ఇంటర్నెట్‌లో విహారం..
తల్లిదండ్రులకు సూచనలు..
పిల్లలను తల్లిదండ్రులు ఎల్లప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలి.
వారి సంతోషాలు, బాధలను గుర్తించాలి.
ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నారంటే అప్రమత్తమై వారితో మాట్లాడి వారి సమస్య ఏమిటో గుర్తించి పరిష్కరించాలి.
అధిక సమయం ఇంటర్నెట్, ఫేస్‌బుక్ చాటింగ్‌లో ఉన్నారని తెలిస్తే వారికి ప్రేమగా నచ్చజెప్పాలి.
చిన్నపిల్లలను ఈ సాంకేతిక మాయాజాలంలోకి తీసుకరాకపోవడమే మంచిది. అవసరం మేరకే వినియోగించుకునేలా చూడాలి.
బోర్ కొట్టిందంటే చాలు..
ప్రస్తుతం సెల్‌ఫోన్ లేని వారు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. ప్రతీ మనిషి ఒక రోజు కనీసం అర గంట నుంచి ఆరు గంటలపాటు సెల్‌ఫోన్‌లో మాట్లాడుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోవడంతో దానిపై ఆధారపడక తప్పడం లేదు. ఇది కాస్త శ్రుతిమించడంతోనే అసలు సమస్య మొదలవుతుంది. కాస్త బోర్ కొట్టిందంటే చాలు సెల్‌ఫోన్ బయటకు తీసి ఇంటర్నెట్, ఫేస్‌బుక్, వాట్సప్‌లో గంటలు గడిపేస్తున్నారు. వినియోగానికి అనుగుణంగా నెట్‌వర్క్ కంపెనీలు కాల్ రేట్లు తగ్గిస్తూ.. తక్కువ నగదుకు ఇంటర్నెట్‌లో సేవలు అందిస్తున్నాయి. ఆండ్రాయిడ్ సెల్‌ఫోన్ ఉన్నవారైతే వాటిని మురిపెంగా చూసుకుంటున్నారు. చిన్నపిల్లలు సైతం సెల్‌పోన్ వినియోగానికి అలవాటు పడుతున్నారు.
ఒక్కసారిగా.. బంధం తెగిపోతే..
ఫేస్‌బుక్ చాటింగ్ సానబట్టిన కత్తి లాంటిది. తొలినాటి నుంచే తన ప్రభావం చూపిస్తుంది. దాన్ని ఉపయోగించుకునే తీరును బట్టే మన విజయాలు ఆధారపడి ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య సరైన బంధం లేని కారణంగా.. ఎంతోమంది ఫేస్‌బుక్‌పై ఆధారపడుతున్నారు. పిల్లలు ఏమాత్రం దిగులుగా ఉంటున్నా.. పరధ్యానంలో ఉన్నా గ్రహించాలి. తల్లిదండ్రులు వారిని ప్రేమతో దగ్గరకు తీసుకుని మాట్లాడాలి. వారిగోడు వినాలి. వీలైతే ఆ సమస్యను పరిష్కరించాలి.
తెల్లవారముందే సందేశాలు..
త్రీజీ సేవలు అందుబాటులోకి రావడంతో వినియోగం మరింతగా పెరిగిపోయింది. తెల్లవారకముందే వాట్సప్, ఫేస్‌బుక్, ఇతర సామాజిక సైట్లలో గుడ్‌మార్నింగ్‌లు చెప్పేసుకుంటున్నారు. వారి అభిప్రాయాలు, అనుభూతులు, చిత్రాలు ఇతరులతో పంచుకుంటున్నారు. ఇంతవరకు పర్వాలేదు. కానీ.. అసలు సమస్య మొదలయ్యేది అక్కడే. గంటల కొద్దీ చాటింగ్ చేయడం, రాత్రివేళల్లో ఆలస్యంగా నిద్రపోవడంతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.
అవసరం ఉన్నంత మేరకే..
యువతతోపాటు పెద్దలూ సరదా కోసమంటూ చాటింగ్‌లో ఊబిలోకి దిగుతున్నారు. ఫేస్‌బుక్‌లో అవసరం ఉన్నా.. లేకపోయినా వచ్చిన ప్రతి లైక్‌కు రిప్లయిలిస్తూ.. 60 శాతం అనవసర పరిచయాలు పెంచుకుంటున్నారు. ఇక్కడి నుంచే అసలు సమస్యలు ప్రారంభమవుతాయి. ఆదిలోనే వీటిని అరికడితే మంచిది. తల్లిదండ్రులు తమ పిల్లలకు సమయం కేటాయించి వారి సమస్యలు పరిష్కరించాలి.
వీడియో గేమ్స్..
పిల్లలు, పెద్దలకు వీడియో గేమ్స్ ప్రియంగా మారాయి. అవకాశం దొరికినప్పుడల్లా నిద్ర మానుకుని గేమ్స్ ఆడేవారి సంఖ్య పెరిగిపోతోంది. ప్రస్తుతం వేలాది వేలాది గేమ్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇంటర్నెట్‌లో కూడా సరికొత్త గేమ్స్ అందుబాటులో ఉన్నాయి. ఎక్కువ మంది పగలు పాఠశాలలకు వెళ్లడంతో చిన్నారులకు సమయం దొరకడం లేదు. దీంతో రాత్రిళ్లు ఎక్కువ సమయం గేమ్స్ ఆడడానికే కేటాయిస్తున్నారు. దీంతో అనారోగ్యానికి గురవుతున్నారు. పెద్దలూ గేమ్స్ మాయలో పడుతున్నారు. ఇటీవల ఓ గేమ్ అందరిలోనూ ‘సెగ’ పుట్టిస్తోంది. రిక్వెస్ట్‌లు, లాక్‌లు, స్టేజీ సతమతం చేస్తున్నాయి.
నిద్రలేమి అతిపెద్ద సమస్య..
మనిషి సగటున ఎనిమిది గంటలైనా నిద్రపోవాలనేది వైద్యులు చేప్పే మాట. కానీ నేడు యువత, ఉద్యోగులు ఎప్పుడు నిద్రపోతున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. రాత్రి 11 గంటల నుంచి ఒంటి గంట వరకు మెలకువగా ఉండేవారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. గ్రామాల్లో విద్యుత్ సరఫరా లేని రోజుల్లో సాయంత్రం ఆరు గంటలకు భోజనం చేసి 7 గంటలకు నిద్రపోయేవారు. తెల్లవారుజామున 5 గంటలకు నిద్రలేచి ఆ రోజు దినచర్యను ప్రారంభించేవారు. ప్రసుత్తం ఎక్కువ మంది ఉదయం పొద్దెక్కే వరకు నిద్రపోతున్నారు. దీంతో అనేక సమస్యలు వస్తున్నాయి. రాత్రి 11-12 గంటల దాకా చాటింగ్ చేస్తున్నవారు చిన్న వయస్సులోనే మధుమేహం, రక్తహీనత బారిన పడుతున్నారని వైద్యుల అంచనా.