Mahabubabad District Latest News
-
రాష్ట్రస్థాయి విజేతలుగా నిలవాలి
మహబూబాబాద్ అర్బన్: సీఎం కప్ క్రీడల్లో జిల్లా స్థాయిలో గెలుపొందిన క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో సైతం విజేతలుగా నిలువాలని జిల్లా క్రీడల యువజన శాఖ అధికారిణి జ్యోతి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో శనివారం సీఎం కప్ క్రీడల ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ.. యువత, విద్యార్థులను క్రీడల్లో పోత్సహించేందుకు గ్రామీణ, మండల, మున్సిపల్, జిల్లా స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ పేరుతో పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. జిల్లా స్థాయిలో మెరిసిన క్రీడాకారులు జిల్లాకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో పీడీ, పీఈటీలు, కోచ్‌లు, వెంకటేశ్వ ర్లు, శంకర్‌నాయక్, పద్మావతి, పుష్పాలీల, శ్రీనివా స్, సునీత, వీరభద్రం, సింధువర్మ, శంకర్, నిర్మల, చాంప్లనాయక్, అరుణ, మాధవి, కాశీనాథ కుమారస్వామి, కమల్‌కిషోర్ క్రీడాకారులు పాల్గొన్నారు. జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి జ్యోతి ముగిసిన సీఎం కప్ క్రీడలు -
కాంగ్రెస్ పాలనలోనే రైతులు సుభిక్షం
● ఎమ్మెల్యే యశస్విని రెడ్డిపెద్దవంగర: కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో రైతులు సుభిక్షంగా ఉంటారని ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అభిప్రాయపడ్డారు. మండలంలోని పోచంపల్లి గ్రామంలో దేవాదుల భూనిర్వాసితులకు నిధులు మంజూరు కాగా శనివా రం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 250మంది రైతులు దేవాదుల ప్రాజెక్టు ద్వారా భూ నిర్వాసితులు కాగా ప్యాకేజీ ఆరు ద్వారా వారికి రూ.11.40 కోట్లు అందజేసినట్లు తెలిపారు. మండలంలోని అవుతాపురం, పోచంపల్లి, గంట్లకుంట చెరువులను గోదావరి జలాలతో నింపుతామని తెలిపారు. మండలంలోని భూ నిర్వాసితులైన 110మంది రైతులకు రూ.4.13లక్షలు అందాయని ఇరిగేషన్ ఈఈ సీతారాం నాయక్ తెలిపారు. నిధుల పంపిణీలో అవకతవకలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఏఎంసీ మార్కెట్ చైర్మన్ హనుమాండ్ల తిరుపతి రెడ్డి, ఆర్డీఓ గణేష్, ఇరిగేషన్ ఈఈ సీతారాం నాయక్, డీఈ కిషన్ ప్రసాద్, ఏఈ కిశోర్, నాయకులు హమ్యా నాయక్, ముద్దసాని సురేష్, విజయ్‌పాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
పౌష్టికాహారంపై అవగాహన అవసరం
డోర్నకల్: పోషకాలు, పౌష్టికాహారంపై విద్యార్థులకు అవగాహన అవసరమని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ రవీందర్‌రెడ్డి తెలిపారు. స్థానిక జెడ్పీహెచ్ఎస్లో శనివారం నిర్వహించిన పేరెంట్స్, టీచర్స్ కమిటీ సమావేశంలో డీఈఓ మాట్లాడుతూ.. విద్యార్థులకు ఎదుగుదల సమయంలో సరైన పౌష్టికాహరం అందించాలని సూచించారు. ఉపాధ్యాయులు పౌష్టికాహార ప్రాముఖ్యత గురించి విద్యార్థులతోపాటు తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. ఇదిలా ఉండగా.. తల్లిదండ్రులు లేని, సింగిల్ పేరెంట్ కలిగిన పదిమంది విద్యార్థులకు డీఈఓ సైకిళ్లను పంపిణీ చేశారు. 1982 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు ఆరు, పాఠశాల ఉపాధ్యాయురాలు మంజులత మూడు, గ్రేసమ్మ ఓ సైకిల్ కొనుగోలు చేసి పాఠశాలకు అందించారు. మాథ్స్ డే సందర్భంగా పాఠశాలలో విద్యార్థులు ప్రదర్శించిన ఆకృతులను డీఈఓ తిలకించారు. హెచ్ఎం బండి నర్సింహరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డీఎస్ఓ అప్పారావు, మున్సిపల్ చైర్మన్ వాంకుడోత్ వీరన్న, వైస్ చైర్మన్ కోటిలింగం, కౌన్సిలర్ సురేందర్జైన్, 1982 బ్యాచ్‌కు చెందిన బిక్కసాని రామకృష్ణ, రమేష్, సంపత్, చంద్రశేఖర్, ఉపాధ్యాయులు అప్పిరెడ్డి, శ్రీనివాసరావు, మంజులత, గ్రేసమ్మ తదితరులు పాల్గొన్నారు. డీఈఓ డాక్టర్ రవీందర్‌రెడ్డి -
క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించాలి
మహబూబాబాద్ అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న క్రిస్మస్ వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ ఐడీఓసీలో అదనపు కలెక్టర్లు లెలిన్ వత్సల్ టోప్పో, వీర బ్రహ్మచారి, అధికారులతో క్రిస్మస్ వేడుకల నిర్వహణపై సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నియోజకవర్గాల వారీగా క్రిస్మస్ కమిటీలు, అధికార యంత్రాంగం సమన్వయంతో కలిసి వేడుకలు నిర్వహించాలని తెలిపారు. చర్చీలను విద్యుద్ధీపాలతో అలంకరించాలని, చర్చీల ప్రాంగణాల్లో శానిటేషన్ నిర్వహించి తాగునీరు అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రత్యేక ప్రార్థనలు, కార్యక్రమాల అనంతరం విందు ఏర్పాటు చేయాలని, చర్చీల వద్ద ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓలు గణేశ్, కృష్ణవేణి, జిల్లా మైనార్టీ అధికారి శ్రీనివాస్, డీపీఓ హరిప్రసాద్, ఆర్అండ్బీ ఈఈ భీమ్లానాయక్, డీవీహెచ్ఓ మరియన్న, డీఎంహెచ్ఓ డాక్టర్ మురళీధర్, మున్సిపల్ కమీషనర్లు రవీందర్, నరేశ్‌రెడ్డి, తహసీల్ధార్ భగవన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రెడ్‌క్రాస్ సేవలు విస్తృతపరచాలి జిల్లా వ్యాప్తంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సేవలు విస్తృతపరచాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ అధ్యక్షులు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో ఆధ్వర్యంలో కలెక్టరేట్లో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆగస్టు, సెప్టెంబర్‌లో కురిసిన వర్షాలకు నష్టపోయిన బాధితుల గ్రామాలను సందర్శించి దుప్పట్లు, వంట సామగ్రి, దుస్తులు, ఆదివాసులకు దోమ తెరలు, టీబీ వ్యాధుగ్రస్తులకు పౌష్టికాహారం అందజేయడం అభినందనీయమన్నారు. గంగారం మండలంలోని 15 నుంచి 20 సంవత్సరాల చిన్నారులకు పౌష్టికాహారం అందించాలని సూచించారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి బ్లడ్ బ్యాంక్‌లో సరిపడా రక్త నిల్వలు లేవని, యువజన సంఘాల, స్వచ్ఛంద సంస్థలతో సమావేశాలు నిర్వహించి శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ వరప్రసాద్,ౖ వైస్ చైర్మన్ డాక్టర్ నెహ్రూ, కోశాధికారి వెంకట్‌రెడ్డి, సభ్యులు వెంకన్న, విశ్వేశరరావు, డాక్టర్ సూర్య కుమారి, న్యాయ సలహాదారులు కొండపల్లి కేశవరావు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ -
