ఫేస్‌ ‘బుక్‌' అయ్యారో.. ఇకపై వీడియో కాల్ తో.. మీ పని అంతే! | Sakshi
Sakshi News home page

ఫేస్‌ ‘బుక్‌' అయ్యారో.. ఇకపై వీడియో కాల్ తో.. మీ పని అంతే!

Published Tue, Oct 10 2023 1:28 AM

- - Sakshi

వరంగల్: కాజీపేటకు చెందిన యువకుడు సాఫ్ట్‌వేర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. కరోనా అనంతరం వర్క్‌ ఫ్రం హోంలో భాగంగా ఇంట్లోనే ఉంటూ పని చేసుకుంటున్నాడు. ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఓ మహిళతో న్యూడ్‌ కాల్‌ మాట్లాడి వారికి దొరికిపోయాడు. వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పెడ్తానని బెదిరించగా రూ.10లక్షలు ముట్టజెప్పాడు. అయినా వేధింపులు ఆగకపోవడంతో చివరికి సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇలా ఎంతో మంది.. ఎన్నో రకాలుగా మోసపోతున్న ఘటనలు ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి.

పరిమితుల్లేని శృంగారం.. అవధుల్లేని ఆనందం ఆస్వాదిద్దాం.. అంటూ వాట్సాప్‌ కాల్స్‌ ద్వారా నగ్నంగా మాట్లాడుతూ ఆపై వీడియోలు తీసి బెదిరిస్తున్న సైబర్‌ నేరస్తుల వల నుంచి తప్పించుకోవచ్చని పోలీస్‌ అధికారులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని యువకులు, వృత్తి నిపుణులే లక్ష్యంగా పశ్చిమ బంగాల్, రాజస్తాన్‌ ముఠాలు వలపు వలలు విసురుతున్నాయి. బుట్టలో పడిన వారిని బెదిరించి లక్షల్లో నగదు బదిలీ చేయించుకుంటున్నారు. పరువు పోతుందన్న భావనతో పలువురు.. నిందితులు అడిగినంత డబ్బు పంపిస్తూ మోసానికి గురవుతున్నారు. ఇకపై అలా చేయొద్దని, సొంతంగానే ముప్పు నుంచి తప్పించుకోవచ్చని పోలీసులు చెబుతున్నారు.

సాధ్యం కాదన్నా వినకుండా..
ఫేస్‌బుక్‌ ద్వారా యువకులు, వృత్తి నిపుణులను భరత్‌పూర్‌, కోల్‌కతాకు చెందిన యువతులు పరిచయం చేసుకుంటున్నారు. ఒకట్రెండు రోజులు ఫేస్‌బుక్‌లో మాట్లాడిన తర్వాత వాట్సాప్‌ నంబర్లు తీసుకుంటున్నారు.

వాట్సాప్‌ కాల్‌ మొదలైన నిమిషానికే దుస్తులన్నీ విప్పేసి నగ్నంగా మారుతున్నారు. కొంతమంది యువతులు ప్రేమలోకి దింపి యువకుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఒక ఆటాడించి డబ్బులు దండుకుని వదిలేస్తున్నారు. మరికొంత మంది యువతులు ఒకటికి, రెండుసార్లు నగ్నంగా మారి వీడియో కాల్‌ చేయండని కోరుతున్నారు. ఇంట్లో ఉన్నాను.. బంధువులు, స్నేహితుల మధ్య ఉన్నాను. ఇప్పుడు చేయడం సాధ్యంకాదని చెప్పినా పదే పదే వీడియో కాల్‌ చేస్తుంటారు.

లొంగిపోతే ఇక బెదిరింపులే..
బాధితులు ఒత్తిడికి లొంగి వీడియో కాల్‌ చేయడం మొదలు పెట్టగానే మీ ముఖం కనింపించేలా మాట్లాడాలని తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేస్తారు. వెంటనే అవతలి వైపు నుంచి మాట్లాడుతున్న యువతి మరో కెమెరాతో మాటలు, నగ్న దృశ్యాలను రికార్డు చేస్తుంది. కాల్‌ పూర్తైనా నిమిషాలకే వీడియోను పంపించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తామంటూ భయబాంత్రులకు గురి చేస్తుంటారు.

రిపోర్ట్‌ కొట్టండి.. సెట్టింగ్‌ మార్చండి..
అసభ్యకరమైన, ఆశ్లీల వీడియోలు పంపుతామని నేరస్తులు చెప్పిన వెంటనే మీ టైమ్‌లైన్‌లో.. ‘నా ఫేస్‌బుక్‌ హ్యాక్‌ అయ్యింది.. మీరు నాకు ఎలాంటి సమాచారం పంపొద్దం’టూ సందేశాన్ని పంపించండి. ఈ సందేశాన్ని హ్యాకర్‌ చూసినా మీకు ఎలాంటి ఇబ్బందులు రావు. స్మార్ట్‌ఫోన్‌లో ఫేస్‌బుక్‌ తెరవగానే.. మూడు చుక్కలు కనిపిస్తాయి. వాటిపై నొక్కితే రిపోర్ట్‌ అని వస్తుంది. అందులో ఎవరో మీలా నటిస్తున్నారా? అన్నవి తెరపైకి వస్తాయి. మమ్మల్ని అనుకరిస్తున్నారా? అన్న ఐచ్ఛికాన్ని ఎంచుకుంటే.. ఫేస్‌బుక్‌ ప్రతినిధులు హ్యాకర్‌ను తొలగిస్తారు. అప్పుడు మీ ఫేస్‌బుక్‌ సెట్టింగ్‌లను కొత్తగా మార్చుకోవాలి.

Advertisement
Advertisement