
సింగరేణి ఉద్యోగి ఆత్మహత్య
ఆర్థిక ఇబ్బందులు..
కాజీపేట: ఆర్థిక ఇబ్బందులతో ఓ సింగరేణి ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన గురువారం రాత్రి కాజీపేట 63వ డివిజన్ బాపూజీనగర్ కాలనీలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కాజీపేట భవానీనగర్‌కు చెందిన ఊరడి సంజయ్ కుమార్(26) సింగరేణి ఉద్యోగిగా విధులు నిర్వర్తిన్నాడు. ఈ క్రమంలో ఇటీవల రూ. 76 లక్షలతో ఇదే కాలనీలో నూతన ఇంటిని కొనుగోలు చేశాడు. ఇంటి రిజిస్ట్రేషన్ తదితర ఖర్చులు అధికం కావడంతో అప్పులు పెరిగాయి. అప్పులు, వడ్డీలు ఎక్కువ కావడంతో మనస్తాపానికి గురైన సంజయ్‌కుమార్..బాపూజీనగర్‌లోని అమ్మమ్మ ఇంటికి వచ్చి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై మృతుడి తల్లి సుభద్ర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నవీన్‌కుమార్ తెలిపారు.
వడ్డేపల్లి చెరువులో పడి నిట్ విద్యార్థి..
కాజీపేట: కాజీపేట 61వ డివిజన్ వడ్డేపల్లి చెరువులో నిట్ వరంగల్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సీఐ సుధాకర్ రెడ్డి కథనం ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన రుత్విక్ సాయి(23) నిట్ వరంగల్‌లో ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఈ క్రమంలో బుధవారం చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారం సాయంత్రం ఆ యువకుడి మృతదేహం చెరువులో తేలియాడుతున్నట్లు స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని బయటకు తీసి ఎంజీఎం మార్చురీకి తరలించారు. కాగా, రిత్విక్‌సాయి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని సీఐ తెలిపారు.

సింగరేణి ఉద్యోగి ఆత్మహత్య