సమయపాలన పాటించాలి
● డీఎంహెచ్ఓ మురళీధర్ కేసముద్రం: వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించకుంటే చర్యలు తప్పవని డీఎంహెచ్ఓ మురళీధర్ ఆదేశించారు. శనివారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్ఓ ఆకస్మికంగా తనిఖీ చేశా రు. ఈ మేరకు రికార్డులను పరీశీలించి, స్టాఫ్ వివరాలు, సిబ్బంది పనితీరుపై ఆరాదీశారు. సిబ్బంది కొరతతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పుకొచ్చారు. ఈ మేరకు స్టాఫ్ నర్స్‌ను డిప్యూటేషన్‌పై ఇస్తామని తెలిపారు. సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామని అన్నారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ నంబీకిషోర్, వైద్యులు విజయ్‌కుమార్, సురేష్, సీహెచ్ఓ సాజిద్ హుస్సేన్, ఎస్‌యూఓ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మనోభావాలను దెబ్బతీసే వ్యాఖ్యలు సరికాదు● సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు నాగయ్య నెహ్రూసెంటర్: రాజ్యాంగం, ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా వాఖ్యలు చేయడం సరికాదని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు జి.నాగయ్య అన్నారు. జిల్లా కేంద్రంలో పార్టీ జిల్లా కమిటీ, మండల కమిటీ సభ్యుల సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ ప్రజల మనోభావాలు, పార్లమెంట్ ప్రతిష్టను అగౌరవపర్చడమంటే రాజ్యాంగ విలువలను అవమానించడమేనని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను హేళన చేయడం సరి కాదన్నారు. దేశ ప్రజలను మరింత దరిద్రంలోకి దిగజార్చే ప్రయత్నంలో భాగమే జమిలి ఎన్నికలని పేర్కొన్నారు. ప్రజా సమస్యల ఎజెండాను పక్కదారి పట్టించేందుకే పార్లమెంట్ సమావేశాల సమయం వృధా చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.అంబేడ్కర్‌ను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన మంత్రి అమిత్ షాను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ీసీపీఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్, కార్యదర్శివర్గ సభ్యులు సూర్నపు సోమయ్య, గునిగంటి రాజ న్న, ఆకుల రాజు, కందునూరి శ్రీనివాస్, కుంట ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు. నల్లతామర పురుగు నివారణకు సస్యరక్షణ చర్యలుగార్ల: మిర్చితోటలో నల్లతామర పురుగు నివారణకు తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలపై మహబూబాబాద్ ఏడీఏ అజ్మీర శ్రీనివాస్ రైతులకు వివరించారు. శనివారం మండలంలోని ముల్కనూరు గ్రామంలోని ఓ రైతు మిర్చితోటలో ఆయన క్షేత్ర ప్రదర్శన చేశారు. తోటల్లో నల్లతామర పురుగు నివారణకు జిగురు పూసిన పసుపు, తెలుపు, నీలిరంగు అట్టాలను ఎకరాకు 20చొప్పున తోటలో అమర్చుకోవాలని సూచించారు. ఏఓ కావటి రామారావు, ఏఈఓ మేఘన పాల్గొన్నారు. మళ్లీ పెద్దపులి సంచారం? ఎస్‌ఎస్‌తాడ్వాయి : మండలంలోని లవ్వాల బీట్ పరిధి బంధాల దేవునిగుట్ట అడవిలో శనివా రం పెద్దపులి సంచరించింది. గత కొద్ది రోజుల క్రితం దా మెరవాయి అడవిలోని వట్టివాగు, నర్సాపూర్, గౌరారం వాగు బ్రిడ్జి కింద నుంచి పెద్దపులి సంచరించిన పాదముద్రలను అధికారులు గుర్తించారు. గురువారం భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని కరకగూడెం అటవీ ప్రాంతంలో పులి పా దముద్రలను అక్కడి అధికారులు గుర్తించినట్లు తెలిసింది. అయితే శనివారం తాడ్వాయి మండలంలోని బంధాల దేవునిగుట్ట ప్రాంతంలో పెద్దపులి మళ్లీ తిరిగినట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. అటవీశాఖ అధికారులు మాత్రం పెద్దపులి పాదముద్రలను గుర్తించినట్లు ధ్రువీకరించడం లేదు. ఇదే విషయంపై సెక్షన్ ఆఫీసర్ సజన్లాల్ను ఫోన్లో సంప్రదించగా ఆయన స్పందించలేదు. -
అంకెలతో ఆట.. సూత్రాలతో లెక్కల వేట
● విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా ప్రాజెక్టులు ● రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రదర్శన.. గుర్తింపు ● నేడు జాతీయ గణిత దినోత్సవం (రామానుజన్ జయంతి)ఈ ఫొటోలోని విద్యార్థిని పేరు ఇందుర్తి సాయిలేఖ్య. కంబాలపల్లి గ్రామానికి చెందిన ఈ విద్యార్థిని గణితంలో రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తుంది. కంబాలపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతూ 2022 – 23 విద్యాసంవత్సరంలో హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి గణిత టాలెంట్ పరీక్షకు హాజరై తృతీయ స్థానం సాధించింది. అదే ఏడాది 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో 10 జీపీఏ సాధించింది. మేథా ట్రస్ట్ టాలెంట్ టెస్ట్ ద్వారా ఎంపికై రెండు సంవత్సరాలు ఉచిత విద్యనభ్యసిస్తుంది. ఇంటర్మీడియట్ (ఎంపీసీ)లో 468 మార్కులు సాధించింది. అదే విధంగా సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ వారి యంగ్ ఇండియా శాస్త్రవేత్త కార్యక్రమంలో పాల్గొంది. నాటి కలెక్టర్ శశాంకతో అభినందనలు అందుకుంది. – మహబూబాబాద్ రూరల్ -
‘లెర్నింగ్ బై డూయింగ్’లో బోధన
