
ధాన్యం కొనుగోళ్లు షురూ..
మహబూబాబాద్: జిల్లాలో యాసంగి వరి కోతలు మొదలయ్యాయి. ఈమేరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. జిల్లాలో గంగారం మినహా అన్ని మండలాల్లో 174 కేంద్రాలను ఏర్పాటు చేయగా.. పలు కేంద్రాలను ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. జిల్లాలో 2.90లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారుల అంచనా వేశారు. రైతుల అవసరాలు పోను 1.50లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సేకరించనున్నారు.
1,50,000 ఎకరాలలో వరి సాగు..
జిల్లాలో 18 మండలాలు ఉండగా గంగారం మండలంలో వరి సాగు చేయలేదు. మిగిలిన 17 మండలాల్లో 1,50,000 ఎకరాల్లో వరి సాగు చేసినట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు. 2.90లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇందులో 1.50లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తామని డీసీఎస్‌ఓ అధికారులు అంచనా వేసి దాని ప్రకారం ఏర్పాట్లు చేస్తున్నారు.
174 కేంద్రాలు ..
ఐకేపీ ఆధ్వర్యంలో 47, పీఏసీఎస్ 114, జీసీసీ, మెప్మా 13.. మొత్తంగా 174 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా గ్రేడ్ ఏ రకం ధాన్యం క్వింటాకు మద్దతు ధర రూ.2320, కామన్ రకం క్వింటాకు ధర రూ.2300 చెల్లిస్తారు. సన్న ధాన్యం క్వింటాకు అదనంగా రూ.500 బోనస్ ఇస్తున్నారు.
ఏఈఓలు టోకెన్ ఇచ్చిన తర్వాతనే..
ఏఈఓలు తేమ శాతాన్ని పరిశీలించిన తర్వాత టోకెన్లు ఇస్తారు. ఆ తర్వాతనే ధాన్యం కొనుగోలు చేస్తారు. రైతులు ఆధార్, పట్టాదారు పాస్‌పుస్తకం, బ్యాంక్ పాస్‌పుస్తకం జిరాక్స్ ప్రతులను కేంద్రాల్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఆతర్వాత నిర్వాహకులు వివరాలను ట్యాబ్‌లలో నమోదు చేస్తారు. 5లక్షల గన్నీ బ్యాగులు, 10,000 టార్పాలిన్లు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు.
సాక్షి కథనంపై స్పందన..
ఇటీవల గాలివాన బీభత్సం, వడగండ్ల వర్షం కురిసింది. ఈమేరకు రైతులు వరి పచ్చిగా ఉండగానే ముందస్తు కోతలు చేపట్టారు. కాగా ఈ నెల 9న సాక్షి దినపత్రికలో ‘ముందస్తు కోతలు’.. ‘ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని’ అనే శీర్షికన ప్రచురితమైన కథనంపై అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి పలు మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈనెల 9న తొర్రూరు మండలం వెలికట్ట గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి ప్రారంభించగా.. 11న మరిపెడ మండలం ఎల్లంపేట గ్రామంలో కేంద్రాన్ని ప్రభుత్వ విప్ జాటోత్ రాంచంద్రునాయక్ ప్రారంభించారు. కాగా కేంద్రాల్లో సేకరించిన ధాన్యాన్ని సంబంధిత మిల్లులకు తరలిస్తున్నారు.
గంగారం మినహా అన్ని మండలాల్లో కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
సాక్షి కథనంతో కొనుగోళ్లు
ప్రారంభించిన అధికారులు
జిల్లాలో 1.50లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యం
సన్నధాన్యం క్వింటాకు రూ.500 బోనస్

ధాన్యం కొనుగోళ్లు షురూ..

ధాన్యం కొనుగోళ్లు షురూ..