facebook chating
-
ఫేస్ ‘బుక్' అయ్యారో.. ఇకపై వీడియో కాల్ తో.. మీ పని అంతే!
వరంగల్: కాజీపేటకు చెందిన యువకుడు సాఫ్ట్‌వేర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. కరోనా అనంతరం వర్క్ ఫ్రం హోంలో భాగంగా ఇంట్లోనే ఉంటూ పని చేసుకుంటున్నాడు. ఫేస్బుక్లో పరిచయమైన ఓ మహిళతో న్యూడ్ కాల్ మాట్లాడి వారికి దొరికిపోయాడు. వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పెడ్తానని బెదిరించగా రూ.10లక్షలు ముట్టజెప్పాడు. అయినా వేధింపులు ఆగకపోవడంతో చివరికి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇలా ఎంతో మంది.. ఎన్నో రకాలుగా మోసపోతున్న ఘటనలు ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి. పరిమితుల్లేని శృంగారం.. అవధుల్లేని ఆనందం ఆస్వాదిద్దాం.. అంటూ వాట్సాప్ కాల్స్ ద్వారా నగ్నంగా మాట్లాడుతూ ఆపై వీడియోలు తీసి బెదిరిస్తున్న సైబర్ నేరస్తుల వల నుంచి తప్పించుకోవచ్చని పోలీస్ అధికారులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని యువకులు, వృత్తి నిపుణులే లక్ష్యంగా పశ్చిమ బంగాల్, రాజస్తాన్ ముఠాలు వలపు వలలు విసురుతున్నాయి. బుట్టలో పడిన వారిని బెదిరించి లక్షల్లో నగదు బదిలీ చేయించుకుంటున్నారు. పరువు పోతుందన్న భావనతో పలువురు.. నిందితులు అడిగినంత డబ్బు పంపిస్తూ మోసానికి గురవుతున్నారు. ఇకపై అలా చేయొద్దని, సొంతంగానే ముప్పు నుంచి తప్పించుకోవచ్చని పోలీసులు చెబుతున్నారు. సాధ్యం కాదన్నా వినకుండా.. ఫేస్బుక్ ద్వారా యువకులు, వృత్తి నిపుణులను భరత్పూర్, కోల్‌కతాకు చెందిన యువతులు పరిచయం చేసుకుంటున్నారు. ఒకట్రెండు రోజులు ఫేస్బుక్లో మాట్లాడిన తర్వాత వాట్సాప్ నంబర్లు తీసుకుంటున్నారు. వాట్సాప్ కాల్ మొదలైన నిమిషానికే దుస్తులన్నీ విప్పేసి నగ్నంగా మారుతున్నారు. కొంతమంది యువతులు ప్రేమలోకి దింపి యువకుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఒక ఆటాడించి డబ్బులు దండుకుని వదిలేస్తున్నారు. మరికొంత మంది యువతులు ఒకటికి, రెండుసార్లు నగ్నంగా మారి వీడియో కాల్ చేయండని కోరుతున్నారు. ఇంట్లో ఉన్నాను.. బంధువులు, స్నేహితుల మధ్య ఉన్నాను. ఇప్పుడు చేయడం సాధ్యంకాదని చెప్పినా పదే పదే వీడియో కాల్ చేస్తుంటారు. లొంగిపోతే ఇక బెదిరింపులే.. బాధితులు ఒత్తిడికి లొంగి వీడియో కాల్ చేయడం మొదలు పెట్టగానే మీ ముఖం కనింపించేలా మాట్లాడాలని తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేస్తారు. వెంటనే అవతలి వైపు నుంచి మాట్లాడుతున్న యువతి మరో కెమెరాతో మాటలు, నగ్న దృశ్యాలను రికార్డు చేస్తుంది. కాల్ పూర్తైనా నిమిషాలకే వీడియోను పంపించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తామంటూ భయబాంత్రులకు గురి చేస్తుంటారు. రిపోర్ట్ కొట్టండి.. సెట్టింగ్ మార్చండి.. అసభ్యకరమైన, ఆశ్లీల వీడియోలు పంపుతామని నేరస్తులు చెప్పిన వెంటనే మీ టైమ్‌లైన్‌లో.. ‘నా ఫేస్బుక్ హ్యాక్ అయ్యింది.. మీరు నాకు ఎలాంటి సమాచారం పంపొద్దం’టూ సందేశాన్ని పంపించండి. ఈ సందేశాన్ని హ్యాకర్ చూసినా మీకు ఎలాంటి ఇబ్బందులు రావు. స్మార్ట్‌ఫోన్‌లో ఫేస్బుక్ తెరవగానే.. మూడు చుక్కలు కనిపిస్తాయి. వాటిపై నొక్కితే రిపోర్ట్ అని వస్తుంది. అందులో ఎవరో మీలా నటిస్తున్నారా? అన్నవి తెరపైకి వస్తాయి. మమ్మల్ని అనుకరిస్తున్నారా? అన్న ఐచ్ఛికాన్ని ఎంచుకుంటే.. ఫేస్బుక్ ప్రతినిధులు హ్యాకర్‌ను తొలగిస్తారు. అప్పుడు మీ ఫేస్బుక్ సెట్టింగ్‌లను కొత్తగా మార్చుకోవాలి. -
ఆమెకు పిల్లలున్నా పాక్ యువకుడితో ప్రేమ.. అతడి కోసం సరిహద్దు దాటి..
జైపూర్: ఇటీవలి కాలంలో ఆన్లైన్ పరిచయాలతో యువత ప్రేమలో మునిగిపోతున్నారు. కొద్దిరోజుల పరిచయాలకే సరిహద్దులతో పాటు దేశాలు కూడా దాటిపోతున్నారు. మొన్నటికి మొన్న పాకిస్థాన్‌కు చెందిన సీమా.. తన ప్రేమ కోసం భారత్‌లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువకముందే భారత్‌కు చెందిన ఓ యువతి.. ఫేస్బుక్ ప్రేమలో పడి పాకిస్తాన్‌కు వెళ్లింది. వీరి ప్రేమ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన వివాహిత అంజు(34)కు.. సోషల్ మీడియాలో పాకిస్థాన్‌కు చెందిన నస్రుల్లా ఖాన్(29)తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో వీరి పరిచయం కాస్తా ప్రేమకు దారి తీసింది. దీంతో, వీరిద్దరూ ఒకరిపై ఒకరు ప్రేమను పెంచుకున్నారు. ఇక, ఒకరినొకరు కాలవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో అంజు.. సరిహద్దులు దాటి పాక్‌లోని ఖైబర్ పఖ్తున్ఖ్వా ఫ్రావిన్స్‌లోని దీర్ సిటీకి జూలై 21న వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ సందర్బంగా అంజు భర్త అరవింద్ మాట్లాడుతూ.. తన భార్య జైపూర్‌కు వెళ్తున్నాననే నెపంతో గురువారం ఇంటి నుంచి వెళ్లినట్టు తెలిపారు. కాగా, ఆమె పాకిస్థాన్‌కు వెళ్లినట్టు తెలిసిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన స్నేహితుడిని కలవాలని చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయిందని వెల్లడించాడు. ఆమె ఆదివారం సాయంత్రం 4 గంటలకు అతనికి ఫోన్ చేసి, తాను లాహోర్‌లో ఉన్నానని, రెండు మూడు రోజుల్లో తిరిగి వస్తానని చెప్పిందని తెలిపాడు. ఇదిలా ఉండగా.. యూపీకి చెందిన అంజుతో అరవింద్‌కు 2007లో వివాహం జరిగింది. వీరికి 15 ఏళ్ల బాలిక, ఆరేళ్ల కుమారుడు ఉన్నారు. అంజు ప్రస్తుతం.. ప్రైవేట్ సంస్థలో బయోడేటా ఎంట్రీ ఆపరేటర్‌గా ఉద్యోగం చేస్తోంది. అటు నస్రుల్లా.. వైద్య రంగంలో పనిచేస్తున్నాడు. అయితే, అంజు పాకిస్థాన్‌లో ఉన్నట్టు తెలియడంతో రాజస్థాన్ పోలీసులు అలర్ట్ అయ్యారు. కాగా, పాక్‌కు వెళ్లేందుకు అంజు వద్ద అన్ని ప్రయాణ పత్రాలు కరెక్ట్‌గానే ఉన్నాయని తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే ఆమెకు అక్కడ సెక్యూరిటీ కల్పించాలని అధికారులను కోరారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనకు పాల్పడకుండా ఉండాలని సూచించారు. A married Indian woman Anju resident of UP has travelled from Rajasthan’s Bhiwadi district all the way to Pakistan's KPK province to meet a man she befriended and fell in love with on Facebook. Her husband Arvind came to know about this from media.#SeemaHaidar #Pakistan pic.twitter.com/qw84iGvWMX — Ashutosh Pandey (@Indiawiing) July 23, 2023 ఇది కూడా చదవండి: సీమా, సచిన్‌ల స్టోరీని తలపించే ఇక్రా, ములాయం లవ్ స్టోరీ.. చివరికి? -
ఫేస్బుక్ చాటింగ్.. మార్ఫింగ్ చేసిన వీడియోలతో..
సాక్షి,బంజారాహిల్స్: ఫేస్బుక్ చాటింగ్ ద్వారా టచ్‌లోకి వచ్చిన ఓ అపరిచితుడు మార్పింగ్ చేసిన వీడియోలు పంపిస్తూ బ్లాక్‌మెయిన్ చేస్తున్న ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శ్రీకృష్ణానగర్‌లో నివాసం ఉంటున్న రాజీవ్ అనే వ్యక్తి ఓ ప్రైవేటు సంస్థలో డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. దీంతో పాటు సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల అతడి ఫేస్బుక్ ద్వారా గుర్తుతెలియని వ్యక్తి పరిచయం అయ్యాడు. ఫోన్ నెంబర్ ఇవ్వాలని కోరాడు. దాంతో అతడికి రాజీవ్ తన నెంబర్ ఇచ్చారు. కొన్నిరోజుల తర్వాత రాజీవ్ ఫేస్బుక్లో ఉన్న కొన్ని ఫొటోలను మార్ఫింగ్ చేసి వాటిని వేరొకరి శరీరాలతో కలిసి వీడియోలు తయారు చేసిన దుండగులు అతడిని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించారు. తమకు డబ్బులు ఇవ్వాలని లేకుంటే ఫేస్‌బుక్‌లోని స్నేహితుల గ్రూపులకు షేర్ చేస్తామని బెదిరించారు. దీంతో రూ. 3469 చొప్పున మూడుసార్లు పంపించినా ఇదే తీరులో బ్లాక్మెయిల్ చేస్తుండటంతో బాధితుడు రాజీవ్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చదవండి👉🏻 కొత్త సినిమా లింకులని కక్కుర్తిపడితే.. ఖేల్ ఖతం -
వార్నీ! సొంత తండ్రితోనే సినీ నటుడి ఆన్లైన్ డేటింగ్..
వాషింగ్టన్: హాలీవుడ్ నటుడు, దర్శకుడు జేమ్స్ మోరొసినికి వింత సమస్య వచ్చి పడింది. ఆయన గత కొన్ని రోజులుగా ఫేస్బుక్లో ఒక అమ్మాయితో చాట్ చేస్తున్నాడు. ఆన్లైన్ వేదికగా 31 ఏళ్ల జేమ్స్ మోరొసినికి, బెక్కా అనే అమ్మాయికి పరిచయమైంది. అభిరుచులు, అలవాట్లు, ఆసక్తులు కలవడంతో వారి మధ్య స్నేహం చిగురించింది. స్నేహం కాస్తా ఆన్లైన్ డేటింగ్‌కు దారితీసింది. ఇలా కొన్ని రోజులు ఆ అమ్మాయితో మనోడు డేటింగ్, చాటింగ్ చేస్తూనే ఉన్నాడు. ఈక్రమంలోనే తనకు సంబంధించిన చాలా విషయాలు ఆ అమ్మాయి చెప్తున్నవాటితో సరిపోలడంతో అతనికి డౌట్కొట్టింది. దీంతో మరింత లోతుగా ఆ యువతి బెక్కా వివరాలు తెలుసుకుని షాకయ్యాడు. అతడు ఆన్లైన్లో ఇన్నిరోజులూ డేటింగ్ చేస్తున్నది తన తండ్రితో అని తెలిసి బిక్కచచ్చిపోయాడు. అయితే, తన తండ్రి ఫేక్ ఫేస్బుక్ ప్రొఫైల్‌తో అలా ఎందుకు చేశాడో తెలుసుకుని కుదుటపడ్డాడు. (చదవండి: మార్లిన్ మన్రో చిత్రానికి భారీ ధర.. అక్షరాలా రూ.1521కోట్లా..!) అమ్మాయిల పట్ల తన ప్రవర్తన ఎలా ఉంది. ఇతరులతో ఆన్లైన్ స్నేహాలు గట్రా చేసే క్రమంలో ఓవర్ చేస్తున్నాడా? అని తెలుసుకునేందుకే ఆయన అలా చేశాడని తెలిసింది. ఆన్లైన్ యుగంలో సైబర్ నేరాలకు కొదవే లేకుండా పోయింది. గుడ్డిగా నమ్మి మోసపోయినవారెందరో ఉన్నారు. తల్లిదండ్రులు వారి పిల్లల డిజిటల్ వ్యవహారాలపట్ల అప్రమత్తంగా ఉండటం మంచిదే కదా! (చదవండి: అర్ధరాత్రి పరుగులు.. ఫేమస్ చేయొద్దంటూ దణ్ణం పెడుతున్నాడు!) -
అల్లరిపిల్ల: ఫేస్బుక్ ఐడీతో పురుషులకు వల.. నగ్నంగా కాల్స్
చిత్తూరు అర్బన్: పురుషుల బలహీనతలను ఆసరాగా చేసుకున్న ఓ యువతి ‘అల్లరిపిల్ల’ అవతారం ఎత్తింది. ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపడం.. ఆ తర్వాత స్నేహితులు అయ్యాక.. నగ్నంగా వీడియోకాల్స్ చేసి మాట్లాడుకోవడం, కొందరికి నిఘా యాప్స్ పంపి మొబైల్ స్క్రీన్ షేరింగ్‌ను తన ఆధీనంలోకి తెచ్చుకోవడం ద్వారా రూ.లక్షలు కొల్లగొట్టింది. ఈ బాగోతంలో కమీషన్ కోసం తమ బ్యాంకు ఖాతాల్లోకి నగదు వేయించుకుంటున్న ఎనిమిది మంది మధ్యవర్తులను చిత్తూరు పోలీసులు అరెస్టుచేశారు. డీఎస్పీ సుధాకర్‌రెడ్డి, సీఐ యుగంధర్ మంగళవారం వివరాలను మీడియాకు వెల్లడించారు. ఫేస్బుక్లో అల్లరిపిల్ల అనే ఐడీ నుంచి పలువురికి ఫ్రెండ్ రిక్వెస్టులు వచ్చేవి. వీటిని అంగీకరించిన కొద్దిరోజుల్లోనే ఓ అజ్ఞాత యువతి మెసెంజర్ ద్వారా వాయిస్‌కాల్స్ చేసి, మత్తెక్కించే మాటలతో అవతలి వాళ్లను తన బుట్టలో వేసుకునేది. అనంతరం వీడియో కాల్స్ ద్వారా నగ్నంగా మాట్లాడుకోవడం, నేరుగా కలవడానికి నమ్మకం వచ్చాక ప్రమాదకరమైన స్పై (నిఘా) యాప్స్ లింకులను పురుషుల మొబైళ్లకు పంపేది. ఆ లింకులను ఇన్స్టాల్ చేసుకున్న తరువాత అవతలి వ్యక్తి మొబైల్లో ఏం చేసినా అల్లరిపిల్ల తన సెల్‌ఫోన్ నుంచే చూసేది. వివరాలను వెల్లడిస్తున్న చిత్తూరు డీఎస్పీ సుధాకర్‌రెడ్డి, వెనుక అరెస్టయిన నిందితులు మరికొందరికి క్రెడిట్‌కార్డులు ఇప్పిస్తామంటూ నిఘా యాప్స్ పంపేది. ఆపై ఫోన్‌పే, గూగుల్‌పే, నెట్ బ్యాంకింగ్ ద్వారా బ్యాంకు ఖాతాల్లో ఉన్న నగదును మాయం చేసేది. ఈ డబ్బులను నేరుగా తన బ్యాంకు ఖాతాకు కాకుండా కొందరు వ్యక్తులను మధ్యవర్తులుగా నియమించుకుని వారి ఖాతాల్లోకి మళ్లించేది. ఇలా ఓ పది బ్యాంకు ఖాతాల నుంచి అల్లరిపిల్ల ఖాతాలోకి నగదు వెళ్తుంది. చిత్తూరు నగరానికి చెందిన సీకే మౌనిక్ అనే వ్యక్తి సైతం అల్లరిపిల్ల మాయలోపడి ఆమె పంపిన నిఘా యాప్స్‌ను డౌన్లోడ్ చేసుకున్నాడు. అంతే.. రూ.3.64 లక్షలు బ్యాంకు నుంచి మాయమయ్యాయి. ఈనెల 3న బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో టూటౌన్ పోలీసులు కేసు నమోదుచేశారు. మాయమైన నగదు ఏయే ఖాతాల్లో జమయ్యిందో తెలుసుకుని విశాఖ జిల్లాకు చెందిన ఎ. సాంబశివరావు (32), బి.ఆనంద్మెహతా (35), జి. శ్రీను (21), సి. కుమార్రాజు (21), ఎల్.రెడ్డి మహేష్ (24), జి. శివకుమార్ (21), వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన సి. సుధీర్‌కుమార్ అలియాస్ సుకు (30), వరంగల్‌కు చెందిన టి.శ్రావణ్‌కుమార్ (31) అనే మధ్యవర్తులను పోలీసులు అరెస్టుచేశారు. కేసు ఛేదించడంలో ప్రతిభ చూపించిన ఎస్ఐలు మల్లికార్జున, లోకేష్‌లను డీఎస్పీ అభినందించారు. ఈ ఎనిమిది మందికి కూడా ఆ అల్లరిపిల్ల ఎవరో తెలియకపోవడం కొసమెరుపు. వీరందరితో నెట్‌కాల్స్ ద్వారా మాట్లాడి కమీషన్ ఇచ్చి నగదు లావాదేవీలు జరపడానికి ఏజెంట్లుగా నియమించుకుంది. బాధితుడి ఫిర్యాదు, అరెస్టు అయిన నిందితుల వాంగ్మూలం ఆధారంగా అల్లరిపిల్లను ఓ యువతిగా గుర్తించిన పోలీసులు ఆమెను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. -
గిఫ్ట్ ఫ్రాడ్ కేసులో నైజీరియన్ అరెస్ట్
సాక్షి,హైదరాబాద్ కస్టమ్స్ అధికారిగా ఫోన్ చేసి అందినకాడిక దండుకుంటున్న నైజీరియన్‌ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏసీసీ కేవీఎం ప్రసాద్ తెలిపిన మేరకు.. ఈస్ట్ మారెడ్‌పల్లికి చెందిన ఓ మహిళకు యూకేకు చెందిన డాక్టర్ హెర్మన్ లియోన్ అనే పేరుతో ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయగా ఆమెకు హెర్మన్ వాట్సాప్ నంబర్‌ను ఇచ్చాడు. తక్కువ సమయంలో వీళ్లిద్దరు మంచి స్నేహితులయ్యారు. యూకే నుంచి 40 వేల పౌండ్ల విలువైన పార్సిల్‌ను బహుమతిగా పంపిస్తున్నానని హెర్మన్ తెలిపాడు. పార్సిల్ కోసం మనీ లాండరింగ్ చార్జీలు, ఆదాయ పన్ను, బీమా వంటి రకరకాల చార్జీలు చెల్లించాలని తెలపగా.. వేర్వేరు ఖాతాలకు రూ.38.57 లక్షలు సమర్పించుకుంది. ఎంతకీ పార్సిల్ ఇంటికి రాకపోవటంతో నిరాశ చెందిన సదరు మహిళ.. తాను మోసపోయానని తెలుసుకొని గతేడాది మే 27న సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాంకేతిక ఆధారలను సేకరించి ఢిల్లీలోని జనక్‌పురిలో నివాసం ఉంటున్న నైజీరియన్ ఒనేకా సొలమన్ విజ్డమ్ అలియాస్ సైమన్ను అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 7 సెల్ఫోన్లు, రెండు బ్యాంక్ ఖాతా పుస్తకాలు, ఒక డెబిట్ కార్డ్ స్వాధీనం చేసుకున్నారు. (చదవండి: ఆ నేరానికి గానూ... ఒక వ్యక్తికి ఐదేళ్లు జైలు శిక్ష!!) -
ఫేస్బుక్లో పరిచయం.. మత్తిచ్చి అత్యాచారం.. ఫోర్న్‌వీడియో తీసి 10 లక్షలు డిమాండ్!
