
భూమి ఆక్రమించినట్లు నిరూపిస్తే రాజీనామా
జనగామ రూరల్: దేవునూర్ అటవీ భూమిలో గుంట స్థలం ఆక్రమించినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. శనివారం జనగామ జిల్లా కేంద్రంలోని ఎన్‌ఎంఆర్ గార్డెన్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆరోపణలు, విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే అంటూ పదేపదే పదవికి రాజీనామా చేయాలనడం సరికాదన్నారు. ప్రస్తుతం ఈ విషయం సుప్రీం కోర్టులో ఉందని, తీర్పునకు కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో 36మంది ఎమ్మెల్యేలు పార్టీ మారి బీఆర్‌ఎస్‌లో చేరిన విషయం రాజేశ్వర్‌రెడ్డికి తెలియదా అని ప్రశ్నించారు. వేరే పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టింది నిజం కదా అంటూ.. పార్టీ ఫిరాయింపుల మీద మాట్లాడే నైతిక హక్కు బీఆర్‌ఎస్‌కు లేదన్నారు. వరంగల్ ఎంపీ కడియం కావ్యకు బీ ఫామ్ ఇచ్చి ఎన్నికల ఖర్చుకు నిధులు ఇచ్చామనడం సరికాదిని, ఇది నిరూపిస్తే తమ పదవులకు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. నిరూపించకపోతే పల్లా రాజీనామా చేయాలన్నారు. అటవీ శాఖ నోటిఫికేషన్‌లో లేని 23 మంది రైతులకు చెందిన 43 ఎకరాల పట్టా భూములను రైతులకు చెందాలని అనడం భూమి కబ్జా చేసినట్టా అని ప్రశ్నించారు. దమ్ముంటే అభివృద్ధిలో పోటీ పడాలని హితవు పలికారు. అనంతరం స్టేషన్‌ఘన్‌ఫూర్ నియోజకవర్గ లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు అదజేశారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, గుడి వంశీధర్‌రెడ్డి, ప్రవీణ్, కోళ్ల రవి, తదితరులు పాల్గొన్నారు.
పట్టా భూములను రైతులకు చెందాలనడం కబ్జా చేసినట్టా?
స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి