
వడదెబ్బపై అవగాహన కల్పించాలి
దంతాలపల్లి: వేసవికాలంలో ప్రజలకు వడదెబ్బపై అవగాహన కల్పించాలని మలేరియా పీడీ(డిప్యూటీ డీఎంహెచ్‌ఓ) సుధీర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందితో మాట్లాడుతూ.. ప్రస్తుత వేసవిలో ఎండల తీవ్రత అధికంగా ఉందని, ప్రజలకు సబ్ సెంటర్లలో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు నిల్వ ఉంచాలన్నారు. వడదెబ్బ తలిగిన వారికి ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందించాలని, ఆస్పత్రిలో తగిన చికిత్స చేయాలని వైద్య సిబ్బందికి సూచించారు. అనంతరం ఆస్పత్రిలోని గదులను, వసతులను పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో రిజిస్టర్లను పరిశీలించి సిబ్బందికి తగిన సలహాలు, సూచనలు ఇచ్చారు. వైద్యులు చైతన్య, కవిత, సిబ్బంది పద్మ, చలపతిరావు తదితరులు ఉన్నారు.