● గణితం సులువుగా అర్థమవుతుంది.. ● జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత బండారి రమేశ్ విద్యారణ్యపురి: ‘గణిత పాఠ్యాంశాల బోధన లెర్నింగ్ బై డూయింగ్ పద్ధతిలో సూత్రాలను నిరూపిస్తూ సమస్యల సాధనను వివరిస్తే విద్యార్థులు సులభరీతిలో అర్థం చేసుకోగలుగుతారు’ అని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, గణితం రాష్ట్రస్థాయి రిసోర్స్ పర్సన్ బండారి రమేశ్ అన్నారు. నేడు (ఆదివారం) జాతీయ గణిత దినోత్సవం పురస్కరించుకొని శనివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. సాధారణంగా గణితం అంటే విద్యార్థులు భయానికి లోనవుతారు. కానీ భయపడాల్సిన సబ్జెక్టు ఏమీ కాదు. నేను బ్లాక్ బోర్డుపై సూత్రాలు వేసి సమస్యలను సాధించినప్పుడు అతి కొద్దిమంది విద్యార్థులు మాత్రమే అర్థం చేసుకునేవారు. మిగతా వారు అడగలేక విషయాలను దాటవేసేవారు. పరీక్షల్లో తక్కువగా మార్కులు వచ్చేవి. దీనిని ఏ విధంగా అధిగమించాలనే ఆలోచన చేశా. ఆ.. ఆలోచన ఫలితమే లెర్నింగ్ బై డూయింగ్ పద్ధతి. ఈ పద్ధతిలో బోధన చేస్తే ఎలా ఉంటుందనేది అనుకున్నా. నేను ధర్మారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న సందర్భంలో ప్రయోగాత్మకంగా గణితం బోఽధించినప్పుడు విద్యార్థుల్లో ఆసక్తి పెరగడం గమనించా. పాఠ్యాంశాన్ని ప్రయోగాత్మకంగా విద్యార్థులతో చేయిస్తూ గణిత సమస్యలను సాధన చేయించాను. ఆ తరువాత పరీక్షల్లో 80శాతంమంది మంచి మార్కులు సాధించారు. అప్పటినుంచి లెర్నింగ్ బై డూయింగ్ పద్ధతిలోనే గణితం బోధిస్తూ వస్తున్నా. చిటూరు, వెంకటాపూర్కలాన్, ప్రస్తుతం వరంగల్ జిల్లా నెక్కొండలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మ్యాథ్స్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నా. జాతీయస్థాయిలో సైన్స్అండ్ టెక్నాలజీలో విజ్ఞాన ప్రదర్శనలకు విద్యార్థులను ప్రోత్సహించా. దానికి కొనసాగింపుగా ఉన్నత పాఠశాలలోని ఐఎఫ్‌పీ ప్యానెల్స్ ఉపయోగించి టెక్నాలజీ ద్వారా గణిత పాఠ్యాంశాలను చెబుతున్నా. ఈ ప్రయోగశాలకు 2018లోనే కేంద్ర ప్రభుత్వం గుర్తించి జాతీయస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా అప్పటి ఉపరాష్ట్రపతి చేతులమీదుగా అవార్డు అందుకున్నా. ప్రస్తుతం టెక్నాలజీని వినియోగించి గణిత పాఠ్యాంశాలను బోఽధించటం ద్వారా అమూర్తభావనలను విద్యార్థులు సలభతరంగా అర్థం చేసుకోగలుగుతున్నారు. సెమినార్లో రమేశ్ పేపర్ ప్రజెంటేషన్ జాతీయ గణిత దినోత్సవం పురస్కరించుకొని హైదరాబాద్‌లోని ఎస్సీఈఆర్టీలో శనివారం మ్యాథ్‌మెటిక్స్ సెమినార్ నిర్వహించారు. ఇందులో బండారి రమేశ్ గణితం సబ్జెక్టుపై తన పరిశోధన పత్రం సమర్పించారు. దీంతో రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నర్సింహారెడ్డి ఆయనకు సర్టిఫికెట్ ప్రదానం చేశారు.‘లెర్నింగ్ బై డూయింగ్ అనగా గణితంలో సూత్రాలు, కృత్యాలను నిర్వహిస్తూ ప్రయోగాత్మకంగా సూత్రాలను రాబట్టడం. (ఉదాహరణ త్రిభుజ వైశాల్యం = 1/2 x భూమి x ఎత్తు. విద్యార్థి పై సూత్రాన్ని ఉపయోగించేటప్పుడు 1/2 ఎలా వచ్చింది అని అడిగితే దానిని ప్రయోగాత్మకంగా వివరించి చెప్పడం.)’ -
గణిత దినోత్సవం ఎలా వచ్చిందంటే..
సంఖ్యాశాస్త్రంలో రామానుజన్ చేసిన విశేష కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం 1962వ సంవత్సరంలో రామానుజన్ 75వ జన్మదినం రోజు స్మారక తపాలా బిళ్లను విడుదల చేసింది. 2012లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్.. రామానుజన్ పుట్టినరోజును జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించారు.గణితమంటే అంకెల గారడీ కాదు. సంఖ్యల మేళవింపు అంతకంటే కాదు. అదొక మహా సముద్రం. కిటుకు తెలిస్తే తక్షణమే విజయ తీరాల్ని చేరవచ్చు. అదే తరహాలో అంకిత భావం, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. చిన్న వయసులోనే చిటికె వేసినంత సులువుగా లెక్కలు చేస్తున్నారు. నేడు (ఆదివారం) రామానుజన్ జయంతి సందర్భంగా జాతీయ గణిత దినోత్సవం. ఈ నేపథ్యంలో గణితంలో ప్రతిభ కనబరుస్తున్న ఘనులపై, వారిని తయారు చేస్తున్న ఉపాధ్యాయులపై ఈ వారం ‘సాక్షి’ ప్రత్యేక కథనం. – సాక్షి నెట్వర్క్ -
అరవింద్ ఆర్యపకిడేకు ‘చేంజ్ మేకర్’ అవార్డు ప్రదానం
హన్మకొండ కల్చరల్ : చారిత్రక వారసత్వ సంపద పరిరక్షణకు కృషి చేస్తున్నందుకు వరంగల్ నగరానికి చెందిన టార్చ్ సంస్థ వ్యవస్థాపకులు అరవింద్ ఆర్యపకిడే ‘చేంజ్ మేకర్’ అవార్డు అందుకున్నారు. రేస్ టూ విన్ ఫౌండేషన్, డెమోక్రటిక్ సంఘ్ సంయుక్త ఆధ్వర్యంలో సమాజంలో మార్పు కోసం పాటు పడిన వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు, సంస్థలను గుర్తించి శుక్రవారం హైదరాబాద్‌లోని తాజ్‌ఫలక్‌నుమా ప్యాలెస్‌లో చేంజ్ మేకర్ అవార్డులను ప్రదానం చేశారు. ముఖ్యఅతిథిగా ఎంపీ జి.రేణుకాచౌదరి, గౌరవ అతిఽథులుగా మిస్‌యూనివర్స్ 1994 సుస్మితాసేన్, హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ జనరల్ జెన్నీఫర్ లార్సన్ పాల్గొన్నారు. ప్రముఖ సంఘ సంస్కర్త, సామాజికవేత్త స్వామి అగ్నివేష్‌కు నివాళులర్పించారు. అనంతరం డెమెక్రటిక్ సంఘ్ వ్యవస్థాపకురాలు, సినీ హీరోయిన్ రెజీనా.. అరవింద్ ఆర్యపకిడేకు చేంజ్ మేకర్ అవార్డు ప్రదానం చేశారు. డీసీఎం, లారీ డ్రైవర్ల మధ్య లొల్లివరంగల్ చౌరస్తా: వరంగల్ లోకోషెడ్ నుంచి ఫెర్టిలైజర్స్ దిగుమతుల విషయంలో కొద్ది నెలలుగా డీసీఎం, లారీ డ్రైవర్ల మధ్య వివాదం నెలకొంది. దీంతో శుక్రవారం డీసీఎం యజమానులు, డ్రైవర్లు వరంగల్ పాత అజాంజాహి మిల్లు గ్రౌండ్లో నిరసన వ్యక్తం చేశారు. అయితే ఓ రాజకీయ నాయకుడి ప్రమేయం వల్లనే సమస్య జఠిలమై ఓ యూనియన్ రోడ్డు ఎక్సాల్సిన పరిస్థితి వచ్చిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
విద్యుదాఘాతంతో యువకుడి మృతి
తరిగొప్పుల: హార్వెస్టర్ యంత్రం మరమ్మతు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతిచెందిన సంఘటన శుక్రవారం జనగామ జిల్లా తరి గొప్పుల మండలంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. తరిగొప్పులకు చెందిన అనుకేశ్ బన్నీ(18) ఇదే గ్రామానికి చెందిన మోటం మొగిళికి చెందిన వరికోత మిషన్ మరమ్మతు కోసం వెల్డింగ్ మిషన్‌కు విద్యుత్ సరఫరా చేసేందుకు విద్యుత్ తీగలు సరిచేస్తున్నాడు. ఈక్రమంలో విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. కాగా తమకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ మృతుడి కుటుంబ సభ్యులు మృతదేహంతో మొగిళి ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న ఎస్సై శ్రీదేవి అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించాలని సూచించగా తమకు న్యాయం జరిగేంత వరకు మృతదేహాన్ని తరలించేది లేదన్నారు. బైక్ పైనుంచి పడి వ్యక్తి.. కొడకండ్ల: బైక్ పైనుంచి పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన జనగామ జిల్లా కొడకండ్ల మండలంలోని హక్యాతండా గ్రామ పంచాయతీ పరిధి వెలిశాల శివారులో శుక్రవారం చోటు చేసుకొంది. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు గాంధీనగర్‌కు చెందిన పందుల నగేశ్(40) బైక్‌పై కొడకండ్ల వైపు వస్తుండగా అదుపు తప్పి రోడ్డు పక్కన పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెల్సుకున్న ఎస్సై చింత రాజు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
