సగటున 10 ఎంబీ స్పేస్‌లో దాదాపు 20కి పైగా స్కాన్ చేసిన సర్టిఫికెట్లను స్టోర్ చేయవచ్చు. వాటిని అవసరానికి అనుగుణంగా ఉపయోగించవచ్చు. అలాగే స్కాన్ చేసిన ప్రతి సర్టిఫికెట్ డిజిటల్ కాపీ కూడా వెబ్సైట్లోనే తయారవుతుంది. దీనిలోనే డిజిటల్ సంతకాలు కూడా చేసుకునే వీలుంది. తద్వారా ఏ అవసరానికైనా సర్టిఫికెట్లు జిరాక్స్‌లు సమర్పించకుండా డిజిటల్ లాకర్లోకి వెళ్లి సర్టిఫికెట్‌కు ఉన్న లింకర్‌ను పంపితే చాలు. అది అక్కడ సర్టిఫికెట్ రూపంలో ప్రింట్ వస్తుంది. ముఖ్యంగా కళాశాల, పాఠశాలల విద్యార్థులకు, ప్రభుత్వ ఉద్యోగులకు బాగా ఉపయోగపడుతుంది. భవిషత్తులో సర్టిఫికెట్లు పొరపాటున పోయినా డిజిటల్ లాకర్లో స్టోర్ అయి ఉంటాయి కాబట్టి ఎన్ని ప్రింట్లయినా తీసుకోవచ్చు. ఇతర రాష్ట్రాల్లో బాగా వినియోగం ఈ డిజిటల్ లాకర్ విధానం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మినహాదాదాపు అన్ని రాష్ట్రాల్లో అమలులో ఉంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 58,220 డిజిటల్ లాకర్లు ఉండగా వాటిలో 52,109 పత్రాలు స్టోర్ చేశారు. ముఖ్యంగా గుజరాత్లో 9494, ఉత్తరప్రదేశ్‌లో 8235, మహరాష్ట్రలో 6071 మంది దీనిని వినియోగిస్తున్నారు. రాష్ట్ర రాజధాని కావడంతో దీనిని జిల్లాలో సీరియస్‌గా అములు చేయాలని కలెక్టర్ బాబు ఎ. నిర్ణయించారు. దీని పర్యవేక్షణ బాధ్యతను ఈ-ఆఫీసర్స్, నిట్ అధికారులు, ముఖ్య ప్రణాళికాధికారులకు అప్పగించారు. జిల్లావాసులంతా దీనిని వినియోగించేలా అవగాహన కల్పించాలని నిర్ణయించారు. -
మోటో నుంచి 4జీ ఫోన్ వస్తోంది!
ఇప్పటివరకూ మన దేశంలో 3జీ సేవలే సంపూర్ణస్థాయిలో అందుబాటులోకి రాలేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్నది 2జీ ఇంటర్నెట్ సేవలే. అయితే స్మార్ట్‌ఫోన్ కంపెనీలు మాత్రం ఈ విషయంలో చాలా వేగంగా ముందడుగులు వేస్తున్నాయి. త్వరలోనే మోటో వాళ్ల నుంచి 4జీ స్మార్ట్‌ఫోన్ రానున్నది. ఇటీవల మోటో- ఇ సెకెండ్ జనరేషన్ ను విడుదల చేసిన ఈ కంపెనీ త్వరలోనే నాలుగోతరం ఇంటర్నెట్ సేవలను అందిపుచ్చుకోగల డివైజ్‌లను ఆవిష్కరించనున్నట్టుగా ప్రకటించింది. అయితే ఈ ఫోన్ ధర తదితరాలను పేర్కొనలేదు. అన్ని వివరాలనూ త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. -
ఎవరీ ఐరన్‌మ్యాన్?
మీరు ఇంటర్నెట్లో డబ్బు చెల్లించేందుకు పే పాల్‌ను ఉపయోగించినా, హాలీవుడ్ సినిమా ఐరన్మ్యాన్ను చూసి ఉన్నా ఎలన్మ్స్క్ మీకు చిరపరిచితుడే. పేపాల్ సృష్టికర్తగానే కాకుండా ఐరన్‌మ్యాన్ సినిమా ఈయన జీవిత కథ ఆధారంగానే తీశారని టాక్. ఈ 43 ఏళ్ల యువ మేధావి పే పాల్ తరువాత అనేక కొత్త సంస్థలు ఏర్పాటు చేశాడు. స్పేస్ ఎక్స్ కంపెనీ ద్వారా ప్రపంచంలోనే తొలి ప్రైవేట్ రాకెట్ తయారీ సంస్థను ఏర్పాటు చేశాడు. స్పేస్ ఎక్స్ తయారు చేసిన ఫాల్కన్ 1, ఫాల్కన్ 9 రాకెట్లు నాసా తరఫున అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సరుకులు రవాణా చేశాయి. దీంతోపాటు అమెరికాలోనే రెండో అతిపెద్ద సౌరశక్తి కంపెనీ ‘సోలార్ సిటీ’ వెనుక, ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన, అత్యధిక మైలేజీనిచ్చే ఎలక్ట్రిక్ కార్లు తయారు చేసే ‘టెస్లా’ కంపెనీ యజమానిగా మస్క్ గుర్తింపు పొందారు. మస్క్ ఫౌండేషన్ ద్వారా పసిపిల్లల వైద్యం కోసం, భూతాపోన్నతిని తగ్గించేందుకు సంప్రదాయేతర ఇంధనవరులను ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తూ తన దాతృత్వాన్ని చాటుతారు మస్క్! -
విద్యార్థుల కోసం ప్రపంచ కథాసాహిత్యం
విద్యార్థుల చేతుల్లోంచి సెల్‌ఫోన్ లాగి పక్కన పెట్టాలి. ఇంటర్నెట్ కేఫుల్లో గంటల తరబడి చూసే అక్కరలేని సైట్ల చెర నుంచి విడిపించాలి. ఏది మంచి ఏది చెడు విడమర్చి చెప్పే స్నేహితుణ్ణి పరిచయం చేయాలి. బావి నుంచి బయట పడేసి విశాలమైన సముద్రంలో ముంచి తీయాలి. వ్యక్తిత్వం అలవర్చాలి. సంస్కారం నూరిపోయాలి. విలువల కోసం నిలబడేలా చేయగలగాలి. ఇందుకు మార్గం? సాహిత్యమే. గతంలో పాఠకుల కోసం, స్కూలు విద్యార్థుల కోసం అనేక పుస్తకాలు వెలువరించిన సాకం నాగరాజ తాజాగా కాలేజీ విద్యార్థుల కోసం ప్రపంచ కథా సాహిత్యాన్ని ఒక చోట చేర్చి పుస్తకంగా వెలువరించారు. అమ్మడానికి కాదు. పంచి పెట్టడానికి. పది మంది చదివి ఇద్దరు అందుకున్నా చూసి సంతోష పడటానికి. జీవితంలో పైకొచ్చినవారంతా ఏదో ఒక దశలో పుస్తకాలను ఆలంబనగా చేసుకున్నవారే. మన పిల్లలకు ఇప్పటి నుంచే ఎందుకు వాటిని అలవాటు చేయకూడదు? ఇది సాకం ఆలోచన. నోబెల్ ప్రైజ్ అందుకున్న ఆలిస్ మన్రో, బెర్నార్డ్ షా, పెర్ల్ ఎస్.బక్, హెమింగ్వే, కామూ, సార్త్,్ర మార్క్వెజ్, ఆక్టేవియో పాజ్ తదితరుల కథలతో పాటు నోబెల్ ప్రైజ్ రాకపోయినా అంతకు ఏ మాత్రం తక్కువ కాని మార్క్ టై్వన్, ఎడ్గార్ అలెన్ పో, దోస్త్విస్కీ, టాల్‌స్టాయ్, ఓ.హెన్రీ, మాక్జిం గోర్కి, జాక్ లండన్... వీళ్లందరి కథలూ ఉన్నాయి. లెక్చరర్లు, ప్రిన్సిపాళ్లు దీనిని పరిశీలించి విద్యార్థులకు చేరవేయదగ్గ పుస్తకం ఇది. ప్రపంచ కథా సాహిత్యం; సంకలనం: సాకం నాగరాజ, వాకా ప్రసాద్; వెల: ఉచితం; ప్రతులకు: 94403 31016 (జనవరి 11 ఆదివారం ఉదయం తిరుపతిలో ఈ పుస్తకం ఆవిష్కరణ జరగనుంది. వేదిక: సబ్‌రిజిస్ట్రార్స్ అతిథిగృహం) -