సాక్షి, లక్నో: ఫేస్బుక్లో యువతితో స్నేహం చేసి అత్యాచారానికి పాల్పడిన ఉదంతం ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో తాజాగా వెలుగు చూసింది. అంతేకాకుండా నిందితుడు అత్యాచారాన్ని వీడియోతీసి బాధితురాలి తండ్రి ఫోన్‌కు పంపి 10 లక్షల రూపాయలు డిమాండ్ చేశాడు. బాధితురాలి పిర్యాదుమేరకు నిందితుడిని అరెస్టుచేసి జైలుకు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. బాధితురాలికి 2019లో ఫేస్బుక్ ద్వారా సన్నీ గుప్త అనే యువకుడు పరిచయమయ్యాడు. ఆగ్రాకు చెందిన సన్నీ తరచుగా ఫేస్బుక్లో చాట్ చేసేవాడు. ఐతే లక్నో చేరుకున్న సన్నీ బాధితురాలిని హోటల్‌కు రావల్సిందిగాకోరాడు. అతని పన్నాగం తెలియని బాధితురాలు హోటల్‌కు చేరుకోగా ఆమెకు మత్తుమందిచ్చి, అత్యాచారానికిపాల్పడ్డాడు. పోర్నోగ్రఫీ వీడియో చిత్రీకరించి ఆమెను తరచుగా బ్లాక్మెయిల్ చేసి, పలుమార్లు అత్యాచారానికిపాల్పడ్డాడు కూడా. ఖ్యాతి గర్జ్ సెంట్రల్ జోన్ డీసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు అభ్యంతరకర వీడియోను బాధితురాలి తండ్రికి పంపి పది లక్షలు డిమాండ్ చేయడంతో, బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు ఫైల్ చేసిన పోలీసులు అలంబాగ్‌లో నిందితుడు సన్నీ గుప్తను అరెస్ట్ చేసినట్లు మీడియాకు తెలిపారు. చదవండి: ల్యాప్ టాప్, స్మార్ట్ ఫోన్‌ను డిటర్జెంట్‌తో శుభ్రం చేసిన టెకీ భార్య.. విడాకుల పంచాయితీ! -
పెళ్లికొడుకు కదా అని ‘చెప్పినట్టు’ చేస్తే... అశ్లీల వీడియోలతో..
సౌజన్య (పేరు మార్చడమైనది)కు మాట్రిమోనియల్ వెబ్సైట్ ద్వారా పెళ్లి సంబంధం వచ్చింది. విదేశాలలో ఉన్న పెళ్లికొడుకు స్వదేశానికి త్వరలో వస్తున్నానని చెప్పాడు. సౌజన్య చాలా సంతోషించింది. నెల రోజులుగా వాట్సప్ చాట్ల ద్వారా ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. ఆధునిక దుస్తుల్లో కనిపించాలని కోరాడు పెళ్లికొడుకు. నమ్మిన సౌజన్య అతను ‘చెప్పినట్టు’ చేసింది. దానిని రికార్డ్ చేసిన పెళ్లికొడుకు ఆ వీడియోను అశ్లీల వెబ్సైట్లో పెట్టాడు. ఆ తర్వాత అతను తన ఆన్లైన్ అకౌంట్స్ అన్నీ బ్లాక్ చేశాడు. మోసపోయిన విషయం అర్ధమైన సౌజన్య ఆత్మహత్యే శరణ్యం అనుకుంది. ∙∙ కీర్తన (పేరు మార్చడమైనది) పేరుతో ఫేస్బుక్లో ఫేక్ ఐడీ సృష్టించబడినట్టు తెలిసింది. దాని ద్వారా తనను వేధిస్తున్నవారి ఆటకట్టించాలనుకుంది. కానీ, ఎలాగో తెలియలేదు. ∙∙ సుందర్ (పేరు మార్చడమైనది) ఏడాది క్రితం సేంద్రీయ ఆహార ఉత్పత్తుల సంస్థకు యజమాని అయ్యాడు. చిన్న సంస్థే అయినా ఇప్పుడిప్పుడే లాభాలు అందుతున్నాయి. తన సంస్థ ఉత్పత్తులు మంచివి కావని, తనకు నష్టం కలిగించే ప్రకటనలు ఆన్లైన్లో చూసి షాకయ్యాడు. ∙∙ ఈ డిజిటల్ కాలంలో అపరిచత వ్యక్తుల నుంచి రకరకాల మోసాలకు లోనయ్యేవారి శాతం రోజు రోజుకూ పెరుగుతోంది. కరోనా కాలాన్ని ఉపయోగించుకొని మరింతగా సైబర్ నేరాలు పెరిగాయి. ఈ నేరాలలో పిల్లలు, మహిళలు ఎక్కువశాతం మోసానికి గురవుతున్నారు. అదేవిధంగా రకరకాల యాప్‌లు వచ్చి, డబ్బు దోపిడీ కూడా జరుగుతోంది. మోసం జరగకుండానే ముందస్తు జాగ్రత్తపడటం ఒక ఎత్తయితే, మోసపోయామని తెలిసినా తమని తాము రక్షించుకోవడం ఎలాగో ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం అవసరం. ఫిర్యాదు చేయడం ఎలా? మొబైల్ లేదా కెమెరా వాడకంతో పిల్లలను, స్త్రీలను వారి వ్యక్తిగత, అశ్లీల చిత్రాలు, వీడియోలను తీసి, ఆన్ లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా చూపినా, డిజిటల్ టెక్నాలజీ ద్వారా బాధితులను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నా, ఒక వ్యక్తి లేదా సంస్థ యొక్క డేటా, ఆర్థిక సమాచారాన్ని డిజిటల్ మాధ్యమం ద్వారా దొంగిలించినా, వ్యక్తిగత సమాచారం లేదా డేటాను పొందడానికి, డబ్బు లేదా పరువును కోల్పోయేవిధంగా మోసపూరిత ప్రయత్నం చేసినా, నెట్‌వర్క్‌ను దోపిడీ చేసే హ్యాకింగ్ ప్రక్రియకు పూనుకున్నా.. ఇలా ఏ డిజిటల్ మోసానికైనా సరైన ముందు https://cybercrime.gov.in లో ఫిర్యాదు చేయడం. ఆన్లైన్ మార్గాలలో ఆర్థిక నష్టం జరిగితే https://cyberpolice.nic.in లో ఫిర్యాదు చేయాలి. దీనినే సిటిజన్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటారు. పై రెండు పోర్టల్స్‌కి 15526 హెల్ప్‌లైన్ నెంబర్ అనుసంధానమై ఉంటుంది. దీనికి ఆర్బిఐ ఆమోదించిన అన్ని బ్యాంకులు అనుసంధానమై ఉంటాయి కాబట్టి ఫిర్యాదు అందిన వెంటనే సంబంధిత అకౌంట్ల తక్షణ నగదు లావాదేవీలను నిలిపి వేసి, మీ డబ్బును సురక్షితం చేస్తాయి. ఈ హెల్ప్‌లైన్ నెంబర్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తుంది. మీ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫోన్ నెంబర్‌ను నమోదు చేసి, వచ్చిన ఓటీపీ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి. అందులో.. (1) చైల్డ్ పోర్నోగ్రఫీ (2) పిల్లల లైంగిక వేధింపులు (3) అసభ్యకరమైనవి, లైంగికపరమైనవి (జీజీ) ఇతర సైబర్ నేరాలు (1) మొబైల్ నేరాలు (2) సోషల్ మీడియా నేరాలు (3) ఆన్ లైన్ ఆర్థిక మోసాలు (4) సైబర్ ట్రాఫికింగ్ (5) హ్యాకింగ్... కి సంబంధించిన అంశాలు ఉంటాయి. ఫిర్యాదు చేసే ప్రక్రియ ఆఫ్‌లైన్ – ఆన్ లైన్ రెండు విధానాల్లో ఉంటుంది. సంఘటన ఏవిధంగా జరిగిందో తెలియజేయడానికి: (ఎ) కమ్యూనికేషన్ మోడ్ అంటే ఇంటర్నెట్, వాట్సాప్ .. ఏ విధానంలో అనేది తెలియజేయాలి. (బి) తేదీ – సమయం (సి) ప్లాట్‌ఫారమ్ (ఇంటర్నెట్, వాట్సాప్ మొదలైనవి) . (డి) ఆర్థిక మోసాలకు సంబంధించిన ఆధారాలు అప్లోడ్, పేమెంట్లు / బ్యాంక్ స్టేట్మెంట్ల స్క్రీన్షాట్లు. వేధింపులకు గురిచేసేవారి సంబంధిత స్క్రీన్ షాట్లు, ఫొటో, ఆడియో, వీడియో మొదలైనవి జత చేయాలి. అనుమానితుల వివరాలు (అందుబాటులో ఉంటే): (ఎ) అనుమానితుని పేరు (బి) గుర్తింపు (మొబైల్, ఇమెయిల్) (సి) ప్రదేశం.. మొదలైనవి) ఫిర్యాదుదారుల వివరాలు: (ఎ) పూర్తి పేరు – సహాయక వివరాలు (తండ్రి, జీవిత భాగస్వామి, గార్డియన్ మొదలైనవి) (బి) ఇమెయిల్ / ఫోన్ నంబర్ (సి) చిరునామా – ఐడీ ప్రూఫ్ (ఆధార్ మొదలైనవి) ఫిర్యాదును దాఖలు చేయడానికి దశల వారీ ప్రక్రియ ద్వారా వివరంగా తెలియజేయాలి. సత్వర స్పందన కోసం సమీప సైబర్‌క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవచ్చు. డిజిటల్‌గా మోసం ఎలా జరిగినా పోలీసులు, పోర్టల్, హెల్స్‌లైన్.. ఆపద్భాంధువుల్లా ఉన్నారనే విషయాన్ని విస్మరించరాదు. – అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
Hyderabad: ఫేస్బుక్ పరిచయం.. కాలేజీలో సీటు ఇప్పిస్తానని చెప్పి..
సాక్షి, చందానగర్(హైదరాబాద్): ఫేస్బుక్లో అమ్మాయిలతో పరిచయం పెంచుకోవడం.. ఆపై కాలేజీలో సీటు ఇప్పిస్తానని చెప్పి నమ్మించి డబ్బులు తీసుకొని మోసం చేయడం.. ఇలా రెచ్చిపోతున్న ఓ కేటుగాడిని చందానగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ క్యాస్ట్రో తెలిపిన వివరాల ప్రకారం... వరంగల్ జిల్లా మహబుబాబాద్‌కు చెందిన సందీప్‌కుమార్ వేమిశెట్టి అలియాస్ అభినవ్‌కుమార్ (34) ఇంటర్మీడియట్ చదివాడు. 2014లో హైదరాబాద్‌కు వచ్చి క్యాటరింగ్ పనిచేశాడు. తిరిగి స్వగ్రామానికి వెళ్లి ఆటో నడుపుకుంటూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలో సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఫేస్బుక్ ద్వారా అమ్మాయిలను పరిచయం చేసుకొని సన్నిహితంగా ఉండేవాడు. కాలేజీల్లో సీటు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి డబ్బులు తీసుకొని మోసం చేసేవాడు. ఇదే క్రమంలో చందానగర్ ఠాణా పరిధిలో నివాసం ఉండే ఓ అమ్మాయితో ఫేస్బుక్లో సందీప్‌కుమార్ పరిచయం చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెతో సన్నిహితంగా మెలిగాడు. ఓ కళాశాలలో ఎన్ఆర్ఐ కోటలో బీఫార్మసీ సీటు ఇప్పిస్తానని నమ్మించి రూ.46 వేలు వసూలు చేశాడు. కొన్ని రోజుల తర్వాత ఆ అమ్మాయి పెళ్లి ప్రస్థావన తీసుకురాగా.. అసభ్యకర పదజాలంతో దూషించడంతో పాటు తన వద్ద ఉన్న ఆమె ఫొటోలను అందరికీ షేర్ చేస్తానని బెదిరించాడు. బీఫార్మసీ సీటు కోసం తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చేది లేదని తేల్చిచెప్పాడు. దీంతో బాధితురాలు చందానగర్ పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేసిన పోలీసులు.. సాంకేతిక పరిజ్ఞానంతో సందీప్‌కుమార్ ఆచూకీ తెలుసుకొని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తన నేరాన్ని ఒప్పుకున్నాడు. దీంతో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇతడిపై ఇప్పటికే సైబరాబాద్, ఎల్బీనగర్, ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుల్లో కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: నిఖా అయిన నిమిషానికే ప్రియుడితో పెళ్లికూతురు పరార్! -
ఫేస్బుక్లో మరో సూపర్ ఫీచర్, వాయిస్,వీడియో కాలింగ్..
మనం ఫోన్ తో చేసే వాయిస్ కాల్, వీడియోకాల్‌ను ఇకపై ఫేస్ బుక్ నుంచి చేసే అవకాశం ఉంది. ఎస్. ఫేస్ బుక్ ను మరింత అందంగా తీర్చిదిద్దేందుకు ఆ సంస్థ సీఈఓ మార్క్ జూకర్ బెర్గ్ ప్రయత్నాలు చేస్తున్నారు.ఇందులో భాగంగా యుజర్లను మరింత అట్రాక్ట్ చేసేందుకు వాయిస్ - వీడియా కాలింగ్ ఆప్షన్ పై వర్క్ చేస్తున్నారని బ్లూమ్ బెర్గ్ తెలిపింది. వాస్తవానికి ఈ ఫీచర్‌ను ఫేస్బుక్..'ఫేస్బుక్ మెసేంజర్'కు అటాచ్ చేసింది. దీంతో యూజర్లు వీడియో కాలింగ్ చేసుకోవాలంటే ఫేస్బుక్ మెయిన్ పేజ్‌ను క్లోజ్ చేసి మెసేంజర్‌లోకి వెళ్లేవారు. అలా వెళ్లడం వల్ల యూజర్లు ఫేస్బుక్ ను వినియోగించడం తగ్గిస్తున్నారని మార్క్ జూకర్ బెర్గ్ గుర్తించారు. అయితే అప్పటి వరకు ఒకటిగా ఉన్న ఫేస్ బుక్ ను - ఫేస్ బుక్ మెసెంజర్ ను 2014లో వేరు చేశారు. వాయిస్ - వీడియో కాలింగ్ ఆప్షన్ ను ఫేస్ బుక్ మెసెంజర్‌కు జోడించారు. ఇప్పుడు మళ్లీ ఇదే ఫీచర్ ను ఫేస్బుక్ డెవలప్ చేసే పనిలో పడిందని బ్లూమ్ బెర్గ్ తన కథనంలో ప్రస్తావించింది.త్వరలో ఈ ఫీచర్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుందని పేర్కొంది. -
ముగ్గురు యువతులతో ప్రియుడి డేటింగ్.. ట్విస్ట్ ఏంటంటే..
వాషింగ్టన్: ఈ మధ్యకాలంలో తరచుగా అబ్బాయిలు, అమ్మాయిలు ప్రేమ పేరుతో మోసపోతున్న సంఘటనలు చాలానే చోటు చేసుకుంటున్నాయి. అయితే, వీటి వెనుక అనేక కారణాలు ఉంటున్నాయి. కొన్ని చోట్ల ఒక యువకుడు.. ఇద్దరు, ముగ్గురు యువతులతో డేటింగ్ చేస్తుండగా.. మరికొన్ని చోట్ల యువతులు తామేమి తీసిపోనట్టు ఇదే విధంగా ప్రవర్తిస్తున్నారు. దీంతో ఇలాంటి మోసాలు ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాయి. తాజాగా, యూఎస్‌కి చెందిన ఒక యువకుడు ఒకేసారి ముగ్గురు యువతులను మోసం చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. ఈ సంఘటన బోయిస్లో జరిగింది. కాగా, బోయిస్ కు చెందిన మోర్గాన్ అనే యువకుడు.. బెకా కింగ్, అబిరాబర్ట్స్, టాబోర్ యువతులతో ఒకరికి తెలియకుండా మరొకరితో ప్రేమాయణం నడిపాడు. కొంత కాలం ఇతగాడి మోసం బాగానే సాగింది. అయితే, కొన్ని రోజుల తర్వాత టాబోర్ అనే యువతి, తన ప్రియుడి మోసాన్ని గ్రహించింది. దీంతో ఈ బండారం కాస్త వెలుగులోకి వచ్చింది. ఈ సందర్భంగా తన చేదు అనుభవాన్ని సిఎన్ఎన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది. టాబోర్ ఒక రోజు ఫేస్బుక్లో తన ప్రియుడు వేరే యువతితో కలిసి ఉన్న ఫోటోలను చూసింది. దీంతో ఆమె అనుమానంతో తన ప్రియుడి అకౌంట్‌ను తెరిచి చూసింది. ఆమెకు షాకింగ్ విషయాలు తెలిశాయి. అతను మరో యువతితో డేటింగ్ చేస్తున్నట్లు తెలుసుకుంది. దీంతో తాను మోసపోయినట్లు గ్రహించింది. తాను ఎవరితో అయితే, జీవితం పంచుకోవాలనుకుందో.. అతను మోసం చేయడంతో తట్టుకోలేక పోయింది. దీంతో సదరు, ప్రియుడికి బుద్ధి చెప్పాలనుకుంది. అతని అకౌంట్‌ను మరింత పరిశీలించింది. అతనితో డేటింగ్లో బెకాసింగ్, రాబర్ట్స్అనే మరో ఇద్దరు యువతులు కూడా ఉన్నట్లు గుర్తించింది. అయితే, టాబోర్ వీరిని రహస్యంగా కలుసుకుంది. తన ప్రియుడి మోసం గురించి వారికి తెలియజేసింది. దీంతో అతని బండారం కాస్త బయటపడింది. ఒకరోజు మోర్గాన్, టాబోర్ను కలవటానికి వచ్చాడు. ఈ క్రమంలో వారంతా ఒక్కచోటికి చేరి అతగాడిని నిలదీశాడు. వారిని ఒక చోట చూసి అతను షాక్‌కు గురయ్యాడు. అయితే, అప్పటికి వారికి మాయమాటలు చెప్పాడానికి ప్రయత్నించాడు. ఆ ముగ్గురు యువతులు ప్రియుడికి బుద్ధి చెప్పారు. అతగాడి బారినుంచి తప్పించుకున్నారు. అతగాడు వీరినే కాకుండా, మరో ఆరుగురిని కూడా మోసం చేస్తున్నట్లు తెలుసుకొని ఆశ్చర్యపోయారు. ఈ మోసం నుంచి బయటకు పడ్డాక.. బెకా కింగ్, అబిరాబర్ట్స్, మోర్గాన్ టాబోర్లు మంచి స్నేహితులుగా మారిపోయారు. ఈ మోసం నుంచి బయటపడాటానికి ఎక్కడికైనా విహార యాత్రకు వెళ్లాలనుకున్నారు. ఈ క్రమంలో వారు ముగ్గురు కూడా ఒక పాత బస్సు కొనుగోలు చేశారు. వారు దానికి కొన్ని మరమ్మత్తులు చేయించారు. ఆ తర్వాత వారి యాత్రను ప్రారంభించారు. దీనికి కొంత మంది దాతలు కూడా సహయం చేశారు. ఈ క్రమంలో వారు.. బోయిస్‌లోని సరస్సులు, గ్రాండ్ టెటన్ నేషనల్ పార్క్, ఎల్లో స్టోన్ నేషనల్ పార్క్ లను సందర్శించినట్లు తెలిపారు. ఇప్పుడు మేము చాలా ఆనందంగా ఉన్నాము. మా గతంలోని చేదు అనుభవాలను పూర్తిగా మరిచిపోయామని రాబర్ట్, బెకాసింగ్ తెలిపారు. అతనికి ప్రేమను పొందే హక్కులేదు. ఇప్పుడు తామంతా ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించామని టాబోర్ తెలియజేసింది. -
ఫేస్బుక్ పరిచయం.. మోడలింగ్ చాన్స్ ఇప్పిస్తానని చెప్పి.. ఆపై
సాక్షి, బొమ్మనహళ్లి(కర్ణాటక): బన్నేరుఘట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని బిల్వర్థహళ్లి గ్రామ పంచాయతీ సభ్యుడు అహ్మద్‌పాషా తనను గన్‌తో బెదిరించి అత్యాచారానికి పాల్పడినట్లు ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు.. హెబ్బాళ సమీపంలో నివాసం ఉంటున్న యువతి మోడలింగ్ రంగంపై ఆసక్తి పెంచుకుంది. ఈ క్రమంలో ఫేస్బుక్లో బిల్వర్థహళ్లి జీపీ సభ్యుడు అహ్మద్‌పాషా ఆ యువతితో పరిచయం పెంచుకున్నాడు. మోడలింగ్ రంగంలో ఆమెకు ఆసక్తి ఉన్నట్లు తెలుసుకున్నాడు. తనకు తెలిసినవాళ్లు ఉన్నారని, అవకాశం కల్పిస్తానని నమ్మించాడు. దీంతో ఆ యువతి శ్యానబోగనహళ్లిలోని అహ్మద్ నివాసానికి వెళ్లగా మాటలు కలిపి అత్యాచారానికి యత్నించగా ప్రతిఘటించింది. అయితే నిందితుడు తుపాకీతో బెదిరించి అత్యాచారానికి ఒడిగట్టాడు. యువతిని నగ్నంగా ఫొటోలు తీశాడు. ఎవరికైనా చెబితే ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేస్తానని బెదిరించాడు. దీంతో బాధితురాలు బన్నేరుఘట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి అహ్మద్ పాషా కోసం గాలింపు చేపట్టారు. చదవండి: విషాదం: బతుకు దెరువు కోసం వచ్చి.. మున్నేరువాగులో గల్లంతు.. -
ఫేస్బుక్ పరిచయం: ప్రేమ పేరుతో మైనర్‌పై లైంగిక దాడి..