టీజీబీగా ఏపీజీవీబీ బ్రాంచ్‌లు
హన్మకొండ: రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికా స్ బ్యాంక్ బ్రాంచ్‌లు ఇక నుంచి తెలంగాణ గ్రామీ ణ బ్యాంకులు(టీజీబీ)గా పని చేస్తాయి.. 2025 జనవరి 1 నుంచి పూర్తి స్థాయి సేవలు అందుబాటులో ఉంటాయని ఏపీజీవీబీ చైర్మన్ కె.ప్రతాప్ రెడ్డి చెప్పారు. శుక్రవారం హనుమకొండలోని బ్యాంకు వరంగల్ ప్రాంతీయ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణలోని 493 ఏపీజీవీబీ బ్రాంచీలు టీజీబీలో విలీనమవుతున్న క్రమంలో ఈనెల 28 నుంచి 31 వరకు బ్యాంకు సేవలు పూర్తిగా నిలిచిపోతాయన్నారు. ఈ నాలుగు రోజుల పాటు సేవల అంతరాయానికి చింతిస్తున్నామని, ఖాతాదారుల నంబర్లు మారవని, చెక్కు బుక్కులు, పాస్ బుక్కులు కొత్తవి ఉచితంగానే అందిస్తున్నట్లు పేర్కొన్నారు. బ్యాంకు సేవల నిలిపివేతపై బ్యాంక్ వెబ్సైట్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియాతో పాటు ఖాతాదారులకు ఎస్ఎంఎస్ రూపంలో సమాచారం చేరవేసినట్లు తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు. సమావేశంలో ఏపీజీవీబీ జనరల్ మేనేజర్ ఆపరేషన్ బి.దయాకర్, రీజినల్ మేనేజర్ జి.పి.ఎస్.చైతన్య కుమార్, చీఫ్ మేనేజర్ యశ్వంత్, మేనేజర్ (ఆపరేషన్) కె.వెంకటచారి పాల్గొన్నారు. 2025 జనవరి 1 నుంచి సేవలు బ్యాంకు చైర్మన్ కె.ప్రతాప్ రెడ్డి -
నేరాలకు పాల్పడితే చర్యలు
వరంగల్ క్రైం: నగరంలో నేరాలకు పాల్పడిన వారిపై చర్యలు తప్పవని నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని హనుమకొండ సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా అన్నారు. శుక్రవారం హనుమకొండ (సుబేదారి) హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఏపీపీ దేవేందర్‌రెడ్డి, ఇన్స్పెక్టర్లు, సైబర్ క్రైమ్ అధికారులతో కలిసి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కాలనీల్లో పలు ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. రహదారులపై వాహనాలను తనిఖీ చేసి వాహన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు. అనంతరం ఆమె మాట్లాడారు. మైనర్ బాలురు వాహనాలు నడపడం, నేరాలు, అసాంఘిక కార్యకలాపాలు డ్రగ్స్, గంజాయి ఇతర నేరాలు జరుగుతున్నాయని అన్నారు. సరైన పత్రాలు లేని 20 ద్విచక్రవాహనాలు, 6 ఆటోలు సీజ్ చేశామని తెలిపారు. కాలనీ లో అనుమానాస్పదంగా ఎవరైన వ్యక్తులు కనిపిస్తే పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో సుబేదారి ఇన్స్పెక్టర్ సత్యనారాయణరెడ్డి, హనుమకొండ, యూనివర్సిటీ ఇన్స్పెక్టర్లు సతీష్, రవికుమార్, సబ్ ఇన్స్పెక్టర్లు 10మంది, 100 మంది కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. సెంట్రల్‌జోన్ డీసీపీ షేక్ సలీమా -
డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని...
కాటారం: భర్తతో విడిపోయి ఉంటున్న మహిళతో వివాహేతర సంబంధం నెరపుతున్నాడు ఓ వ్యక్తి.. ఆ తర్వాత ఇద్దరి మధ్య గొడవలు జరగడంతో పెద్దల సమక్షంలో పంచాయితీ చేసుకొని రూ.40 వేలు ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. కానీ, పైసలు ఇవ్వకుండా ఉండేందుకు ఆ మహిళను హత్య చేశాడు ఆ వ్యక్తి. జయశంకర్భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో శుక్రవారం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి, పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. భూపాలపల్లి మండలం కమలాపూర్‌కు చెందిన కాల్వ శైలజ(30) అనే మహిళ.. భర్తతో విడిపోయి ఐదేళ్లుగా తల్లిగారి ఇంటి వద్ద ఉంటుంది. తన అక్క, చెల్లి అత్తగారి గ్రామమైన కాటారం మండలంలోని అంకుషాపూర్‌కు అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంది. ఈక్రమంలో అదే గ్రామానికి చెందిన ఇనుగాల రమేశ్‌తో పరిచయం ఏర్పడి అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇది రమేశ్ భార్యకు తెలియడంతో ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరిగాయి. దీంతో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ జరగగా రమేశ్, శైలజకు రూ.40 వేలు ఇవ్వాలని నిర్ణయించారు. కానీ ఒప్పుకున్న విధంగా రమేశ్, శైలజకు డబ్బులు ఇవ్వకపోగా ఇంటికి వచ్చి బెదిరింపులకు గురి చేయడంతో భూపాలపల్లి పో లీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో రమేశ్ ఈ నెల 17న శైలజ ఇంటికి వచ్చి రాజీ పడాలని బ్రతిమిలాడటంతో ఆమె ఒప్పుకుంది. అనంతరం రమేశ్ వెళ్లిపోగా శైలజ సైతం భూపాలపల్లికి వెళ్లి వస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయింది. సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు తెలిసినవారి వద్ద ఆరా తీసి చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, అంకుషాపూర్ శివారులోని అటవీప్రాంతంలో శుక్రవారం ఓ మహిళ మృతదేహం కన్పించడంతో శైలజ అని గుర్తించి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. మూడు రోజుల క్రితం గొంతు నులిమి హత్య చేసినట్లు ఆనవాళ్లు గుర్తించారు. సంఘటనా స్థలాన్ని కాటారం డీఎస్పీ రామ్మోహన్‌రెడ్డి, సీఐ నాగార్జునరావు, ఎస్సై అభినవ్, క్లూస్ టీం ఎస్సై రాజ్‌కుమార్ పరిశీలించారు. హత్య స్థలంలో పలు వివరాలు సేకరించారు. రూ.40 వేలు ఇవ్వాల్సి వస్తుందని రమేశ్ తన కూతురికి మాయమాటలు చెప్పి అడవిలోకి తీసుకొచ్చి హత్య చేశాడని శైలజ తల్లి దుర్గమ్మ పేర్కొంది. దుర్గమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రమేశ్‌పై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ, ఎస్సై తెలిపారు. -
దాడి కేసులో నలుగురికి జైలు
