‘లాంతరు’తో నెట్ వెలుగులు... | 'Lantern' net with light . | Sakshi
Sakshi News home page

‘లాంతరు’తో నెట్ వెలుగులు...

Published Tue, Dec 2 2014 11:13 PM | Last Updated on Sat, Sep 2 2017 5:30 PM

‘లాంతరు’తో  నెట్ వెలుగులు...

‘లాంతరు’తో నెట్ వెలుగులు...

జేబులోకి ఇమిడిపోతుంది ఇది.
చిన్నదేనని చిన్నచూపు చూసేరు సుమీ!
చాలా శక్తిమంతమైంది. ప్రపంచంలోని ఏ మూలకైనా
ఇంటర్నెట్‌ను చేరవేస్తుంది. చదువు చెబుతుంది..
సమాచారం అందిస్తుంది. ఆపత్కాలాల్లో ఆదుకుంటుంది కూడా!
దీని పేరు... లాంటెర్న్!
 

ప్రపంచ జనాభా 700 కోట్లు దాటిపోయిందిగానీ... ఇన్ఫర్మేషన్ ఈజ్ పవర్ అని అనుకంటున్న ఈ రోజుల్లోనూ ఇంటర్నెట్ సౌకర్యం లేని వారి సంఖ్య దాదాపు 430 కోట్లు ఉందంటే ఆశ్చర్యం వేస్తుంది. ఈ డిజిటల్ డివైడ్‌ను తగ్గించేందుకు వీలైతే పూర్తిగా తొలగించే లక్ష్యంతో మొదలైన ప్రాజెక్టు ఫలితమే ఈ ‘లాంటెర్న్’. ఫొటో చూశారుగా... చిన్నపాటి డబ్బీ మాదిరిగా ఉంటుందిగానీ... దీంట్లోని హైటెక్ హంగులు అన్నీ ఇన్నీ కావు. ఔటర్‌నెట్ ప్రాజెక్టు ద్వారా ఎప్పటికప్పుడు అప్‌డేట్ అయ్యే వెబ్‌పేజీలు, వీడియోలు, ఇతర సమాచారాన్ని ఇది ఉపగ్రహాల నుంచి నేరుగా గ్రహిస్తూంటుంది. ఫలితంగా సెల్‌ఫోన్ టవర్లు ఉన్నా లేకున్నా, కేబుల్ కనెక్షన్లతో నిమిత్తం లేకుండా ప్రపంచంలో ఏమూలనున్నా రేడియోతరంగాల రూపంలో ఇంటర్నెట్ సౌకర్యం పొందవచ్చునన్నమాట.
 
ఔటర్‌నెట్ ప్రాజెక్టు...

 
లాంటెర్న్ గురించి తెలుసుకునే ముందు డిజిటల్ డివైడ్‌ను తగ్గించేందుకు చేపట్టిన ఔటర్‌నెట్ ప్రాజెక్టు గురించి తెలుసుకోవడం ఎంతైనా అవసరం. 1995లో ఇద్దరు ఔత్సాహిక శాస్త్రవేత్తలు ఏర్పాటు చేసిన స్వచ్ఛంద సంస్థ ఈ ఔటర్‌నెట్. భూస్థిర, లోయర్ ఎర్త్ కక్ష్యల్లోని ఉపగ్రహాల ద్వారా వరల్డ్‌వైడ్ వెబ్ సమాచారాన్ని అందరికీ అందించాలన్నది ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ ఏడాది ఆగస్టు 11న ఔటర్‌నెట్ తొలిసారి ఉపగ్రహాల ద్వారా సమాచారాన్ని అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం రోజుకు 200 మెగాబైట్ల సమాచారాన్ని ప్రసారం చేస్తూన్నారు. వచ్చే ఏడాదికల్లా రోజుకు ఒక గిగాబైట్... అంతిమంగా కనీసం వంద గిగాబైట్ల సమాచారాన్ని ప్రసారం చేయాలన్నది ఔటర్‌నెట్ లక్ష్యం. కొద్దిపాటి ప్రోగ్రామింగ్ మెళకువలు ఉన్న వారు ఔటర్‌నెట్ ప్రసారాలను అందుకునేందుకు అవసరమైన వ్యవస్థలను స్వయంగా తయారు చేసుకోవచ్చు. రేడియో సంకేతాలను అందుకునేందుకు ఉపయోగించే యాంటెన్నాతోపాటు ఒక రిసీవర్ తదితర పరికరాలుంటాయి ఈ వ్యవస్థలో. ఇది కాకుండా మొబైల్ ఫోన్ల ద్వారా కూడా నెట్ సమాచారాన్ని ఉచితంగా పొందేందుకు రూపొందించిన వినూత్న పరికరమే... లాంటెర్న్!
 
