
సరస్వతీ పుష్కర ఔషధ సేకరణపై సమీక్ష
ఎంజీఎం : కాళేశ్వరంలో మే 12వ తేదీ నుంచి 26వ తేదీ వరకు 12 రోజుల పాటు జరిగే సరస్వతీ పుష్కరాల వైద్యశిబిరాలకు అవసరమైన ఔషధాల కోసం శుక్రవారం హనుమకొండ సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్‌లో భూపాలపల్లి డీఎంహెచ్‌ఓ డాక్టర్ మధుసూదన్ సమీక్ష నిర్వహించారు. ఈ పుష్కరాలకు సుమారు 10లక్షల నుంచి 12 లక్షల వరకు భక్తులు రానున్నట్లు అంచనా వేశారు. కాళేశ్వరంతో తాత్కాలికంగా 30 పడకల ఆస్పత్రితోపాటు మహదేవపూర్‌లో 30 పడకల సీహెచ్‌సీ సేవలను వినియోగించుకోనున్నట్లు పేర్కొన్నారు. ఇవేకాకుండా 10 ప్రత్యేక వైద్యశిబిరాలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. గైనకాలజీ, సర్జరీ, అనస్తీషియా, పిడియాట్రిక్, అర్థోపెడిక్, జనరల్ మెడిసిన్ వంటి ప్రత్యేక వైద్యసేవలను అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. అవసరమైన మందులను సమకూర్చేందుకు డీహెచ్ రవీంద్రనాయక్, టీఎస్‌ఎంఎస్‌డీసీ రాష్ట్ర అధికారుల దృష్టికి తీసుకెళ్లి పూర్తిస్థాయి ఔషధాలు అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. సమావేశంలో సీఎంఎస్ ఈఈ ప్రసాద్, ఫార్మసిస్టులు ఉప్పు భాస్కర్, నళిని, సదయ్య పాల్గొన్నారు.