
మిర్చి కొనుగోళ్లు ఆలస్యం
మహబూబాబాద్ రూరల్: మానుకోట వ్యవసాయ మార్కెట్‌లో సకాలంలో మిర్చితో పాటు ఇతర పంటల ఉత్పత్తులు కొనుగోలు చేయడంలేదని ఆరోపిస్తూ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు మంగళవారం ఆందోళన చేశారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు గునిగంటి రాజన్న, జిల్లా ఉపాధ్యక్షుడు నల్లపు సుధాకర్ మాట్లాడుతూ.. వ్యాపారులు మార్కెట్‌కు వచ్చి తడిసిన మిర్చితో పాటు అన్ని బస్తాలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రెండు రోజుల క్రితం మిర్చి కొనుగోళ్లలో ఆలస్యం కావడం వల్లే అకాల వర్షానికి తడిసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్‌లో పదిమంది మిర్చి వ్యాపారులు ఉండగా ఒకరిద్దరు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని, మిగతా వ్యాపారులు రావడంలేదన్నారు. సుమారు 4 వేల మిర్చి బస్తాలు, 4వేల మొక్కజొన్న బస్తాలు, 450 పత్తి బస్తాలు ఉన్నాయని తెలిపారు. స్పందించిన వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఇస్లావత్ సుధాకర్, కార్యదర్శి షంషీర్ వ్యాపారులకు ఫోన్ చేసి పిలిపించి వేలం పాటలు ప్రారంభించి, త్వరగా మిర్చి బస్తాలు గోదాంకు తరలిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రైతులు రమేశ్, బాలునాయక్, శ్రీను, సర్వన్, వెంకన్న, మంగీలాల్ పాల్గొన్నారు.
రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళన