
హెచ్‌సీయూ భూములను పరిరక్షించాలి
కేయూ క్యాంపస్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను పరిరక్షించాల్సిన అవసరం ఉందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు రిటైర్డ్ జడ్జి చంద్రకుమార్ అన్నారు. వర్సిటీల భూముల పరిరక్షణపై డెమొక్రటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యాన బుధవారం కాకతీయ యూనివర్సిటీ దూరవిద్యాకేంద్రం సెమినార్‌హాల్‌లో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. సెంట్రల్ యూనివర్సిటీ భూములపై ప్రైవేట్ పెట్టుబడీదారుల కన్నుపడిందని, నాటి చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఐఎంజీ భారత్ అనే కంపెనీకి 400ల ఎకరాల భూమి కేటాయించగా.. తర్వాత పరిణామ క్రమంలో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో ఆ కేటాయింపును రద్దు చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం ఉన్నత న్యాయ స్థానం 2024లో ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ తీర్పు ఇచ్చినట్లు వివరించారు. ఆ 400 ఎకరాల భూమిని విద్యారంగాభివృద్ధికి వినియోగించాలన్న ఆయన.. బాధ్యత కలిగిన ప్రభుత్వం మళ్లీ ప్రైవేటు కంపెనీలకు అప్పగించడానికి పూనుకోవటం సరికాదన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ వెంకట్‌దాస్ మాట్లాడుతూ హెచ్‌సీయూ విద్యార్థులు భూమి పరిరక్షణకు ఉద్యమిస్తే వారిపై అణిచివేత చర్యలు తగదన్నారు. సమావేశంలో డెమొక్రటిక్ స్టూడెంట్స్ రాష్ట్ర కన్వీనర్ శ్రవణ్, కోకన్వీనర్ గణేష్, ప్రజాసంఘాల బాధ్యులు లింగారెడ్డి, లక్ష్మయ్య, మొయీనుద్దీన్, ఓంబ్రహ్మం, వివిధ విద్యార్థి సంఘాల బాధ్యులు బి.నర్సింహారావు, వడ్డెపెల్లి మధు, సంతోష్, రాజేష్, నాగరాజు, స్టాలిన్, వెంకటేష్, శివ పాల్గొన్నారు.
ఉమ్మడి ఏపీ హైకోర్టు రిటైర్డ్ జడ్జి
జస్టిస్ చంద్రకుమార్