సాక్షి,పెనమలూరు: ఇంటర్ చదువుతున్న బాలికతో(17) పరిచయం పెంచుకుని ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెపై లైంగిక దాడి చేసిన యువకుడు, అతనికి సహకరించిన మరి కొందరు యువకులపై పోలీసులు బుధవారం పోక్సో కేసు నమోదు చేశారు. పెనమలూరు పోలీసుల కథనం ప్రకారం.. కానూరు గుమ్మడితోటకు చెందిన బాలిక తల్లిదండ్రులు విడిపోవటంతో మేనమామ ఇంట్లో ఉంటూ విజయవాడలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆమెకు ఫేస్బుక్లో బాబీ, గోవిందు, నిఖిల్, బుజ్జి, అవినాష్‌తో పరిచయం ఏర్పడింది. అయితే విజయవాడ పటమటలో నివాసం ఉండే గోవిందు బాలికను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో బాలికను కానూరులో బాబీ ఇంటికి తీసుకెళ్లి ఆమెపై లైంగిక దాడి చేశాడు. ఈ ఘటన జరిగిన తరువాత బాలిక తనను మోసం చేయవద్దని పెళ్లి చేసుకోవాలని గోవిందును కోరింది. దీంతో గోవిందుతో పాటు అతని మిత్రులు తమ వద్ద ఫొటోలు ఉన్నాయని, అవి బయటపెడతామని బాలికలను బెదిరించసాగారు. దీంతో బాలిక పెనమలూరు పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయాలని ఫిర్యాదు చేసింది. పోలీసులు గోవిందుతో పాటు అతని మిత్రులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. చదవండి: ప్రియుడి నాటకంతో శానిటైజర్ తాగి ప్రియురాలి ఆత్మహత్య -
దక్షిణాది వారే టార్గెట్.. అశ్లీల వీడియోలతో ఎర
సాక్షి, హైదరాబాద్ : ఎవరైనా బెదిరించి డబ్బు దండుకోవడాన్ని ఎక్స్టార్షన్ అంటారు...ఆన్లైన్ అశ్లీలంతో ఎర వేసి బెదిరిస్తూ అందినకాడికి వసూలు చేయడాన్ని సెక్స్టార్షన్ అంటున్నారు. ఆన్లైన్ ఆధారంగా జరిగే ఈ నేరాలు ఇటీవల పెరిగిపోయాయి. సిటీ సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్‌కు తరచు ఈ బాధితులు వస్తున్నారు. అయితే తొలిసారిగా మలక్‌పేటకు చెందిన వ్యక్తి రూ.2 లక్షలు పోగొట్టుకుని శనివారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో ఢిల్లీ పోలీసులు ఓ గ్యాంగ్‌ను పట్టుకున్నారు. దీంతో ఇక్కడి అధికారులు ఆ పోలీసుల నుంచి వివరాలు సేకరించాలని నిర్ణయించారు. ఈ–యాడ్స్ సైట్ ఓఎల్ఎక్స్లో సెకండ్ హ్యాండ్ వస్తువులు అంటూ ఆర్మీ అధికారులుగా ప్రకటనలు ఇచ్చి అందినకాడికి దండుకుంటున్న, నకిలీ ఫేస్బుక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి ‘ఫ్రెండ్స్’ నుంచి డబ్బు వసూలు చేస్తున్న నేరాలు చేసే రాజస్థాన్‌లోని భరత్పూర్ గ్యాంగే ఈ సెక్స్టార్షన్ క్రైమ్ మొదలెట్టింది. సైబర్ నేరగాళ్లు తొలుత నకిలీ వివరాలు, ఇంటర్నెట్ నుంచి సేకరించిన మహిళల ఫొటోలతో ఫేస్బుక్లో ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తున్నారు. వీటికి ఎదుటి వారిని ఇట్టే ఆకర్షించే ఫొటోలను ప్రొఫైల్ పిక్చర్స్‌గా ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రొఫైల్స్ ద్వారా ఫేస్బుక్లో ఉన్న అనేక మందికి ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపిస్తున్నారు. ప్రత్యేక యాప్స్ ద్వారా ఈ నేరగాళ్లు ఉత్తరాదికి చెందిన వారు కావడంతో ఎక్కువగా దక్షిణాదికి చెందిన వారినే టార్గెట్‌గా చేసుకుంటున్నారు. ఎక్కువగా ‘సింగిల్ స్టేటస్’ కలిగిన వారినే ఎంచుకుని..తామూ ‘సింగిల్’ అంటూ తన ప్రొఫైల్స్‌లో పొందుపరుస్తున్నారు. వీటిని చూస్తున్న వాళ్లు తక్షణం రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్ చేసి ఫ్రెండ్స్‌గా మారిపోతున్నారు. ఇలా తమకు ఫ్రెండ్స్‌గా మారిన వాళ్లతో సైబర్ నేరగాళ్లు కొన్నాళ్ల పాటు సదరు యువతి మాదిరిగానే మెసెంజర్లో చాటింగ్ చేస్తున్నారు. ఆ త ర్వాత సెక్స్ చాటింగ్ మొదలు పెట్టి వాట్సాప్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకునేలా చేస్తున్నారు. ఇవి చేతికి అందిన తర్వాత అసలు కథ మొదలువుతోంది. ఇంటర్నెట్ సంగ్రహించిన అర్ధనగ్న, నగ్న వీడియోలను సైబర్ నేరగాళ్లు ప్రత్యేక యాప్స్ ద్వారా తమ ఫోన్లో ఉంచి టార్గెట్ చేసిన వ్యక్తులకు ఫోన్లు చేస్తున్నారు. వాళ్లతో మాట్లాడుతూ తామే నగ్నంగా తయారవుతున్నామంటూ ఆ యాప్‌లోని వీడియోను ప్లే చేస్తున్నారు. చదవండి: నగ్నంగా కవ్వించి...ఆపై రికార్డు చేసి 'నేను చనిపోతున్నా.. పిల్లల్ని బాగా చూసుకో' దీన్ని చూస్తున్న బాధితులకు ఆ యువతి/మహిళ ఫోన్ కెమెరా ముందే అలా చేస్తున్నట్లు కనిపిస్తుంది. దీంతో పూర్తిగా వారి వల్లో పడిపోతున్నారు. ఇలా ఒకటిరెండు సార్లు వీడియోలు చూపిస్తున్న సైబర్ నేరగాళ్లు ఆపై మాటల్లో దింపి బాధితులూ అలా చేసేలా చేస్తున్నారు. ఈ దృశ్యాలను స్క్రీన్ రికార్డింగ్ యాప్స్ ద్వారా రికార్డు చేస్తున్నారు. ఆపై వీటిని తాము సృష్టించిన యూ ట్యూబ్ చానల్స్‌లో ఉంచి ఆ లింకుల్ని బాధితులకు వాట్సాప్ చేస్తున్నారు. కంగుతింటున్న బాధితులు తొలగించాలంటూ వారిని ప్రాధేయపడుతున్నారు. తాము కోరిన మొత్తం చెల్లింకుండా వీటిని ఇతర సోషల్‌మీడియాలో పెట్టేస్తామంటూ నేరగాళ్లు బెదిరిస్తున్నారు. ఇలా అందినకాడికి పేటీఎం, గూగుల్ పే, బ్యాంకు ఖాతాల ద్వారా డబ్బు డిపాజిట చేయించుకుంటున్నారు. ఆపై పోలీసుల మాదిరిగా బాధితులకు కాల్స్ చేస్తూ మరో అంకానికి తెరలేపుతున్నారు. నగ్న వీడియోలతో వేధించినందుకు నీపై ఫలానా యువతి ఫిర్యాదు చేసిందంటూ పోలీసుల మాదిరిగా నేరగాళ్లు బాధితులతో మాట్లాడుతున్నారు. ఆ పేరుతోనూ మరికొంత స్వాహా చేస్తున్నారు. వీరి వల్లోపడిన ఇద్దరు ఆర్మీ జవాన్లు రూ.10 వేల చొప్పున చెల్లించి గతంలో సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదయ్యాయి. తాజాగా మలక్‌పేటకు చెందిన వ్యక్తి రూ.2 లక్షలు పొగొట్టుకున్నాడు. బెదిరింపుల పాలైనా డబ్బు చెల్లించని వాళ్లు ప్రతి నెలా దాదాపు 20 మంది వరకు సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయిస్తున్నారు. వీరి బలహీనతలే వారికి బలం సైబర్ నేరగాళ్లకు ఎదుటి వారి బలహీనతలే బలంగా మారుతున్నాయి. ఆన్లైన్, సోషల్ మీడియాల్లో ఎంత క్రమశిక్షణతో ఉంటే అంతమేలు. అపరిచితులు..ప్రదానంగా మహిళలు, యువతుల పేర్లతో వచ్చే రిక్వెస్ట్‌లకు స్పందించకూడదు. ఈ నేరాల్లో బాధితులుగా మారితే ఒక్కోసారి ఆర్థికంగా, సామాజికంగా, కుటుంబ పరంగా నష్టపోవాల్సి ఉంటుంది. పరిచయం లేని వారితో వ్యక్తిగత, ఆంతరంగిక చాటింగ్స్, ఫొటోలు, వీడియోల మారి్పడిలు చేయకపోవడం ఉత్తమం. – కేవీఎం ప్రసాద్, సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ -
ఫేక్ ఐడీస్: నమ్మారో.. మోసపోయినట్లే..!
బేస్తవారిపేట(ప్రకాశం జిల్లా): ఆధునిక యుగంలో చదువుకున్న ప్రతి ఒక్కరూ ఫేస్బుక్లో అకౌంట్లు ఓపెన్ చేస్తున్నారు. మారుతున్న కాలంతో పాటు యువత ఇంటర్నెట్ వైపు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. ఫేస్బుక్ ఖాతాను విరివిరిగా వినియోగిస్తున్నారు. ఎటువంటి సమాచారమైనా క్షణాల్లో పోస్టింగ్ చేయడం.. షేర్ చేయడం అలవాటుగా మారింది. దీంతో ఉపయోగం ఎంత ఉందోకానీ కొందరికి కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. ఫేస్బుక్ అకౌంట్లో ప్రొఫైల్ ఫొటోను కొందరు డౌన్లోడ్ చేసుకుని ఫేక్ అకౌంట్‌ను అదే పేరుమీద ఓపెన్ చేస్తున్నారు. ఫేస్బుక్ మెసెంజర్లో ఓన్ హెల్ప్ మీ..అంటూ చాటింగ్ చేస్తారు. చదవండి: ఫోన్ చేసి విసిగిస్తావా అంటూ.. ఫేస్బుక్ స్నేహితులు స్పందించినప్పుడు అర్జెంట్‌గా అమౌంట్ కావాలని, గూగూల్ పే, ఫోన్ పే, బ్యాంక్ అకౌంట్ నంబర్.. ఇలా ఏదీ కావాలంటే అది ఇస్తారు. ఆపదలో ఉన్నారు.. అత్యవసరంగా డబ్బు అవసరమై ఉంటుందని భావించిన స్నేహితులు రూ.20 వేలు, రూ.10 వేలు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. మొదట్లో పెద్ద మొత్తంలో మనీ అవసరమంటూ చాటింగ్ చేస్తూ చివరకు ఎంతో కొంత అత్యవసరంగా కావాలంటూ అడుగుతున్నారు. చదవండి: వీడని మిస్టరీ: ఆ బాలుడు ఏమయ్యాడో..? గతంలో ఇక్కడ పనిచేసి బదిలీపై వెళ్లిన ఓ ఎస్ఐ, కంభంలోని హీరో షోరూమ్ వ్యక్తి, బేస్తవారిపేటలోని ఓ కళాశాల కరస్పాండెంట్ల పేరుతో దొంగ ఫేస్బుక్ అకౌంట్లు సృష్టించి పలువురి నుంచి భారీగానే అమౌంట్ దోచేశారు. వారం క్రితం ఓ పురుగుమందుల సంస్థలో పనిచేసే సేల్స్ మేనేజర్ అకౌంట్‌ను ఇలాగే చేశారు. స్పందించిన ఐదుగురు స్నేహితుల నుంచి రూ.60 వేలు కొట్టేశారు. ఇచ్చిన బ్యాంక్ అంకౌంట్ నంబర్లు, ఫోన్ నెంబర్లు ఛత్తీఘడ్లోని రాయచూర్ ప్రాంతాలకు చెందినవిగా గుర్తించారు. గూగూల్, ఫోన్ పేలలో ఒకే పేరు గూగూల్ పే, ఫోన్ పేలలో ఫోన్ నంబర్ నమోదు చేయగానే పేరు చూపిస్తుంది. దొంగతనంగా తయారు చేసిన డూప్లికేట్ వ్యక్తుల ఫోన్ నంబర్ ఇతర రాష్ట్రాల్లోని వ్యక్తులకు సంబంధించినా ఓరిజినల్ వ్యక్తికి సంబంధించిన పేరు వస్తుంది. దీంతో నగదు బదిలీ చేసేటప్పుడు ఎటువంటి అనుమానం లేకుండా స్నేహితులు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఉన్నత విద్యావంతులు కూడా మోసపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ట్రాన్సక్షన్స్ ముగిసిన తర్వాత మరుసటి రోజుకు అతని ఫోన్ నంబర్ ఫోన్ పేలో నమోదు చేస్తే వేరే పేరు రావడం గమనార్హం. -
ప్రాణం మీదికి తెచ్చిన ఫేస్బుక్ ప్రేమ
మదనపల్లె టౌన్ : ఫేస్బుక్ ప్రేమ ఓ యువతి ప్రాణం మీదకు వచ్చింది. ప్రేమికుడు పెళ్లికి నిరాకరించి, మరొకరితో పెళ్లికి సిద్ధపడ్డాడని ఆమె మనస్తాపం చెందింది. జీవితంపై విరక్తితో ఆత్మహతాయ్యత్నానికి పాల్పడింది. మదనపల్లె మండలంలో సోమవారం ఈ సంఘటన జరిగింది. రూరల్ ఎస్ఐ దిలీప్‌కుమార్, బాధితురాలి కథనం మేరకు మండలంలోని ఓ రైతు కుమార్తె (20)కు మదనపల్లెలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదివే సమయంలో అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన వినోద్‌కుమార్‌తో ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ఏడాదిగా చాటింగ్ చేసుకుంటూ ప్రేమించుకున్నారు. కొంతకాలం సహజీవనం సాగించారు. పెళ్లి చేసుకుందామనుకున్న సమయంలో ఇద్దరి కుటుంబ సభ్యులకు సమాచారం తెలిసింది. అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయిని హెచ్చరించారు. అతని ఫోన్ నంబర్ బ్లాక్ చేశారు. దీంతో ఆ యువకుడు మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు. అదే సమయంలో యువతికి తల్లిదండ్రులు దగ్గరి బంధువుతో పెళ్లి కుదిర్చారు. ఇష్టంలేని పెళ్లి చేసుకోలేక ప్రియుడికి ఫోన్ చేసింది. అతడు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నట్లు చెప్పాడు. దీంతో మనోవేదనకు గురైన ఆ యువతి సోమవారం పురుగుమందు తాగింది. కుటుంబ సభ్యులు హుటాహుటిన మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు ప్రథమ చికిత్స చేశారు. మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు. రూరల్ ఎస్ఐ దిలీప్‌కుమార్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మహిళపై సామూహిక అత్యాచారం ? గుర్రంకొండ : ఓ మహిళపై పది మంది యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన మండల కేంద్రమైన గుర్రంకొండలో జరిగింది. బాధితురాలు గాయాలతో బయటపడింది. గుర్రంకొండ గ్రామానికి సమీపంలో జీవనతోపునకు వెళ్లే మార్గంలో సిద్దేశ్వరగుట్ట పరిసరాల్లో ఈ అఘాయిత్యం జరిగినట్లు సమాచారం. ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు పది మంది యువకులు సిద్దేశ్వరస్వామి గుట్టలో ఓ పెద్ద బండరాయిపై ఉండడాన్ని పరిసర పొలాల రైతులు గమనించారు. మద్యం సేవించడానికి వారు అక్కడి వచ్చారేమోనని రైతులు భావించారు. అయితే రాత్రి 8.20 గంటలకు దాదాపు 30 సంవత్సరాల వయస్సున్న మహిళ గాయాలతో పరుగెత్తుకొంటూ సమీప కోళ్లఫారమ్ వద్దకు చేరుకుంది. అక్కడ పనిచేసే వ్యక్తులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. తనను 10 మంది యువకులు వెంబండించి అఘాయిత్యానికి పాల్పడ్డారని , వారి నుంచి తప్పించుకుని వచ్చానని భోరున ఏడ్చినట్లు ప్రత్యక్ష్య సాక్షులు పేర్కొన్నారు. ఆమెను కిడ్నాప్ చేసి తీసుకొచ్చి అత్యాచారానికి పాల్పడ్డా రా లేక, అటు వైపు వెళుతుంటే బలవంతంగా లాక్కెల్లారా అనే విషయం పోలీసుల విచారణలో తేలాలి. ఈ విషయమై ఎస్ఐ హరిహరప్రసాద్ను వివరణ కోరగా.. తమకు ఎటువంటి ఫిర్యాదు రాలేదని ఆయన పేర్కొన్నారు. -
వీడిన కార్తీక్ హత్య కేసు మిస్టరీ
గద్వాల క్రైం: మహబూబ్‌నగర్, జోగుళాంబ గద్వాల జిల్లాలలో సంచలనం సృష్టించిన కార్తీక్ హత్య, రాగసుధ ఆత్మహత్య కేసు చిక్కుముడి వీడింది. వివాహేతర సంబంధం కారణంగానే కార్తీక్ హత్యకు గురయ్యాడని.. ఆ నేరం తనపైకి వస్తుందనే ఆందోళనతో రాగసుధ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. గద్వాల డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి శనివారం కేసు వివరాలు వెల్లడించారు. రాగసుధ, కార్తీక్ ఇంటర్లో క్లాస్మేట్స్.. రవి వీరి కంటే సీనియర్. కొన్నేళ్ల క్రితం రాగసుధకు మహబూబ్‌నగర్‌కు చెందిన ఉదయ్‌కుమార్‌తో వివాహమైంది. గతంలో రాగసుధకు కార్తీక్, రవితో ఉన్న పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. అయితే రవితో చనువుగా ఉండటం గమనించిన కార్తీక్.. రాగసుధను వేధించసాగాడు. ఈ నేపథ్యంలో కార్తీక్ నుంచి తనకు విముక్తి కలిగించాలని రాగసుధ రవికి చెప్పింది. దీంతో అతను కార్తీక్ అడ్డు తొలగించాలనుకున్నాడు. ఫిబ్రవరి 24న కార్తీక్ రాగసుధకు ఫోన్ చేయగా.. ఆ విషయాన్ని ఆమె రవికి చెప్పింది. (ప్రాణాలు తీసిన ఫేస్బుక్ చాటింగ్) కార్తీక్ ఎక్కడున్నాడో ఫోన్ చేసి తెలుసుకున్న రవి.. అతనిని శ్రీనివాస్‌నగర్ కాలనీలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్లో కలిశాడు. అక్కడ ఇద్దరూ ఘర్షణ పడ్డారు. ఆ తర్వాత అక్కడి నుంచి కార్తీక్‌తో పాటు మరో ఇద్దరు స్నేహితులు వసంత్, అనిల్‌ను రవి తన కారులో ఎక్కించుకుని రాత్రి ఒంటిగంట సమయంలో గద్వాల వెళ్లాడు. అక్కడ మరో మారు వాగ్వాదం జరిగింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న రవి.. కార్తీక్ తలపై ఇనుప రాడ్‌తో బలంగా కొట్టాడు. దీంతో స్పృహ తప్పిన కార్తీక్‌ను కారు డిక్కీలో వేసుకుని రవి నిర్వహిస్తున్న డెకరేషన్ షాప్ వద్దకు తీసుకెళ్లారు. తెల్లవారుజామున కార్తీక్‌ను లేపేందుకు ప్రయత్నించగా.. అప్పటికే చనిపోయినట్లు గుర్తించారు. దీంతో అదే కారులో మేలచెర్వు గుట్ట ప్రాంతానికి తీసుకెళ్లి పాతిపెట్టారు. మిస్సింగ్ కేసు నమోదుతో వెలుగులోకి.. కార్తీక్ 24వ తేదీన మహబూబ్‌నగర్‌కు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. తమ కుమారుడు ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన తండ్రి సూరిబాబు ఫిబ్రవరి 25న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కుమారుడిని గద్వాలకు చెందిన కొంతమంది బెదిరిస్తున్నారని చెప్పడంతో సెల్‌ఫోన్ సిగ్నల్స్, కాల్‌డేటా ఆధారంగా అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించారు. విచారణలో కార్తీక్‌ను హత్య చేసినట్లుగా రవికుమార్, వసంత్, అనిల్‌లు ఒప్పుకున్నారు. హత్యకు గురైన కార్తీక్‌ను పూడ్చిన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాన్ని వెలికితీశారు. కుళ్లిన స్థితిలో ఉన్న మృతదేహానికి అక్కడే పోస్టుమార్టం చేసి, బంధువులకు అప్పగించారు. అయితే ఈ కేసులో మరో ఆరుగురు ఉన్నారని, వారిని కూడా త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు. -
కలకలం రేపుతున్న శ్రీ హర్షిణి హత్య
సాక్షి, మహబూబ్‌నగర్: ఫేస్బుక్ పరిచయం మరో బాలికను బలిగొంది. సామాజిక మాధ్యమం ద్వారా పరిచయం పెంచుకుని, ఆ తర్వాత ఆమెను దారుణంగా హతమార్చాడో యువకుడు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్రకలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే మహబూబ్‌నగర్ కేంద్రీయ విద్యాలయంలో పదో తరగతి చదువుతున్న శ్రీ హర్షిణి అనే బాలిక ఈ నెల 27న ఇంటి నుంచి అదృశ్యమైంది. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్రీ హర్షిణి ఫేస్బుక్ చాటింగ్‌పై ఆరా తీశారు. ఈ క్రమంలో హైదరాబాద్‌కు చెందిన నవీన్ రెడ్డితో ఎక్కువగా చాటింగ్ చేసినట్లు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల విచారణలో జడ్చర్ల మండలం శంకరాయపల్లి సమీపంలో శ్రీ హర్షిణి హతమార్చినట్లు నవీన్‌రెడ్డి అంగీకరించాడు. బాలికకు మాయమాటలు చెప్పి కారులో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి...ఆమెపై అత్యాచారానికి యత్నించగా, శ్రీ హర్షిణి తీవ్రంగా ప్రతిఘటించింది. అయితే ఈ విషయాన్ని ఆమె ఎక్కడ బయటపెడుతుందనే భయంతో శ్రీ హర్షిణిని బండరాయితో కొట్టి హతమార్చినట్లు వెల్లడించాడు. పోలీసులు గురువారం ఉదయం బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టంకు తరలించారు. కాగా ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. నవీన్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ విషయం తెలిసిన నిందితుడు కుటుంబసభ్యులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. -