పుస్తకం... ప్రియనేస్తం
చదువరి చెంతకు పుస్తకరాజం బహుభాషల భాగ్యనగరిలో బుక్‌ఫెయిర్‌కు అపూర్వ ఆదరణ పాఠకుడి వద్దకు పయనమైన ‘వట్టికోట’ మూడుపదులకు చేరువైన పుస్తక ప్రదర్శన హైదరాబాద్ బుక్‌ఫెయిర్...మూడు దశాబ్దాలుగా చదువరి చెంతకే సాగుతున్న పుస్తక లోకమిది. విభిన్న సంస్కృతులు, బహుభాషలకు నిలయమైన భాగ్యనగరంలో ఏటేటా పుస్తకం వేడుక చేసుకుంటూనే ఉంది. లక్షలాదిగా తరలి వచ్చే పాఠక మహాశయుల జ్ఞానదాహార్తిని తీరుస్తూనే ఉంది. ఎనిమిదో దశాబ్దంలో మొదలై 28 ఏళ్లుగా అప్రతిహాతంగా కొనసాగుతున్న పుస్తకప్రదర్శనకు మొదటి నుంచి పాఠకులు బ్రహ్మరథం పడుతున్నారు. వైవిధ్యభరితమైన భాగ్యనగర సంస్కృతిని, విభిన్న జీవన శైలులను సమున్నతంగా ఆవిష్కరించే వివిధ భాషల పుస్తకాలకు అపూర్వ ఆదరణ లభిస్తోంది. సామాజిక మాధ్యమాలు, ఇంటర్నెట్లు, స్మార్ట్ఫోన్లు రాజ్యమేలుతున్న ప్రస్తుత తరుణంలో ప్రతి రోజు వేలాది మంది పుస్తక ప్రియులు తమకు నచ్చిన పుస్తకం కోసం తరలి రావడమే ఇందుకు నిదర్శనం. బాలల సాహిత్యం, ఆధ్యాత్మికం, వ్యక్తిత్వ వికాసం, వైద్యం, ఆరోగ్యం వంటి వివిధ రంగాలకు చెందిన పుస్తకాలతో పాటు, చరిత్ర, సాహిత్యం, ప్రముఖుల జీవిత చరిత్ర గ్రంథాలపై పాఠకులు మక్కువ చూపుతున్నారు. బుక్‌ఫెయిర్ సందర్భంగా నగరంలో పుస్తక ప్రదర్శన చారిత్రక నేపథ్యంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. సిటీబ్యూరో : హైదరాబాద్ నగరంలో 1980లలో పుస్తక ప్రదర్శన ప్రారంభమైనప్పటికీ అంతకుముందే పుస్తకాన్ని పాఠకుడి దగ్గరకు తీసుకొని వెళ్లే సంప్రదాయానికి రచయిత, ప్రచురణకర్త వట్టికోట ఆళ్వారుస్వామి శ్రీకారం చుట్టారు. పుస్తకాలన్నింటినీ ఒక దగ్గరకు చేర్చి ప్రదర్శించాలనే ఆలోచనకు తావులేని రోజుల్లో ఆయన తాను ముద్రించిన పుస్తకాలను నెత్తిన పెట్టుకొని పాఠకుల ద గ్గరకు వెళ్లారు. ఇదంతా 1938 నాటి సంగతి. ఆ సంవత్సరం సికింద్రాబాద్‌లో ‘దేశోద్ధారక గ్రంథమాలను’ ప్రారంభించిన వట్టికోట ఆ సంస్థ నుంచి 100 పుస్తకాలను ప్రచురించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 1948 నాటికి సుమారు 50 పుస్తకాలను ముద్రించారు. 1948లో అరెస్టై ఐదేళ్ల పాటు జైలు జీవితం గడిపారు. బయటకు వచ్చాక తాను చనిపోయే(1961) వరకు పలు పుస్తకాలను ముద్రించారు. నిజానికి నగరంలో నిజాంల కాలం నుంచే పుస్తకాలకు ఆదరణ ఉంది. అధికార భాష ఉర్ధూతో పాటు తెలుగు, మరాఠా, కన్నడం భాషలకు చెందిన ప్రజలతో పాటు హిందీ, ఇంగ్లీష్ పుస్తకాలు బాగా చదివే ప్రజలు కూడా మొదటి నుంచీ ఉన్నారు. పాఠకుల అభిరుచికి తగిన విధంగానే పుస్తక ప్రచురణ సంస్థలు, విక్రయ సంస్థలు ఆవిర్భవించాయి. కోఠీలోని బడీచౌడీ ఒక పుస్తక బజార్‌గా వెలుగొందింది. ఈ బడిచౌడీ బుక్ సెల్లర్సే హైదరాబాద్ బుక్ ఫెయిర్‌కు శ్రీకారం చుట్టారు. విశాలాంధ్ర, ప్రజాశక్తి, మిళింద ప్రకాశన్, ఎమెస్కో, నవోదయ సంస్థలు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇతోధిక కృషి కొనసాగిస్తూనే ఉన్నాయి. నేషనల్ బుక్ ట్రస్టు కృషి... నగరంలోని పుస్తక ప్రచురణ సంస్థలు, విక్రయ సంస్థల ఆకాంక్షలను నేషనల్ బుక్‌ట్రస్టు పరిపూర్తి చేసింది. నేషనల్ బుక్ ట్రస్టు ఇక్కడి సంస్థలతో కలిసి 986 ప్రాంతంలో ‘హైదరాబాద్ బుక్ ఫెయిర్’ను కేశవ మొమోరియల్ స్కూల్ మైదానంలో మొదటిసారి ఏర్పాటు చేశారు. ఆ తర్వాత నగరంలోని పలు ప్రాంతాల్లో పుస్తక ప్రదర్శనలు జరుగుతూనే ఉన్నాయి. కథలు, నవలలు, గుల్ఫికలు, చరిత్ర గ్రంథాలదే ఇక్కడ అగ్రస్థానం. చలం, బుచ్చిబాబు, కొడవటిగంటి కుటుంబరావు, గోపీచంద్, వట్టికోట, విశ్వనాథ సత్యనారాయణ, షేక్స్పియర్, సోమర్సెట్ మామ్, యద్ధనపూడి, మాదిరెడ్డి, కొమ్మూరి వేణుగోపాల్‌రావు వంటి ప్రముఖుల గ్రంథాలను పాఠకులు ఎక్కువగా ఇష్టపడ్డారు. సోవియెట్ సాహిత్యం కూడా బాగా ప్రభావితం చేసింది. క్రమంగా ప్రముఖుల జీవిత చరిత్రలు, పంచతంత్ర వంటి పిల్లల పుస్తకాలు ఆదరణ పొందాయి. ‘మహాత్మాగాంధీ ఆత్మకథ’ వంటి గ్రంథాలు అప్పటి నుంచి ఇప్పటి వరకు లక్షలాది మంది పాఠకులను ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. ప్రత్యేక కార్యక్రమాలు... ఈ నెల 21న ఎమెస్కో పుస్తక ఆవిష్కరణ 22న రాజకీయ పార్టీల నేతలతో చర్చా కార్యక్రమం 23న పత్రికా సంపాదకుల సమావేశం 24న పుస్తకావిష్కరణ, జయరాజ్ పాటల కార్యక్రమం 25న సైన్స్ డ్రామా 26న ముగింపు, స్పీకర్ మధుసూధనాచారి హాజరు. పిల్లలను చదివించండి ప్రపంచీకరణ తరువాత జీవన వేగం బాగా పెరిగింది. నవలలు,కథలు వంటి పుస్తకాలకు కొద్దిగా ఆదరణ తగ్గినప్పుటికీ మిగతా వాటికి బాగానే ఉంది. అయితే ఇప్పటి పిల్లలు ఫేస్‌బుక్‌లు, స్మార్ట్ఫోన్లకు పరిమితమైపోవడమే బాధగా ఉంది. పిల్లల్ని చదివించాలి.తల్లిదండ్రులు బాధ్యతగా ఆ పని చేయాలి.సామాజిక చైతన్యాన్ని ఇచ్చేవి, జ్ఞానాన్ని కలిగించేవి, ఉన్నతమైన విలువలను బోధించే పుస్తకాలను తప్పనిసరిగా చదివించాలి. - లలితా జోషి ( మొట్టమొదటి హైదరాబాద్ బుక్‌ఫెయిర్ కమిటీ సభ్యురాలు) -
‘లాంతరు’తో నెట్ వెలుగులు...
