మహబూబాబాద్: ఓ వివాహితను వేధింపులకు గురి చేయడమే రాజు హత్యకు దారి తీసింది. ఈ హత్యలో వివాహిత తండ్రి, సోదరులు, మామయ్య, తల్లితోపాటు భర్త కూడా పాల్గొన్నట్లు కాజీపేట ఏసీపీ డేవిడ్ రాజ్ వెల్లడించారు. ఈ మేరకు బుధవారం హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజు హత్యకు దారి తీసిన వివరాలను ఏసీపీ వెల్లడించారు. హసన్‌పర్తి మండలం మడిపల్లికి చెందిన తుమ్మల రాజు(28) ఇదే మండలం అన్నాసాగరం గ్రామానికి చెందిన బైకాని కుమారస్వామి కూతురిని కొంతకాలంగా వేధింపులకు గురి చేస్తున్నాడు. దీంతో బాధితురాలు కుటుంబ సభ్యుల ఎదుట ఆవేదన వ్యక్తం చేసింది.
రెండు సార్లు తప్పించుకున్నాడు..
రాజును హత్య చేయడానికి కుమారస్వామి కుటుంబ సభ్యులు నిర్ణయించారు. బాధితురాలి కూతురు చదువుతున్న న్యూశాంపేటలోని స్కూల్ వద్ద తుమ్మల రాజు వస్తున్నాడనే సమాచారంతో హత్య చేయాలని పథకం వేసినప్పటీకీ రాజు తప్పించుకున్నాడని ఏసీపీ తెలిపారు.
పక్కా పథకం..
కాగా, రాజును ఎలాగైనా హత్య చేయాలని పక్కా పథకం వేశారు. ఈ క్రమంలో గత నెల 30వ తేదీన రాజు అన్నాసాగరంలో ఉన్నాడనే విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లి బైకాని కేతమ్మ.. భర్త కుమారస్వామి, సోదరుడు ఎల్లబోయిన అనిల్‌కుమార్, కుమారుడు బైకాని శివకుమార్,అల్లుడు మామిండ్ల సంజీవ్‌కు సమాచారం అందించింది. సమాచారం అందుకున్న వారు గ్రామంలో రాజుపై దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత రాజును ఇంటి నుంచి తీసుకెళ్లి కాళ్లు, చేతులను తాడుతో కట్టారు. ఆటోలో ఎక్కించుకుని జయగిరి సమీపంలోని ఎస్సారెస్పీలో పడేశారు.
మృతదేహం కోసం గాలింపు..
రాజు మృతదేహం కోసం నాలుగు బృందాలుగా విడిపోయి గాలించినట్లు డేవిడ్ రాజ్ తెలిపారు. ఈ క్రమంలో వర్ధన్నపేట మండలం కట్య్రాల సమీపంలోని ఎస్సారెస్పీలో రాజు మృతదేహం లభ్యమైనట్లు ఏసీపీ చెప్పారు.
వైస్ ఎంపీపీ సహకారంతో..
కాగా, నిందితులు కుమారస్వామి, శివకుమార్, అనిల్, కేతమ్మ, సంజీవ్..మండల పరిషత్ ఉపాధ్యక్షుడు బండా రత్నాకర్‌రెడ్డి సహకారంతో లొంగిపోయినట్లు ఏసీపీ వివరించారు. రాజును హత్య చేసినట్లు వారు అంగీరించినట్లు డేవిడ్ రాజ్ తెలిపారు. మృతుడి భార్య రవళి ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ వెల్లడించారు.నిందితుల నుంచి ఆటోతో పాటు రెండు బైక్‌లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో పోలీస్ ఇన్‌స్పెక్టర్ తుమ్మ గోపి, ఎస్సై సురేష్, అశోక్, వలీ, హెడ్‌కానిస్టేబుల్ విద్యాసాగర్, కానిస్టేబుల్ క్రాంతి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment