అదనపు కట్నం కోసం అత్తింటి వేధింపులు..
●వివాహిత నవ్య బలవన్మరణంపై
కేసు నమోదు
మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నర్సంపేట బైపాస్ రోడ్‌లో ఆదివారం రాత్రి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిన నవ్య మృతిపై ఆమె తండ్రి ఉత్తరాచారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని టౌన్ సీఐ పెండ్యాల దేవేందర్ సోమవారం రాత్రి తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని బ్రాహ్మణ బజార్‌కు చెందిన శ్రీపాద ఉత్తరాచారి పెద్ద కుమార్తె నవ్య (21)ను ఇల్లందు మండలం ధర్మారం తండాకు చెందిన తాడూరి భిక్షమాచారి, సత్యవతి దంపతుల కుమారుడు రవిచంద్రాచారికి ఇచ్చి గతేడాది డిసెంబర్ 26వ తేదీన వివాహం జరిపించారు. వివాహం సమయంలో రూ.50 వేలు కట్నం ఇచ్చారు. భర్త రవిచంద్రాచారి, అత్తామామ భిక్షమాచారి, సత్యవతి తరచూ అదనపు కట్నం కోసం నవ్యను వేధింపులకు గురిచేస్తుండేవారు. ఈ క్రమంలో పలుమార్లు పంచాయితీలు జరగగా అదనపు కట్నం డబ్బులు తర్వాత ఇస్తామని ఆపుకుంటూ వచ్చారు. ఆదివారం సాయంత్రం నవ్య తాను ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడుతున్నానని పక్కింటి వారికి చెప్పగా వారు హు టాహుటిన వచ్చి భర్త రవిచంద్రాచారికి చెప్పా రు. అప్పటికే ఆమె ఇంట్లోనే ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనపై మృతురాలి తండ్రి ఉత్తరాచారి ఫిర్యాదు మేరకు టౌన్ ఎస్సై బి.విజయ్ కుమార్ కేసు నమోదు చేసి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కు టుంబీకులకు అప్పగించారని సీఐ తెలిపారు.
మండలంలో
రెండు చోట్ల చోరీలు
వెంకటాపురం(కె): మండలంలోని ఉప్పేడు గొల్లగూడెం, మండ కేంద్రంలోని సాయిబాబా ఆలయ సమీపంలో ఆదివారం చోరీలు జరిగాయి. బాధితుల కథనం ప్రకారం.. ఉప్పేడు గొల్లగూడెం గ్రామానికి చెందిన నాగేశ్వరావు రాత్రి నిద్రిస్తున్న సమయంలో దొంగలు ఇంటి ఎదుట ఉన్న షెట్టర్ పగుల కొట్టి అందులో ఉన్న రూ. 50 వేల నగదు, ఓ సెల్‌ఫోన్ అపహరించారు. అలాగే, మండల కేంద్రంలో బీజేపీ నాయకుడు సంకా హేమ సుందర్ ఇంట్లోకి చొరబడి బీరువా తాళాలు పగుల కొట్టి అందులో ఉన్న కిలో వెండి, 18 గ్రాముల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై సోమవారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరిచారు.
అదనపు కట్నం కోసం అత్తింటి వేధింపులు..