జేబులోకి ఇమిడిపోతుంది ఇది. చిన్నదేనని చిన్నచూపు చూసేరు సుమీ! చాలా శక్తిమంతమైంది. ప్రపంచంలోని ఏ మూలకైనా ఇంటర్నెట్ను చేరవేస్తుంది. చదువు చెబుతుంది.. సమాచారం అందిస్తుంది. ఆపత్కాలాల్లో ఆదుకుంటుంది కూడా! దీని పేరు... లాంటెర్న్! ప్రపంచ జనాభా 700 కోట్లు దాటిపోయిందిగానీ... ఇన్ఫర్మేషన్ ఈజ్ పవర్ అని అనుకంటున్న ఈ రోజుల్లోనూ ఇంటర్నెట్ సౌకర్యం లేని వారి సంఖ్య దాదాపు 430 కోట్లు ఉందంటే ఆశ్చర్యం వేస్తుంది. ఈ డిజిటల్ డివైడ్‌ను తగ్గించేందుకు వీలైతే పూర్తిగా తొలగించే లక్ష్యంతో మొదలైన ప్రాజెక్టు ఫలితమే ఈ ‘లాంటెర్న్’. ఫొటో చూశారుగా... చిన్నపాటి డబ్బీ మాదిరిగా ఉంటుందిగానీ... దీంట్లోని హైటెక్ హంగులు అన్నీ ఇన్నీ కావు. ఔటర్‌నెట్ ప్రాజెక్టు ద్వారా ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యే వెబ్‌పేజీలు, వీడియోలు, ఇతర సమాచారాన్ని ఇది ఉపగ్రహాల నుంచి నేరుగా గ్రహిస్తూంటుంది. ఫలితంగా సెల్‌ఫోన్ టవర్లు ఉన్నా లేకున్నా, కేబుల్ కనెక్షన్లతో నిమిత్తం లేకుండా ప్రపంచంలో ఏమూలనున్నా రేడియోతరంగాల రూపంలో ఇంటర్నెట్ సౌకర్యం పొందవచ్చునన్నమాట. ఔటర్‌నెట్ ప్రాజెక్టు... లాంటెర్న్ గురించి తెలుసుకునే ముందు డిజిటల్ డివైడ్‌ను తగ్గించేందుకు చేపట్టిన ఔటర్‌నెట్ ప్రాజెక్టు గురించి తెలుసుకోవడం ఎంతైనా అవసరం. 1995లో ఇద్దరు ఔత్సాహిక శాస్త్రవేత్తలు ఏర్పాటు చేసిన స్వచ్ఛంద సంస్థ ఈ ఔటర్‌నెట్. భూస్థిర, లోయర్ ఎర్త్ కక్ష్యల్లోని ఉపగ్రహాల ద్వారా వరల్డ్‌వైడ్ వెబ్ సమాచారాన్ని అందరికీ అందించాలన్నది ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ ఏడాది ఆగస్టు 11న ఔటర్‌నెట్ తొలిసారి ఉపగ్రహాల ద్వారా సమాచారాన్ని అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం రోజుకు 200 మెగాబైట్ల సమాచారాన్ని ప్రసారం చేస్తూన్నారు. వచ్చే ఏడాదికల్లా రోజుకు ఒక గిగాబైట్... అంతిమంగా కనీసం వంద గిగాబైట్ల సమాచారాన్ని ప్రసారం చేయాలన్నది ఔటర్‌నెట్ లక్ష్యం. కొద్దిపాటి ప్రోగ్రామింగ్ మెళకువలు ఉన్న వారు ఔటర్‌నెట్ ప్రసారాలను అందుకునేందుకు అవసరమైన వ్యవస్థలను స్వయంగా తయారు చేసుకోవచ్చు. రేడియో సంకేతాలను అందుకునేందుకు ఉపయోగించే యాంటెన్నాతోపాటు ఒక రిసీవర్ తదితర పరికరాలుంటాయి ఈ వ్యవస్థలో. ఇది కాకుండా మొబైల్ ఫోన్ల ద్వారా కూడా నెట్ సమాచారాన్ని ఉచితంగా పొందేందుకు రూపొందించిన వినూత్న పరికరమే... లాంటెర్న్! ప్రస్తుతానికి పరిమితంగానే... లాంటెర్న్ ద్వారా ప్రస్తుతానికి ఇంటర్నెట్ సమాచారం మొత్తం అందడం లేదు. ముఖ్యమైన కొంత సమాచారాన్ని మాత్రం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసి ప్రసారం చేస్తున్నారు. అంతర్జాతీయ వార్తలతోపాటు రైతులకు ఉపయోగపడేందుకు వేర్వేరు ప్రాంతాల్లోని వ్యవసాయ ఉత్పత్తుల ధరల వివరాలు అందిస్తున్నారు. వీటితోపాటు అత్యంత పేదదేశాల్లోని పాఠశాల విద్యార్థులకు చదువు చెప్పేందుకు టీచర్స్ వితౌట్ బార్డర్స్ రూపొందించిన సమాచారాన్ని కూడా ప్రసారం చేస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు, సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు అవసరమైన ఏర్పాట్లున్నాయి. అంతేకాకుండా కొన్ని రకాల ఉచిత సాఫ్ట్వేర్లు, సినిమాలు, సంగీతం, ఆటలు, వికీపీడియాలు కూడా ఉన్నాయి ఈ ఔటర్‌నెట్ కంటెంట్‌లో. ఇవేకాకుండా... లాంటెర్న్కున్న మరికొన్ని ప్రత్యేకతలు ఏమిటంటే... ఉపగ్రహల నుంచి ప్రసారమయ్యే సమాచారాన్ని అందుకునే అతి చిన్న వ్యవస్థ ఇది. అన్ని రకాల ఫైళ్లను అందుకోగలదు. వైఫై హాట్‌స్పాట్‌గా పనిచేస్తుంది. వైఫై ఆధారిత గాడ్జెట్స్ అన్నింటికీ సమాచారాన్ని ప్రసారం చేయగలదు. సోలార్ ప్యానెల్స్ ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేసుకుంటుంది. స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్‌లను ఛార్జ్ చేసుకోవచ్చు. ప్రపంచబ్యాంకు ఇప్పటికే ఈ ప్రాజెక్టు ద్వారా సూడాన్‌లో, ఐరిక్స్ అనే సంస్థ నమీబియాలోనూ లాంటెర్న్ ద్వారా సమాచార ప్రసారాలకు ఏర్పాట్లు చేశారు. మీరు ఓ చేయి వేయవచ్చు... లాంటెర్న్ ప్రాజెక్టు ద్వారా మీరు కూడా కొంతమందికి నెట్ వెలుగులు అందించాలనుకుంటున్నారా? అయితే వీరి ఇండిగోగో (ఐఛీజ్ఛీజౌజౌ) పేజీకి వెళ్లండి. దీంట్లో మీరు ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలతోపాటు మీరు ఎంత మొత్తం సాయం చేస్తే... ఏ రకమైన చిరుకానుకలు అందుతాయన్న వివరాలు ఉన్నాయి. వచ్చే ఏడాది జూలై నాటికి ప్రపంచవ్యాప్తంగా సమాచార ప్రసారాలతోపాటు, లాంటెర్న్లను కూడా అందుబాటులోకి తెచ్చేందుకు ఔటర్‌నెట్ ప్రయత్నాలు చేస్తోంది. -