మహబూబాబాద్ రూరల్: మహిళపై దాడి చేసిన కేసులో నలుగురికి జరిమానాతోపాటు, జైలు శిక్ష విధిస్తూ మహబూబాబాద్ అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ తిరుపతి శుక్రవారం తీర్పునిచ్చారు. కోర్టు డ్యూటీ అధికారి తాజీమ్ తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా సీరోలు మండలం మోదుగులగూడెం గ్రామ శివారు జుజురు తండాకు చెందిన ఇస్లావత్ లక్ష్మి తమ పత్తి చేను చుట్టూ కంచె ఏర్పాటు చేసింది. కొందరు వ్యక్తులు కంచెను తొలగించి పశువులను మేపడంతో పంటకు నష్టం వాటిల్లింది. దీంతో కంచెను తొలగించడంపై లక్ష్మీ స్థానిక రైతులను అడగగా.. బానోతు కస్న, బానోతు పూల, బానోతు పద్మ, బానోతు కులియ కలిసి అసభ్యకర పదజాలంతో దూషిస్తూ 2020 జూన్‌లో దాడిచేసి గాయపరిచారు. దీంతో లక్ష్మీ కుమారుడు ఇస్లావత్ రాజేందర్ సీరోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా అప్పటి ఎస్సై చంద్రమోహన్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అదే ఏడాది అక్టోబర్‌లో మహబూబాబాద్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ జయలత కోర్టులో వాదనలు వినిపించగా ప్రస్తుత సీరోలు ఎస్సై నగేశ్ ఆధ్వర్యంలో కోర్టు డ్యూటీ అధికారి తాజీమ్ 10 మంది సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. వాదనలువిన్న అడిషనల్ జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ తిరుపతి పై విధంగా తీర్పు వెలువరించారు. రూ.1,500 చొప్పున జరిమానా -
పురుగులమందు డబ్బాతో రైతు ఆందోళన
కేసముద్రం: బీటీ రోడ్డు నిర్మాణంలో భాగంగా సిమెంట్ పైపులతో ఏర్పాటు చేస్తున్న కల్వర్టు వద్ద ఓ రైతు పురుగులమందు డబ్బాతో ఆందోళనకు దిగిన ఘటన మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలంలోని రాముతండా జీపీ శివారు వీరారెడ్డిపల్లి తండాలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వీరారెడ్డిపల్లి తండా నుంచి రూప్లాతండా వరకు నూతనంగా బీటీ రోడ్డు పనులు చేస్తున్నారు. ఈ మేరకు ఓ చోట కల్వర్టు విస్తరణ పనులు చేపడుతుండగా, ఆ నిర్మాణం వలన తన పంటపొలంలోకి వరదనీరు వచ్చే అవకాశం ఉందంటూ, అదే తండాకు చెందిన ఈర్యా అనే రైతు పురుగుల మందు డబ్బాతో ఆందోళనకు దిగాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, ఆ రైతుకు నచ్చజెప్పి శాంతింపజేశారు. -
విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దు
కేసముద్రం: నూతన డైట్ మెనూ, విద్య, వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని పీహెచ్సీ, కల్వల మోడల్‌స్కూల్, బాలికల వసతి గృహం, కేసముద్రంస్టేషన్ జెడ్పీహైస్కూల్, పెనుగొండ, బోడమంచ్యాతండాల్లో ఇందిరమ్మ ఇళ్ల సర్వేను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేసముద్రం పీహెచ్సీలో మందుల స్టాక్, రోగుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పీహెచ్సీ పరిధిలో ప్రతీరోజు షెడ్యూల్ ప్రకారం వైద్య పరీక్షలు, శిబిరాలు నిర్వహించి మందులు పంపిణీ చేయాలన్నారు. సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని, వైద్య సిబ్బంది సకాలంలో ఆస్పత్రికి రావా లని ఆదేశించారు. అదేవిధంగా మోడల్‌స్కూల్, వసతిగృహం, కేసముద్రంస్టేషన్ జెడ్పీ హైస్కూల్లో మధ్యాహ్న భోజనాన్ని ఆయన పరిశీలించారు. పిల ్ల లకు నాణ్యమైన, రుచికరమైన భోజనాన్ని అందించాలన్నారు. విద్యార్థులు చదువుపై ఆసక్తి చూపుతూ ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన డైట్ మెనూ ప్రకారం నాణ్య మైన భోజనాన్ని అందించాలని, విద్య, శానిటేషన్, వైద్యం విషయంలో నిర్లక్ష్యం వహించొద్దన్నారు. ఇందిరమ్మ ఇళ్ల సర్వేను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో డీఈఓ రవీందర్‌రెడ్డి, తహసీల్దార్ దామోదర్, ఎంపీడీఓ క్రాంతి, మార్కెట్ చైర్మన్ సంజీవరెడ్డి ఉన్నారు. కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ -
హత్యాయత్నం కేసులో జైలు
కాటారం: మహాముత్తారం మండలం కొర్లకుంటలో 2018లో చోటుచేసుకున్న హత్యాయత్నం కేసులో అదే గ్రామానికి చెందిన నిందితుడు మేడిపల్లి నరేశ్‌కు జైలు శిక్ష విధిస్తూ భూపాలపల్లి జిల్లా కోర్టు అసిస్టెంట్ సెషన్ జడ్జి జయరామిరెడ్డి శుక్రవారం తీర్పు వెల్లడించినట్లు ఎస్సై మహేందర్‌కుమార్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం కొర్లకుంటకు చెందిన కాల్వ రాజేశ్ అదే గ్రామానికి చెందిన మేడిపల్లి నరేశ్‌పై 2018లో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో హత్యాయత్నం ఫిర్యాదు చేశాడు. అప్పటి ఎస్సై రాజు నరేశ్‌పై కేసు నమోదు చేయగా కోర్టులో కొనసాగుతుంది. ఇదే క్రమంలో శుక్రవారం కేసు ట్రయల్‌కు రాగా అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రఫి ఆధ్వర్యంలో ఎస్సై మహేందర్‌కుమార్, కోర్టు లైసింగ్ ఆఫీసర్ వెంకన్న, కోర్టు పీసీ సంపత్‌రెడ్డి సాక్షులను కోర్టు ఎదుట ప్రవేశపెట్టారు. దీంతో నేర నిరూపణ కావడంతో జడ్జి.. నిందితుడు నరేశ్‌కు రెండేళ్ల సాధారణ జైలు శిక్షతో పాటు రూ.వెయ్యి జరిమాన విధిస్తూ తీర్పు వెల్లడించారు. ట్రయల్‌ను విజయవంతం చేసిన ఎస్సై, సిబ్బందిని కాటారం డీఎస్పీ గడ్డం రామ్మోహన్‌రెడ్డి, సీఐ నాగార్జునరావు అభినందించారు. -
‘నిఫ్ట్’లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
నయీంనగర్ : నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్)–2025 ప్రవేశాలకు ఆన్లైన్ నిఫ్ట్ వెబ్సైట్లో విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని డాక్టర్ ప్రొఫెసర్ చక్రపాణి, డాక్టర్ ప్రొఫెసర్ శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో వారు అడ్మిషన్ క్యాలెండర్ ఆవిష్కరించి మాట్లాడారు. ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్ నిఫ్ట్‌లో జూలై–2025 గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులలో ప్రవేశాలు పొందేందుకు అభ్యర్థులు www.nif-t.ac.in /admirrion లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులలో ఫ్యాషన్ డిజైన్, టెక్స్టైల్ డిజైన్, యా క్సెసరీ డిజైన్, నిట్వేర్ డిజైన్, లెథర్ డిజైన్, ఫ్యాషన్ కమ్యూనికేషన్, ఫ్యాషన్ టెక్నాలజీ–10+2 ఏదైనా స్ట్రీం విద్యార్థులు గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులకు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు జనవరి 6వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు 040 23112628, 94412 36043 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో నరేష్ పాల్గొన్నారు. -
