విద్యార్థిని బలవన్మరణం
మహబూబాబాద్ రూరల్ : మరో రెండు రోజుల్లో డిగ్రీ వార్షిక పరీక్షలు ప్రారంభం కానుండగా ఓ విద్యార్థి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన ఆదివారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల ప్రకారం.. వరంగల్ జిల్లా ఖానాపురం మండల కేంద్రానికి చెందిన పర్వతపు ఈశ్వరాచారి, ధనలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు తరంగిణి (20), మౌనికశ్రీ ఉన్నారు. ధనలక్ష్మి 15 సంవత్సరాల క్రితం మృతి చెందింది. దీంతో ఆ ఇద్దరు అమ్మాయిలు చిన్నప్పటి నుంచి మహబూబాబాద్‌లోని ఆర్టీసీ కాలనీలో తమ పెద్దమ్మ,పెద్దనాన్న వంగాల పరమేశ్వరాచారి, జయప్రద ఇంటి వద్ద ఉండి చదువుకుంటున్నారు. వరంగల్‌లోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో తరంగిణి బీఎస్సీ ఫస్టియర్ చదువుతోంది. ఈనెల 15వ తేదీ నుంచి డిగ్రీ పరీక్షలు ప్రారంభం కానుండగా ఆదివారం తన తండ్రి ఈశ్వరాచారికి ఫోన్ చేసి మానుకోటకు ఎప్పుడు వస్తున్నావని అడిగింది. ఈ క్రమంలో పరమేశ్వరాచారి ఉదయం తమ బంధువుల ఇంట్లో వివాహం ఉండగా అక్కడికి వెళ్లారు. దీంతో ఎవరూలేని సమయంలో తరంగిణి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. సాయంత్రం చుట్టుపక్కల వాళ్లు ఇంటికి వెళ్లి తలుపులు కొట్టగా స్పందించలేదు. దీంతో ఇంట్లోకి వెళ్లి చూడగా తరంగిణి ఉరేసుకుని కనిపించింది. వెంటనే బంధువులకు సమాచారం ఇవ్వగా వారు పోలీసులకు తెలియజేయడంతో టౌన్ ఎస్సై కె. శివ, హెడ్ కానిస్టేబుల్ దామోదర్ ఘటనా స్థలికి చేరుకుని తరంగిణి మృతదేహాన్ని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి ఈశ్వరాచారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని టౌన్ సీఐ దేవేందర్ పేర్కొన్నారు. కాగా, శనివారం రాత్రి తరంగిణి ఎవరితోనో ఫోన్‌లో ఘర్షణ పడినట్లు కుటుంబ సభ్యులు గుర్తించినట్లు సమాచారం.
జిల్లా కేంద్రంలోనే వివాహిత..
మహబూబాబాద్ రూరల్ : ఉరేసుకుని ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణానికి చెందిన శ్రీపాద రవిచంద్ర, నవ్య దంపతులు కొద్ది నెలల క్రితం మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి వచ్చి స్థిరపడ్డారు. నర్సంపేట బైపాస్ రోడ్‌లో రెడీమేడ్ షాప్ నిర్వహిస్తున్నారు. ఆదివారం ఉదయం వివాహ వేడుకకు హాజరై సాయంత్రం వచ్చారు. రవిచంద్ర షాపులో ఉండగా నవ్య ఇంట్లోకి వెళ్లింది. ఈ క్రమంలో రవిచంద్ర ఇంట్లోకి వెళ్లి చూడగా నవ్య ఉరేసుకుని ఆత్మహత్య పాల్పడి కనిపించింది. విషయం తెలుసుకున్న టౌన్ సీఐ పెండ్యాల దేవేందర్, ఎస్సై బి.విజయ్ కుమార్ ఘటనా స్థలికి చేరుకుని నవ్య మృతదేహాన్ని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. కాగా, నవ్య ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదని, ఈ ఘటనపై ఇంకా ఫిర్యాదు అందలేదని సీఐ దేవేందర్ పేర్కొన్నారు.
మానుకోటలో ఘటన
మరో రెండు రోజుల్లో డిగ్రీ పరీక్షలు
అంతలోనే అనంతలోకాలకు..