ఇదేనా.. ఈ- పంచాయ(యి)తీ
అమలుకు ఆమడదూరం కొన్ని పంచాయతీలకు ఇంటర్నెట్ సౌకర్యం నిల్ సర్టిఫికెట్లు ఇవ్వలేని తీరు ప్రస్తుతం అకౌంట్ల నమోదుకే పరిమితం 970కు గానూ... 344 పంచాయతీలకే.... జనన మరణ ధ్రువీకరణ పత్రాలను సకాలంలో ప్రజలకు అందించాలనే సదుద్దేశంతో...ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ‘ఈ పంచాయతీ’ బాలారిష్టాలు దాటలేదు. నాలుగు నెలల క్రితమే ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టినప్పటికీ... మొదటి దశ పంచాయతీలే ఇంకా పూర్తి స్థాయిలో సేవలందించలేకపోతున్నాయి. ప్రతి పత్రం ఆన్లైన్ ద్వారా అందిస్తామని చెప్పిన అధికారులు... ఇప్పటి వరకు కొన్ని పంచాయతీలకు ఇంటర్నెట్ సౌకర్యమే కల్పించలేదు. దీంతో ఆపరేటర్లు ఖాళీగా ఉంటూ వేతనాలందుకుంటున్నారు. గుడివాడ : గ్రామ పంచాయతీల్లో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈపంచాయతీలు అలంకార ప్రాయంగా మారాయి. ఈ పంచాయతీ ద్వారా ధ్రువీకరణ పత్రాల జారీకి కావాల్సిన సాఫ్టు వేర్‌ను ఇంతవరకు రూపొందించలేదని తెలుస్తోంది. ఒక్కో పంచాయతీకి రూ.1.50లక్షల వ్యయంతో కంప్యూటర్, స్కానర్, ప్రింటర్, యూపీఎస్, బ్రాడ్‌బ్యాండు సౌకర్యం కల్పించారు. అయితే కొన్ని చోట్ల బీఎస్ఎన్ఎల్ బ్రాండ్ బ్యాండు అందుబాబులో లేకపోవటంతో పంచాయతీల్లో ఏర్పాటు చేసిన కంప్యూటర్లకు పని లేకుండాపోయింది. జిల్లాలో 546 ఈ-పంచాయతీలు... సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ప్రజలకు మేలైన పాలన అందించే పేరుతో ఈఏడాది జూలైలో ఈ- పంచాయతీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. జిల్లాలో 970 గ్రామ పంచాయతీలుండగా... వాటిలో క్లష్టర్ పంచాయతీలుగా ఉన్న 546 గ్రామ పంచాయతీల్లో ఈ- పంచాయతీ సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు. అయితే 362 గ్రామ పంచాయతీల్లోనే కంప్యూటర్లు ఏర్పాటు చేసి తాత్కాలిక పద్ధతిపై ఆపరేటర్లను నియమించారు. ఇంకా 184 క్లష్టర్ పంచాయతీల్లో ఇందుకు సంబంధించిన పనులు నత్తనడకన సాగుతున్నాయని పంచాయతీ సర్పంచులు చెబుతున్నారు. ఇంటర్నెట్ బ్రాండ్ బ్యాండ్ ఇక్కట్లు.... ఈ- పంచాయతీలకు ఇంటర్నెట్ సౌకర్యం అందించేందుకు బీఎస్ఎన్ఎల్ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే జిల్లాలో ఇప్పటి వరకు ఏర్పాటుచేసిన 362 గ్రామ పంచాయతీల్లో దాదాపు 20చోట్ల ఇంటర్నెట్ సౌకర్యంలేక కంప్యూటర్లు పనిచేయడంలేదు. క్లష్టర్ పంచాయతీకి దగ్గర్లో ఉండి నెట్ సౌకర్యం ఉన్న పం చాయతీల్లోకి కంప్యూటర్లు మార్చుకోవాలని జిల్లా పంచాయతీ అధికారులు సూచించారు. దీంతో గుడివాడ రూరల్ మండలంలోని సీపూడి, రామనపూడి పంచాయతీల్లోని కంప్యూటర్లును వేరో పంచాయతీకి మారుస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ధ్రువీకరణ పత్రాల సాఫ్ట్వేర్ ఏదీ?... ఈ- పంచాయతీల నిర్వాహణ పంచాయతీరాజ్ ఇనిస్టిట్యూషనల్ అకౌంటింగ్ (పీఆర్ఐఏ) సాఫ్ట్వేర్ ద్వారా కొనసాగుతోంది. ప్రస్తుతం అన్ని పంచాయతీల్లో 2011నుంచి ఉన్న అకౌంట్స్‌ను ఆన్లైన్ చేస్తున్నారు. జమా ఖర్చులు బిల్లులు వంటివి కంప్యూటర్లో నిక్షిప్తం చేస్తున్నారు. దీని ద్వారా ఏఏ పంచాయతీ ఏపనికి ఎంత బిల్లు చెల్లించిందో ఆన్లైన్ ద్వా రా తెలుస్తుంది. ఈ- పంచాయతీ ద్వారా జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, ఆస్తి విలువ పత్రాలు, ఆస్తిపన్ను వసూళ్ల ఎంట్రీలు, వివిధ శాఖల డేటా ఎంట్రీలు, చేయాల్సి ఉంది. నాలుగు నెలలు దాటినా ఈ తర హా సేవలు ఎక్కడా ప్రారంభించలేదు. నెలరోజుల్లో అన్ని సేవలు అందిస్తాం.. మరో నెల రోజుల్లో ఈ-పంచాయతీల్లో అన్ని సేవ లూ అందిస్తాం. ఇప్పటికే కంప్యూటర్ ఆపరేటర్లను నియమించి వారికి శిక్షణ ఇచ్చాం. బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ అందుబాటులో లేని చోట్ల వేరే ప్రాంతానికి కం ప్యూటర్లు మారుస్తున్నాం. ఇకపై ప్రపంచంలో ఎక్క డ ఉన్నా వారి జనన మరణ ధ్రువీకరణ పత్రాలు పొందే అవకాశం ఉంది. రెండవ ఫేజ్‌లో అన్ని పంచాయతీలను ఈ-పంచాయతీలుగా మారుస్తాం. - వరప్రసాద్, డీఎల్పీవో, గుడివాడ. -
ఇంటర్నెట్లో విహారం..
