వెబ్‌సైట్ నో అప్‌డేట్ !
చిత్తూరు(ఎడ్యుకేషన్): ప్రస్తుతం చాలా మంది చేతుల్లో ఇంటర్నెట్ ఉండే మొబైల్ ఫోన్లు ఉన్నాయి. వీటి ద్వారా జిల్లా పరిపాలనకు సంబంధించిన సమాచారం తెలుసుకుంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో జిల్లా అధికారిక వెబ్‌సైట్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసి ఉంచితే ప్రజలకు సరైన సమాచారం అందుతుంది. అప్‌డేట్ చేయకపోవడంతో జిల్లా అధికారిక వెబ్‌సైట్ http://www.chittoor.ap.gov.in లో తప్పుడు సమాచారం దర్శనమిస్తోంది.
ఇటీవల ఈ వెబ్‌సైట్‌లో మార్పులు చేశారు. దాన్ని నూతనహంగులతో తీర్చిదిద్దారు. హోం పేజీ రంగురంగులతో ఆకర్షణీయంగా దర్శనమిస్తుండగా, సమాచారం మాత్రం తప్పులుతడకగా ఉంది. జిల్లా జాయింట్ కలెక్టర్‌గా భరత్‌గుప్తా బాధ్యతలు స్వీకరించి సుమారు నెల రోజులు కాగా ఇంకా పాత జేసీ సీహెచ్ శ్రీధర్ ఉన్నట్లుగా చూపుతోంది. అలాగే ప్రజాప్రతినిధుల పేజీలో వారి ఫొటోలు, వారు ప్రాతినిధ్యం ప్రాంతం పేరు మాత్రమే ఉన్నాయి.
జిల్లా అధికారుల వివరాల్లో కొంత మంది అధికారుల ఫోన్ నెంబర్లు 9999999999 అని పెట్టారు. అలాగే అందరు అధికారుల ఈ మెయిల్ ఐడీని mail@ mail.com అని ఉంచారు. పాఠశాలల వివరాలపై క్లిక్ చేస్తే 16 పాఠశాలల సమాచారాన్ని మాత్రమే చూపుతోంది. జిల్లా శాఖల నుంచి పూర్తిస్థాయిలో సమాచారం సేకరించకుండానే వెబ్‌సైట్‌ను మార్పు చేసినట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులు స్పందించి ప్రజలకు సరైనా సమాచారం అందేలా చూడాల్సి ఉంది.