బాలికను బలి తీసుకున్న ఫేస్బుక్ పరిచయం
-
ఫేస్బుక్లో కామెంట్ పెట్టాడని విద్యార్థిపై దాడి
సత్తుపల్లి: జూనియర్ విద్యార్థిపై సీనియర్ల దాడి కలకలం సృష్టించింది. ఫేస్బుక్లో కామెంట్ చేశాడని జూనియర్‌ను లాక్కెళ్లి పాడుబడిన ఇంట్లో చితక బాదిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. సోమవారం దాడి చేసి, సెల్ఫోన్లో వీడియో తీసి ఫేస్బుక్లో అప్లోడ్ చేశారు. మంగళవారం వీడియో వైరల్‌గా మారింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కనకళ్ల గ్రామానికి చెందిన వలకట్ల శివగణేష్ ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని కొత్తూరు మదర్‌థెరిస్సా ఇంజనీరింగ్ కళాశాలలో అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. నెల రోజుల క్రితం తన మిత్రుడనుకుని ఎస్కె అఫ్రీద్‌ను ఫేస్బుక్ మెసెంజర్లో చిన్న కామెంట్ చేశాడు.దీనిపై అఫ్రీద్, శివగణేష్ తీవ్రపదజాలంతో చాటింగ్ చేసుకున్నారు. తర్వాత తనమిత్రుడు అఫ్రీద్, ఫేస్బుక్లో కామెంట్ చేసిన అఫ్రీద్ ఒక్కరుకారని తెలుసుకున్న శివగణేష్.. ఎస్కె అఫ్రీద్‌కు క్షమించమంటూ మళ్లీ పోస్టు చేశాడు. అయినా కనికరించకుండా శివగణేష్‌పై దాడి చేశారు. దాడి చేసిన ఎస్కె అఫ్రీద్(అశ్వారావుపేట మండలం గుమ్మడివల్లి), ఎస్.సాయికిరణ్(ఖమ్మం), వి.మణితేజ(సత్తుపల్లి మండలం రేజర్ల) అదే కళాశాలలో డిప్లొమా ట్రిపుల్ఈ మూడో సంవత్సరం చదువుతున్నారు. పాడుబడ్డ ఇంట్లోకి తీసుకెళ్లి దాడి పెద్దపల్లి నుంచి వి.శివగణేష్ కళాశాలకు వెళ్లేందుకు సోమవారం సాయంత్రం సత్తుపల్లి వచ్చాడు. ఆలస్యం కావటంతో బయట మిత్రుని గదిలోనే ఉన్నాడు. అదేరోజు శివగణేష్ బయట కన్పించటంతో ఎస్కె అఫ్రీద్ మిత్రులైన ఎస్.సాయికిరణ్, వి.మణితేజలతో పాటు మరికొంత మందితో కలిసి శివగణేష్ నోరుమూసి కళాశాల సమీపంలోని పాడుబడిన ఇంట్లోకి తీసుకెళ్లి విచక్షణా రహితంగా కొట్టారు. ఈ దృశ్యాన్ని వీడియో తీసి ఫేస్బుక్లో అప్లోడ్ చేశారు. శివగణేష్ ఆర్తనాదాలు చేస్తున్నా వదలకుండా.. దుర్భాషలాడుతూ కాళ్లు, చేతులు, కర్రలతో ఇష్టం వచ్చినట్టు.. ఈడ్చి.. ఈడ్చి.. కొట్టడం చూపరులను కలిచివేస్తోంది. ఈ వీడియో దృశ్యాలు కళాశాల వాట్సాప్ గ్రూపుల్లో, ఫేస్బుక్లో వైరల్‌గా మారి విషయం బహిర్గతమైంది. పోలీసులకు ఫిర్యాదు.. శివగణేష్‌పై సీనియర్ విద్యార్థుల దాడి చేసిన విషయం మదర్‌థెరిస్సా ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ చలసాని హరికృష్ణకు మంగళవారం సాయంత్రం తెలిసింది. బాధిత విద్యార్థి శివగణేష్ నుంచి వివరాల తెలుసుకుని దాడిచేసిన విద్యార్థులైన ఎస్కె అఫ్రీద్, వి.మణితేజ, ఎస్.సాయికిరణ్‌లను విచారించి, వీడియో క్లిప్‌ను జత చేసి కళాశాలకు చెందిన అధ్యాపకులు, సిబ్బందితో సత్తుపల్లి పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేసేందుకు పంపించటంతో దాడి ఘటన వెలుగు చూసింది. పెద్దపల్లిలో ఉన్న తల్లిదండ్రులకు కళాశాల సిబ్బంది ఫోన్ చేసి చెప్పటంతో విషయం తెలిసిందని బాధితుని తండ్రి వెంకటేశ్వర్లు తెలిపారు. సీనియర్ విద్యార్థులు దాడి చేసిన విషయాన్ని శివగణేష్ తల్లిదండ్రులకు కూడా చెప్పలేదు. మళ్లీ ఎక్కడ దాడి చేస్తారోనని భయంతో చెప్పలేదని కనీళ్ల పర్యంతమయ్యాడు. దాడి ఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఐ జూనియర్ విద్యార్థిపై సీనియర్ విద్యార్థులు దాడి చేసిన ఘటనా స్థలాన్ని సత్తుపల్లి పట్టణ సీఐ సురేష్ బుధవారం సందర్శించారు. దాడికి వాడిన కర్రలను స్వాధీనం చేసుకున్నారు. ఏదైన మత్తు పదార్థం తీసుకొని దాడికి పాల్పడ్డారేమోనని క్షుణ్ణంగా పరిశీలన చేశారు. కళాశాలలో ఘటనను చూసిన విద్యార్థులను పిలిచి ఎలా జరిగిందో విచారించారు. శివగణేష్‌ను వైద్య పరీక్షల నిమిత్తం సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు శివగణేష్ శరీరంపై ఉన్న గాయాలను పరీక్షించారు. విచారణ నిర్వహిస్తున్నామని, దాడికి పాల్పడిన వారిపై ర్యాగింగ్ నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేస్తామని సీఐ టి.సురేష్ తెలిపారు. -
ప్రేమ పేరుతో వంచించాడు..
సాక్షి, గుంటూరు: ‘హాయ్ అంటూ ఫేస్బుక్లో పరిచయం అయ్యాడు. మొదట స్నేహంగా.. ఆపై ప్రేమిస్తున్నానంటూ నమ్మించాడు.. పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత అతనికి ముందే పెళ్లయిందని తెలిసి నిలదీస్తే కుటుంబ సభ్యులతో కలసి నాపై దాడి చేశారు’ అంటూ కృష్ణాజిల్లా విజయవాడకు చెందిన ఓ వివాహిత సోమవారం స్పందన కార్యక్రమంలో గుంటూరు రూరల్ ఏఎస్పీ ఎస్.వరదరాజుకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం... పిడుగురాళ్లకు చెందిన రావిపాటి వీరయ్య అలియాస్ వినయ్ ఫేస్బుక్లో ఓ మహిళను పరిచయం చేసుకున్నాడు. ఆపై ఆమెతో స్నేహంగా ఉంటూ ప్రేమిస్తున్నానని చెప్పాడు. ఓ రోజు హడావుడిగా ఆమెను తిరుపతి తీసుకెళ్లి వివాహం చేసుకొని ఇంటికి తీసుకువెళ్లాడు. భర్త మరో వివాహం చేసుకున్నాడని తెలుసుకున్న వినయ్ మొదటి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వినయ్‌కు ముందుగా వివాహం జరిగిందని, ఇద్దరు సంతానం ఉన్నారని తెలుసుకుంది. నమ్మించి తనను మోసం చేశావంటూ దీనిపై వినయ్‌ను నిలదీసింది. ఇద్దరి మధ్య వాగ్వివాదం జరుగుతున్న క్రమంలో అత్తమామలు కల్పించుకొని వివాహితపై దాడికి యత్నించారు. జరిగిన మోసాన్ని గుర్తించిన వివాహిత నేరుగా పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. అయితే ఆమె ఇచ్చిన ఫిర్యాదును కూడా పోలీసులు తీసుకోకపోవడంతో న్యాయం చేయాలని బాధితురాలు ఏఎస్పీని వేడుకుంది. -
కొంపముంచిన ఫేస్బుక్ ప్రేమ
టెక్కలి రూరల్: ఫేస్బుక్లో యువకుడు పరిచయం అయ్యాడు. ఇద్దరూ కలిసి ఏడాదికి పైగా చెట్టపట్టాలు వేసుకుంటూ తిరిగారు. యువతి పెళ్లి విషయం ప్రస్తావించడంతో యువకుడు ముఖం చాటేశాడు. మనస్థాపానికి గురైన యువతి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మండలంలోని రావివలస గ్రామానికి చెందిన యువతి డిప్లామో పూర్తిచేసి విశాఖపట్నంలో డేటా ఆపరేటర్‌గా పనిచేస్తోంది. అక్కడ తన స్నేహితురాలి ఫేస్బుక్లో విజయనగరం జిల్లా మొదవలస గ్రామానికి చెందిన గిరిడి రాకేష్‌కుమార్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఏడాది పాటు ఇద్దరూ కలిసి తిరిగారు. పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి యువకుడు ముఖం చాటేస్తూ తిరిగాడు. చివరకు నిలదీసే సరికి తాను పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పాడు. దీంతో మనస్థాపానికి గురైన యువతి ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై టెక్కలి ఎస్ఐ షేక్‌ఖాదర్ బాషా వివరాలు సేకరించారు. -
ఫేస్బుక్ ప్రేమ... విషాదాంతం
హస్తినాపురం: ఫేస్బుక్ ప్రేమ వికటించింది. తన కంటే చిన్నవాడైన యువకుడి కోసం కోల్‌కతా నుంచి వచ్చిన ఓ మహిళ లాడ్జి గదిలో అర్ధంతరంగా తనువు చాలించింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రియుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఈ ఘటన వనస్థలిపురం పరిధిలో బుధవారం వెలుగులోకి వచ్చింది. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాకు చెందిన సంగీత ముఖర్జీ (43) వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజినీర్. ఈమెకు గతంలోనే వివాహం కాగా... భర్త నుంచి విడాకులు తీసుకున్నారు. మూడేళ్ల క్రితం ఫేస్బుక్ ద్వారా సంగీతకు పంజాబ్ వాసి లోకేశ్ (25) పరిచయమయ్యాడు. అప్పటి నుంచి ఫేస్బుక్లో చాటింగ్ చేసుకుంటున్న వీరిద్దరి మధ్యా ప్రేమ చిగురించింది. గత ఏడాది పంజాబ్ వెళ్ళిన సంగీత అక్కడ లోకేశ్‌ను కలిసి వచ్చింది. ఇద్దరూ కలిసి జీవించాలనే ఉద్దేశంతో మూడు నెలలు అక్కడే కలిసి ఉన్నారు. ఆపై కోల్‌కతాకు వెళ్ళిన వీళ్ళు కొన్నాళ్లు అక్కడా కలిసి ఉన్నారు. హైదరాబాద్‌లో ఉద్యోగం చూసుకుని స్థిరపడాలని, వివాహం చేసుకోవాలని భావించిన ఇద్దరూ సోమవారం సిటీకి వచ్చారు. వనస్థలిపురం పోలీసుస్టేషన్ పరిధిలోని అభ్యుదయనగర్ కాలనీలో ఉన్న ఓయో హోటల్లో గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. సంగీత గుర్తుతెలియని వ్యక్తులతో చాటింగ్ చేస్తోందనే ఉద్దేశంతో లోకేశ్ ఆమెతో ఘర్షణకు దిగాడు. మంగళవారం సాయంత్రం కూడా వీరి మధ్య గొడవలు జరిగాయి. దీంతో లోకేశ్ రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో ఉన్న తన స్నేహితుని వద్దకు వెళ్ళిపోయాడు. ఈ పరిణామంతో మనస్థాపం చెందిన సంగీత బుధవారం ఉదయం హోటల్ గదిలోనే బెడ్‌షీట్‌తో ఫ్యాన్‌కి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆ గది దగ్గరకు వెళ్లిన సిబ్బంది డోర్ కొట్టినా ఎంతకీ డోర్ తీయకపోవడంతో హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. వనస్థలిపురం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గది తలుపులు తెరిచి చూసేసరికి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. హోటల్ యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు ప్రేరేపించిన నేరంపై లోకేష్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా మొయినాబాద్‌లో ఉంటున్న లోకేష్ స్నేహితుడు కూడా కోల్‌కత్తాకు చెందిన వాడేనని, ఇతను నగరంలోని ఓ కళాశాలలో బీటెక్ చేస్తున్నాడని తెలిసింది. ఈ యువకుడితోనే సంగీత చాటింగ్ చేస్తుండగా వివాదం తలెత్తిందని తెలిసింది. ఈ నేపథ్యంలో లోకేష్, సంగీతలు తీవ్రంగా గొడవ పడుతున్నారని, వారిని ఓ కంట కనిపెట్టాలని కూడా ఆ యువకుడు హోటల్ సిబ్బందికి సూచించాడని తెలిసింది. -
ఇక ఫేస్బుక్ నుంచి వాట్సాప్ మెసేజ్
న్యూయార్క్: అదేంటి.. ఫేస్బుక్ నుంచి వాట్సాప్‌కు మెసేజ్ ఎలా పంపుతాం? అనే కదా.. అయితే ఇన్స్టాగ్రామ్ నుంచి పంపుకోండి! అర్థం కాలేదు కదూ..? ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, మెసెంజర్‌ను కలుపుతూ ఒకేసారి మెసేజ్‌లను పంపే సేవలను ప్రారంభించాలని ఫేస్బుక్ యాజమాన్యం భావిస్తోంది. ఈ మూడూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు ప్రస్తుతం వేర్వేరు మొబైల్ యాప్స్‌లా పనిచేస్తున్నాయి. కానీ, ఈ మూడూ ఒక ప్లాట్ఫామ్లో ఒకదాని నుంచి ఇంకో దానికి సులభంగా మెసేజ్ పంపించేలా వాటిని అనుసంధానం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇలా చేయడంవల్ల ఏవైనా ఇబ్బందులు ఎదురవుతాయా? ప్రైవసీకి సంబంధించి సమస్యలు తలెత్తుతాయా? అనే కోణాల్లో పరీక్షిస్తున్నారు. ఇవన్నీ విజయవంతమైతే ఇక ఫేస్బుక్లో ఉన్న వ్యక్తి వేరే వారికి వాట్సాప్ సందేశం కూడా పంపించొచ్చని చెబుతున్నారు. ఈ ఏడాది చివరికి, లేదా 2020 ప్రారంభంలో ఈ రకమైన సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశముందంటున్నారు. -
అమ్మాయినంటూ చాటింగ్... ఆపై..
సాక్షి, బెంగళూరు : పోలీసు అధికారినని చెప్పుకుంటూ డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ ఎస్ఐని బుధవారం ఉదయగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. హుబ్లి నగరానికి చెందిన సిద్దప్ప ఫేస్బుక్లో భవిక పేరుతో నకిలీ ఖాతా తెరచి యువకులతో అమ్మాయినని చాటింగ్ చేసేవాడు. యువకుల మొబైల్ నంబర్లు తీసుకొని వాయిస్ ఛేంజర్ సాఫ్ట్‌వేర్‌తో అమ్మాయిలా మాట్లాడుతూ వ్యక్తిగత వివరాలు సేకరించి ప్రేమ పేరుతో వారిని ముగ్గులోకి దించేవాడు. ఇలా కొద్ది రోజులు గడచిన అనంతరం అసలు నాటకానికి తెర తీసేవాడు. భవిక అనే అమ్మాయి ఫిర్యాదు చేసిందంటూ పోలీసు వేషధారణతో యువకులను బెదిరించి కేసు నుంచి తప్పించుకోవాలంటే డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేసేవాడు. ఇలా మైసూరుతో పాటు బెంగళూరు తదితర ప్రాంతాల్లో యువకుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశాడు. మైసూరు మహిళకు బెదిరింపులు ఇదే క్రమంలో కొద్ది రోజుల క్రితం మైసూరు నగరంలోని శక్తి నగర్‌కు చెందిన శారదమ్మ అనే మహిళతో ఫేస్బుక్లో పరిచయం పెంచుకున్న నిందితుడు మాటల్లో శారద కుమారుడు బెంగళూరులో పని చేస్తున్నట్లు తెలుసుకున్నాడు. అనంతరం మంగళవారం ఎస్ఐ వేషంలో కారులో శారదమ్మ ఇంటికి వచ్చిన సిద్దప్ప బెంగళూరులో మీ కుమారుడు ప్రేమ, పెళ్లి పేరుతో యువతులను మోసం చేసినట్లు తమకు ఫిర్యాదులు అందాయని అందుకు సంబంధించి విచారణకు వచ్చామంటూ నమ్మించాడు. అయితే తనకు రూ.50వేలు లంచం ఇస్తే మీ కుమారుడిని కేసు నుంచి తప్పిస్తానంటూ సూచించాడు. సిద్దప్ప మాటలు నిజమేనని నమ్మిన శారదమ్మ ఇంట్లో ఉన్న రూ.5వేల నగదును అతడికి ఇచ్చింది. అయితే మొత్తం ఇవ్వాల్సిందేనంటూ సిద్దప్ప డిమాండ్ చేయడంతో ఇంట్లోనే ఉన్న శారదమ్మ భర్త నారాయణగౌడకు నిందితుడి ప్రవర్తనపై అనుమానం కలగడంతో ఇక్కడే ఉండాలని బ్యాంకు నుంచి డబ్బులు తెస్తానంటూ నమ్మించి బయటకు వచ్చి ఉదయనగర్ పోలీసులకు సమాచారం అందించారు. ఇంటెలిజెన్స్ ఎస్సైనని బుకాయింపు సమాచారం అందుకున్న ఉదయనగర ఎస్ఐ జైకీర్తి సిబ్బందితో అక్కడికి చేరుకొని ప్రశ్నించగా తాను ఇంటలిజెన్స్ విభాగ ఎస్ఐనని యువతి ఫిర్యాదు మేరకు ఇక్కడికి విచారణకు వచ్చినట్లు చెప్పాడు. అయితే ఐడీ కార్డు చూపించాలని అడగడంతో పాటు ఇంటలిజెన్స్ విభాగానికి సంబంధించి పలు ప్రశ్నలు అడగడంతో సిద్దప్ప పూర్తిగా తడబడ్డాడు. దీంతో సిద్దప్పను స్టేషన్‌కు తరలించి తమదైన శైలిలో విచారణ చేయగా అసలు విషయం వెలుగు చూడడంతో సిద్దప్పపై కేసు నమోదు చేసుకున్నారు. -
50 మంది సైనికులపై వలపు వల
న్యూఢిల్లీ: భారత ఆర్మీకి సంబంధించిన కీలక వివరాలను సేకరించేందుకు పాకిస్తానీ మహిళ 50 మంది జవాన్లపై వల వేసిన సంగతి తాజాగా వెలుగులోకి వచ్చింది. సున్నితమైన సమాచారాన్ని ఆమెతో పంచుకోవడంతో సోమ్‌వీర్ సింగ్ అనే సిపాయిని ఆర్మీ ఇప్పటికే అరెస్టు చేసింది. ఫేస్బుక్లో అనికా చోప్రా పేరుతో ఖాతా తెరిచి, ఆకుపచ్చ రంగు చీర కట్టుకున్న ఫొటోను ప్రొఫైల్‌కు పెట్టి సదరు మహిళ జవాన్లకు వలపు వల విసిరింది. మిలిటరీ నర్సింగ్ విభాగంలో ఆర్మీ కెప్టెన్‌గా పనిచేస్తున్నట్లు చెప్పుకుంది. సోమ్‌వీర్‌ను అరెస్టు చేయడంతోపాటు మిగతా జవాన్లను కూడా ఆర్మీ ప్రస్తుతం విచారిస్తోంది. రాజస్తాన్‌లోని జైçసల్మేర్‌లో విధులు నిర్వర్తిస్తున్న సోమ్‌వీర్‌కు 2016లో ఈ మహిళ స్నేహ అభ్యర్థనను పంపి సంభాషించడం మొదలుపెట్టింది. త్వరలోనే వారి మాటలు హద్దులు దాటాయి. ఓ దశలో సోమ్‌వీర్ తన భార్యకు విడాకులివ్వాలని కూడా నిర్ణయించుకున్నాడు. అయితే, ఐదు నెలలుగా జమ్మూ నుంచి సోమ్‌వీర్‌కు ఎక్కువగా ఫోన్‌కాల్స్ వస్తుండటంతో ఆర్మీకి అనుమానం వచ్చి అతని సామాజిక మాధ్యమ ఖాతాలపై ఓ కన్నేసింది. ఫేస్బుక్లో సదరు మహిళతో అతని చాటింగ్‌ను ఓ కంట కనిపెడుతూనే ఉంది. ఆమె పాకిస్తాన్ నుంచి ఫేస్‌బుక్‌ను వాడుతున్నట్లుగా నిర్ధారించుకుంది. సంభాషణల్లో తొలుత నీ పోస్టింగ్ ఎక్కడ లాంటి ప్రశ్నలతో మొదలుపెట్టి ట్యాంక్ ఫొటోలు పంపించమని ఆమె అడిగిందనీ, ఇది ఆమె పన్నిన వల అని తెలియని సోమ్‌వీర్ కొన్ని వివరాలు ఆమెకు తెలిపాడని అధికారులు చెప్పారు. అనంతరం ఆమె సోమ్‌వీర్‌ను బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించిందనీ, ఆ తర్వాత సమాచారం ఇచ్చినందుకు బదులుగా సోమ్‌వీర్ డబ్బు తీసుకుంటున్నాడని తెలిపారు. ఇలా మొత్తం 50 మంది జవాన్లపై పాక్ మహిళ ఫేస్బుక్ ద్వారా వల వేసింది. ఒక్కో జవాన్‌కు ఒక్కో సమయాన్ని కేటాయించి, ఆ సమయంలోనే ఆమె మాట్లాడేదని దర్యాప్తులో వెల్లడయింది. -
ఫేస్బుక్ చాటింగ్ ప్రాణం తీసింది!
