
బదిలీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి
హన్మకొండ అర్బన్: రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే పంచాయతీ కార్యదర్శులను బదిలీ చేయాలని చూడడం సరికాదని, వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని టీఎన్జీఓస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన టీఎన్జీఓస్ నాయకులు, పంచాయతీ కార్యదర్శులతో కలిసి హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్యను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ.. 8 నెలల క్రితమే సాధారణ బదిలీల్లో భాగంగా పెద్ద సంఖ్యలో పంచాయతీ కార్యదర్శులను బదిలీ చేశారని, తిరిగి ఇప్పుడు మళ్లీ బదిలీలు చేయడం వల్ల కార్యదర్శులు అనేక ఇబ్బందులకు గురవుతారని పేర్కొన్నారు. గ్రామాల్లో పాలకవర్గం ముగిసి ఏడాది గడిచినా పంచాయతీ ఎన్నికలు కాకపోవడంతో చాలాచోట్ల గ్రామాల అభివృద్ధి పనులకు ఆయా గ్రామాల కార్యదర్శులే పెద్ద మొత్తంలో సొంత డబ్బులు ఖర్చు చేశారని, ఇప్పుడు వేరే ప్రాంతానికి వెళ్తే వారు ఖర్చు పెట్టిన సొమ్ము వారికి అందడం కష్టమవుతుందన్నారు. వారు ఖర్చు చేసిన డబ్బులను వెంటనే ప్రభుత్వం నుంచి ఇప్పించేలా చూడాలని కలెక్టర్‌ను కోరారు. పంచాయతీ కార్యదర్శుల బదిలీలను టీఎన్జీఓస్ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీఎన్జీఓస్ జిల్లా కార్యదర్శి బైరి సోమయ్య, అసోసియేట్ అధ్యక్షుడు పుల్లూరు వేణుగోపాల్, కోశాధికారి పనికెల రాజేశ్, గౌరవ అధ్యక్షుడు శ్యాంసుందర్, పంచాయతీ కార్యదర్శుల ఫోరం కార్యదర్శి ఇంజపల్లి నరేశ్, నాయకులు ఎండీ రఫీ, వెంకన్న, సురేశ్, కృష్ణంరాజు, సౌజన్య, అంజలి, వెంకటేశం, ప్రవళిక, లావణ్య, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షుడు రాజేందర్