తల్లిదండ్రులకు సూచనలు.. పిల్లలను తల్లిదండ్రులు ఎల్లప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలి. వారి సంతోషాలు, బాధలను గుర్తించాలి. ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నారంటే అప్రమత్తమై వారితో మాట్లాడి వారి సమస్య ఏమిటో గుర్తించి పరిష్కరించాలి. అధిక సమయం ఇంటర్నెట్, ఫేస్బుక్ చాటింగ్‌లో ఉన్నారని తెలిస్తే వారికి ప్రేమగా నచ్చజెప్పాలి. చిన్నపిల్లలను ఈ సాంకేతిక మాయాజాలంలోకి తీసుకరాకపోవడమే మంచిది. అవసరం మేరకే వినియోగించుకునేలా చూడాలి. బోర్ కొట్టిందంటే చాలు.. ప్రస్తుతం సెల్‌ఫోన్ లేని వారు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. ప్రతీ మనిషి ఒక రోజు కనీసం అర గంట నుంచి ఆరు గంటలపాటు సెల్ఫోన్లో మాట్లాడుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోవడంతో దానిపై ఆధారపడక తప్పడం లేదు. ఇది కాస్త శ్రుతిమించడంతోనే అసలు సమస్య మొదలవుతుంది. కాస్త బోర్ కొట్టిందంటే చాలు సెల్‌ఫోన్ బయటకు తీసి ఇంటర్నెట్, ఫేస్బుక్, వాట్సప్‌లో గంటలు గడిపేస్తున్నారు. వినియోగానికి అనుగుణంగా నెట్వర్క్ కంపెనీలు కాల్ రేట్లు తగ్గిస్తూ.. తక్కువ నగదుకు ఇంటర్నెట్లో సేవలు అందిస్తున్నాయి. ఆండ్రాయిడ్ సెల్‌ఫోన్ ఉన్నవారైతే వాటిని మురిపెంగా చూసుకుంటున్నారు. చిన్నపిల్లలు సైతం సెల్‌పోన్ వినియోగానికి అలవాటు పడుతున్నారు. ఒక్కసారిగా.. బంధం తెగిపోతే.. ఫేస్బుక్ చాటింగ్ సానబట్టిన కత్తి లాంటిది. తొలినాటి నుంచే తన ప్రభావం చూపిస్తుంది. దాన్ని ఉపయోగించుకునే తీరును బట్టే మన విజయాలు ఆధారపడి ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య సరైన బంధం లేని కారణంగా.. ఎంతోమంది ఫేస్‌బుక్‌పై ఆధారపడుతున్నారు. పిల్లలు ఏమాత్రం దిగులుగా ఉంటున్నా.. పరధ్యానంలో ఉన్నా గ్రహించాలి. తల్లిదండ్రులు వారిని ప్రేమతో దగ్గరకు తీసుకుని మాట్లాడాలి. వారిగోడు వినాలి. వీలైతే ఆ సమస్యను పరిష్కరించాలి. తెల్లవారముందే సందేశాలు.. త్రీజీ సేవలు అందుబాటులోకి రావడంతో వినియోగం మరింతగా పెరిగిపోయింది. తెల్లవారకముందే వాట్సప్, ఫేస్బుక్, ఇతర సామాజిక సైట్లలో గుడ్మార్నింగ్లు చెప్పేసుకుంటున్నారు. వారి అభిప్రాయాలు, అనుభూతులు, చిత్రాలు ఇతరులతో పంచుకుంటున్నారు. ఇంతవరకు పర్వాలేదు. కానీ.. అసలు సమస్య మొదలయ్యేది అక్కడే. గంటల కొద్దీ చాటింగ్ చేయడం, రాత్రివేళల్లో ఆలస్యంగా నిద్రపోవడంతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అవసరం ఉన్నంత మేరకే.. యువతతోపాటు పెద్దలూ సరదా కోసమంటూ చాటింగ్‌లో ఊబిలోకి దిగుతున్నారు. ఫేస్బుక్లో అవసరం ఉన్నా.. లేకపోయినా వచ్చిన ప్రతి లైక్‌కు రిప్లయిలిస్తూ.. 60 శాతం అనవసర పరిచయాలు పెంచుకుంటున్నారు. ఇక్కడి నుంచే అసలు సమస్యలు ప్రారంభమవుతాయి. ఆదిలోనే వీటిని అరికడితే మంచిది. తల్లిదండ్రులు తమ పిల్లలకు సమయం కేటాయించి వారి సమస్యలు పరిష్కరించాలి. వీడియో గేమ్స్.. పిల్లలు, పెద్దలకు వీడియో గేమ్స్ ప్రియంగా మారాయి. అవకాశం దొరికినప్పుడల్లా నిద్ర మానుకుని గేమ్స్ ఆడేవారి సంఖ్య పెరిగిపోతోంది. ప్రస్తుతం వేలాది వేలాది గేమ్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇంటర్నెట్లో కూడా సరికొత్త గేమ్స్ అందుబాటులో ఉన్నాయి. ఎక్కువ మంది పగలు పాఠశాలలకు వెళ్లడంతో చిన్నారులకు సమయం దొరకడం లేదు. దీంతో రాత్రిళ్లు ఎక్కువ సమయం గేమ్స్ ఆడడానికే కేటాయిస్తున్నారు. దీంతో అనారోగ్యానికి గురవుతున్నారు. పెద్దలూ గేమ్స్ మాయలో పడుతున్నారు. ఇటీవల ఓ గేమ్ అందరిలోనూ ‘సెగ’ పుట్టిస్తోంది. రిక్వెస్ట్‌లు, లాక్‌లు, స్టేజీ సతమతం చేస్తున్నాయి. నిద్రలేమి అతిపెద్ద సమస్య.. మనిషి సగటున ఎనిమిది గంటలైనా నిద్రపోవాలనేది వైద్యులు చేప్పే మాట. కానీ నేడు యువత, ఉద్యోగులు ఎప్పుడు నిద్రపోతున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. రాత్రి 11 గంటల నుంచి ఒంటి గంట వరకు మెలకువగా ఉండేవారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. గ్రామాల్లో విద్యుత్ సరఫరా లేని రోజుల్లో సాయంత్రం ఆరు గంటలకు భోజనం చేసి 7 గంటలకు నిద్రపోయేవారు. తెల్లవారుజామున 5 గంటలకు నిద్రలేచి ఆ రోజు దినచర్యను ప్రారంభించేవారు. ప్రసుత్తం ఎక్కువ మంది ఉదయం పొద్దెక్కే వరకు నిద్రపోతున్నారు. దీంతో అనేక సమస్యలు వస్తున్నాయి. రాత్రి 11-12 గంటల దాకా చాటింగ్ చేస్తున్నవారు చిన్న వయస్సులోనే మధుమేహం, రక్తహీనత బారిన పడుతున్నారని వైద్యుల అంచనా. -
పల్లె ముంగిట్లో సాంకేతిక సౌరభాలు
