
అమ్మమ్మ కర్మకు వస్తూ.. అనంతలోకాలకు
బయ్యారం: అమ్మమ్మ కర్మకు వస్తూ మనవడు అనంతలోకాలకు చేరాడు. కారు.. బైక్‌ను ఢీకొన్న ఘటనలో మనవడు మృతి చెందగా అతడి భార్య, కొడుకుకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన బుధవారం మండలంలోని నామాలపాడు సమీపంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గూడూరు మండలం వాయిల్‌బంధం గ్రామానికి చెందిన సొక్కం నాగేశ్వరరావు(43) భద్రాద్రి జిల్లా బూర్గంపాడు మండలం సారపాక బీపీఎల్‌లో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. నాగేశ్వరరావు తన మేనమామ కుమార్తె సునీతను వివాహం చేసుకోగా వారికి ప్రజ్వల్ సంతానం. ఈ క్రమంలో వాయిల్‌బంధంలో నివసించే అమ్మమ్మ ఆది సత్యమ్మ ఇటీవల మృతి చెందగా పెద్దకర్మకు హాజరయ్యేందుకు భార్య, కుమారుడితో కలిసి నాగేశ్వరరావు బైక్‌పై బయలుదేరాడు. మండలంలోని నామాలపాడు సమీపంలోకి రాగానే ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం ఉసిరికాయపల్లికి చెందిన గుగ్గిల రామయ్య మహబూబాబాద్ నుంచి కారులో అతివేగంగా ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొన్నాడు. దీంతో తీవ్రంగా గాయపడిన నాగేశ్వరరావు, సునీత, ప్రజ్వల్‌ను 108లో మహబూబాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ నాగేశ్వరరావు మృతి చెందాడు. భార్య పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలించగా కుమారుడు మహబూబాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అలాగే, కారు నడుపుతున్న గుగ్గిళ్ల రామయ్యకు సైతం గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు మృతుడి బంధువు చిన్నరామయ్య ఫిర్యాదు మేరకు కారు నడుపుతున్న గుగ్గిళ్ల రామయ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తిరుపతి పేర్కొన్నారు.
ఛాగల్లులో వ్యక్తి..
స్టేషన్‌ఘన్‌పూర్: కారు.. బైక్‌ను వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని ఛాగల్లులో జరిగింది. ఎస్సై వినయ్‌కుమార్ కథనం ప్రకారం.. మండలంలోని మీదికొండకు చెందిన చంద్రయ్య(60) వ్యక్తిగత పనుల నిమిత్తం తన బైక్‌పై స్టేషన్‌ఘన్‌పూర్‌కు వస్తున్నాడు. ఈ క్రమంలో ఛాగల్లు సమీపంలో జాతీయ రహదారిపై వెనుక నుంచి కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో చంద్రయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి కుమారుడు రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
వాయిల్ బంధంలో విషాదఛాయలు
గూడూరు: సొక్కం నాగేశ్వరరావు మృతితో మండలంలోని అయోధ్యపురం శివారు వాయిల్‌బంధం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మానుకోటలో పోస్టుమార్టం అనంతరం నాగేశ్వరరావు మృతదేహాన్ని స్వగ్రామం వాయిల్‌బంధం తీసుకొచ్చారు. దీంతో అమ్మమ్మ దశదిన కర్మ.. నీ చావుకు వచ్చిందా బిడ్డా అంటూ కుటుంబ, బంధుమిత్రులు బోరున విలపించారు. గురువారం అంత్యక్రియలు చేస్తామని మృతుడి బంధువులు తెలిపారు.
బైక్‌ను ఢీకొన్న కారు
మనవడు మృతి.. అతడి భార్య, కొడుకుకు తీవ్ర గాయాలు

అమ్మమ్మ కర్మకు వస్తూ.. అనంతలోకాలకు