
సైక్లింగ్ రోడ్ పోటీలకు కేయూ జట్టు
కేయూ క్యాంపస్: బికనీర్‌లోని మహారా గంగాసింగ్ యూనివర్సిటీలో ఈనెల 10 నుంచి నిర్వహించే ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ సైక్లింగ్ రోడ్(పురుషుల) పోటీలకు కేయూ జట్టును ఎంపిక చేసినట్లు కేయూ స్పోర్ట్స్‌బోర్డు సెక్రటరీ ఆచార్య వై.వెంకయ్య శుక్రవారం తెలిపారు. జట్టులో ఎన్.రాకేష్(శ్రీఅరుణోదయం డిగ్రీ కాలేజీ హనుమకొండ), ఎండీ.రియాజ్(మాస్టర్జీ డిగ్రీ కాలేటీ హనుమకొండ), జె.సంజీవ్, జి.లోకేష్(వరంగల్ కిట్స్), ఎన్.మహేందర్‌యాదవ్(యూసీపీఈ కేయూ), కె.బాలమురుగన్ (ఎల్‌బీ కాలేజీ వరంగల్) ఉన్నారు. వీరికి హనుమకొండలోని జాగృతి డిగ్రీ కాలేజీ ఫిజికల్ డైరెక్టర్ ఎ.రాజేష్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారని వెంకయ్య పేర్కొన్నారు.
సెలవు రోజుల్లో
ప్రత్యేక టూర్ ప్యాకేజీ
హన్మకొండ: పర్యాటక ప్రాంతాల సందర్శనకు సెలవు రోజుల్లో ప్రత్యేక టూర్ ప్యాకేజీని తీసుకొచ్చినట్లు తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ డిప్యూటీ మేనేజర్(మార్కెటింగ్) టి.శ్రీనివాస్ రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రెండో శనివారం, ఆదివారం, అంబేడ్కర్ జయంతి రోజు సోమవారం వరంగల్, రామప్ప, లక్నవరం ప్రాంతాల పర్యటనకు ప్రత్యేక టూర్ ప్యాకేజీ అమలు చేస్తున్నట్లు వివరించారు. ఉదయం 8 నుంచి రాత్రి 7.30 వరకు పర్యాటక ప్రాంతాల సందర్శన ఉంటుందని పేర్కొన్నారు. ఏసీ బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. చార్జీలు పెద్దలకు రూ.980, పిల్లలకు రూ.790గా నిర్ణయించినట్లు వివరించారు. భోజన చార్జీలు రూ.150, బోటింగ్ చార్జీలు రూ.50 అదనం అని తెలిపారు. పర్యాటకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
అందుబాటులోకి
టీజీ ఎన్పీడీసీఎల్ యాప్
హన్మకొండ: ఐఫోన్ వినియోగదారులకు టీజీ ఎన్పీడీసీఎల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఎన్పీడీసీఎల్ హనుమకొండ సర్కిల్ ఎస్‌ఈ పి.మధుసూదన్ రావు, వరంగల్ సర్కిల్ ఎస్‌ఈ కె.గౌతం రెడ్డి తెలిపారు. మరిన్ని సాంకేతిక అంశాలు జోడించి టీజీ ఎన్పీడీసీఎల్ యాప్‌ను ఆధునీకరించినట్లు వారు వేర్వేరు ప్రకటనలో వెల్లడించారు. ఐఫోన్ యాప్ స్టోర్ నుంచి టీజీ ఎన్పీడీసీఎల్ యాప్‌ను డౌన్‌లోడు చేసుకోవచ్చన్నారు. ఈ యాప్‌లో 20 ఫీచర్లు ఉన్నాయని వివరించారు. రిపోర్ట్ ఆన్ ఇన్సిడెంట్, కనూ్‌స్య్‌మర్ గ్రీవెన్సెస్, న్యూ కంప్లైంట్, కంప్లైంట్ స్టేటస్, రీఓపెన్, సెల్ఫ్ రీడింగ్, పే బిల్స్, బిల్ హిస్టరీ, ఆన్ లైన్ పేమెంట్ హిస్టరీ, కొత్త సర్వీస్ స్థితి, లింక్ ఆధార్ – మొబైల్, డొమెస్టిక్ బిల్ క్యాలిక్కులెటర్, కొత్త కనెక్షన్ ఎ లా తీసుకోవాలి, పేరు– లోడ్ మార్పు, పవర్ క ంజమ్సన్ గైడ్‌లైన్స్, టారిఫ్ డీటెయిల్స్, ఎనర్జీ సేవింగ్ టిప్స్, సేఫ్టీ టిప్స్, ఫీడ్ బ్యాక్, మై అ కౌంట్, వినియోగదారుల బిల్లు సమాచారం, వినియోగదారుల పరిధిలోని అధికారి వివరా లు, కాంటాక్ట్ ఆజ్.. అనే ఫీచర్లు ఈ యాప్‌లో అందుబాటులో ఉన్నాయని వివరించారు.
వ్యక్తిపై కేసు నమోదు
బయ్యారం: వితంతు మహిళపై లైంగికదాడికి యత్నించిన వ్యక్తిపై శుక్రవారం బయ్యారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని పీహెచ్‌సీ సమీపంలో నివసించే కె.కార్తీక్ గురువారం రాత్రి ఒంటరిగా ఉన్న మహిళ ఇంట్లోకి వెళ్లాడు. ఈ క్రమంలో లైంగికదాడికి యత్నించటంతో మహిళ కేకలు వేయగా కార్తీక్ పరారయ్యాడు. ఈ మేరకు బాధిత మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
మహిళ ఆత్మహత్య
బచ్చన్నపేట: మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని కట్కూర్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎనుగుల లక్ష్మి(59)కి ఇటీవల అనారోగ్య సమస్యలతోపాటు మానసికంగా కూడా సరిగా ఉండడంలేదు. ఈక్రమంలో శుక్రవారం కుటుంబ సభ్యులు వ్యవసాయ పనులకు వెళ్లారు. పనులు ముగించుకుని వచ్చేలోగా లక్ష్మి ఉరివేసుకుని కన్పించింది. మృతురాలికి భర్త ఎల్లయ్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలాన్ని ఎస్సై ఎస్‌కే హమీద్ పరిశీలించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

సైక్లింగ్ రోడ్ పోటీలకు కేయూ జట్టు