బాల్యానికి ‘బంధం’
పెరుగుతున్న బాల్య వివాహాలు ● 2023లో 106.. ఈ ఏడాది ఏకంగా 140 ● అధికారులు ఆపినవి ఇవే అయితే అనధికారికంగా ఎన్నో ● ఏటికేడు పెరుగుతుండడంతో అధికారుల్లో ఆందోళన ● తల్లిదండ్రుల్లో మార్పుతోనే అరికట్టే అవకాశంనవంబర్ 19న వరంగల్ జిల్లా దుగ్గొండి మండల పరిధిలోని ఓ గ్రామంలో 16 ఏళ్ల అమ్మాయి, 25 ఏళ్ల అబ్బాయికి వివాహం అవుతున్నట్లు ఫోన్ రావడంతో జిల్లా బాలల సంరక్షణ అధికారులు వెళ్లి పెళ్లి ఆపారు. తర్వాత అమ్మాయిని సీడబ్ల్యూసీ ఎదుట హాజరుపరిచి నర్సంపేటలోని ఆశ్రమ పాఠశాలకు తరలించారు. అక్కడ రెండు రోజులున్న తర్వాత అమ్మాయిని తల్లిదండ్రులు తీసుకెళ్లారు. -
ఎల్కతుర్తి ఎస్సై రాజ్‌కుమార్ సస్పెన్షన్
వరంగల్ క్రైం: ఎల్కతుర్తి పో లీస్‌స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ రాజ్‌కుమార్‌ను సస్పెండ్ చే స్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాజ్‌కుమార్‌పై పలు రకాల అవినీతి ఆరోపణలు రావడంతో అధికారులు విచారణ చేపట్టారు. దీంతో వాస్తవాలు వెలుగు చూడడంతో సీపీ సస్పెన్షన్ వేటు వేశారు. నేడు ఉమ్మడి వరంగల్ జిల్లా సమగ్రాభివృద్ధిపై చర్చ హన్మకొండ: ఫోరం ఫర్ బెటర్ వరంగల్ ఆధ్వర్యంలో ఈనెల 21న ఉమ్మడి వరంగల్ జిల్లా, వరంగల్ నగర సమగ్రాభివృద్ధిపై మేథావులచే చర్చా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ అధ్యక్షుడు పుల్లూరు సుధాకర్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్లో ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని పేర్కొన్నా రు. ఉమ్మడి వరంగల్‌లోని మేథావులు, సమస్యలపై అవగాహన ఉన్న ప్రతినిధులు పాల్గొ ని తమకు సమాచారమందించాలని కోరారు. తల్లి మందలించిందని తనయుడి ఆత్మహత్య కురవి: తల్లి మందలించిందని తనయుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సీరోలు మండల కేంద్రం శివారు రేకులతండాలో శుక్రవారం చోటుచేసుకుంది. తేజావత్ చంద్రబాను(22), తల్లి బుల్లితో కలిసి మూడు ఎకరా ల వ్యవసాయభూమిని సాగుచేస్తున్నారు. కొ డుకును వ్యవసాయ భూమికి వెళ్లమని చెప్పే సమయంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరి గింది. దీంతో మనస్తాపానికి గురైన చంద్రబా ను పురుగులమందు తాగడంతో మహబూ బాబాద్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. వికటించిన నాటు వైద్యం ● మహిళకు అస్వస్థతనర్సంపేట రూరల్: ఇంటింటికీ తిరుగుతూ నాటు వైద్యం మందు గోలీలు అందిస్తూ చికి త్స చేస్తున్న ఓ వైద్యుడు మహిళకు వైద్య చికిత్సకోసం వైబ్రెటింగ్ మిషన్ అమర్చడంతో బీపీ తగ్గి పడిపోయిన ఘటన వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని నాగుర్లపల్లిలో శు క్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూ రుకు చెందిన ఆయుర్వేదిక్ వైద్యుడు గుమ్మడి రమణ.. ద్విచక్రవాహనంపై సంతానం లేని వారికి మాత్రలు ఇస్తామని, పరీక్షలు చేస్తామని తిరుగుతూ నాగుర్లపల్లికి చెందిన జన్ను సంపూ ర్ణ ఇంటికి వెళ్లాడు. మొదట వైబ్రెటింగ్ మిషన్‌తో ఎల్లయ్యకు పరీక్షలు నిర్వహించగా.. కళ్లు తిరుగుతున్నాయని అన్నాడు. వెంటనే మీరు రూ.5వేలు ఇస్తే మందులు ఇస్తానని కూల్‌డ్రింక్(మజా)లో కలుపుకొని తాగాలని సూచించారు. మరో ఐదు వేలు ఇస్తే ఇద్దరికీ మందులు ఇస్తానని చెప్పడంతో సంపూర్ణ తమ వద్ద డబ్బులు లేవని చెప్పింది. కానీ, సదరు వ్యక్తి.. సంపూర్ణకు ఆ వైబ్రెటింగ్ మిషన్ అమర్చాడు. ఆ వెంటనే బీపీ తగ్గి కిందపడిపోవడంతో భర్త ఎల్లయ్య కేకలు వేశాడు. చుట్టు పక్కవారు వచ్చి సంపూర్ణను స్థానిక వైద్యుడి వద్దకు తరలించి చికిత్స అందించడంతో కోలుకుంది. అనంతరం నాటు వైద్యుడిని నర్సంపేట పోలీస్ స్టేషన్లో అప్పగించి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఇదే విషయమై ఎస్సై రవికుమార్‌ను వివరణ కోరగా.. ఫిర్యాదు మేరకు వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
24న అంపశయ్య నవీన్ గ్రంథాల ఆవిష్కరణ
విద్యారణ్యపురి: కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్ జన్మదినం సందర్భంగా నవీన్ లిటరరీ ట్రస్టు ఆధ్వర్యాన ఈనెల 24న సాయంత్రం 5.30 గంటలకు హనుమకొండ వాగ్దేవి కళాశాల ఆడిటోరియంలో అంపశయ్య నవీన్ గ్రంథాలను ఆవిష్కరించనున్నారు. అలాగే ప్రథమ నవలా పురస్కారాలు కూడా అందజేయనున్నట్లు అంపశయ్య నవీన్ ట్రస్టు సెక్రటరీ డి.స్వప్న శుక్రవారం తెలిపారు. ‘ప్రేమకు ఆవలి తీరం’ నవలకు ఇంగ్లిష్ అనువాదం(బియాండ్ ది షోర్ఆఫ్ లవ్) గ్రంథాన్ని ప్రొఫెసర్ మిట్టపెల్లి రాజేశ్వర్, కర్రె సదాశివ్ రచించిన అంపశయ్యనవీన్ కథలు–ఒక పరిశీలన గ్రంథాన్ని జి.గిరిజామనోహర్‌బాబు ఆవిష్కరిస్తారని పేర్కొన్నారు. -
భర్త చేతిలో భార్య హతం
మడికొండ: కట్టుకున్న భర్తే కాలయముడై ఉరి వేసి చంపిన ఘటన కాజీపేట మండలం అమ్మవారిపేట గ్రామంలో చోటు చేసుకుంది. మడికొండ ఇన్స్పెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం.. కాజీపేట మండలం అమ్మవారిపేట గ్రామానికి చెందిన మైదం కొంరయ్య కొద్ది రోజులుగా పని చేయకపోగా తాగుడుకు బానిసై భార్య మైదం సంతోష(55), కుమారుడు రాజేశ్‌తో గొడవ పడుతూ చంపుతానని బెదించేవాడు. ఈక్రమంలో గ్రామంలో కుల పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. పంచాయితీలో పెద్దమనుషులు కుటుంబ సభ్యులు, కొంరయ్యను మందలించి పంపించారు. ఈక్రమంలో గురువారం ఇంట్లో ఉన్న సంతోషతో గొడవ పడి తాడుతో గొంతుకు బిగించి హత్య చేశాడు. కోడలు చూసి కేకలు వేయడంతో కొంరయ్య పారిపోయాడు. శుక్రవారం కుమారుడు రాజేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ కిషన్ తెలిపారు. -
నిర్వహణాధికారులు ఎక్కడ?
