ప్రజలకు ఏం చేశారని రజతోత్సవ సభ
● ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి
హన్మకొండ చౌరస్తా: పదేళ్లు అధికారంలో ఉండి ప్ర జలను మోసం చేసినందుకా..? ఏం చేశారని రజతో త్సవ సభ పెట్టుకుంటున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే, హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. హనుమకొండలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దళితులకు మూడెకరాల భూమి, దళితుడిని సీఎం చేస్తానని, ఇంటికో ఉద్యోగం ఇస్తానని.. ఇలాంటి అనేక హామీలు ఇచ్చి పదేళ్లు ప్రజలను మోసం చేసి, పీడించినందుకా సంబురాలు చేసుకుంటున్నారని ప్రశ్నించారు. ఇంతకీ 25 సంవత్సరాల ఉత్సవాలు టీఆర్‌ఎస్ పార్టీకా, తెలంగాణ పదాన్ని తీసేసిన బీఆర్‌ఎస్ పార్టీకా అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పై దుష్ప్రచారం చేయడమే బీఆర్‌ఎస్ ఎజెండా తప్పితే మరో అంశం లేదన్నారు. కార్యక్రమంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, పీసీసీ సభ్యుడు బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కార్పొరేటర్లు జక్కుల రవీందర్, వేముల శ్రీనివాస్, మామిండ్ల రాజు, మాజీ కార్పొరేటర్ తాడిశెట్టి విద్యాసాగర్, నాయకులు డాక్టర్లు పెరుమాండ్ల రామకృష్ణ, పులి అనిల్, బంక సరళ, బంక సంపత్, నాయిని లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


