డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని హత్య?
కాటారం: భర్తతో విడిపోయి ఉంటున్న మహిళతో వివాహేతర సంబంధం నెరపుతున్నాడు ఓ వ్యక్తి.. ఆ తర్వాత ఇద్దరి మధ్య గొడవలు జరగడంతో పెద్దల సమక్షంలో పంచాయితీ చేసుకొని రూ.40 వేలు ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. కానీ, పైసలు ఇవ్వకుండా ఉండేందుకు ఆ మహిళను హత్య చేశాడు ఆ వ్యక్తి. జయశంకర్‌భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో శుక్రవారం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి, పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. భూపాలపల్లి మండలం కమలాపూర్‌కు చెందిన కాల్వ శైలజ(30) అనే మహిళ.. భర్తతో విడిపోయి ఐదేళ్లుగా తల్లిగారి ఇంటి వద్ద ఉంటుంది. తన అక్క, చెల్లి అత్తగారి గ్రామమైన కాటారం మండలంలోని అంకుషాపూర్‌కు అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంది. ఈక్రమంలో అదే గ్రామానికి చెందిన ఇనుగాల రమేశ్‌తో పరిచయం ఏర్పడి అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇది రమేశ్ భార్యకు తెలియడంతో ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరిగాయి. దీంతో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ జరగగా రమేశ్, శైలజకు రూ.40 వేలు ఇవ్వాలని నిర్ణయించారు. కానీ ఒప్పుకున్న విధంగా రమేశ్, శైలజకు డబ్బులు ఇవ్వకపోగా ఇంటికి వచ్చి బెదిరింపులకు గురి చేయడంతో భూపాలపల్లి పో లీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో రమేశ్ ఈ నెల 17న శైలజ ఇంటికి వచ్చి రాజీ పడాలని బ్రతిమిలాడటంతో ఆమె ఒప్పుకుంది. అనంతరం రమేశ్ వెళ్లిపోగా శైలజ సైతం భూపాలపల్లికి వెళ్లి వస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయింది. సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు తెలిసినవారి వద్ద ఆరా తీసి చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, అంకుషాపూర్ శివారులోని అటవీప్రాంతంలో శుక్రవారం ఓ మహిళ మృతదేహం కన్పించడంతో శైలజ అని గుర్తించి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. మూడు రోజుల క్రితం గొంతు నులిమి హత్య చేసినట్లు ఆనవాళ్లు గుర్తించారు. సంఘటనా స్థలాన్ని కాటారం డీఎస్పీ రామ్మోహన్‌రెడ్డి, సీఐ నాగార్జునరావు, ఎస్సై అభినవ్, క్లూస్ టీం ఎస్సై రాజ్‌కుమార్ పరిశీలించారు. హత్య స్థలంలో పలు వివరాలు సేకరించారు. రూ.40 వేలు ఇవ్వాల్సి వస్తుందని రమేశ్ తన కూతురికి మాయమాటలు చెప్పి అడవిలోకి తీసుకొచ్చి హత్య చేశాడని శైలజ తల్లి దుర్గమ్మ పేర్కొంది. దుర్గమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రమేశ్‌పై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ, ఎస్సై తెలిపారు.
కాటారం మండలం
అంకుషాపూర్‌లో ఘటన
వివాహేతర సంబంధమే కారణం..?
Comments
Please login to add a commentAdd a comment