దోమ: ఒకప్పుడు పట్టణాలకు, ఉన్నత కుటుంబాలకే పరిమితమైన టెక్నాలజీ వినియోగం నేడు పల్లెలకు కూడా పాకింది. విద్య, వైద్యం, ఆరోగ్యం, రవాణా, కమ్యూనికేషన్, వినోదం, ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోనూ టెక్నాలజీ నిత్య నూతనమైంది. ఆయా రంగాల్లో సాంకేతికాభివృద్ధి ఫలితంగా అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక సౌకర్యాలన్నీ మానవ జీవితాన్ని అత్యంత సుఖవంతం చేశాయి. అదే సమయంలో వాటిని దుర్వినియోగం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతున్నాయి. ఈ కారణంగా శాస్త్ర, సాంకేతికాభివృద్ధి ఫలితంగా అందుబాటులోకి వచ్చిన సౌకర్యాలను ఎలా సద్వినియోగం చేసుకోవాలి, వాటిని దుర్వినియోగం చేస్తే ఎదురయ్యే పరిస్థితులపై ప్రజలకు అవగాహన కల్పించేందుకై ప్రతి ఏటా నవంబర్ మాసంలో 2వ గురువారాన్ని ప్రపంచ యూజబిలిటీ డేగా పాటిస్తున్నారు. ప్రపంచ యూజబిలిటీ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏటా ఈ రోజు పలు ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతూ ప్రజలను చైతన్యవంతం చేయడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి. పల్లె జీవన శైలి మార్చిన టెక్నాలజీ గత కొన్నేళ్ల క్రితం వరకు పట్టణాలు,నగరాలకే పరిమితమైన టెక్నాలజీ వినియోగం నేడు పల్లెలకు కూడా పాకింది. కొన్నేళ్ల క్రితం వరకు సెల్‌ఫోన్ ఎవరిచేతిలోనైనా కనబడితే అందరూ ఆశ్చర్యంగా చూసేవారు. నేడు పల్లెల్లో సెల్‌ఫోన్ లేనిదే క్షణం గడవని పరిస్థితి. అంతేకాకుండా ప్రస్తుతం పల్లెల్లో ఇంటర్నెట్ వినియోగం కూడా గణనీయంగా పెరిగింది. పరిగి ప్రాంతాన్ని తీసుకుంటే మూడేళ్ల క్రితం కేవలం 2 ఇంటర్నెట్ కేంద్రాలు మాత్రమే అందుబాటులో ఉండేవి. కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది. పరిగిలోనే కాకుండా దోమ, కుల్కచర్ల, గండేడ్ మండలాల్లో పెద్ద ఎత్తున ఇంటర్నెట్ కేంద్రాలు వెలిశాయి. అన్ని చోట్లా కలిపి ప్రస్తుతం 20 ఇంటర్నెట్ కేంద్రాలు కొనసాగుతున్నాయి. ఇక ఇళ్లల్లో దాదాపు 200 మంది వరకు బ్రాడ్ బ్యాండ్ సేవలను వినియోగిస్తున్నారు. నిర్మాణ రంగంలోనూ అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. శారీరక శ్రమ తగ్గిపోయి బేస్మెంట్ దగ్గర నుంచి చెత్తు వేసే వరకు కూడా అత్యాధునిక యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. విద్యా సంస్థల విషయానికొస్తే బ్లాక్‌బోర్డులకు బదులుగా ప్రస్తుతం కొన్ని చోట్ల ప్రొజెక్టర్ సౌకర్యాన్ని వినియోగిస్తున్నారు. అలాగే ఒకప్పుడు ధనవంతులకే పరిమితమైన కార్లు ప్రస్తుతం మధ్యతరగతి వారికి కూడా అందుబాటులోకి వచ్చాయి. అంతేకాకుండా పల్లెల్లో ద్విచక్రవాహనం లేని ఇళ్లు లేదని చెప్పడానికి ఎలాంటి అతిశయోక్తి అవసరం లేదు. ఇక వ్యవసాయంలోనూ కూలీల అవసరం తగ్గి మి షన్లతోనే పనులు జరుగుతున్నాయి. గతంలో వారాలు పట్టే పనిని యంత్రాలతో గంటల్లోనే ముగిస్తున్నారు. వినియోగంలో లోపిస్తున్న విచక్షణ.... విజ్ఞాన శాస్త్రం అనేక సమస్యలు పరిష్కరించి మానవ జీవితాన్ని సుఖమయం చేసింది. కానీ మనిషి విచక్షణా లోపం వల్ల ఆ విజ్ఞానమే పర్యావరణ అసమతుల్యత, పరిసరాల కాలుష్యానికి దారి తీస్తోంది. ఉదాహరణకు సోషల్నెట్వర్కింగ్తో పరిచయాలు పాత స్నేహితులను కలుసుకోవచ్చు. అదే సోషల్నెట్వర్క్ను కొందరు దుర్వినియోగం చేస్తుండటంతో వస్తున్న పెద్ద పెద్ద సమస్యల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అదే విధంగా సెల్ఫక్షన్ సిగ్నల్స్‌తో కొన్ని రకాల పక్షులు ఇప్పుడు పల్లెల్లో కూడా కనుమరుగవుతున్నాయి. ఇక ఆండ్రాయిడ్ ఫోన్లు వచ్చినప్పటి నుంచి సహచరులతో మాట్లాడటం తగ్గించి ఫోన్లతోనే కాలక్షేపం చేస్తుండటంతో సంబంధబాంధవ్యాలు దెబ్బతింటున్నాయి. మానవుడు తన పరిజ్ఞానాన్ని సరైన మార్గంలో వినియోగించి సృష్టి ఔన్నత్యానికి పాటు పడాలే గానీ సృష్టి వినాశనానికి కాదని గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. -
వెబ్సైట్ నో అప్డేట్ !
చిత్తూరు(ఎడ్యుకేషన్): ప్రస్తుతం చాలా మంది చేతుల్లో ఇంటర్నెట్ ఉండే మొబైల్ ఫోన్లు ఉన్నాయి. వీటి ద్వారా జిల్లా పరిపాలనకు సంబంధించిన సమాచారం తెలుసుకుంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో జిల్లా అధికారిక వెబ్‌సైట్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసి ఉంచితే ప్రజలకు సరైన సమాచారం అందుతుంది. అప్డేట్ చేయకపోవడంతో జిల్లా అధికారిక వెబ్సైట్ http://www.chittoor.ap.gov.in లో తప్పుడు సమాచారం దర్శనమిస్తోంది. ఇటీవల ఈ వెబ్సైట్లో మార్పులు చేశారు. దాన్ని నూతనహంగులతో తీర్చిదిద్దారు. హోం పేజీ రంగురంగులతో ఆకర్షణీయంగా దర్శనమిస్తుండగా, సమాచారం మాత్రం తప్పులుతడకగా ఉంది. జిల్లా జాయింట్ కలెక్టర్‌గా భరత్‌గుప్తా బాధ్యతలు స్వీకరించి సుమారు నెల రోజులు కాగా ఇంకా పాత జేసీ సీహెచ్ శ్రీధర్ ఉన్నట్లుగా చూపుతోంది. అలాగే ప్రజాప్రతినిధుల పేజీలో వారి ఫొటోలు, వారు ప్రాతినిధ్యం ప్రాంతం పేరు మాత్రమే ఉన్నాయి. జిల్లా అధికారుల వివరాల్లో కొంత మంది అధికారుల ఫోన్ నెంబర్లు 9999999999 అని పెట్టారు. అలాగే అందరు అధికారుల ఈ మెయిల్ ఐడీని mail@ mail.com అని ఉంచారు. పాఠశాలల వివరాలపై క్లిక్ చేస్తే 16 పాఠశాలల సమాచారాన్ని మాత్రమే చూపుతోంది. జిల్లా శాఖల నుంచి పూర్తిస్థాయిలో సమాచారం సేకరించకుండానే వెబ్‌సైట్‌ను మార్పు చేసినట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులు స్పందించి ప్రజలకు సరైనా సమాచారం అందేలా చూడాల్సి ఉంది. -
అమెరికాను మించిపోయాం!