ప్రస్తుతానికి పరిమితంగానే...
 
లాంటెర్న్ ద్వారా ప్రస్తుతానికి ఇంటర్నెట్ సమాచారం మొత్తం అందడం లేదు. ముఖ్యమైన కొంత సమాచారాన్ని మాత్రం ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసి ప్రసారం చేస్తున్నారు. అంతర్జాతీయ వార్తలతోపాటు రైతులకు ఉపయోగపడేందుకు వేర్వేరు ప్రాంతాల్లోని వ్యవసాయ ఉత్పత్తుల ధరల వివరాలు అందిస్తున్నారు. వీటితోపాటు అత్యంత పేదదేశాల్లోని పాఠశాల విద్యార్థులకు చదువు చెప్పేందుకు టీచర్స్ వితౌట్ బార్డర్స్ రూపొందించిన సమాచారాన్ని కూడా ప్రసారం చేస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు, సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు అవసరమైన ఏర్పాట్లున్నాయి. అంతేకాకుండా కొన్ని రకాల ఉచిత సాఫ్ట్‌వేర్లు, సినిమాలు, సంగీతం, ఆటలు, వికీపీడియాలు కూడా ఉన్నాయి ఈ ఔటర్‌నెట్ కంటెంట్‌లో. ఇవేకాకుండా...

లాంటెర్న్‌కున్న మరికొన్ని ప్రత్యేకతలు ఏమిటంటే...

ఉపగ్రహల నుంచి ప్రసారమయ్యే సమాచారాన్ని అందుకునే అతి చిన్న వ్యవస్థ ఇది.
అన్ని రకాల ఫైళ్లను అందుకోగలదు.
వైఫై హాట్‌స్పాట్‌గా పనిచేస్తుంది. వైఫై ఆధారిత గాడ్జెట్స్ అన్నింటికీ సమాచారాన్ని ప్రసారం చేయగలదు.
సోలార్ ప్యానెల్స్ ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేసుకుంటుంది. స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్‌లను ఛార్జ్ చేసుకోవచ్చు.
ప్రపంచబ్యాంకు ఇప్పటికే ఈ ప్రాజెక్టు ద్వారా సూడాన్‌లో, ఐరిక్స్ అనే సంస్థ నమీబియాలోనూ లాంటెర్న్ ద్వారా సమాచార ప్రసారాలకు ఏర్పాట్లు చేశారు.
 
 మీరు ఓ చేయి వేయవచ్చు...

లాంటెర్న్ ప్రాజెక్టు ద్వారా మీరు కూడా కొంతమందికి నెట్ వెలుగులు అందించాలనుకుంటున్నారా? అయితే వీరి ఇండిగోగో (ఐఛీజ్ఛీజౌజౌ) పేజీకి వెళ్లండి. దీంట్లో మీరు ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలతోపాటు మీరు ఎంత మొత్తం సాయం చేస్తే... ఏ రకమైన చిరుకానుకలు అందుతాయన్న వివరాలు ఉన్నాయి. వచ్చే ఏడాది జూలై నాటికి ప్రపంచవ్యాప్తంగా సమాచార ప్రసారాలతోపాటు, లాంటెర్న్‌లను కూడా అందుబాటులోకి తెచ్చేందుకు ఔటర్‌నెట్ ప్రయత్నాలు చేస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement