బిడ్డ ఇంటికి వెళ్తూ మృత్యుఒడికి..
ఖిలా వరంగల్ : కొత్త వాహనానికి రిజిస్ట్రేషన్ పూర్తయింది. అదే వాహనంపై బిడ్డ ఇంటికి వెళ్తూ ఓ వృద్ధుడు మృత్యుఒడికి చేరాడు. రోడ్డు ప్రమాదంలో దర్మరణం చెందాడు. ఈ ఘటన వరంగల్ హంటర్ రోడ్డు ప్లైఓవర్ వద్ద చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం సాయిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన పావులూరి వెంకటేశ్వర్లు (60) పర్వతగిరి మండల కేంద్రంలో నివాసముంటూ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకున్నాడు. ఇంటింటికీ తాగునీరు సరఫరా చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇటీవల కొత్త బైక్‌ను కొనుగోలు చేశాడు. గురువారం ఉదయం వాహన రిజిస్ట్రేషన్ కోసం వరంగల్ ఆర్టీఏ కార్యాలయానికి చేరుకున్నాడు. రిజిస్ట్రేషన్ పూర్తి కాగానే మధ్యాహ్నం హనుమకొండలోని కుమార్తె ఇంటికి బయలుదేరాడు. ఈక్రమంలో వరంగల్ హంటర్ రోడ్డులోని ప్లైఓవర్ వద్ద టిప్పర్ ఎదురుగా బైక్‌ను ఢీకొంది. ఈ ఘటనలో వెంకటేశ్వర్లు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ విషయం తెలిసిన వెంటనే మిల్స్‌కాలనీ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని టిప్పర్‌ను డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. మృతుడు వెంకటేశ్వర్లుకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. కాగా, వెంకటేశ్వర్లు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన విషయం తెలియడంతో స్వగ్రామం సాయిరెడ్డిపల్లి, ప్రస్తుతం ఉంటున్న పర్వతగిరి మండల కేంద్రంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడి కుమార్తె బొర్ర కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ వెంకటరత్నం తెలిపారు.
బైక్‌ను ఢీకొన్న టిప్పర్..
వృద్ధుడి దుర్మరణం
వరంగల్ హంటర్ రోడ్డు
ప్లైఓవర్ వద్ద ఘటన
నెక్కొండ మండలం
సాయిరెడ్డి పల్లిలో విషాదం


