
కాళేశ్వరం ట్రస్టు బోర్డు ఏర్పాటయ్యేనా?
ఆశావహుల ఎదురుచూపులు
కాళేశ్వరం: తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాల్లో కాళేశ్వరం ఒకటి. ఇంతటి ప్రాముఖ్యం కలిగిన ఆలయానికి ట్రస్టు బోర్డు ఏర్పాటు చేయాలని భక్తులతోపాటు ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. కాగా, ఎమ్మెల్సీ ఎన్నికల ముందు ట్రస్టు బోర్డు ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే కోడ్ అమల్లోకి రావడంతో నియామకాలు నిలిచాయి. కానీ మార్చి 3వ తేదీతో కోడ్ ముగిసింది. నెల రోజులకు పైగా గడిచిన ట్రస్టు బోర్డు ఏర్పాటు ఆలస్యం అవుతుండడంతో చైర్మన్, డైరెక్టర్ పదవులను ఆశిస్తున్న వారిలో ఆందోళన మొదలైంది. సరస్వతీ నది పుష్కరాలు మే 15 నుంచి 26వ తేదీ వరకు నిర్వహించడానికి ప్రభుత్వం నిర్ణయించి రూ.25కోట్లు మంజూరు చేసింది. అభివృద్ధి పనులు కూడా చకచకా జరుగుతున్నాయి. కాగా, పుష్కరాలకు 27 రోజుల సమయం కూడా లేదు. అయినా ఇంతవరకు ట్రస్టు బోర్డు ఏర్పాటు చేయకపోవడంతో ఆశావహులు ఆందోళన చెందుతున్నారు. ఈవిషయంపై మంత్రి శ్రీధర్‌బాబు, ఇతర నాయకులు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
రెండోసారి నోటిఫికేషన్
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతేడాది ఆగస్టులో ట్రస్టుబోర్డు ఏర్పాటుకు దేవాదాయ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. అప్పుడు 20 రోజుల నిర్ణీత గడువులోగా వివిధ పదవులకు 37 వరకు దరఖాస్తులు వచ్చాయి. అంతలోనే మూడు నెలల గడువు ముగియడంతో అనివార్య కారణాలతో ఆ ఉత్తర్వులు రద్దు చేశారు. తర్వాత ఈ ఏడాది జనవరి 5న ట్రస్టుబోర్డు ఏర్పాటుకు మళ్లీ రెండోసారి నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఆశావహులు 88మంది వరకు దరఖాస్తులు చేసుకున్నారు. సంవత్సరం కాలపరిమితితో 14 మంది డైరెక్టర్లు, ఎక్స్‌అఫీషియో మెంబర్‌కు ధరఖాస్తులు చేసుకున్నారు.
ముమ్మర ప్రయత్నాలు!
ఇప్పటికే దరఖాస్తులు చేసుకున్న ఆశావహులకు సంఽబంధించి పోలీసు, ఎస్‌బీ ఎంకై ్వరీలు పూర్తయ్యాయి. నివేదికలు ప్రభుత్వానికి పంపించారు. మంత్రి శ్రీధర్‌బాబు సూచించిన వారికి డైరెక్టర్, చైర్మన్ పదవులు రానుండడంతో ఆయన వద్దకు నేతలు క్యూ కడుతున్నారు. కాళేశ్వరం, మహదేవపూర్, మంథని, ముత్తారం, హనుమకొండ, భూపాలపల్లి నుంచి చైర్మన్ పదవి కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది. గతంలో చైర్మన్ చేసిన ఒకరికి గ్రీన్‌సిగ్నల్ వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం.
సరస్వతీ పుష్కరాలకు ముందు ఏర్పాటు చేస్తే బాగుటుందని భక్తుల అభిప్రాయం
పుష్కరాల లోపు ఏర్పాటు చేయాలంటున్న భక్తులు..
కాళేశ్వరం దేవస్థానంలో ఫిబ్రవరి 7, 8, 9 తేదీల్లో మహాకుంభాభిషేకాన్ని ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి ముందుగానే ట్రస్టుబోర్డు నియామకం జరుగుతుందని ఆశావహులు ఆశించి నిరాశ పడ్డారు. ఈక్రమంలో సరస్వతీ పుష్కరాలు వచ్చే నెల 15 నుంచి 26 వరకు నిర్వహించనున్నారు. ఈలోపు ట్రస్టుబోర్డును ఏర్పాటు చేసేలా నేతలు మంత్రి శ్రీధర్‌బాబు, ఇతర అధికారపార్టీ నాయకులను కలుస్తున్నట్లు తెలిసింది. కాగా, పుష్కరాల లోపు ట్రస్టుబోర్డు నియామకం జరిగితే అభివృద్ధి పనులపై అజమాయిషీ ఉంటుందని, పుష్కరాల్లో ఏర్పాట్లపై మరింతగా దృష్టిసారిస్తారని భక్తులు పేర్కొంటున్నారు.