కృష్ణలంక (విజయవాడ తూర్పు) : ఫేస్బుక్ పరిచయం ఓ నిండు ప్రాణాన్ని బలికొనగా.. భార్య బిడ్డలను అనాథలను చేసింది. వివరాల్లోకి వెళితే..కృష్ణలంక మెట్లబజార్‌కు చెందిన లంక రామాంజనేయులుశర్మ(35) పౌరోహిత్యం చేస్తుంటాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. అతనికి బాలాజీనగర్‌కు చెందిన ఒక వివాహితతో ఫేస్బుక్లో పరిచయం అవ్వడంతో.. చాటింగ్ చేసుకుంటూ.. ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ కాంప్లెక్స్‌లో ఎలాక్ట్రానిక్ షాపు నిర్వహిస్తున్న వివాహిత భర్త సాయిశ్రీనివాస్‌కు తన భార్య ప్రవర్తనపై అనుమానం రావడంతో ఫోన్‌ను పరిశీలించి రామాంజేయులుశర్మతో చాటింగ్ చేస్తున్నట్లు నిర్ధారించుకున్నాడు. దీంతో అతను రామాంజనేయులుశర్మను ఎలాగైనా మట్టుపెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఈ నెల 15వతేదీన అతనికి ఫోన్‌చేసి గవర్నరుపేటలోని ఎన్టీఆర్ కాంప్లెక్స్‌లోని తన షాపునకు రావాలని పిలవడంతో రామాంజేనేయులు శర్మ వెళ్లాడు. అప్పటికే అక్కడ సెల్లారులో తన ఐదుగురు స్నేహితులతో కలసి సాయిశ్రీనివాస్ ఇష్టానుసారం కొట్టసాగాడు. దీంతో చుట్టుపక్కల వారు అడ్డుకోవడంతో స్నేహితుల మధ్య చిన్న గొడవ అని చెప్పి ద్విచక్రవాహనంపై రామాంజనేయులుశర్మను ఎక్కించుకుని తేలప్రోలు పరిసరాల్లోని పంటపోలాల్లోకి తీసుకెళ్లారు. అక్కడే వారు మద్యం సేవించి అతన్ని ఇష్టానుసారంగా కొట్టారు. వారి దెబ్బలకు స్పృహ తప్పడంతో అక్కడ నుంచి వారు ద్విచక్ర వాహనంపై అతన్ని తీసుకుని విజయవాడ వైపు వస్తుండగా.. గన్నవరం బిస్మిల్లా హోటల్ సమీపంలోకి రాగానే రామాంజనేయులుశర్మ మృతిచెందినట్లు గమనించి రోడ్డుపక్కన పడేసి 108కి ఫోన్‌చేసి పరారాయ్యారు. దీంతో 108 సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించగా అప్పటికే మృతి చెందాడు. పక్కన ఎవరూ లేకపోవడంతో 108 సిబ్బంది సైతం వెళ్లిపోయారు. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గన్నవరం పోలీసులు ఈ నెల 16న గుర్తుతెలియని వ్యక్తి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా ఈ నెల 15వతేదీ మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లిన తన భర్త కనిపించడం లేదని భార్య స్వరూప కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు గన్నవరంలో మృతిచెందిన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం.. అదృశ్యమైన రామాంజనేయులు శర్మదేనని నిర్ధారించుకుని విచారణ చేపట్టారు. మృతుడి కాల్‌డేటాలో సాయిశ్రీనివాస్‌తో చివరిసారిగా మాట్లాడినట్లు ఉండడంతో అతన్ని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా హత్య తామే చేసినట్లు అంగీకరించాడు. హత్యకు సహకరించిన స్నేహితులు ఎన్టీఆర్, మున్నా, సాయి, ఫరూక్, సతీష్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
వర్మ వీక్ పాయింట్‌పై కొట్టేశాడు
సాక్షి, సినిమాలు : విలక్షణ సినిమాలు, వివాదాలు.. దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఓ ప్రత్యేకతను సంతరించి పెట్టాయి. ప్రతీ విషయాన్ని చాలా క్యాజువల్‌గా తీసుకునే వర్మ.. ఎవరైనా తన జోలికొస్తే మాత్రం ధీటుగానే స్పందిస్తుంటాడు. అలాంటి వర్మనే ఆశ్చర్యపోయేలా చేశాడు ఓ యువ దర్శకుడు. టాలీవుడ్లో అ! చిత్రంతో ప్రశాంత్ వర్మ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయాడు. వైవిధ్య భరితమైన కాన్సెప్ట్, సాహసోపేతమైన స్క్రిప్ట్‌తో చిత్రం తెరకెక్కించాడంటూ విమర్శకులు అతనిపై ప్రశంసలు కురిపించారు. ఇప్పుడీ యువ దర్శకుడు ఓ పోస్టుతో వార్తల్లో నిలిచాడు.‘జనాలంతా నన్ను ఆర్జీవీతో పోలుస్తుంటారు. కానీ, నిజం చెప్పాలంటే మా ఇద్దరి మధ్యే రెండే కామన్ పాయింట్లు ఉన్నాయి. ఒకటి ఇంటిపేరు.. రెండోది శ్రీదేవి ... అంటూ ట్వీట్ చేశాడు. అది చూసి వర్మ తన ఫేస్ బుక్ పేజీలో ‘అ!’ అంటూ రిప్లై ఇచ్చేశాడు. నటి శ్రీదేవి అంటే వర్మకు ఎంత ప్రత్యేకమైన అభిమానమో తెలిసిందే. ఈ నేపథ్యంలో కామన్ పాయింట్ పేరిట ఆమె పేరు ప్రస్తావన తెచ్చిన ప్రశాంత్.. వర్మను ఎక్కడో టచ్ చేశాడంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. -
చిత్రరంగంలో రాణించలేక మోసాలు..!
సాక్షి, చెన్నై : తాను చిత్రరంగంలో రాణించలేకనే మోసాలకు పాల్పడినట్లు ఫేస్‌బుక్‌తో పలువురు యువకులను మోసగించిన శ్రుతి శుక్రవారం వెల్లడించింది. ఫేస్ బుక్‌లో తన అందమైన ఫొటోలు పెట్టి పలువురి వద్ద శ్రుతి రూ.1.50 కోట్లు దోచుకున్న విషయం తెలిసిందే. తమిళనాడుకు చెందిన ముగ్గురు సాప్ట్వేర్ ఇంజినీర్లను బురిడీ కొట్టించిన శ్రుతి అనే యువతి తన తల్లి, సోదరుడు, స్నేహితుడు సహా ఊచలు లెక్కపెడుతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. అందమైన ఫొటోలను ఎరవేసి.. సేలం జిల్లా ఎడపాడికి చెందిన బాలకృష్ణన్ (29) విదేశాల్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్. ఆన్లైన్లో పెళ్లి సంబంధాలు వెతుకుతున్న ఇతనికి కోయంబత్తూరు పాపనాయకన్‌పాళైకి చెందిన శ్రుతి (21) ఫేస్బుక్ ద్వారా పరిచయమైంది. సినిమా నటిలా ఫోజులిస్తూ ఫొటోలు పెట్టడం, ఇంగ్లిషులో మాట్లాడడంతో బాలకృష్ణన్ ప్రేమలో పడిపోయాడు. దీనిని అవకాశంగా తీసుకున్న శ్రుతి.. తన తల్లి చిత్ర మెదడులో గడ్డ ఉందని, వెంటనే ఆపరేషన్ చేయాలని ఆవేదన వ్యక్తం చేసింది. శ్రుతి మాటలు నమ్మిన బాలకృష్ణన్ రూ.5 లక్షలను ఆమె బ్యాంకు ఖాతాలో వేశాడు. కొన్ని రోజుల తరువాత ఇంటిపై అప్పు ఉందని, తీరిన తరువాతనే పెళ్లి అని చెప్పడంతో కాబోయే భార్యే కదాని మరో రూ.45 లక్షలు పంపాడు. ఈ నేపథ్యంలోనే శ్రుతి ఫొటోలను చెన్నైలోని తన ప్రాణస్నేహితునికి పంపి పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపాడు. వెంటనే గుర్తించిన అతను ఆమె పెద్ద మోసగత్తెని తెలిపాడు. దీంతో బాలకృష్ణన్ వెంటనే శ్రుతికి ఫోన్ చేసి నిలదీయడంతో కట్ చేసి ఏకంగా స్విచ్ ఆఫ్ చేసేసింది. తాను మోసపోయానని గ్రహించిన బాలకృష్ణన్ కోయంబత్తూరుకు చేరుకుని సైబర్ క్రైంబ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా శ్రుతి చిదంబరానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరుళ్‌కుమార్ గురురాజా నుంచి రూ.50లక్షలు, నామక్కల్ జిల్లా పరమత్తివేలూరుకు చెందిన సంతోష్‌కుమార్ అనే సాప్ట్వేర్ ఇంజినీరు నుంచి రూ.43 లక్షలు.. దండుకున్నట్లు పోలీసులు తెలిపారు. శ్రుతితో పాటు ఆమెకు సహకరించిన తల్లి చిత్ర (48), సోదరుడు సుభాష్ (18) బంధువు వెంకటేష్ (38), స్నేహితుడు శబరినా«థ్ (23)లను బుధవారం రాత్రి సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. చిత్రసీమలో రాణించలేకపోవడంతో .. శ్రుతి ఆడి పోనాల్ ఆవణి అనే చిత్రంలో హీరోయిన్గా నటించింది. అయితే ఆ చిత్రం ఇంకా విడుదల కాలేదు. సినిమాలో రాణించలేకపోవడంతో నిరాశ చెందిన శ్రుతి తన తల్లి సహకారంతో ధనవంతులైన యువకులకు లోబరచుకుని కోట్లాది రూపాయలు మోసగించింది. విలాస జీవితానికి అలవాటు పడడమే దీనికి కారణం. శ్రుతి, ఆమె తల్లి సహకారంతో ఎనిమిది మంది యువకులను ప్రేమ వలతో మోసగించినట్లు తెలిసింది. దీంతో వారిద్దరూ ఈ విధంగానే చాలా మంది యువకులను మోసగించి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. అంతేకాకుండా వీరి మోసంలో పలువురికి సంబంధం ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఇందుకోసం శ్రుతిని కస్టడీలోకి తీసుకుని విచారణ జరిపేందుకు నిర్ణయించారు. కోర్టులో పిటిషన్ దాఖలు చేసి అనుమతి పొందేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. -
ఐ మిస్ యూ
అనంతపురం : రెండు నెలల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఆ యువకుడు పాడెక్కాడు. అతడికి ఏ కష్టం వచ్చిందో తెలీదు. ‘ఐ మిస్ యూ’ అంటూ మెసేజ్ పంపి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకెళితే.. యాడికి మండలం చందన గ్రామానికి చెందిన సూర్యనారాయణ, అమ్మణ్ణి దంపతుల కుమారుడు గోవర్ధన్‌గౌడ్ (24) తాడిపత్రి సమీపంలోని అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. ఇతనికి ఇటీవలే నిశ్చితార్థం జరిగింది. ఫిబ్రవరి 24, 25 తేదీల్లో పెళ్లికి ముహూర్తం నిర్ణయించారు. బట్టతల కలిగిన ఇతను పెళ్లిలోపు హెయిర్ ప్లాంటేషన్ ట్రీట్మెంట్ చేయించుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం బట్టలు సర్దుకుని అనంతపురంలో చికిత్స చేయించుకునేందుకు ఇంటి నుంచి బయల్దేరాడు. అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత తన సెల్ నుంచి బంధువులు, స్నేహితులకు ‘ఐ మిస్ యూ.. ఐ మిస్ యూ’ నేను చనిపోతున్నా అంటూ మెసేజ్ పెట్టాడు. ఫేస్ బుక్‌లోనూ పోస్ట్ చేశాడు. అప్రమత్తమైన బంధువులు, స్నేహితులు గోవర్ధన్‌గౌడ్ కోసం గాలింపు చేపట్టారు. అనంతపురం నగరంలో అన్ని లాడ్జీల్లోనూ విచారణ చేశారు. చివరగా బస్టాండ్ సమీపంలోని ఓ లాడ్జిలో ఆచూకీ దొరికింది. గదిలో గడియ పెట్టుకుని పురుగుమందు తాగిన అనంతరం తాడుతో ఉరివేసుకుని ఉన్న గోవర్ధన్‌గౌడ్‌ను గుర్తించారు. శనివారం స్వగ్రామానికి చేరుకున్న మృతదేహాన్ని చూసి గ్రామస్తులు, బంధువులు బోరున విలపించారు. ఆత్మహత్యకు గల కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. -
ఫేస్బుక్లో చాటింగ్ చేస్తూ చీటింగ్
►నగర వ్యాపారికి రూ.4.5 లక్షల టోకరా సాక్షి, సిటీబ్యూరో : ఫేస్బుక్ ద్వారా అందమైన యువతి ఫొటోతో నగరానికి చెందిన వ్యాపారికి ఎర వేసిన సైబర్ నేరగాళ్ళు చాటింగ్‌తో ముగ్గులోకి దింపారు. ఆపై భారీ మొత్తం పంపిస్తున్నానంటూ చెప్పి రూ.4.5 లక్షలకు టోకరా వేశారు. దీనిపై బుధవారం కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన జగన్నాథం అనే వ్యాపారికి ఫేస్బుక్లో ఓ యువతి పరిచయమైంది. ఆకర్షణీయమైన ఫొటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టి ఆకర్షించింది. కొంతకాలం చాటింగ్ చేస్తూ వ్యాపారి దగ్గర నమ్మకం సంపాదించుకుంది. నాకున్న ఏకైన మంచి స్నేహితుడవంటూ జగన్నాథాన్ని బుట్టలో వేసుకుంది. తన వద్ద భారీ మొత్తంలో నగదు, నగలు ఉన్నాయని, వాటిలో కొన్ని నీకు బహుమతిగా పంపిస్తున్నానంటూ చెప్పింది. ఇది జరిగిన కొన్నాళ్ళకు ఢిల్లీ విమానాశ్రయం కస్టమ్స్ అధికారినంటూ ఓ వ్యక్తి నుంచి జగన్నాథానికి ఫోన్ వచ్చింది. విలువైన వస్తువులతో వచ్చిన ఆ పార్శిల్‌కు సంబంధించి కొన్ని పన్నులు చెల్లించాలంటూ చెప్పాడు. మరికొన్ని పత్రాలు సైతం కావాలని, అవి లేని కారణంగా దొడ్డిదారిలో క్లియర్ చేస్తానని నమ్మించాడు. ఇలా కొన్ని బ్యాంకు ఖాతాల్లో రూ.4.5 లక్షలు డిపాజిట్ చేయించుకున్నాడు. ఇంత మొత్తం చెల్లించినా మరికొంత చెల్లించాలంటూ ఫోన్లు వస్తుండటంతో మోసపోయినని తెలుసుకున్న వ్యాపారి సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించాడు. -
వగలాడి వల.. లక్షకు పైగా స్వాహా
అతడి పేరు దినేష్ శర్మ. ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటాడు. ఫేస్బుక్, వాట్సాప్ లాంటి సోషల్ మీడియా అంటే ఎక్కడ లేని ఇష్టం. అదే పిచ్చితో ఒక వగలాడి విసిరిన వలలో పడి దాదాపు లక్ష రూపాయలు పోగొట్టుకున్నాడు. పోలీసులకు ఫిర్యాదు అయితే చేశాడు గానీ, ఆ డబ్బు తిరిగి రావడం అసాధ్యమని వాపోతున్నాడు. ఒక టెలికం కంపెనీలో సీనియర్ మేనేజర్‌గా పనిచేసే దినేష్‌కు తాను లండన్‌లో ఉంటున్నానని చెప్పిన నేహా బజాజ్ అనే అమ్మాయితో సోషల్ మీడియాలో స్నేహం కుదిరింది. ఇద్దరూ బాగా క్లోజ్ అయ్యారు. అతడి జీతం, ఉద్యోగం, ఇతర ఆర్థిక పరిస్థితులు కూడా అడిగింది. తన తండ్రి భారతీయుడని, అందువల్ల ఇక్కడకు రావాలనుకుంటున్నానని చెప్పింది. ఇక్కడ హోటళ్లు బుక్ చేసుకోవడానికి ఎవరూ తెలియదని చెప్పడంతో తాను సాయం చేస్తానని దినేష్ ముందుకొచ్చాడు. దాంతో ఆమె తాను కొన్ని బహుమతులు పంపుతానని కూడా చెప్పింది. ఒకరోజు ఆమె దినేష్‌కు కొరియర్ వివరాలు, రసీదు, రిఫరెన్సు నంబర్లు కూడా ఇచ్చింది. టెడ్డీబేర్, ఒక ల్యాప్‌టాప్, వాచీ, కొన్ని పౌండ్ల డబ్బు అందులో ఉన్నాయని చెప్పింది. దాన్ని డిప్లొమాటిక్ కొరియర్ సర్వీసులో పంపానని, దాన్ని క్లియర్ చేయాలంటే భారతీయ కరెన్సీలో కొంత డబ్బు చెల్లించాలని వివరించింది. పార్సిల్ భారతదేశానికి రాగానే కస్టమ్స్ క్లియరెన్స్ కోసం తనను రూ. 23600 కట్టమన్నారని దినేష్ చెప్పాడు. దాంతో అతడు చెప్పిన బ్యాంకు ఖాతాలోకి డబ్బులు వేశాడు. అదే రోజు పెద్దనోట్లను రద్దు చేయడంతో, వాళ్లు డబ్బులు డ్రా చేసుకోలేకపోతున్నామని, అందువల్ల నగదు రూపంలో డబ్బు చెల్లించాలని చెప్పారు. ఆ తర్వాత రూ. 85వేల రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలని, లేకపోతే ప్యాకెట్ డెలివరీ ఇవ్వడం కుదరదని అన్నారు. ఈ మధ్యలో నేహా కూడా తరచు ఫోన్ చేస్తూ త్వరగా పార్సిల్ తీసుకోవాలని తొందరపెట్టేది. లేకపోతే తానంటే ప్రేమ లేదా అని కూడా అడిగేది. ఆ మొత్తం కట్టేసిన తర్వాత కూడా.. వాళ్లు తమకు డబ్బులు అందలేదని, నిబంధనలు కఠినం అయినందువల్ల తాము ఆ ప్యాకెట్‌ను రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లండ్కు పంపుతున్నామని, వాళ్లు పౌండ్లను రూపాయలలోకి మారుస్తారని చెప్పారు. దాంతో దినేష్ శర్మకు అప్పుడు అనుమానం వచ్చింది. నగదు మార్పిడి కోసం రూ. 2 లక్షలు కట్టాలన్నప్పుడు అనుమానం బలపడింది. దాంతో బ్యాంకు అధికారులను సంప్రదించగా, వాళ్లు ఇదంతా పచ్చిమోసం అని చెప్పారు. ఢిల్లీలో దాదాపు ప్రతిరోజూ ఇలాంటి ఘటనలు ఉంటూనే ఉంటాయని కేసు దర్యాప్తు చేస్తున్న ఎస్ఐ మనీష్ యాదవ్ చెప్పారు. -
ఫేస్బుక్లో హెలికాప్టర్ సేల్... ధరెంతో తెలుసా?
