తల్లులకు తనివితీరా మొక్కులు
● మేడారానికి భారీగా
తరలివచ్చిన భక్తులు
ఎస్‌ఎస్ తాడ్వాయి: వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు ఆదివారం మేడారానికి పోటెత్తారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర నుంచి ప్రైవేట్ వాహనాల్లో తరలివచ్చారు. జంపన్నవాగు వద్ద భక్తుల పుట్టువెంట్రుకలు సమర్పించి స్నానాలు ఆచరించారు. అమ్మవార్ల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీరసారె, ఎత్తుబంగారం, ఒడిబియ్యం, గాజులు, పూలు, పండ్లు, కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గోవిందరాజు, పగిడిద్దరాజులకు పూజలు చేశారు. సుమారు 10వేల మంది భక్తులు హాజరైనట్లు అధికారులు తెలిపారు. ఎండోమెంట్ జూనియర్ అసిస్టెంట్ జగదీశ్వర్, బాలకృష్ణ భక్తులకు సేవలందించారు.
కిక్కిరిసిన తల్లుల గద్దెలు
అమ్మవార్ల దర్శనానికి ఉదయం 8గంటల నుంచే భక్తుల తాకిడి పెరిగింది. భక్తుల రద్దీతో సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. మొక్కులు చెల్లించుకునేందుకు గద్దెల వద్ద పోటీ పడ్డారు. దొంగలు చేతివాటం ప్రదర్శించకుండా పోలీసులు గద్దెల వద్ద చర్యలు తీసుకున్నారు. ఎండోమెంట్ అధికారులు మైక్ అనౌన్స్‌మెంట్ ద్వారా భక్తులకు ఎప్పటికప్పుడు సూచనలు చేశారు. భక్తుల రద్దీతో మేడారం సందడిగా కనిపించింది. దర్శనాల అనంతరం భక్తులు మేడారం పరిసరాల్లోని చెట్ల కింద వంటావార్పు చేసుకొని సహపంక్తి భోజనాలు చేశారు. కాగా, సాయంత్రం 4గంటల ప్రాంతంలో ఉరుములు మెరుపులతో మేడారంలో భారీ వర్షం కురియడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు.