ఎస్‌ఎస్‌తాడ్వాయి: లక్షలాది మంది భక్తులు వచ్చే సమ్మక్క, సారలమ్మ జాతర, మేడారం అభివృద్ధి విషయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ వైఖరిపై సమ్మక్క, సారలమ్మ పూజారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారులంతా హనుమకొండలోనే ఉంటూ మేడారాన్ని పట్టించుకోవడం లేదంటున్నారు. ఇక్కడ జరిగే అభివృద్ధిలో తమ అభిప్రాయాలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మేడారానికి మంత్రులు, జిల్లా కలెక్టర్ వస్తేనే అధికారులు మేడారానికి వస్తున్నారని.. ప్రధానంగా కార్యనిర్వహణాధికారి కార్యాలయం మేడారంలో లేకపోవడంతో ఈఓ చుట్టపుచూపుగా ఇక్కడకు వస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. 1996లో రాష్ట్ర పండుగగా గుర్తింపు లక్షలాదిగా భక్తులు తరలివచ్చే మేడారం జాతర 1996లో దేవాదాయశాఖ పరిధిలోకి వెళ్లగా.. ఈ ఏడాది రాష్ట్ర పండుగగా గుర్తించారు. గద్దెల ప్రాంగణం పక్కన ఉన్న రేకుల గదుల్లో ఉంటూ ఈఓ సహా ఇతర సిబ్బంది జాతర సమయంలో సేవలు అందించేవారు. ఇటీవల దాన్ని కూల్చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత మేడారంలో దేవాదాయశాఖ ఆధ్వర్యంలోని కాటేజీల్లో ఈఓ ఆఫీసు ఏర్పాటు చేసి, 2016 జాతర సందర్భంగా ఇక్కడి నుంచి కార్యకలాపాలు నిర్వహించారు. జాతర ముగిసిన తర్వాత మళ్లీ ఈఓ కార్యకలాపాలను హనుమకొండ నుంచే కొనసాగించారు. 2018 జాతర నాటికి అప్పటి సీఎం కేసీఆర్ మేడారం అభివృద్ధికి రూ.200 కోట్ల నిధులతోపాటు 200 ఎకరాల స్థలాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖకు అప్పగిస్తామని ప్రకటించారు. కానీ, ఈ రెండు హామీలు అమలుకు నోచుకోలేదు. మరోవైపు తాత్కాలికంగా కొనసాగిన ఈఓ కార్యాలయం కూడా ఇక్కడి నుంచి దూరమైంది. కొన్ని సంవత్సరాలు హనుమకొండలోని అద్దె భవనంలో ఈఓ కార్యాలయాన్ని కొనసాగించారు. అనంతరం వరంగల్‌లో శాశ్వత ధార్మిక భవనం నిర్మించడంతో మేడారం ఈఓ కార్యాలయాన్ని అక్కడకు తరలించారు. ఏళ్లు గడుస్తున్నా మేడారంలో ఏర్పాటు కానీ ఈఓ ఆఫీస్ మంత్రులు, ఉన్నతాధికారుల పర్యటనల సమయంలోనే వస్తున్న ఈఓ అసహనం వ్యక్తం చేస్తున్న ఆదివాసీ పూజారులు వరంగల్ ధార్మిక భవనంలో కొనసాగుతున్న కార్యాలయంఇన్చార్జ్ పాలనే.. మేడారం జాతర దేవాదాయశాఖ పరిధిలోకి వచ్చి 30 ఏళ్లు అవుతున్నా.. ఇప్పటికీ మేడారం జాతరకు పూర్తిస్థాయి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(ఈఓ)ను నియమించకపోవడం గమనార్హం. ప్రతీసారి జాతర సందర్భంగా ఇతర ఆలయాల్లో సూపరింటెండెంట్ హోదా అధికారిని తాత్కాలిక ఈఓగా నియమిస్తున్నారు. ఆ తర్వాత మేడారం జాతరను పట్టించుకోవడం లేదు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మేడారంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. రెండేళ్లకోసారి ఇక్కడ భక్తులు కనిపించే దశ నుంచి ప్రతి బుధవారం నుంచి ఆదివారం వరకు సగటున వెయ్యి మంది భక్తులు వచ్చే స్థితికి చేరుకుంది. వందల సంఖ్యలో ప్రైవేట్ కాటేజీలు, షాపింగ్ కాంప్లెక్స్ వెలిశాయి. అయితే వీరిని పట్టించుకునే వారు దేవాదాయశాఖ తరఫున ఇక్కడ ఎవరూ లేకపోవడం గమనార్హం.మోకాలడ్డు? ప్రస్తుతం మేడారం ఈఓగా ఉన్న రాజేంద్రం వరంగల్‌లోని థార్మిక భవన్ కేంద్రంగా విధులు నిర్వర్తిస్తున్నారు. మేడారంలో దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించి అతిథి సముదాయ నిర్మాణానికి రూ.2.15 కోట్లను 2022 జాతర సందర్భంగా మంజూరు చేశారు. ఈ నిర్మాణం పూర్తయితే ఇందులో ఈఓ ఆఫీసు నిర్వహణకు ఆస్కారం ఉండేంది. కానీ, మూడేళ్లు గడిచినా నిర్మాణ పనులు మొదలే కాలేదు. మరోవైపు ఇక్కడ మొదలు పెట్టిన రెవెన్యూ, ఆర్ అండ్ బీ అతిథి, ఆర్ డబ్ల్యూఎస్ అతిథి గృహాలు పూర్తయ్యాయి. అయితే మేడారంలో ఉంటూ విధులు నిర్వహించడం ఇష్టంలేకనే సంబంధిత అధికారులే పనులు అడ్డుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఈఓ ఆఫీస్ ఏర్పాటుపై నిర్లక్ష్యం మేడారంలో ఈఓ ఆఫీస్ ఏర్పాటు చేయడంలో దేవాదాయశాఖ అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారు. అధికారుల అవసరాల నిమిత్తం సిటీ వాతావరణానికి అలవాటు పడి మేడారంలో కార్యాలయం ఏర్పాటు చేయడం లేదు. చాలాసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. మేడారంలో ఈఓ కార్యాలయం ఏర్పాటుకు కలెక్టర్ చర్యలు తీసుకోవాలి. – సిద్ధబోయిన జగ్గారావు, పూజారుల సంఘం అధ్యక్షుడు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం మేడారంలో ఈఓ కార్యాలయం నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. నిధులు మంజూరు కాగానే పనులు ప్రారంభిస్తాం. భక్తులకు అందుబాటులో ఉండి సేవలందిస్తాం. – సునీత, అసిస్టెంట్ కమిషనర్, దేవాదాయశాఖ -
పోడు రైతులకు పంట రుణాలు ఇవ్వాలి
కొత్తగూడ: ఏజెన్సీ మండలాల్లో పోడు హక్కు పట్టాలు ఉన్న రైతులకు పంట రుణాలు అందించాలని తుడుందెబ్బ నాయకులు మండలకేంద్రంలోని రైతు వేదికలో శుక్రవారం జరిగిన గిరిజన ద ర్బార్(గ్రీవెన్స్)లో ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రాకు వినతిపత్రం అందజేశారు. కొత్తగూడ, గంగారం, గూ డూరు మండలాల్లో ఎక్కువ మంది రైతులు పోడు వ్యవసాయంపై ఆధారపడుతున్నారన్నారు. వారికి హక్కు పత్రాలు ఉన్నా బ్యాంకులు పంట రుణాలు ఇవ్వకపోవడంతో వడ్డీ వ్యాపారులపై ఆధారపడి దోపిడీకి గురవుతున్నారని వివరించారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని పీఓ హామీ ఇచ్చారు. గుండ్రపల్లి ప్రాథమిక పాఠశాలను పునఃప్రారంభించాలని గ్రామస్తులు వినతిపత్రం అందించారు. ఈ సమస్య కలెక్టర్ ద్వారా పరిష్కారం అవుతుందని అందుకు మహబూబాబాద్ గ్రీవెన్స్‌కు వెళ్లాలని సూచిస్తూ, వినతిని ఐటీడీఏ ద్వారా సంబంధిత అధికారులకు పంపిస్తామని హామీ ఇచ్చారు. గ్రామాల్లో రోడ్ల పనులుపూర్తి చేయాలని ప్రజలు వినతి పత్రాలు అందించారు. పోడు భూముల్లో వ్యవసాయానికి ఫారెస్ట్ అధికా రుల అడ్డంకులను ఆపాలని న్యూడెమోక్రసీ నాయకులు వినతి పత్రం అందజేశారు. గిరివికాస్ బోర్లు మంజూరు చేయాలని పలు గ్రామాల రైతులు వినతి పత్రాలు అందజేశారు. ఆదివాసీ ఉపాధ్యాయుల సర్వీస్ రెగ్యులరైజ్ చేయాలని ఉపాధ్యాయ సంఘం నాయకులు సిద్దబోయిన బిక్షం వినతిపత్రం అందజేశారు. పోడు పట్టాలు రాలేదని, పెన్షన్లు రావడం లే దని, గ్రామాల్లో అంతర్గత రోడ్లు మంజూరు చేయాలని మొత్తం 48 వినతులు అందాయి. కార్యక్రమంలో కొత్తగూడ, గంగారం, గూడూరు, బయ్యారం, గార్ల మండలాల అధికారులు, ఐటీడీఏ అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు. గిరిజన దర్బార్‌లో వినతుల వెల్లువ ప్రతీ సమస్యకు సమాధానం ఇచ్చిన ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా -
దేవాలయాలు, పురాతన కోటలే టార్గెట్..