వెరైటీ బ్యాంగిల్స్, డిజైనర్ డ్రస్‌లు వంటి వాటిని ఫేస్బుక్లో అమ్మకానికి పెడుతుండటం మనం చూస్తుటాం. కాని కొత్తగా దేశ రాజధాని పరిధిలో ఓ ప్రైవేట్ ఫేస్బుక్ గ్రూప్ డైరెక్ట్‌గా హెలికాప్టర్‌నే అమ్మకానికి పెట్టింది. ఫ్లాట్స్, ఫ్లాట్‌మేట్స్ పేరు మీదున్న ఈ ఫేస్బుక్ గ్రూప్‌లో 2009 మోడల్‌కు చెందిన హెలికాప్టర్‌ను అమ్మకానికి పెట్టారు. దీని ధర రూ.2.8 కోట్లగా ప్రకటించారు. ఆరు సీటర్లున్న ఈ హెలికాప్టర్, గంటకు 200-300 కిలోమీటర్లు పయనిస్తుందట. గంటలకు 60 లీటర్ల వరకు ఇంధనం ఖర్చువుతుందట. ఆసక్తి ఉన్న కస్టమర్లు వయా ఫేస్బుక్ ద్వారా తమ ఇన్‌బాక్స్‌లో నమోదుచేసుకోవాలని విక్రయదారుడు కోరాడు. సామాజిక మాధ్యమంగా ఎక్కువగా పాపులర్ అయిన ఫేస్బుక్, వినియోగదారులను, అమ్మకందారులను అనుసంధానం చేయడానికి మార్కెట్ ప్లేస్‌ను ఇటీవలే ప్రవేశపెట్టింది. చాలామందికి ఈ పేజీ వివరాలు తెలియనప్పటికీ, ఫేస్బుక్ ద్వారా ఇప్పటికే అమ్మక, కొనుగోలు జరుగుతున్నాయి. గుర్గావ్ నివాసితులకు సమీపవారు ఫ్లాట్స్ అండ్ ఫ్లాట్మేట్ ఫేస్బుక్ గ్రూప్‌ను ప్రారంభించారు. ఎలాంటి బ్రోకరేజ్ చార్జీలు చెల్లించకుండా ఫ్లాట్లను అద్దెకు ఇచ్చేందుకు, తీసుకునేందుకు ఈ పేజీ ఎంతో సహకరిస్తోందని గ్రూప్ ఓనర్లు చెబుతున్నారు. ఈ గ్రూప్‌లో ఇప్పటివరకు 65,131 సభ్యులున్నారు. ఫ్లాట్లను అద్దెకిచ్చే ఈ గ్రూప్‌లో హెలికాప్టర్ విక్రయానికి పెట్టడం విశేషం. -
ఫేస్ బుక్ పరిచయంతో మోసపోయాను
► సేవా కార్యక్రమాలకు రూ.50 లక్షలు విరాళం ఇస్తానంటే నమ్మి రూ.7 లక్షలు ఖాతాలో వేశాను ► ప్రభుత్వం, దాతలు ఆదుకోకుంటే ఆత్మహత్యే శరణ్యం ► బాధితురాలి ఆవేదన పాలకుర్తి: అమెరికాకు చెందిన వ్యక్తి చేతిలో తాను మోసపోయానని పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన అనంతోజు రజిత ఆవేదన వ్యక్తం చేసింది. బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ తాను చేస్తున్న సేవా కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలను ఫేస్బుక్లో పోస్టు చేయగా.. ఆ ఫొటోలు, వివరాలు చూసిన అమెరికాకు చెందిన టోని మార్క్ అనే వ్యక్తి స్పందించి సేవా కార్యక్రమాలు బాగున్నాయంటూ పరిచయం చేసుకున్నాడని చెప్పింది. తాను ఏర్పాటు చేయదలుచుకున్న అనాథ శరణాలయం కోసం విరాళం ఇస్తామని చెబితే నమ్మానని తెలిపింది. ముందుగా తనకు అత్యవసరంగా రూ.7 లక్షలు అవసరం ఉన్నాయని టోని మార్కు చెబితే నమ్మి అతను ఇచ్చిన అకౌంట్లో వేసి.. అతడి మోసానికి బలయ్యానని చెప్పింది. స్నేహితులు, బంధువుల దగ్గర అప్పులు తెచ్చి ఇచ్చానని రజిత తెలిపింది. తన పరిస్థితి అర్ధం చేసుకుని దాతలు, ప్రభుత్వం ఆదుకోవాలని, లేకుంటే తనకు ఆత్మహత్యే శరణ్యమని పేర్కొంది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదని చెప్పింది. -
ఫేస్బుక్లో పరిచయం... ప్రేమ పేరుతో వంచన
బెంగళూరు : ఫేస్బుక్ పరిచయం ఓ యువతికి ప్రాణ సంకటంగా మారింది. ఆ యువతికి ప్రేమ పేరుతో వల వేసిన యువకుడు..తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మించి అవసరాలు తీర్చుకున్నాడు. మోసాన్ని గుర్తించిన యువతి నిలదీయగా, చంపేస్తామని బెదిరిస్తున్నాడు. ఈ ఘటన బుధవారం బెంగళూరులో వెలుగు చూసింది. పోలీసులతో పాటు బాధితురాలి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నగరానికి చెందిన 26 ఏళ్ల యువతికి స్థానిక జేపీ నగర్లో నివసిస్తున్న కార్తీక్‌రెడ్డితో మే మొదటి వారంలో ఫేస్బుక్లో పరిచయమైంది. వారం పాటు ఛాటింగ్ చేసిన తర్వాత కార్తీక్‌రెడ్డి తన ప్రేమను వ్యక్తం చేశాడు. పెళ్లి కూడా చేసుకుంటానన్నాడు. ఇందుకు ఆమె ఒప్పుకోవడమే కాకుండా తల్లిదండ్రులకు కూడా తెలియజేసింది. వారి సమ్మతితో అప్పుడప్పుడు డేటింగ్‌కు వెళ్లేది. ఈ క్రమంలో శారీరకంగా ఒకటయ్యారు. తర్వాత కార్తీక్‌రెడ్డి ప్రవర్తనలో మార్పు వచ్చింది. అనుమానించిన యువతి ఫేస్బుక్లో అతనికి స్నేహితులుగా ఉన్నవారిని విచారించింది. గతంలో కూడా కార్తీక్ ఇలానే పలువురిని మోసం చేసినట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో బాధితురాలు అతడిని నిలదీసింది. దీంతో ‘నా గురించి నా స్నేహితులతో విచారిస్తావా? నాకు చాలామంది రాజకీయ నాయకులు, కార్పొరేట్ వ్యక్తులతో సంబంధం ఉంది. నేను ఒక కంపెనీ సీఈఓను. నువ్వు ఏమీ చేయలేవు. నిన్ను వదిలిపెట్టను’ అని కార్తీక్ రెడ్డి బెదిరించాడు. అంతేకాకుండా ఫోన్ చేసి యాసిడ్ పోస్తానని బెదిరింపులకు దిగాడు. కార్తీక్‌రెడ్డి స్నేహితుడిగా చెప్పుకునే జయదీప్ కూడా బాధితురాలికి ఫోన్ చేసి ‘నీ పై వాహనం పోనిచ్చి చంపేస్తా. రోడ్డు ప్రమాదమని అందరినీ నమ్మిస్తా’ అంటూ కొద్దిరోజులుగా బెదిరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో బాధితురాలు వైట్‌ఫీల్డ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కార్తీక్‌రెడ్డి, జయదీప్ కోసం గాలిస్తున్నారు. -
పోలీసులకు హీరో భార్య ఫిర్యాదు
ముంబై: తన పేరుతో నకిలీ ఫేస్బుక్ ఎకౌంట్ తెరిచారని బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ భార్య, దర్శకురాలు కిరణ్ రావు పోలీసులను ఆశ్రయించారు. నకిలీ ఎకౌంట్ తో సోషల్ మీడియాలో తన పరువు తీస్తున్నారని బాంద్రా కుర్లాలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో శనివారం ఆమె ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తి ఫేస్బుక్ లో తన ఫొటోలు పోస్ట్ చేస్తున్నాడని.. అక్కడితో ఆగకుండా తన స్నేహితులు, కుటుంబ సభ్యులతో చాటింగ్ చేస్తున్నాడని కిరణ్ రావు ఫిర్యాదులో పేర్కొన్నట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మిగతా వివరాలు వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు. సెలబ్రిటీల పేరుతో సోషల్ మీడియాలో నకిలీ ఖతాలు తెరిచి అనుచితంగా ప్రవర్తించడం ఇటీవల కాలంలో ఎక్కువైంది. ముఖ్యంగా సినీతారల పేరుతో సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలు పెరిగిపోతుండడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. -
ఫేస్బుక్ కీచకుడు
పెనుగొండ: అతనో అధ్యాపకుడు. భావ వ్యక్తీకరణ, నిర్వహణ కోర్సులో దిట్ట. సామాజిక మాధ్యమాల నిర్వహణలోనూ ఆరితేరాడు. యువతులను వేధించడానికి అతను సామాజిక మాధ్యమాన్నే వేదికగా చేసుకున్నాడు. అసభ్య మెసేజ్‌లు పంపిస్తూ చివరకు కటకటాలపాలయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన కారాని నరేష్ తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ మేనేజ్మెంట్ అధ్యాపకునిగా పనిచేస్తున్నాడు. ఇతను నకిలీ ధ్రువపత్రాలతో సిమ్ తీసుకుని, ఫేస్బుక్ ఖాతా ప్రారంభించాడు. అందులో యువతులకు ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపుతూ పరిచయం చేసుకోవడం మొదలెట్టాడు. కొంత చనువు పెరిగాక అసభ్య మెసేజ్‌లు పంపడం ప్రారంభించాడు. ఇలా చాలామందికి అసభ్య మెసేజ్‌లు పంపాడు. ఈ నేపథ్యంలోనే పెనుగొండకు చెందిన ఓ యువతికి కూడా అసభ్య మెసేజ్‌లు పంపాడు. దీంతో ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై సీఐ సి.హెచ్.రామారావు ఆధ్వర్యంలో విచారణ ప్రారంభించిన పోలీసులు శనివారం నరేష్‌ను అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి రిమాండ్ విధించారు. అప్రమత్తంగా ఉండాలి : పోలీసులు అపరిచిత వ్యక్తులతో సామాజిక మాధ్యమాల్లో స్నేహం చేసేటప్పుడు యువత అప్రమత్తంగా ఉండాలని పెనుగొండ ఎస్సై సి.హెచ్.వెంకటేశ్వరరావు హెచ్చ రించారు. ఇటీవల ఫేస్బుక్, వాట్సప్, ఇతర సామాజిక మాధ్యమాల్లో అపరిచిత వ్యక్తులతో స్నేహాలు పెరిగిపోయాయని పేర్కొన్నారు. దీని వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. కొందరు ధైర్యం చేసి ఫిర్యాదు చేస్తున్నారని, మరికొందరు ఫిర్యాదు చేయడం లేదని వివరించారు. యువత ఇటువంటి వారి ఉచ్చులో పడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
ఫేస్‌బుక్‌తో గాలం
నగ్న చిత్రాలతో బ్లాక్మెయిల్ బాధితుల ఫిర్యాదుతో నిందితుణ్ని అరెస్టు చేసిన పోలీసులు కర్నూలు: ఫేస్బుక్ ద్వారా అమ్మాయిలకు వల వేసి.. ఉద్యోగమిస్తానంటూ మాయమాటలతో లాడ్జికి రప్పించి.. నగ్నచిత్రాలు తీసి బ్లాక్మెయిల్ చేస్తూ బంగారు ఆభరణాలు లాక్కుంటున్న ఘరానా నిందితుడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. కర్నూలు జిల్లా పగిడ్యాలకు చెందిన అవుజ రాజ్‌కుమార్ అలియాస్ తేజర్షి డిగ్రీ వరకు చదువుకొని.. వెలుగోడులో కొంతకాలం పాటు ఆర్ఎంపీ వద్ద అసిస్టెంట్‌గా పనిచేశాడు. ఆ తర్వాత దొర్నిపాడు గ్రామంలో ఆర్ఎంపీగా ప్రాక్టీస్ ప్రారంభించాడు. ఈ క్రమంలో ఏడు నెలల క్రితం రోడ్డు ప్రమాదానికి గురై కాలు విరగడంతో మంచం పట్టాడు. కాలక్షేపం కోసం ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేశాడు. తన బట్టతలకు విగ్ పెట్టుకుని ఉన్న ఫొటోను అందులో ఉంచి.. అమ్మాయిలను ఆకర్షించే విధంగా కొటేషన్లను అప్లోడ్ చేసేవాడు. వీటికి ఆకర్షితులై కామెంట్ చేసిన అమ్మాయిలతో చాటింగ్ చేస్తూ మంచి ప్రవర్తన కలిగిన వ్యక్తిగా నమ్మించి సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకున్నాడు. తన ఆస్పత్రిలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మాయమాటలు చెప్పి లాడ్జిలకు పిలిపించి వారిని లోబరుచుకునేవాడు. నగ్న ఫొటోలు కూడా తీసి, వారి వద్ద ఉన్న బంగారు ఆభరణాలను లాక్కునేవాడు. ఈవిధంగా మోసపోయిన సికింద్రాబాద్‌కు చెందిన ఓ యువతి, గుంటూరుకు చెందిన మరో వివాహిత చేసిన ఫిర్యాదు మేరకు కర్నూలు మూడో పట్టణ పోలీసులు గతంలో కేసు నమోదు చేసుకున్నారు. పోలీసులు కూడా ఫేస్‌బుక్‌నే ప్రయోగించి నిందితున్ని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి పది తులాల బంగారు ఆభరణాలు, కారు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని గురువారం ఎస్పీ ఆకే రవికృష్ణ ఎదుట హాజరు పరిచారు. -
ఫేస్బుక్లో ఎంపీకి బెదిరింపులు!
లండన్: ఫేస్బుక్లో సందేశాలు పంపుతూ బెదిరింపు చర్యలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని యూకే పోలీసులు ఆదివారం రాత్రి అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. తమకు ప్రాణాపాయం ఉందని లేబర్ పార్టీ ఎంపీలు సిమన్ డాన్క్జుక్, నెయిల్ కోలేలు ఇటీవలే ఫిర్యాదు చేశారు. గత మూడు, నాలుగు రోజుల నుంచి యూకేకి చెందిన పార్లమెంట్ సభ్యులకు బెదిరింపు సందేశాలు ఎక్కువగా వస్తున్నాయి. అయితే, కేసు దర్యాప్తులో భాగంగా విచారణ చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని క్రేయిగ్ వాల్లేస్ అలియాస్ మమమ్మద్ ముజాహిద్ ఇస్లామ్ అని గుర్తించారు. సామాజిక మాధ్యమం ఫేస్బుక్లో హెచ్చరింపు మెస్సేజ్‌లు చేస్తున్న నిందితుడు ముజాహిద్ ని పోలీసులు ఆదివారం రాత్రి అదుపులోనికి తీసుకున్నారు. హెండన్ మేజిస్ట్రేట్ ఎదుట సోమవారం నిందితుడిని హాజరుపరచనున్నట్లు వారు తెలిపారు. సిరియాలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులపై యూకే చేపట్టిన దాడులను ముమ్మరం చేయాలని పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తీర్మానానికి మద్దతు ప్రకటించిన తర్వాత ఎంపీలపై బెదిరింపు చర్యలు అధికమయ్యాయి. గత గురువారం నాడు వాల్లేస్ ఫేస్బుక్ నుంచి ఎంపీకి చేసిన ఓ మెస్సేజ్ సాక్ష్యాధారంగా చేసుకుని ఆదివారం అతడిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే, నిందితుడు ఏ పార్లమెంట్ సభ్యుడికి సందేశాలు పంపించాడన్న వివరాలను వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు. లండన్ నియోజకవర్గం సభ్యుడు అయితే కాదని మాత్రం స్పష్టంచేశారు. -
ఇళ్ల కష్టాలు తీర్చేందుకు ఫేస్బుక్ గ్రూప్!
న్యూఢిల్లీ: నీదే కులం, ఏ మతం, ఏ ప్రాంతం, మగా.. ఆడా, పెళ్లయిందా, కాలేదా, భర్త ఉన్నాడా, పోయాడా, పిల్లలున్నారా, లేదా, విజిటేరియనా, నాన్ వెజిటేరియనా.....? ఇలాంటి ప్రశ్నల పరంపరతో ఇళ్ల వేటలో అష్టకష్టాలు అనుభవించిన వారంతా ఇప్పుడు ఫేస్బుక్లో ఏకమయ్యారు. ముంబై నగరంలోని వడాలా ప్రాంతంలో ఇటీవల ముస్లిం మహిళ అయినందున అద్దె ఫ్లాట్ ఖాళీ చేయాల్సి వచ్చిన మిస్బా ఖాద్రికి అండగా నిలిచారు. గురువారం నాటికి దాదాపు వెయ్యిమంది ఫేస్బుక్లో ఓ గ్రూపుగా ఏర్పడి, ఇప్పటికే మైనారిటీ కమిషన్, మానవ హక్కుల కమిషన్ ముందు పోరాటం చేస్తున్న ఖాద్రీకి మద్దతుగా నిలుస్తున్నారు. నగరం ఏదైనా ఇళ్ల అద్దె, కొనుగోళ్లలో యజమానులు, హౌసింగ్ సొసైటీలు చూపిస్తున్న వివక్షపై న్యాయ పోరాటానికి మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇలాంటి వివక్షపూరిత అనుభవాలను ఎదుర్కొన్న వారు దేశంలో కోకొల్లలే ఉన్నారు. వారిలో సామాన్యులు ఉన్నారు. ప్రముఖులూ ఉన్నారు. ముస్లిం అవడం వల్ల తమకు నచ్చిన చోట ఫ్లాట్ కొనుక్కోలేక పోతున్నామని ప్రముఖ సినీ గేయ రచయిత జావేద్ అక్తర్ భార్య, సామాజిక కార్యకర్త, ప్రముఖ బాలీవుడ్ నటి షబానా ఆజ్మీ రెండేళ్ల క్రితం వాపోయారు. ఒకప్పుడు వివిధ కులాలు, మతాలు, జాతులతో భిన్నత్వంలో ఏకత్వంగా, దేశానికి ఆదర్శప్రాయంగా నిలిచిన ముంబై మహానగరం ఇప్పుడు కుల, మతాల ప్రాతిపదికన విడిపోతుంది. నగరంలోని గురుగావ్ ప్రాంతంలో మహారాష్ర్ట హిందువుల ప్రాబల్యం ఎక్కువగా ఉంది. బెండి బజార్ ప్రాంతంలో ముస్లింలు ఎక్కువగా ఉన్నారు. మాజ్గావ్లో క్రైస్తవులు, మాతుంగ ప్రాంతంలో హిందూ తమిళులు, గుజరాతీ, మలయాళీలు ఎక్కువగా ఉన్నారు. మలబార్ ప్రాంతంలో జైనులు ఉన్నారు. ఈ ప్రాంతాల్లో ఇల్లు అద్దెకివ్వడం, కొనుగోలు చేయడానికి ఇతరులను అనుమతించడం లేదు. కుల, మత, ప్రాంతాలతో ప్రమేయం లేకుండా ఐక్యంగా ఉన్న నగర ప్రజల మధ్య విభజన రేఖ ఎందుకు, ఎప్పుడు ఏర్పడింది ? ఎవరు చిచ్చు పెట్టారన్న ప్రశ్నలకు సమాధానం వెతుక్కోవడం పెద్ద కష్టం కాదు. అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం 1992-93 మధ్య జరిగిన మత కల్లోలాలతో ప్రజల మధ్య విభజన, వివక్ష ప్రారంభమైంది. ఇళ్ల వేటలో ఏర్పడుతున్న వివక్షను ఎదుర్కోవడానికి అన్ని న్యాయ మార్గాలను అన్వేషిస్తున్నామని ‘ఫేస్బుక్ గ్రూప్’ చెబుతోంది. అయితే ఇలాంటి వివక్షకు శాశ్వత పరిష్కారం సూచించే అవకాశం 2005లో వచ్చినా సుప్రీం కోర్టు వదిలేసుకొంది. మహారాష్ట్రకు చెందిన ఓ పార్సీ వ్యక్తి తన బంగళాను అమ్మకానికి పెట్టాడు. పార్సీలకు తప్ప ఇతరులకు అమ్మడానికి వీల్లేదని జోరాస్ట్రియన్ హౌసింగ్ సొసైటీ ఆంక్షలు విధించింది. దీనికి వ్యతిరేకంగా సదరు యజమాని సుప్రీంకోర్టు వరకు వెళ్లాడు. తమ సంస్కృతిని పరిరక్షించుకునేందుకు ఓ ప్రైవేటు సొసైటీ ఇలాంటి ఆంక్షలు విధించుకోవచ్చంటూ అతని కేసును సుప్రీం కోర్టు కొట్టివేసింది. -
రేపే నా పెళ్లి.. మీరంతా రండి!