అమెరికాలో భారతీయులు, భారతీయ సంతతి వారు సాధించిన విజయాలు మనకు గర్వకారణంగా అనిపించడంలో ఆశ్చర్యం లేదు. కానీ... తాజాగా భారతీయులు మరో ఘనత సాధించారు. ఇంటర్నెట్ వినియోగదారుల విషయంలో ఈ ఏడాది చివరికల్లా మనం అమెరికాను మించిపోనున్నాం. ఇప్పటికే ఇందుకు తగిన తార్కాణాలు కనిపిస్తున్నాయి కూడా. కొన్ని వెబ్సైట్లకు అక్కడికంటే భారతీయ వినియోగదారులు ఎక్కువగా ఉండటం. కొన్నింటిలో దాదాపు సమానంగా ఉండటం గమనార్హమని ఇంటర్నెట్ ట్రాఫిక్‌పై ఓ కన్నేసి ఉంచే సంస్థ అలెక్సా తెలిపింది. ఇవేవీ చెత్త వెబ్సైట్లు కాకపోవడం..మేధో సమాజంగా భారత్ ఎదుగుతోందనేందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇంతకీ ఆ వెబ్సైట్లు ఏవంటే... కోరా... ప్రశ్న, జవాబు మనవే..! ఫేస్బుక్ మాజీ ఉద్యోగులు ఇద్దరు కలిసి మొదలుపెట్టిన వెబ్సైట్ ఇది. ఇది సెర్చ్ ఇంజిన్‌లా పనిచేస్తుంది. అదే సమయంలో వికీపీడియా మాదిరిగా సందేహాలపై వివరాలనూ అందిస్తుంది. వికీపీడియాలో ఏదైనా అంశం గురించి తెలుసుకోవాలంటే ఒక చిక్కు ఉంది. ఆ అంశానికి సంబంధించిన పదాలను ఎంటర్ చేయగానే విసృ్తత స్థాయిలో సమాచారం స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతుంది. దాంట్లో మనకు కావాల్సిన సమాచారం ఏమిటో తెలుసుకునేందుకు చాలా సమయం పడుతుంది. కోరాలో ఇలా కాదు. ఇందులో ఎలాంటి ప్రశ్న అయినా అడగవచ్చు. సింపుల్ కీవర్డ్‌తో సెర్చ్ చేయవచ్చు. కోరాలో కనిపించే కొన్ని ప్రశ్నలు ఇలా ఉంటాయి. ‘How is school life in different countries?" or "What is the worst part about working at Google?"భారతీయ వినియోగదారులు పెరిగిన తరువాత "What does it feel like to get married through BharatMatrimony?"వంటి ప్రశ్నలు పెరిగిపోతున్నాయి!!! భారత్‌లో వినియోగదారులు 35.6 శాతమైతే అమెరికాలో ఇది 25.6 శాతంగా ఉంది. చాటింగ్ కోసం ఒమెగ్లే... అమెరికాతో సమానమైన వినియోగదారులు ఉన్న ఛాటింగ్ వెబ్సైట్ ఇది. అపరిచితులతో మాటామాటా కలిపేందుకు, అభిరుచులు పంచుకునేందుకు ఉపయోగపడుతుంది. 2009లో మొదలైన ఈ వెబ్‌సైట్‌కు భారత్‌లో 18 శాతం వినియోగదారులుంటే అమెరికాలో ఒక శాతం ఎక్కువ వినియోగదారులు ఉన్నారు. టెక్ట్స్, వీడియో ఛాటింగ్ రెండింటికీ అవకాశముంది. అసలు పేరు పెట్టుకోవాల్సిన అవసరం లేని కారణంగా కొంతమంది ఈ సైట్‌ను అడల్ట్ ఛాటింగ్కూ ఉపయోగిస్తున్నట్లు అలెక్సా చెబుతోంది. స్టంబుల్ అపాన్.... గూగుల్‌లో మనం కొన్ని వేలసార్లు వివిధ అంశాలపై సెర్చ్ చేసి ఉంటాం. ఎప్పటికప్పుడు వెతుక్కోవడం, ఆ తరువాత మరచిపోవడం మనకు అలవాటు. స్టంబుల్ అపాన్ అలా కాదు. మీరు గతంలో జరిపిన సెర్చ్‌ల హిస్టరీని గుర్తుంచుకుని ఆ అంశానికి సంబంధించిన సమాచారాన్ని అప్పుడప్పుడూ ఇస్తూంటుంది. అదే సమయంలో మనం కూడా ఏదైనా ఆసక్తికరమైన సమాచారాన్ని గుర్తించినప్పుడు ఆ లింక్‌లను వెబ్సైట్లో పోస్ట్ చేయవచ్చు. భారతీయ వినియోగదారులు ఎప్పటికప్పుడు పెరిగిపోతూండటం వల్ల ఈ వెబ్సైట్లో త్వరలోనే ఇదే తరహా కంటెంట్ కూడా పెరిగిపోతుందని అంచనా. ప్రోగ్రామర్ల కోసం స్టాక్ఓవర్ఫ్లో... ఇది ప్రోగ్రామర్లు పరస్పర సహకారం అందించుకునేందుకు ఏర్పాటు చేసుకున్న ఓ వేదిక. ప్రోగ్రామింగ్‌లో వచ్చే సమస్యలను ఇక్కడ పోస్ట్ చేస్తూంటారు. ఈ సమస్యలకు ఎవరు సరైన సమాధానం పోస్ట్ చేస్తారో వారికి ‘రెప్యుటేషన్ పాయింట్లు’ దక్కుతాయి. ఎవరికి ఎన్ని పాయింట్లు ఉంటే అంత పాపులర్ అన్నమాట. భారతీయ ఐటీ ఇంజినీర్లు ఈ వెబ్‌సైట్‌ను వాడటం ఎక్కువ కావడంతో మిగిలిన వినియోగదారులు పాపులారిటీ చార్ట్‌లో బాగా వెనుకబడి పోతున్నారట. సహజంగానే భారతీయ ఐటీ ఇంజినీర్లే ఈ వెబ్సైట్ టాప్‌లిస్ట్‌లో ఉన్నారు. -
ఇంటర్నెట్తో పెడదోవ పడుతున్న యువత
జన్నారం, న్యూస్‌లైన్ : ఇంటర్నెట్ ద్వారా భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాల్సిన యువత అశ్లీల అంశాలకు ప్రాధాన్యమిస్తూ ఉజ్వల భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారు. ఆటపాటలతో గడపాల్సిన వయసులో కుర్చీలో బందీలైపోతున్నారు. పాశ్చాత్య విష సంస్కృతికి బానిసలుగా మారుతున్నారు. గంటల తరబడి ఇంటర్నెట్తో గడుపుతున్నారు. గతంలో నగరాలకే పరిమితమైన ఈ వ్యసనం నేడు పల్లెలకూ విస్తరించింది. సాంకేతిక పరిజ్ఞానం గ్రామాలకు సైతం అందడం ఓ విధంగా సంతోషకరమే అయినా.. అందిపుచ్చుకున్న విజ్ఞానం చెడుపోకడలకు దారితీయడం బాధాకరంగా పరిణమిస్తోంది. కంప్యూటర్, ల్యాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్, సెల్ఫోన్ల వాడకం విపరీతంగా పెరగడం ఇందుకు ప్రధాన కారణం. ఈ మెయిల్స్, ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ వినియోగం ప్రధానంగా దుష్ర్పభావం చూపుతోంది. ఇంటర్నెట్ నుంచి అశ్లీల చిత్రాలను డౌన్లోడ్ చేసుకుంటూ ఇష్టం వచ్చినట్లు చాటింగ్ చేసుకుంటూ గంటల కొద్ది సమయాన్ని వృథా చేస్తున్నారు. పిల్లలపై నెట్ ప్రభావం పిల్లలపై ఇంటర్నెట్ ప్రభావం విపరీతంగా ఉంది. పెద్దల మాదిరిగానే సెల్‌ఫోన్, ఇంటర్నెట్లను పిల్లలు సైతం వినియోగిస్తున్నారు. ఎక్కువగా ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్, అశ్లీల వెబ్సెట్లు చూస్తున్నట్టు సర్వేలు చెప్తున్నాయి. ఫేస్బుక్లో యూజర్‌కు 12 ఏళ్ల పరిమిత వయస్సు ఉండాలని నిబంధన ఉంది. అయితే తప్పుడు వయస్సుతో అకౌంట్ ఓపెన్ చేసి చాటింగ్‌లు చేస్తున్నారు. పాఠశాల నుంచి ఇంటికి చేరుకోగానే నెట్ మాయాజాలం వారిని కట్టి పడేస్తోంది. ఈ కారణంతో చదువులో కూడా వెనుకబడిపోతున్నారు. తల్లిదండ్రులు తమ పనిలో బిజీగా ఉండటం, పిల్లల అలవాట్లపై దృష్టి పెట్టకపోవడం కూడా దీనికి కారణమవుతోంది. ఏ సమాచారమైనా క్షణాల్లో.. ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా, ఏ సమాచారం కావాలన్నా, ఎలాంటి చరిత్రలు తెలుసుకోవాలన్నా, సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా, దరఖాస్తులు, ఉద్యోగాలు, ఫలితాలు తదితర వివరాల కోసం గూగుల్ సెర్చ్‌లోకి వెళ్తే క్షణాల్లో సమాచారం వస్తుంది. అశ్లీలతపై ఆసక్తి సమాజంలో వ్యసనాలకు బానిసలైన యువకులపై ఇంటర్నెట్ ప్రభావం అధికంగా ఉన్నట్టు తెలుస్తోంది. నెట్ వేగంగా విస్తరించినప్పటికీ మరోవైపు యువత భవిష్యత్తు ఆందోళనకరంగా మారింది. యూట్యూబ్‌లో అశ్లీల చిత్రాలు చూడడానికే యువత అత్యధిక ప్రాధాన్యమిస్తున్నట్లు పలు సర్వేల్లో వెల్లడైనట్లు తెలుస్తోంది. కంప్యూటర్, ల్యాప్‌ట్యాప్‌ల ద్వారా ఇంటర్నెట్ను వినియోగించే వారితో పాటుగా సెల్‌ఫోన్‌ను వినియోగిస్తున్న వారు కూడా ఈ విషయంలో పోటీ పడుతున్నారు. అర్ధరాత్రి సమయంలో కూడా యువత ఇంటర్నెట్ను వినియోగిస్తున్నారని సర్వేలు చెప్తుతున్నాయి. ఫోర్న్సైట్ను బ్లాక్ చేయడంతో అసభ్యకర చిత్రాలు చూసే వీలు లేనందున యువత ఇంటర్నెట్ సెంటర్లకు వచ్చేందుకు సుముఖత చూపడం లేదని ఇంటర్నెట్ నిర్వాహకులు చెప్తుతున్నారు. దీంతో అరచేతిలో అందుబాటులో ఉండేలా స్మార్ట్‌ఫోన్, సెల్ఫోన్లను ప్రధానంగా ఉపయోగిస్తున్నారు. ఫేస్బుక్ మాయలో... ఫేస్బుక్ మాయలో పడి యువతులు సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు. అవగాహన లేని కారణంగా ఫేస్బుక్లో ఫొటోలు పెడితే ఆ ఫొటోలను కొందరు డౌన్లోడ్ చేసి అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి నెట్లో అందరికీ పంపుతున్నారు. ఇలాంటి విషయంలో హైదరాబాద్‌కు చెందిన ఒక అమ్మాయి సూసైడ్ చేసుకున్న విషాదకర ఘటన కూడా ఉంది. ఫొటోల అప్లోడ్ విషయంలో యువతులు జాగ్రత్తలు పాటించకపోతే సమస్యలు ఎదుర్కోక తప్పదు. బినామీలు తస్మాత్ జాగ్రత్త బినామీ పేరుతో, ప్రొఫైల్స్‌తో అకౌంట్లు కొనసాగిస్తున్న వారు ఇకపై జాగ్ర త్త వహించాలి. అసభ్యకరమైన మెసేజ్‌లు పంపితే సాంకేతిక నైపుణ్యంతో అటువంటి వారిని ఇట్టే పసిగట్టే పరిజ్ఞానం ఇప్పుడు అందుబాటులో ఉంది. సర్వర్ల ద్వారా ఆచూకీని తెలుసుకునే వెసులుబాటు ఉంది. సదరు వ్యక్తులు ఉపయోగించిన కంప్యూటర్లు, సెల్ఫోన్లను ఇట్టే కనిపెట్టేస్తారు. -
టైమ్‌పాస్ వెబ్సైట్లు...