సాక్షి, మహబూబాబాద్: జిల్లాలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపుతూ విలువైన సొత్తును దోచుకెళ్తున్నారు. ముఖ్యంగా కాకతీయులకాలం నాటి దేవాలయాలు, కోటల వద్ద తవ్వకాలు చేపట్టి బంగారం, ఇతర విలువైన విగ్రహాలు, శిల్ప సంపదను ఎత్తుకెళ్లే గ్యాంగ్‌లు జిల్లాలో ఎక్కువ అవుతున్నాయి. ఈ తవ్వకాలతో ఆలయాలు, గడీలు, కోటలు బీటలుబారుతున్నాయి. ఈ క్రమంలో చరిత్ర ఆనవాళ్లు ఒక్కొక్కటిగా కనుమరుగవుతున్నాయి. ఇంత జరిగినా దేవాదాయ ధర్మాదాయశాఖతో పాటు పురావస్తుశాఖ, జిల్లా అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి.పూర్వీకులు దాచిన ధనం..ఈ ప్రాంతాన్ని పాలించిన శాతవాహనులు, కాకతీయులు, వారి సామంతరాజులు జిల్లా వ్యాప్తంగా ప్రతీ గ్రామంలో శివాలయాలు, వైష్ణవాలయాలను నిర్మించారు. కాగా జిల్లాలో దేవాదాయశాఖ రికార్డుల ప్రకారం 257కుపైగా దేవాలయాలు ఉండగా.. రికార్డుల్లో లేనివి మరో 100మేరకు ఆలయాలు ఉంటాయని అంచనా. అదేవిధంగా నవాబుల కాలం వరకు అనేక కోటలు, దుర్గాలు, బురుజులు కట్టించారు. ఇలా జిల్లాలోని బయ్యరం చెరువుపై కాకతీయుల శిలాశాసనం, ఇనుగుర్తి, కందికొండ, గార్ల, వేలుబెల్లి, కొత్తగూడ, మాటేడు, నర్సింహులపేట, తానంచర్ల, కురవి, గుర్తూరు, పెద్దముప్పారం, చిన్నగూడూరు, నేరడ మొదలైన ప్రాంతాల్లో రాజులు నిర్మించిన దేవాలయాలు, కోటలు, పూర్వీకులు నివసించిన గ్రామాల ఆనవాళ్లు ఉన్నాయి. కాగా దేవతామూర్తుల విగ్రహాలు, నందీశ్వరుడు, గర్భగుడి, ధ్వజస్తంభం మొదలైన చోట్ల బంగారం, వెండి ఇతర ధనాన్ని వేసి నిర్మించడం ఆనాటి ఆచారంగా చెబుతారు. అదేవిధంగా కోటల్లో రాజులు, అప్పుడు నివసించిన ప్రజలు ధరించిన ఆభరణాలు, దాచిన ధనం కూడా భూగర్భంలో కలిసిపోయి పలు తవ్వకాల్లో బయట పడిన సంఘటనలు ఉన్నాయి.దేవాలయాలు, పురావస్తు స్థలాలపై కన్నుఈ ప్రాంతంలో పూర్వీకులు దాచిన ధనాన్ని వెలికితీసే ప్రయత్నాలు ఎప్పుడూ జరుగుతూనే ఉన్నాయి. ప్రధానంగా పురాతన దేవాలయాలు, కోటల మధ్యలో గడ్డపారతో తవ్విన గుర్తులు, అక్కడ ధనం దొరికిన ఆనవాళ్లు కనిపిస్తూనే ఉంటాయి. తవ్విన గుంతల్లో బూడిద, ఊక, కుండలు పగులగొట్టిన పెంకులు కనిపిస్తున్నాయి. అలాగే అక్కడ జంతు బలి, నిమ్మకాయలు కోయడం, కొబ్బరి కాయలు కొట్టిన సందర్భాలు ఉన్నాయి. కాగా ఇటీవల గడ్డపారలు, పారలు, ఇనుప వస్తువులతో కాకుండా ఏకంగా జేసీబీలు, ఇతర మిషన్లు వినియోగించి తవ్వకాలు చేపడుతున్నారు. ఇటీవల బయ్యారం పెద్ద చెరువు కట్టపై ఉన్న కాకతీయుల వంశవృక్షాన్ని తెలిపే శాసనం సమీపంలో పెద్ద గుంత తవ్వారు. ఈ విషయం తెలుసుకున్న నీటిపారుదలశాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా కొత్తగూడ అటవీ ప్రాంతంలో పురాతన కట్టడాల సమీపంలో తవ్వకాలు జరిగాయి. ఇది మరువకముందే తొర్రూరు మండలం మాటేడు గ్రామంలోని పురాతన శివాలయంలో ఉన్న నంది విగ్రహం కింది భాగం తవ్వి గుప్తనిధిని అపహరించుకెళ్లిన ఆనవాళ్లు కనిపించాయి.ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం..జిల్లాలో గుప్తనిధుల పేరిట దేవాలయాలను ధ్వంసం చేస్తున్న సంఘటనలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. వారి ఆదేశాల మేరకు పోలీసులకు ఫిర్యాదులు చేయ డం, నిందితులను కనిపెట్టి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. చారిత్రక సంపద, దేవాలయాల పరిరక్షణలో అందరూ భాగస్వామ్యులు కావాలి.– రెంటాల సమత, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్, మహబూబాబాద్పట్టించుకోని అధికారులు..జిల్లాలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుగుతున్నా.. కట్టడి చేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఏకంగా జేసీబీలు, ఇతర మిషన్లతో తవ్వకాలు చేస్తున్నా.. వాటిని పరిరక్షించాల్సిన పురావస్తుశాఖ, దేవాదాయ ధర్మాదాయ శాఖ, జిల్లా యంత్రాంగం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. అధికారులు స్పందించి గుప్తనిధుల తవ్వకాలను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.