ఇన్నాళ్లుగా అందరినీ తన తాగుబోతు పాత్రలతో అలరిస్తున్న తాగుబోతు రమేష్.. ఓ ఇంటివాడు కాబోతున్నాడు. భిక్కనూర్ ప్రాంతానికి చెందిన గోసు సత్యనారాయణ చిన్న కుమార్తె స్వాతిని అతడు గురువారం పెళ్లి చేసుకుంటున్నాడు. రమేష్ కూడా తమ కుటుంబంలో అందరికంటే చిన్నవాడు కావడం గమనార్హం. తన పెళ్లికి అందరూ రావాలని ఫేస్‌బుక్‌లోని తన అఫీషియల్ పేజి ద్వారా అందరినీ ఆహ్వానించాడు. తెలుగు, ఇంగ్లిషు భాషల్లో ముద్రించిన శుభలేఖలను కూడా అందరికీ ఫేస్బుక్ ద్వారా పంచాడు. రామిళ్ల వెంకటయ్య, రాజమ్మలకు చిన్న కుమారుడైన రమేష్.. సినిమాల్లో ఎప్పటినుంచో ఉన్నా, 'అలా మొదలైంది' సినిమాలో తాగుబోతు సాఫ్ట్వేర్ ఇంజనీర్ పాత్రతో బాగా ఫేమస్ అయ్యాడు. అప్పటి నుంచి దాదాపు ప్రతి సినిమాలో తాగుబోతు పాత్రలే పోషించాడు. నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలోని అశోక్ నగర్ కాలనీ వరలక్ష్మి గార్డెన్స్‌లో ఉదయం 8.22 గంటలకు రమేష్, స్వాతిల పెళ్లి జరగనుంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని దస్పల్లా హోటల్లో శనివారం రాత్రి 7.30 గంటల నుంచి రిసెప్షన్ ఇస్తున్నారు. -
ప్రాణం తీసిన ఫేస్బుక్ వ్యసనం
* ఇద్దరు యువతుల హత్య * ప్రాణం తీసిన ఫేస్బుక్ వ్యసనం * చెన్నైలో వెలుగుచూసిన దారుణాలు ప్రేమించిన యువకులే ఆ యువతులను కడతేర్చారు. ప్రియుల ప్రేమోన్మాదం ఆ ఇద్దరు యువతుల జీవితాన్ని నిలువునా హరించివేసింది. ఉన్నత విద్యావంతులైన ఆ అమ్మాయిలను కాటికి పంపారు. చెన్నై నగరంలో స్వల్ప వ్యవధిలో చోటుచేసుకున్న రెండు హత్యోదంతాలు తల్లిదండ్రులనేగాక ప్రజలను హతాశులను చేశాయి. అత్యాచారానికి యత్నించగా, ప్రతిఘటించిన ందుకు ఒక యువతిని హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. మరో సంఘటనలో ఫేస్ బుక్ చాటింగ్ వద్దన్నా వినకపోవడంతో యువతిని ప్రియుడు హత్య చేశాడు. చెన్నై, సాక్షి ప్రతినిధి : తలమైసెయిలగ కాలనీ వీజీ అపార్టుమెంటులో నివసిస్తున్న కేంద్ర ప్రభుత్వ రిటైర్డు ఉద్యోగి కన్నప్పన్ అనారోగ్యంపాలై ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, భార్య జమున భర్తకు తోడుగా ఉంటోంది. ఈ దంపతులకు కుమార్తెలు ఉమా, అశ్వని, కుమారుడు దినేష్ (25) ఉన్నారు. చూలైకి చెందిన అరుణ బీకాం పూర్తిచేసి ఆడిటర్ శిక్షణ తీసుకుంటోంది. వీరిద్దరి మధ్య కొంతకాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఎప్పుడూ చుడీదార్‌తో ఆఫీసుకు వెళ్లే అరుణ (20) సోమవారం చీరతో వెళ్లింది. ఇంట్లోవారు ఇదేమని ప్రశ్నించగా దేవతలా తిరిగి వస్తానని చమత్కారంతో బదులిచ్చింది. తండ్రితోపాటూ ఆస్పత్రిలో అమ్మ, సోదరి ఉండడంతో ఇంటిలో ఒంటరిగా ఉన్నానంటూ దినేష్ ప్రియురాలు అరుణను సాయంత్రం ఇంటికి రప్పించుకున్నాడు. రాత్రి 10.30 గంటల సమయంలో ఒక పరుపు, దుప్పటిలో అరుణ మృతదేహాన్ని చుట్టి తమ కారు డిక్కీలో ఎక్కించే ప్రయత్నంలో బరువును ఎత్తలేకపోయాడు. పక్కనున్న అపార్టుమెంటు సెక్యూరిటీ గార్డును పిలిచి ఆస్పత్రిలో ఉన్న తండ్రి కోసం వీటిని తీసుకెళుతున్నాను సహకరించాల్సిందిగా కోరాడు. అరుణను ఉంచిన మూటను ఇద్దరు కలిసి ఎత్తి కారులోకి చేరవేస్తున్న దశలో చేయి బయట పడింది. దీంతో ఉలిక్కిపడిన సెక్యూరిటీ గార్డు బిగ్గరగా కేకలు వేయడంతో దినేష్ పారిపోయాడు. వెళ్తూ వెళ్తూ ప్రియురాలి నుంచి స్వాధీనం చేసుకున్న ఆమె హ్యాండ్ బ్యాగ్, నగలతో సహా అరుణ ఇంటి వద్ద గిరాటు వేసి వెళ్లిపోయాడు. ఇరుగుపొరుగూ వచ్చి పరుపు మూటను విప్పిచూడగా దారుణంగా పొడిచి చంపిన తీరులో అరుణ మృతదేహం ఉంది. ఆఫీసుకు వెళ్లిన అరుణ రాత్రి పొద్దుపోతున్నా ఇంటికి చేరుకోకపోవడం, సెల్‌ఫోన్ ఎత్తకపోవడంతో భయపడిన అరుణ తల్లిదండ్రులు కుముద, శ్రీనివాసన్ వెతుకులాటకు బయలుదేరారు. ఇంటి బయట కుమార్తె హ్యాండ్‌బ్యాగ్, నగలు దొరకడంతో మరింతగా భయపడిన ఆయన రాత్రి 11 గంటల సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కీల్పాక్ వద్ద ఒక యువతి హత్యకు గురైంది, మీ అమ్మాయేమో చూసుకోండని సరిగ్గా అదే సమయంలో పోలీసులు శ్రీనివాసన్‌కు చెప్పారు. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రిలో ఉన్న అరుణ మృతదేహాన్ని చూసి తల్లి అముద స్ఫృహ తప్పిపోగా, తండ్రి తల్లడిల్లిపోయాడు. ఇంటిలో ఒంటరిగా ఉన్న సమయాన్ని అవకాశంగా తీసుకుని అరుణపై అత్యాచారం చేయబోతే ప్రతిఘటించడం వల్ల హతమార్చాడా లేక అత్యాచారం చేసి హత్య చేశాడా అని పోలీసులు అనుమానిస్తున్నారు. పరారైన నిందితుడు దినేష్ కోసం మంగళవారం తెల్లవారేవరకు రోడ్లన్నీ దిగ్బంధించి, గాలించినా దొరక్క పోవడంతో అతని బంధువులు, స్నేహితుల ఇళ్లలో గాలిస్తున్నారు. ప్రాణంతీసిన ఫేస్బుక్ బాయ్‌ఫ్రెండ్స్ అంటూ ప్రియురాలిపై అనుమానం పెంచుకుని ఆమె ప్రాణాలనే హరించిన సంఘటన మంగళవారం వెలుగుచూసింది. వడపళనికి చెందిన అంతోని కుమార్తె గ్రేసీ షాలినీ (21) (ఎంఏ ఇంగ్లీషు లిటరేచర్ విద్యార్థిని) కోడంబాకానికి చెందిన అబ్దుల్ రజాక్ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఇటీవల సెల్‌ఫోన్‌లోని ఫేస్బుక్, వాట్సాప్‌ల ద్వారా బాయ్‌ఫ్రెండ్స్‌తో గంటల కొద్దీ చాటింగ్ చేస్తున్నట్లు రజాక్ అనుమానించాడు. అంతేగాక ఇటీవల తనకు దూరంగా మెలుగుతున్నట్లు భావించాడు. బాయ్‌ఫ్రెండ్స్‌తో చాటింగ్ మానుకోవాలని అనేకసార్లు మందలించినా ఆమె పట్టించుకోలేదు. తాంబరం సమీపం పట్టిపై ఆరంబాకంలో కాపురం ఉంటున్న నత్తంబీవీ అనే మహిళ ఊరికెళుతూ తన ఇంటి తాళాలను రజాక్ వద్ద ఇచ్చి వెళ్లింది. ఈనెల 7వ తేదీన కాలేజీకి వెళ్లిన షాలినీని నత్తంబీవీ ఇంటికి పిలిపించుకున్నాడు. చాటింగ్ వ్యవహారాలు మానుకోవాలని మళ్లీ మందలించా డు. ఈ సమయంలో ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకోగా అగ్రహం పట్టలేని రజాక్ పక్కనే ఉన్న పశువులు కట్టే తాడుతో ఆమెకు ఉరిబిగించి హతమార్చాడు. శవాన్ని ఇంటిలోనే వదిలి ఏమీ తెలియనట్లుగా తాళం వేసుకుని కోడంబాకంలోని ఇంటికి చేరుకున్నాడు. మంగళవారం నత్తం బీవీ ఇంటికి చేరుకోగా దారుణంగా కుళ్లిపోయిన స్థితిలో షాలిని మృతదేహం పడి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి రజాక్‌ను అరెస్ట్ చేశారు. -
అమ్మాయితో చాటింగ్.. చితకబాదిన బంధువులు
ఫేస్బుక్లో ఓ అమ్మాయితో చాటింగ్ చేసిన యువకుడిని ఆమె బంధువులుగా భావిస్తున్న కొందరు వ్యక్తులు చితక్కొట్టారు. కృష్ణాజిల్లా గొల్లపూడికి చెందిన శివదుర్గా శ్రీనివాస్, వారంరోజులుగా ఫేస్బుక్లో ఓ యువతితో చాటింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ''ఈ రోజు కాలేజీ లేదు విజయవాడ క్లబ్ సమీపంలోని ఎడ్వంచర్ వద్ద కలుసుకుందామా '' అని అతడు చాటింగ్‌లో కోరాడు. ఆమె ఓకే అంటూ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దాంతో అతడు ఎడ్వంచర్ ప్రాంతం వద్ద వేచి చూస్తుండగా.. అక్కడకు వచ్చిన కొంతమంది అగంతకులు అతడిని ఎత్తుకెళ్లి చితకబాది పొలంలోపడేసి పరారయ్యారు. గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కేన్సర్ రోగితో రెహమాన్ పుట్టినరోజు వేడుకలు
చెన్నై: మ్యూజిక్ మాంత్రికుడు, ఆస్కార్ విజేత ఎ.ఆర్.రెహమాన్ తనలోని మానవత్వాన్ని చాటుకున్నారు. మంగళవారం 48వ ఏట అడుగుపెట్టిన ఆయన.. చెన్నైలో కేన్సర్ తో బాధపడుతున్న ఓ అభిమానిని పరామర్శించారు. పుట్టినరోజున తన కుటుంబంతో కాసేపు గడిపిన రెహమాన్.. కేన్సర్ రోగిని పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం ఫేస్ బుక్ లో అభిమానులతో కాసేపు చాట్ చేశారు. 'ఆయన తన పుట్టినరోజును విలాసవంతంగా జరుపుకోవడానికి ఏమాత్రం ఇష్టపడరు. తల్లి ఆశీర్వాదంతో ఆ రోజును ప్రారంభించిన రెహమాన్.. అనంతరం చెన్నై లోని ఓ ప్రైవేటు హాస్పిటల్ కు వెళ్లి అక్కడ కేన్సర్ తో బాధపడుతున్న ఆయన అభిమానిని పరామర్శించారు.' అని రెహమాన్ సన్నిహితులు వెల్లడించారు. పుట్టినరోజున కూడా పని చేయడానికి ఆయన ఇష్టపడతారని, ఆ రోజు కూడా స్టూడియోలో కాసేపు గడిపారని తెలిపారు. అనంతరం తన ఫేస్ బుక్ అభిమానులతో చాటింగ్ చేసినట్టు వెల్లడించారు. -
ఇంటర్నెట్లో విహారం..
తల్లిదండ్రులకు సూచనలు.. పిల్లలను తల్లిదండ్రులు ఎల్లప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలి. వారి సంతోషాలు, బాధలను గుర్తించాలి. ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నారంటే అప్రమత్తమై వారితో మాట్లాడి వారి సమస్య ఏమిటో గుర్తించి పరిష్కరించాలి. అధిక సమయం ఇంటర్నెట్, ఫేస్బుక్ చాటింగ్‌లో ఉన్నారని తెలిస్తే వారికి ప్రేమగా నచ్చజెప్పాలి. చిన్నపిల్లలను ఈ సాంకేతిక మాయాజాలంలోకి తీసుకరాకపోవడమే మంచిది. అవసరం మేరకే వినియోగించుకునేలా చూడాలి. బోర్ కొట్టిందంటే చాలు.. ప్రస్తుతం సెల్‌ఫోన్ లేని వారు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. ప్రతీ మనిషి ఒక రోజు కనీసం అర గంట నుంచి ఆరు గంటలపాటు సెల్ఫోన్లో మాట్లాడుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోవడంతో దానిపై ఆధారపడక తప్పడం లేదు. ఇది కాస్త శ్రుతిమించడంతోనే అసలు సమస్య మొదలవుతుంది. కాస్త బోర్ కొట్టిందంటే చాలు సెల్‌ఫోన్ బయటకు తీసి ఇంటర్నెట్, ఫేస్బుక్, వాట్సప్‌లో గంటలు గడిపేస్తున్నారు. వినియోగానికి అనుగుణంగా నెట్వర్క్ కంపెనీలు కాల్ రేట్లు తగ్గిస్తూ.. తక్కువ నగదుకు ఇంటర్నెట్లో సేవలు అందిస్తున్నాయి. ఆండ్రాయిడ్ సెల్‌ఫోన్ ఉన్నవారైతే వాటిని మురిపెంగా చూసుకుంటున్నారు. చిన్నపిల్లలు సైతం సెల్‌పోన్ వినియోగానికి అలవాటు పడుతున్నారు. ఒక్కసారిగా.. బంధం తెగిపోతే.. ఫేస్బుక్ చాటింగ్ సానబట్టిన కత్తి లాంటిది. తొలినాటి నుంచే తన ప్రభావం చూపిస్తుంది. దాన్ని ఉపయోగించుకునే తీరును బట్టే మన విజయాలు ఆధారపడి ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య సరైన బంధం లేని కారణంగా.. ఎంతోమంది ఫేస్‌బుక్‌పై ఆధారపడుతున్నారు. పిల్లలు ఏమాత్రం దిగులుగా ఉంటున్నా.. పరధ్యానంలో ఉన్నా గ్రహించాలి. తల్లిదండ్రులు వారిని ప్రేమతో దగ్గరకు తీసుకుని మాట్లాడాలి. వారిగోడు వినాలి. వీలైతే ఆ సమస్యను పరిష్కరించాలి. తెల్లవారముందే సందేశాలు.. త్రీజీ సేవలు అందుబాటులోకి రావడంతో వినియోగం మరింతగా పెరిగిపోయింది. తెల్లవారకముందే వాట్సప్, ఫేస్బుక్, ఇతర సామాజిక సైట్లలో గుడ్మార్నింగ్లు చెప్పేసుకుంటున్నారు. వారి అభిప్రాయాలు, అనుభూతులు, చిత్రాలు ఇతరులతో పంచుకుంటున్నారు. ఇంతవరకు పర్వాలేదు. కానీ.. అసలు సమస్య మొదలయ్యేది అక్కడే. గంటల కొద్దీ చాటింగ్ చేయడం, రాత్రివేళల్లో ఆలస్యంగా నిద్రపోవడంతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అవసరం ఉన్నంత మేరకే.. యువతతోపాటు పెద్దలూ సరదా కోసమంటూ చాటింగ్‌లో ఊబిలోకి దిగుతున్నారు. ఫేస్బుక్లో అవసరం ఉన్నా.. లేకపోయినా వచ్చిన ప్రతి లైక్‌కు రిప్లయిలిస్తూ.. 60 శాతం అనవసర పరిచయాలు పెంచుకుంటున్నారు. ఇక్కడి నుంచే అసలు సమస్యలు ప్రారంభమవుతాయి. ఆదిలోనే వీటిని అరికడితే మంచిది. తల్లిదండ్రులు తమ పిల్లలకు సమయం కేటాయించి వారి సమస్యలు పరిష్కరించాలి. వీడియో గేమ్స్.. పిల్లలు, పెద్దలకు వీడియో గేమ్స్ ప్రియంగా మారాయి. అవకాశం దొరికినప్పుడల్లా నిద్ర మానుకుని గేమ్స్ ఆడేవారి సంఖ్య పెరిగిపోతోంది. ప్రస్తుతం వేలాది వేలాది గేమ్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇంటర్నెట్లో కూడా సరికొత్త గేమ్స్ అందుబాటులో ఉన్నాయి. ఎక్కువ మంది పగలు పాఠశాలలకు వెళ్లడంతో చిన్నారులకు సమయం దొరకడం లేదు. దీంతో రాత్రిళ్లు ఎక్కువ సమయం గేమ్స్ ఆడడానికే కేటాయిస్తున్నారు. దీంతో అనారోగ్యానికి గురవుతున్నారు. పెద్దలూ గేమ్స్ మాయలో పడుతున్నారు. ఇటీవల ఓ గేమ్ అందరిలోనూ ‘సెగ’ పుట్టిస్తోంది. రిక్వెస్ట్‌లు, లాక్‌లు, స్టేజీ సతమతం చేస్తున్నాయి. నిద్రలేమి అతిపెద్ద సమస్య.. మనిషి సగటున ఎనిమిది గంటలైనా నిద్రపోవాలనేది వైద్యులు చేప్పే మాట. కానీ నేడు యువత, ఉద్యోగులు ఎప్పుడు నిద్రపోతున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. రాత్రి 11 గంటల నుంచి ఒంటి గంట వరకు మెలకువగా ఉండేవారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. గ్రామాల్లో విద్యుత్ సరఫరా లేని రోజుల్లో సాయంత్రం ఆరు గంటలకు భోజనం చేసి 7 గంటలకు నిద్రపోయేవారు. తెల్లవారుజామున 5 గంటలకు నిద్రలేచి ఆ రోజు దినచర్యను ప్రారంభించేవారు. ప్రసుత్తం ఎక్కువ మంది ఉదయం పొద్దెక్కే వరకు నిద్రపోతున్నారు. దీంతో అనేక సమస్యలు వస్తున్నాయి. రాత్రి 11-12 గంటల దాకా చాటింగ్ చేస్తున్నవారు చిన్న వయస్సులోనే మధుమేహం, రక్తహీనత బారిన పడుతున్నారని వైద్యుల అంచనా. -
ఫ్రెండ్స్ బుక్
