అమ్మా.. నేనేం పాపం చేశా! | Mahabubabad News: Dornakal Mother Usha Case Details | Sakshi
Sakshi News home page

అమ్మా.. నేనేం పాపం చేశా!

Published Mon, Feb 24 2025 5:05 PM | Last Updated on Mon, Feb 24 2025 6:34 PM

Mahabubabad News: Dornakal Mother Usha Case Details

మహాబూబాబాద్‌, సాక్షి: కన్నతల్లే ఆ పిల్లల పాలిట మృత్యు దేవతగా మారింది. తన భర్త మరణించాక మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుంది. అయితే తన సుఖానికి పిల్లలే అడ్డొస్తున్నారని భావించి వాళ్లను లేకుండా చేయాలనుకుంది. ఈ ప్రయత్నంలో ఆ చిట్టితల్లిని విషమిచ్చి ఆ కన్నతల్లి చేజేతులారా చంపేసుకుంది. 

డోర్నకల్ మండలంలోని జోగ్య తండ గ్రామ పంచాయతీ పరిధిలోని మంగళ్ తండాకు చెందిన వాంకుడోత్ వెంకటేష్‌(30) నాలుగు నెలల కిందట అనారోగ్యంతో చనిపోయాడు. దీంతో ఆయన భార్య  ఉష, ఇద్దరు పిల్లలు నిత్యశ్రీ (05) అబ్బాయి వరుణ్ తేజ (07)ల అత్తింట్లోనే ఉంటోంది. ఈ నెల 5వ తేదీన ఇంటి వద్ద ఆడుకుంటూ పిల్లలిద్దరూ కిందపడి పోయారు. వాంతులు, విరోచనాలు కావడంతో కంగారు పడిపోయిన వెంకటేష్‌ తల్లి.. పిల్లలను ఏం జరిగిందని వాకబు చేసింది. అమ్మ కూల్‌డ్రింక్‌ తాగించిందని అమాయకంగా చెప్పారు  ఆ ఇద్దరూ.  ఆ తర్వాత బాబాయ్‌ రాంబాబు సహాయంతో పిల్లలను ఖమ్మంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. 

అక్కడ రెండు రోజుల చికిత్స అనంతరం పిల్లల శరీరంలో గడ్డిమందు అవశేషాలు ఉన్నాయని వైద్యులు తెలపడంతో బంధువులు ఉషను నిలదీశారు. పిల్లలకు కూల్‌డ్రింక్‌లో గడ్డిమందు కలిపి తాగించినట్లు ఒప్పుకుందామె. ఈలోపు పిల్లల ఆరోగ్య పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని నీలోఫర్‌ ఆస్పత్రికి తరలించారు. పిల్లలకు ఏమైనా జరిగితే తనను చంపేస్తారన్న భయంతో.. ఉష ఎలుకల మందు తాగింది.  దీంతో ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. 

మరోవైపు పిల్లల బాబాయ్‌ ఫిర్యాదు చేయడంతో.. డోర్నకల్‌ పోలీసులు   ఈ నెల 10న హత్యాయత్నం కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సుమారు రెండువారాల తర్వాత వరుణ్‌తేజ్‌ కోలుకోగా.. పరిస్థితి విషమించి నిత్యశ్రీ మృతి చెందింది. దీంతో కేసును హత్య కేసుగా మార్చిన పోలీసులు.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యాక ఆమెను అరెస్ట్‌ చేస్తామని ప్రకటించారు.  

ఆ అధికారితో ఉష సంబంధం!
నిత్యశ్రీ పోస్టుమార్టంను పర్యవేక్షించిన డోర్నకల్‌ సీఐ బీ రాజేశ్‌.. దగ్గరుండి ఆ చిన్నారి మృతదేహాన్ని హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. కుటుంబ సభ్యులకు అప్పగించే క్రమంలో జోగ్యతండాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉషను తీసుకు రావాలంటూ ఆగ్రహంతో స్థానికులు ఊగిపోయారు.  ఆంబులెన్స్‌కు అడ్డుపడి ధర్నా చేపట్టారు. 

స్థానికంగా ఉన్న ఓ పోలీస్‌ అధికారితో ఉష సంబంధం ఉందని, ఆ అధికారి చెప్పడంతోనే ఆమె ఈ ఘోరానికి పాల్పడిందని ఆరోపించారు. చిన్నారి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.  అలా.. 12 గంటలు ధర్నా కొనసాగించారు. ఈ తరుణంలో గ్రామ పెద్దలతో పోలీసులు చర్చలు జరిపారు. నిత్యశ్రీ మృతికి కారణమైన పోలీస్ అధికారిపై విచారణ జరిపించి.. అయన పాత్ర ఉంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తులు ధర్నా విరమించగా.. నిత్యశ్రీ మృతదేహాన్ని బంధవులకు అప్పగించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement