మొక్కు తీర్చుకోవడానికి షిర్డీ వెళ్లిన ఓ కుటుంబం ప్రయాణిస్తున్న వాహనాన్ని ట్రాక్టర్ ఢీకొనడంతో నలుగురు దుర్మరణం చెందారు. అలాగే సంక్రాంతి పండుగకు సొంతూరు వెళ్లి తిరిగివస్తున్న వారి కారు అదుపుతప్పి లారీ కింద ఇరుక్కోవడంతో ఇద్దరు మృతిచెందారు. మృతిచెందిన వారిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మహారాష్ట్రలోని గంగాపూర్ వద్ద ఓ ఘటన చోటుచేసుకోగా, భువనగిరి జిల్లా కేంద్రం సమీపంలో మరో ఘటన చోటుచేసుకుంది. వివరాలు..
భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని కొండగడప గ్రామానికి చెందిన శ్యాంశెట్టి కృష్ణమూర్తి, ప్రేమలత దంపతులు తమ కొడుకు, కోడలుతో సరూర్‌నగర్ గ్రీన్ పార్కు ఏరియాలో నివాసం ఉంటూ కిరాణా దుకాణం నిర్వహిస్తున్నారు. వీరికి మనవడు పుట్టిన సందర్భంగా మొక్కుతీర్చుకోవడానికి షిర్డీకి వెళ్లాలని అనుకున్నారు. భోగి పండుగ రోజు పెద్ద కూతురు ప్రసన్నలక్ష్మి, చిన్న కూతురు బజ్జూరి స్రవంతి కుటుంబాలతో కలిసి హైదరాబాద్ నుంచి ప్రైవేట్ బస్సులో వెళ్లి షిర్డీ సాయిబాబా దర్శనం చేసుకున్నారు.
ఆ తర్వాత స్థానికంగా తుఫాన్ వాహనం కిరాయికి తీసుకొని ఔరంగాబాద్‌లోని మినీ తాజ్‌మహల్‌ను సందర్శించారు. ఔరంగాబాద్ – షిర్డీ మధ్యలో గంగాపూర్ వద్ద బుధవారం రాత్రి వీరు ప్రయాణిస్తున్న తుఫాన్ వాహనాన్ని ట్రాక్టర్ ఢీకొట్టడంతో శ్యాంశెట్టి ప్రేమలత (57) ఆమె కుమారుడి కొడుకు వైది్వక్ (6 నెలల బాలుడు), పెద్ద కూతురు తొల్పునూరి ప్రసన్నలక్ష్మి (42)తో పాటు ప్రసన్నలక్ష్మి పెద్ద కూతురు తొల్పునూరి అక్షిత (21) మృతిచెందారు.
ప్రేమలత పెద్ద అల్లుడు శ్రీనివాస్, ప్రసన్నలక్ష్మి రెండో కూతురు శరణ్యతో పాటు ప్రేమలత భర్త కృష్ణమూర్తి, కుమారుడు వెంకన్నకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారు ఔరంగాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రేమలత చిన్న కూతురు బజ్జూరి స్రవంతి, అల్లుడు రాంబాబుతో పాటు వీరి కుమారుడు, కుమార్తె ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం ఔరంగాబాద్ నుంచి స్వగ్రామానికి తరలించారు.
సంక్రాంతి పండుగకు వచ్చి వెళ్తూ...
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం వెంకట్రాంతండాకు చెందిన గుగులోతు రవి, భూక్య సంతోష్ బావాబావమరుదులు. రవికి భార్య భవాని, కుమార్తె మోక్ష ఉండగా.. సంతోష్ కు భార్య అనూష (26), ఇద్దరు కుమార్తెలు ప్రణశ్వని, చైత్ర (6) ఉన్నారు. రవి, సంతోష్‌లు కుటుంబాలతో కొంతకాలంగా హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో ఉంటున్నారు. రవి, సంతోష్‌లు తమ భార్యాపిల్లలతో కలిసి సంక్రాంతి పండుగ జరుపుకునేందుకు కారులో స్వగ్రామం వెంకట్రాంతండాకు వెళ్లారు. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తిరిగి హైదరాబాద్‌కు బయల్దేరారు. సంతోష్ కారు నడుపుతుండగా.. అతడి భార్య అనూషతో పాటు చిన్న కుమార్తె చైత్ర అతడి పక్కన కారు ముందు భాగంలో కూర్చున్నారు. మిగతావారు వెనక కూర్చున్నారు.
గురువారం తెల్లవారుజామున 6.30 గంటల సమయంలో భువనగిరి జిల్లా కేంద్రానికి సమీపంలోని రాయగిరి వద్దకు రాగానే వరంగల్–హైదరాబాద్ హైవే బైపాస్ రోడ్డుపై ముందు వెళ్తున్న లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా ఇండికేటర్ వేయకుండా పక్కనే ఉన్న పెట్రోల్ బంక్‌లోకి ఒక్కసారిగా టర్న్ తీసుకున్నాడు. వెనకాలే వస్తున్న వీరి కారు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. కారు లారీ కిందిభాగంలో ఇరుక్కుపోవడంతో నుజ్జునుజ్జు అయ్యింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కారును జేసీబీ సహాయంతో బయటకు తీయగా.. అప్పటికే అనూష, చైత్ర మృతిచెందారు.
తీవ్రంగా గాయపడిన మిగతా ఐదుగురిని భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. భూక్య సంతోష్ సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చంద్రబాబు, ఎస్‌హెచ్‌ఓ సంతోష్ కుమార్ తెలిపారు. కాగా, ఈ ప్రమాదంలో గాయపడిన రవి భార్య భవాని 8 నెలల గర్భంతో ఉంది. ఆస్పత్రికి తరలించిన అనంతరం వైద్యులు ఆమెకు పరీక్షలు నిర్వహించారు. కడుపులో ఉన్న శిశువుకు ఎలాంటి ప్రమాదం లేదని తేల్చారు.
Comments
Please login to add a commentAdd a comment