స్థలం.. బేగంపేట్‌లోని ఉమానగర్.. ‘అందరిమాట ఏమోగాని నాకు మాత్రం ఇంటర్నెట్ చాలా యూజ్‌ఫుల్ అయింది. ఏజీ ఆఫీస్‌లో అంకౌట్స్ ఆఫీసర్‌గా రిటైర్ అయ్యాక కాలక్షేపం ఏంటా అనుకుంటున్నప్పుడు ఫేస్బుక్ పరిచయమైంది. ఇందులోని ప్రమదాక్షరి గ్రూప్ నాకు ఎందరో రచయితలను, కొత్త రచనలను పరిచయం చేసింది. ఈ గ్రూప్‌లోని వాళ్లలో కాంపిటేటీవ్ స్పిరిట్‌ను చూస్తున్నాను’ అంటూ ఉపోద్ఘాతం ఇచ్చారు సీఎస్ఎమ్ లక్ష్మీ. ‘బ్లాగ్‌లో.. ఫేస్బుక్ గ్రూప్‌లో రచనలు రాయడంలో నేను జూనియర్‌నే అయినా రచయిత్రిగా మాత్రం మీ అందరికన్నా సీనియర్నే’ అంటూ ఈ చర్చలోకొచ్చారు పొత్తూరి విజయలక్ష్మి..‘ మేం కథలు, నవలలు రాసే కాలంలో పాఠకుల నుంచి వచ్చే ఉత్తరాల కోసం వారాలకు వారాలు ఎదురు చూసేవాళ్లం. ఇప్పుడలాకాదు ఇలా ఓ వాక్యం రాశామో లేదో అలా లైక్లూ.. కామెంట్లు వచ్చిపడుతున్నాయ్. పుస్తకాలు చదివేవాళ్లు, రాసేవాళ్లు లేటెస్ట్ టెక్నాలజీని ఇట్లా ఉపయోగించుకుంటున్నారు. అందుకే పఠనాసక్తి తగ్గిందంటే నేనొప్పుకోను’అని కరాఖండిగా చెప్పారామె. ‘అవును నేనూ ఒప్పుకోను. ఇప్పుడు ఈ ఇంటర్నెట్ పత్రికలు నిర్వహిస్తున్న పాత్ర అంతాఇంతా కాదు మరి. మీలాంటి సీనియర్స్ సీరియస్‌గా రచనా వ్యాసంగంలో ఉన్న రోజుల్లో మీ రచనలకు ఆస్ట్రేలియా, అమెరికా, చైనా, జపాన్, సింగపూర్‌లాంటి దేశాల్లో పాఠకులుండేవారా? కానీ ఇప్పుడు ఈ ఇంటర్నెట్ పత్రికలకు ప్రపంచవ్యాప్త పాఠకులున్నారు. కథను పోస్ట్ చేసిన క్షణంలోనే దాన్ని చదివేవాళ్లున్నారు. వెంటనే తమ స్పందననూ తెలుపుతున్నారు’అంటూ పొత్తూరి విజయలక్ష్మి అభిప్రాయాన్ని ఏకీభవిస్తూ తన అభిప్రాయాన్నీ చెప్పారు మంథా భానుమతి. ‘ఇదివరకు రచయితలు తక్కువ, పాఠకులు ఎక్కువ ఉండేవారు. ఇప్పుడు రచయితలు ఎక్కువయ్యారు. రచన ఎవరి సొత్తు కాదని ఇవి నిరూపిస్తున్నాయి’అని స్వాతి శ్రీపాద అంటుంటే ‘పాఠకులూ రచయితలు అవుతున్నారన్న మాట.. రచయితలు మంచి పాఠకులుగా కూడా ఉంటున్నారు’ అని తన వాక్యాన్ని ఆమె మాటకు జోడించారు ప్రముఖ రచయిత్రి, వాన చినుకులు బ్లాగ్ రైటర్ వారణాసి నాగలక్ష్మి. ‘మా మనవడితో మాట్లాడటానికని ఇంటర్నెట్ యూజ్ చేయడం నేర్చుకున్నాను. అలా ప్రమదావనం అనే గ్రూప్‌తో పరిచయం ఏర్పడింది. దానివల్లే ఫొటోషాప్ నేర్చుకున్నాను. నాలుగు కథలూ రాశాను’అని తన వాణి వినిపించారు మాలాకుమార్. ‘పుస్తకాలు తగ్గిపోతున్న ఈ కాలంలో అంతర్జాల పత్రికలతో చెలిమైంది. ప్రమదావనంలో మెంబర్అయి సొంతంగా బ్లాగ్ కూడా స్టార్ట్ చేశాను. వెంటనే వచ్చే రెస్పాన్స్ ఈ వయసులో కూడా నాలో రచనా ఉత్సాహాన్ని నింపింది’ అని విశ్రాంత సమయాన్ని వినియోగపర్చుకుంటున్న తీరును పంచుకున్నారు జీఎస్ లక్ష్మీ. ‘ఇంటర్నెట్ పత్రికలను ఏ ఫోన్లోనైనా. ట్యాబ్లోనైనా చదువుకోవచ్చు. నా మటుకు నాకు పత్రికలు, ఫేస్బుక్ గ్రూప్స్ వల్ల కొత్త ఫ్రెండ్స్ అయ్యారు, పాత ఫ్రెండ్షిప్ మరింత సన్నిహితమైంది’ అని వివరించారు కే బీ లక్ష్మి. ‘మీ అందరి స్నేహాన్ని నేను పొందగలిగానంటే ఫేస్బుక్కే కారణం. అంతేకాదు నాలో ఉన్న రచనాసక్తిని వెలికితీసి కథలు రాయగలిగేలా చేసిందీ ఈ గ్రూప్‌లే. పదాల పందిరి లాంటి ఆటలను పరిచయం చేశాను’ అని తన జ్ఞాపకాన్ని పంచుకుంది నండూరి సుందరీనాగమణి. ‘తీరిక సమయాల్లో కుట్లుఅల్లికలతో కాలక్షేపం చేస్తున్న నేను పిల్లల చదువుకోసం ఇంటర్నెట్ను పరిచయం చేసుకున్నాను. పచారీ కోసం దినుసుల పేర్లు రాయడం తప్ప ఇతర రాతలు అలవాటు లేని నేను ఇంటర్నెట్ పుణ్యమాని బ్లాగ్ రైటర్‌గా మారాను. దినపత్రికల్లో ఫుడ్కాలమిస్ట్గా.. చివరకు కథారచయిత్రిగా, పబ్లిషర్‌గా ఎదిగాను. అంతర్జాల పత్రికకు సంపాదకురాలినయ్యాను. ఇలా ఇంటర్నెట్ వల్ల నా కన్నా ఎక్కువ ఉపయోగపడినవారు లేరనుకుంటా’ అంటూ చర్చకు ముగింపు పలికారు రచయిత్రి జ్యోతి వలబోజు. - సరస్వతి రమ -
'ఫేస్బుక్' ద్వారా అసభ్య మెసేజ్‌లు, అరెస్ట్
హైదరాబాద్ : సోషల్ మీడియా (పేస్బుక్) ద్వారా అసభ్యకర మెసేజ్‌లు పంపి విద్యార్థినిని వేధిస్తున్న ఆకతాయిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ఐ నరేష్ కథనం ప్రకారం రాజేంద్రనగర్‌కు చెందిన విద్యార్థిని హనుమాన్ టెకిడీలోని ఓ ప్రయివేట్ కళాశాలలో బీయస్సీ రెండో సంవత్సరం చదువుతోంది. అంబర్‌పేటకు చెందిన ఉదయ్ కుమార్ అనే సహచర విద్యార్థి...... విద్యార్థినికి ఫేస్బుక్ ద్వారా అసభ్యకర మెసేజ్‌లు పంపుతున్నాడు. ఈ విషయమై విద్యార్థిని అతడిని నిలదీయగా ...దుర్భాషలాడటంతో పాటు ఆమెను బెదిరించాడు. దీంతో బాధితురాలు, కుటుంబ సభ్యులతో కలిసి సుల్తాన్ బజార్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఉదయ్ కుమార్ ను అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి) -
‘ఫేస్బుక్’ కలిపింది ఇద్దరిని..!
ఫేస్బుక్... సప్త సముద్రాల ఆవల ఉన్న వారినీ ఏకం చేస్తున్న సామాజిక నెట్వర్క్. దీనిద్వారా అనేకమంది చాటింగ్ మొదలుపెట్టి పెళ్లి దాకా వెళ్లారు. ఈ జాబితాలోనే చేరాడు భారత హాకీ జట్టు కెప్టెన్ సర్దార్ సింగ్. ఇంగ్లండ్ హాకీ జట్టు యువ క్రీడాకారిణి అశ్‌పాల్ కౌర్ భోగల్తో రెండేళ్ల క్రితం ఫేస్బుక్ చాటింగ్ ద్వారా మొదలైన పరిచయం ప్రేమగా మారింది. వచ్చే ఏడాది వీరు వివాహం చేసుకోబోతున్నారు. భారత హాకీ కెప్టెన్ సర్దార్ సింగ్ ప్రేమాయణం న్యూఢిల్లీ: ప్రముఖ క్రీడాకారుల ప్రేమాయణాల ప్రస్తావన వస్తే ముందుగా క్రికెటర్లు, ఫుట్‌బాలర్లు, టెన్నిస్ స్టార్స్ వస్తారు. అయితే ఓ హాకీ క్రీడాకారుడు కూడా ఈ జాబితాలో చేరాడు. అతనెవరో కాదు... మైదానంలో మెరుపు కదలికలతో సహచరులకు పాస్‌లు ఇస్తూ, గోల్స్ చేసేందుకు అవకాశాలు సృష్టించడంలో దిట్ట అయిన భారత హాకీ కెప్టెన్, స్టార్ మిడ్‌ఫీల్డర్ సర్దార్ సింగ్. రెండేళ్ల క్రితం లండన్ ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు వెళ్లిన భారత హాకీ జట్టు ఎలాంటి పతకం లేకుండా రిక్తహస్తాలతో తిరిగి వచ్చినా... కెప్టెన్ సర్దార్ సింగ్‌కు మాత్రం జోడి దొరికింది. ‘ఒకరోజు నా ఫేస్బుక్ అకౌంట్ ఇన్‌బాక్స్‌లో వచ్చిన సందేశాన్ని చూసుకున్నాను. అశ్‌పాల్ కౌర్ అనే అమ్మాయి నుంచి ఈ సందేశం వచ్చింది. తొలుత తేలిగ్గా తీసుకున్నాను. ఆ తర్వాత వరుసగా నా గురించి ఎన్నో విషయాలు రాయడంతో ఆసక్తి పెరిగింది. ఎవరీ అమ్మాయి. ఒకసారి కలిస్తే బావుంటుంది అనుకున్నాను. లండన్ ఒలింపిక్స్ (2012)లో మా మ్యాచ్‌ను తిలకించేందుకు రావాలని ఆహ్వానించాను. కానీ ఆమె రాలేదు’ అని ప్రేమ చిగురించిన క్షణాలను సర్దార్ సింగ్ గుర్తు చేసుకున్నాడు. ‘లండన్ ఒలింపిక్స్ తర్వాత స్వదేశానికి వచ్చాను. కానీ మా మధ్య ఎస్ఎంఎస్లు, ఈ-మెయిల్స్, ఫోన్స్ కాల్స్‌తో మాటల పరంపర కొనసాగింది. అయినా ఈ మాటలు మా మధ్య ఉన్న దూరాన్ని తగ్గించలేకపోయాయి. మూడు నెలల గడిచాయి. సస్పెన్స్‌కు తెరదించాలనుకున్నాను. లండన్ వెళ్లి అశ్పాల్ను, ఆమె తల్లిదండ్రులను కలవాలని నిర్ణయించుకున్నాను. వారితో కలిశాక నా ఆనందం రెట్టింపైంది. ఈ సంబంధం గురించి నా తల్లిదండ్రులవద్ద ప్రస్తావించాను. నేను ఎలా ఫీలవుతున్నానో చెప్పాను. కానీ వారు మాత్రం ఆ అమ్మాయి ‘నామ్ధారి’ వర్గీయురాలేనా అని ప్రశ్నించడంతో నేను కొంచెం కంగారు పడ్డాను. కానీ అంతా మంచే జరిగింది. నామ్ధారి వర్గం పెద్ద.. ఠాకూర్ ఉదయ్ సింగ్ నుంచి ఆమోదం లభించాక ఇంట్లో వారూ ఈ సంబంధానికి సరే అన్నారు’ అని ప్రస్తుతం హర్యానా పోలీసు డిపార్ట్మెంట్లో డిప్యూటీ సూపరిటెండెంట్‌గా పనిచేస్తోన్న 28 ఏళ్ల సర్దార్ సింగ్ వివరించాడు. ‘ఈ ఏడాది మే 22న నెదర్లాండ్స్‌లో ప్రపంచ కప్ సమయంలో అశ్పాల్కు పెళ్లి ప్రతిపాదన చేశాను. ఆమె అంగీకరించింది. ఇప్పటికైతే నిశ్చితార్థం జరిగింది. ఇంట్లో వాళ్లు తొందరగా పెళ్లి చేసుకోవాలని కోరుతున్నారు. కానీ 2016 రియో ఒలింపిక్స్ వరకు ఆగితే బావుంటుందని నా అభిప్రాయం తెలిపాను. ఈ ఏడాది మా ఇద్దరికీ బిజీ షెడ్యూల్ ఉంది. నేను ఆసియా క్రీడల్లో, చాంపియన్స్ ట్రోఫీలో ఆడాలి. అశ్‌పాల్ ఇంగ్లండ్ జాతీయ జట్టుకు సేవలు అందించాల్సి ఉంది. అంతా అనుకూలిస్తే వచ్చే ఏడాది పెళ్లి జరిగే అవకాశముంది’ అని సర్దార్ సింగ్ తెలిపాడు. వచ్చే నెలలో 20 ఏళ్లు పూర్తి చేసుకోనున్న అశ్‌పాల్ తమ పరిచయాన్ని ‘లవ్ ఎట్ ఫస్ట్‌సైట్’ అని చెబుతోంది. ఆరేళ్ల వయస్సులోనే హాకీ స్టిక్ పట్టుకున్న అశ్‌పాల్ ఇంగ్లండ్ అండర్-19 జట్టులో ఎంపికై ఈ ఘనత సాధించిన తొలి ఆసియా సంతతి క్రీడాకారిణిగా నిలిచింది. -
ఫేస్బుక్కే మీ పిల్లల టీచర్!!
మీ పిల్లలు ఎక్కువ సేపు ఫేస్బుక్ చూస్తున్నారా? అయినా సరే ఇప్పుడు మీరు వాళ్లను తిట్టాల్సిన అవసరం అంతగా లేదు. అదే వాళ్లకు టీచర్లా ఉపయోగపడుతుందట. సోషియాలజీ క్లాసులో భాగంగా ఫేస్బుక్ ఎక్కువగా ఉపయోగించిన యూనివర్సిటీ విద్యార్థులు వాళ్ల ఎసైన్‌మెంట్లను చాలా బాగా పూర్తిచేశారు. ఫేస్బుక్ గ్రూపు రూపొందించుకున్న విద్యార్థులు దానిద్వారా గ్రూప్ స్టడీ లాంటివి చేసుకుని, ఎసైన్మెంట్లు బాగా రాశారని బేలర్ యూనివర్సిటీ కాలేజి ఆఫ్ ఆర్ట్స్‌లో సోషియాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ కెవిన్ డౌర్టీ తెలిపారు. ఉన్నత విద్యకు వచ్చేసరికి ఎక్కువ మంది పిల్లలకు బోధించడం చాలా కష్టంగా ఉంటుందని, ఆ సవాళ్లను విద్యార్థులు ఇలా ఫేస్బుక్ లాంటి వాటితో అధిగమిస్తున్నారని అదే వర్సిటీలో పీహెచ్డీ చేస్తున్న బ్రిటా ఆండర్చెక్ అభిప్రాయపడ్డారు. 218 మంది విద్యార్థులతో కూడిన బృందాన్ని ఈ వర్సిటీ గమనించిన తర్వాత ఈ విషయాన్ని వెల్లడించింది. -
ఫేస్'బుక్కైపోయాడు'
హైదరాబాద్ : సామాజిక వెబ్సైట్ ఫేస్బుక్లో యువతుల పేర్లతో అకౌంట్లు క్రియేట్ చేసి అభ్యంతరకర సందేశాలు, అశ్లీల ఫోటోలు పోస్ట్ చేస్తున్న ఓ యువకుడిని సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. డీసీపీ పాలరాజు కథనం ప్రకరాం బేగంపేటలోని గన్ బజార్ నివాసి మహ్మద్ ఖాలేద్ ఓల్డ్ బోయిన్‌పల్లిలోని ఓ పెస్ట్ కంట్రోల్ సంస్థలో టెక్నీషియన్. గతంలో ఇతడితో కలిసి మరో సంస్థలో విధులు నిర్వర్తించిన యువతిపై ఆశలు పెంచుకున్న ఖాలేద్ ఫేస్బుక్లో ఆమె అకౌంట్‌ను గుర్తించి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. ఆమె నుంచి ఎలాంటి స్పందన లేకపోవటంతో కక్షకట్టాడు. యువతికి చెందిన ఫోటోను ఆమె పేరుతో నకిలీ అకౌంట్ తెరిచాడు. దీన్ని వినియోగించి యువతి ఫ్రెండ్స్ లిస్ట్‌లో ఉన్న మహిళలు/యువతులకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. రిసీవ్ చేసుకున్న వారంతా సదరు యువతే పంపిందని భావించి యాక్సెప్ట్ చేశారు. ఇలా ఫ్రెండ్స్‌గా మారిన వారిలో ఓ యువతితో అసభ్యకర పదజాలంతో చాటింగ్ చేశాడు. ఆమె ద్వారా సమాచారం అందుకున్న బాధితురాలు సీసీఎస్ డీసీపీ పాలరాజుకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన ఇన్స్పెక్టర్ రాజు నేతృత్వంలోని బృందం సాంకేతిక దర్యాప్తు చేపట్టి నిందితుడైన ఖాలేద్‌ను గుర్తించారు. శుక్రవారం ఇతడిని అరెస్ట్ చేసి విచారించగా... ఇదే తరహాలో మరో ఏడు బోగస్ అకౌంట్లు క్రియేట్ చేసి,అశ్లీల ఫోటోలు పోస్ట్ చేయడంతో పాటు వారి పేర్లతో చాటింగ్స్ చేసినట్లు వెల్లడైంది. -
‘ఫేస్బుక్’ మెసేజ్‌తో దుమారం
తూప్రాన్, న్యూస్‌లైన్ : ఫేస్బుక్లో ఓ నాయకుని పేరుతో అనుచిత వ్యాఖ్యలు రాసి మెసేజ్ చేసిన ఘటన కాళ్లకల్, తూప్రాన్లలో గురు దుమారం రేపింది. కాంగ్రెస్, టీడీపీ పార్టీలకు చెందిన ఇరువర్గాలు ఈ ఘటనపై బాహాబాహీకి దిగడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీస్ స్టేషన్ ఎదుట జరిగిన ఈ సంఘటన కలకలం రేపగా ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు. వివరాలిలా ఉన్నాయి. తూప్రాన్ మండలం కాళ్లకల్‌లో కొందరు యువకులు బుధవారం రాత్రి ఫేస్బుక్ ద్వారా మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడి పేరును అనుచిత వ్యాఖ్యలు రాసి మెసేజ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఆ పార్టీకి చెందిన నాయకులు సెల్‌ఫోన్ నంబరు ఆధారంగా మెసేజ్ పంపిన యువకులను గుర్తించి మందలించడంతో సదరు యువకులు క్షమాపణ చెప్పారు. అయితే అదే సమయంలో అటుగా వచ్చిన టీడీపీకి చెందిన నాయకుడు.. ‘ఎందుకు క్షమాపణ చెప్పారు. ఫేస్బుక్లో ఎవరి వారి ఇష్టాలను వ్యక్త పరుచవచ్చు’ అని తెలుపడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఒకరికొకరు వాగ్వాదానికి దిగారు. ఇరువర్గాల నాయకులు బుధవారం రాత్రి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గురువారం ఇరువర్గాల నాయకులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. వీరికి పోలీసులు నచ్చజెప్పడంతో ఇరువర్గాలూ రాజీపడ్డాయి. పోలీస్‌స్టేషన్ నుంచి బయటకు వచ్చిన అనంతరం ఇరుపార్టీలకు చెందిన వారు తిరిగి దూషించుకోవడంతో పోలీస్‌స్టేషన్ ఎదుట ఘర్షణ వాతావరణం నెలకొంది. స్పందించిన సీఐ రవీందర్‌రెడ్డి, ఎస్ఐ నిరంజన్‌రెడ్డిలు సిబ్బందితో ఇరుపార్టీల నాయకులను అక్కడి నుంచి చెదరగొట్టారు. అయితే ఈ విషయం మండలంలో చర్చనీయంశమైంది. ఈ విషయంపై ‘న్యూస్‌లైన్’ ఎస్ఐ నిరంజన్‌రెడ్డిని వివరణ కోరగా ఎవరిపై కేసు నమోదు చేయలేదన్నారు. ఇరువర్గాలను నచ్చజెప్పినట్లు తెలిపారు.