అనుకుంటాంగానీ... టైమ్‌పాస్ చేసేందుకు ఫేస్బుక్, ట్విటర్లను మించినవి ఇంటర్నెట్లో బోలెడున్నాయి. కళ్లముందు అలా అలా కదిలిపోయే కుక్కపిల్లలు... చిత్రవిచిత్రమైన ఆకారాలు... మౌస్తో కదులుతూ అడ్డూ ఆపు లేకుండా బోలెడంత సేపు వినోదాన్ని పంచేవి... ఇలా ఎన్నో రకాల వెబ్సైట్లతో ఆ బోరుకొట్టే క్షణాలను ఇట్టే గడిపేయవచ్చు. ఉన్న బోలెడింటిలో మచ్చుకు కొన్ని మీ కోసం... 1. theuselessweb.com తెల్లటి హోంపేజీపై...‘నన్ను ఏదైనా ఓ చెత్త వెబ్‌సైట్‌కు తీసుకెళ్లు’ అన్న మెసేజ్ మాత్రమే ఉంటుంది. కింద క్లిక్ చేస్తే... ఒక్కోసారి ఒక్కో రకమైన వెబ్‌సైట్‌కు తీసుకెళుతుంది. ఎన్ని రకాలు ఉన్నాయో చూసుకునేలోపు నిమిషాలు గడిచిపోతాయి. 2. staggeringbeauty.com నల్లటి గొట్టంలాంటి ఆకారం... మధ్యలో రెండు కళ్లు. అంతే ఈ వెబ్సైట్లో ఉండేది. మౌస్ కదలికలకు అనుగుణంగా ఈ ఆకారమూ కదులుతూ ఉంటుంది. కదిలిస్తూ.. కదిలిస్తూ అలసిపోవాల్సిందే! 3. dontevenreply.com చిత్ర విచిత్రమైన ఈమెయిళ్లు, ప్రకటనలతో నిండి ఉంటుంది ఈ వెబ్సైట్. ఈ చెత్త మెయిళ్లలోనూ టాప్ రేటెడ్ కోసం ప్రత్యేకమైన సెక్షన్లు కూడా ఉన్నాయి దీంట్లో. 4. shutupandtakemymoney.com చిత్ర విచిత్రమైన గాడ్జెట్లు అమ్మకానికి ఉంచిన వెబ్సైట్ ఇది. వీటిల్లో ఏవీ మనకు ఉపయోగపడవు కానీ... ఉంటే బాగుంటుందేమో అని అనిపించేలా ఉంటాయి వీటిల్లోని పరికరాలు. ఎన్ని ఉన్నాయో... అవి ఎలా పనిచేస్తాయో తెలుసుకుంటూ పోతే.. కాలం గడిచిపోతుందన్నమాట! 5. onreadz.com టైమ్‌పాస్‌కు పుస్తకానికి మించిన స్నేహితుడు ఉండడని అంటారు. ఇది నిజం కూడా. ఈ వెబ్సైట్లోకి వెళితే.. కావాల్సినన్ని పుస్తకాలు ఈ బుక్ వెర్షన్లో అందుబాటులో ఉంటాయి. నచ్చినదాన్ని డౌన్లోడ్ చేసుకుని చదువుకుంటే సరి! 6. wolframalpha.com గూగుల్ కంటే కొంచెం భిన్నమైన సెర్చ్ ఇంజిన్ వెబ్సైట్ ఇది. రకరకాల అంశాల గురించి తెలుసుకోవాలనుకుంటే హోంపేజీలోని సెర్చ్ బాక్స్‌లో కీవర్డ్లను టైప్ చేయాలి. ఉదాహరణకు ఇండియా అని టైప్ చేస్తే... మనదేశానికి సంబంధించిన వివరాలు వివరంగా ప్రత్యక్షమవుతాయి. 7. lizardpoint.com/geography/ భూగోళ శాస్త్రం, గణితం వంటి సబ్జెక్ట్‌లతోపాటు పిల్లల కోసం ఆటలు కూడా ఉన్న వెబ్సైట్ ఇది. బ్రౌజర్ ఆధారిత లెర్నింగ్ యాక్టివిటీ ఈ వెబ్సైట్ ముఖ్య ఉద్దేశం. రకరకాల క్విజ్లు, గణితశాస్త్ర వర్క్షీట్లు ఉంటాయి దీంట్లో. 8. weavesilk.com మీలో ఓ మంచి కళాకారుడు, చిత్రకారుడు ఉన్నాడని మీరు అనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం. ఈ వెబ్సైట్లోకి ఎంటరైపోండి. మౌస్‌ను అటు ఇటు కదిలించండి. మీ కల్లముందు అద్భుతమైన సిమెట్రిక్ చిత్రాలు ప్రత్యక్షమవుతాయి. వీటిని సేవ్ చేసుకోవచ్చు. షేర్ కూడా చేసుకోవచ్చు. 9. freerice.com చిన్న చిన్న ప్రశ్నలతో కూడిన క్విజ్లు ఈ వెబ్సైట్లో ఉంటాయి. అయితే వీటికి సమాధానాలు చెప్పడం ద్వారా మిమ్మల్ని మీరు పరీక్షించుకోవడంతోపాటు ఇంకొకరికి ఉపకారం కూడా చేయవచ్చు. రిజిస్టర్ చేసుకుని లాగిన్ అవండి.. వేర్వేరు సబ్జెక్టుల క్విజ్లు ఆన్సర్ చేయండి. సరైన సమాధానం ఒక్కోదానికి పది గింజల బియ్యం బహుమతి. మీకు కాదండోయ్. పేదరికంతో మగ్గిపోతున్న వారికి ఈ బియ్యం అందిస్తామని అంటోంది వెబ్సైట్.!